ఈ రోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి శ్రేష్ఠత అవార్డులను ప్రదానం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం రాజ్యాంగం 75వ సంవత్సరాల వేడుకలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సివిల్ సర్వీసెస్ డే మరింత విశిష్ఠతను సంతరించుకుందన్నారు. అలనాడు 1947 ఏప్రిల్ 21న సర్దార్ పటేల్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, సర్దార్ సివిల్ సర్వెంట్లను ‘భారత దేశ ఉక్కు కవచం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పూర్తి అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే పాలనా యంత్రాంగాన్ని పటేల్ కోరుకున్నారని చెప్పారు. వికసిత్ భారత్ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.
గతంలో ఎర్రకోట ప్రసంగం సందర్భంగా, దేశం కోసం వచ్చే వెయ్యేళ్లకు సరిపడే గట్టి పునాదులను నిర్మించాలని తాను అన్నానని, నూతన సహస్రాబ్దిలో 25 సంవత్సరాలు గడిచిపోయాయని, కొత్త సహస్రాబ్ది, శతాబ్దిలో ఇది 25వ సంవత్సరమని వ్యాఖ్యానించారు. “నేడు అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న నిర్ణయాలు వచ్చే వెయ్యేళ్ళ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి” అని ప్రధాని అన్నారు. తగినంత కృషి చేయకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడటం ఒంటి చక్రంతో ముందుకుసాగని రథం వంటిదని పురాణ వాక్యాలను ఉదహరిస్తూ అన్నారు. సంపూర్ణంగా అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని అందుకునేందుకు ఉమ్మడి కృషి, పట్టుదలలు కీలకమైనవని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ, ప్రతి క్షణం ఈ ఉమ్మడి లక్ష్య సాధనకు కృషి చేయాలని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్న మార్పులను ప్రస్తావిస్తూ, కుటుంబాల్లో కూడా కొత్త తరం వారితో సంభాషించే మునుపటి తరం వారికి వెనకబడ్డ భావన కలుగవచ్చని, ప్రతి రెండు మూడేళ్ళకొకసారి సాంకేతికతలో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పిల్లలు ఈ మార్పుల మధ్య పెరిగి పెద్దవుతున్నారని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన పద్ధతులు, విధాన నిర్ణయాలను ప్రభుత్వోద్యోగులు అనుసరించరాదని శ్రీ మోదీ చెప్పారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలన్న ఆశయంతో 2014లో గొప్ప మార్పులు చేపట్టినట్లు గుర్తు చేశారు. అంబరాన్నంటుతున్న యువత, రైతాంగం, మహిళాలోకం అసాధారణ ఆకాంక్షలను ప్రస్తావిస్తూ, వీటిని నెరవేర్చేందుకు అత్యంత వేగం అవసరమని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఇంధన భద్రత.. పరిశుభ్రమైన ఇంధనం.. క్రీడలు, అంతరిక్ష పరిశోధనల్లో ముందంజ.. వంటి లక్ష్యాలను సాధించాలని భారత్ ఆశిస్తోందని, ప్రతి రంగంలోనూ దేశ జెండా రెపరెపలాడాలని అన్నారు. ప్రపంచ దేశాల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలన్న ఆశయ సాకారంలో సివిల్ సర్వెంట్ల బాధ్యత కీలకమైనదని, ఈ ప్రయాణంలో జాగుని నివారిస్తూ సకాలంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ అధికారులు చేయూతనందించాలని పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ డే ఇతివృత్తమైన ‘దేశ సమగ్ర అభివృద్ధి’ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన శ్రీ మోదీ, ఇది కేవలం ఇతివృత్తం మాత్రమే కాదని, దేశ ప్రజలకు ఇచ్చే వాగ్దానమని అన్నారు. “భారత సమగ్రాభివృద్ధి అంటే దేశంలోని ఏ ఒక్క పౌరుడు, కుటుంబం, గ్రామం వెనకబడి ఉండే వీలు లేదు” అని స్పష్టం చేశారు. మందకొడిగా జరిగే చిన్న చిన్న మార్పులను నిజమైన అభివృద్ధిగా నిర్వచించలేమని, భారీ ప్రభావాన్ని కలుగజేసేదే సిసలైన అభివృద్ధి అని ప్రధాని అన్నారు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీరు, బాలలకు నాణ్యమైన విద్య, వ్యాపారవేత్తలకు అందుబాటులో పెట్టుబడి, ప్రతి గ్రామానికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లాభాల వంటివి చేకూరినప్పుడే సమగ్ర అభివృద్ధిగా పరిగణించగలమని అన్నారు. కేవలం కొత్త పథకాలను ప్రవేశపెట్టడం నాణ్యమైన పాలన అనిపించుకోజాలదని, పథకాల విస్తృతి, క్షేత్రస్థాయిలో చూపే సత్ఫలితాలే నాణ్యమైన పాలనను నిర్ధారించే అంశాలని ప్రధాని చెప్పారు. రాజకోట్, గోమతి, తిన్సుకియా, కోరాపుట్, కుప్వాడా వంటి జిల్లాల్లో పాఠశాల్లో బాలల హాజరు మెరుగయ్యిందని, సౌర విద్యుత్తు వాడకం పెరిగిందని, అనేక స్పష్టమైన మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ పథకాలతో అనుబంధంగల వ్యక్తులకు, జిల్లాలకు అభినందనలు తెలుపుతూ, ఈ విజయాన్ని సాధించడంలో ఆయా వ్యక్తులు చేసిన కృషిని, జిల్లాలకు దక్కిన పురస్కారాలని గురించి తెలియజేశారు.

గత పదేళ్ళుగా దేశం మందకొడి సరళి నుంచి బయటపడి ప్రభావశీల పరివర్తనను చవి చూస్తోందని ప్రధాని అన్నారు. ప్రభుత్వ విధానం ఇప్పుడు కొత్త తరం సంస్కరణలకు ప్రాధాన్యమిస్తోందని, ఇవి అత్యాధునిక సాంకేతికత, సృజనాత్మక పరిష్కారాల సహాయంతో ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణల మార్పు గ్రామీణ, నగర, మారుమూల ప్రాంతాల్లో సైతం ఒకే రకంగా కనిపిస్తోందని అన్నారు. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల పథకం సాధించిన ఘన విజయాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, 2023 జనవరిలో ప్రారంభించిన ఈ పథకాలు కేవలం రెండేళ్ళ కాలంలో అపూర్వమైన ఫలితాలను చూపాయని అన్నారు. ఆయా బ్లాకుల్లో ఆరోగ్యం, పోషకాహారం, సాంఘిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల్లో మెరుగుదల వంటి సూచీల్లో గణనీయమైన ప్రగతి కనిపించిందని చెప్పారు. పరివార్తనాత్మక మార్పుల ఉదాహరణలను పంచుకుంటూ, రాజస్థాన్ టోంక్ జిల్లా, పీప్లూ బ్లాకులోని అంగన్వాడీ కేంద్ర బాలల సామర్థ్యాల్లో 20 శాతం నుంచి 99 శాతం మెరుగుదల నమోదయ్యిందని, అదే విధంగా బీహార్ భాగాల్ పూర్ జగదీశ్ పూర్ బ్లాకులో తొలి మూడు నెలల్లో నమోదైన గర్భిణుల సంఖ్య 25 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని చెప్పారు. ఇక జమ్మూకాశ్మీర్ మార్వా బ్లాకులో ఆరోగ్య కేంద్రాల్లో జరిగే శిశు జననాలు 30 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయని, జార్ఖండ్ గుర్డీ బ్లాకులో నీటి కనెక్షన్లు 18 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయని చెప్పారు. ఇవన్నీ కేవలం గణాంకాలు కావని, క్షేత్రస్థాయిలో ప్రతి పౌరుడికీ పథకాల లబ్ధిని అందించి తీరాలన్న ప్రభుత్వ పట్టుదలకి నిదర్శనమని చెప్పారు. “సరైన ఉద్దేశం, ప్రణాళిక, అమలుల ద్వారా మారుమూల ప్రాంతాల్లో సైతం పరివర్తన సాధ్యమే” అని శ్రీ మోదీ చెప్పారు.
గత దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, పరివార్తనాత్మక మార్పుల ద్వారా దేశం కొత్త శిఖరాలను చేరుకుందని ప్రధానమంత్రి అన్నారు. “వేగవంతమైన అభివృద్ధి సాధించిన దేశంగానే కాక, పరిపాలన, పారదర్శకత, కొత్త ఆలోచనలను అవలంబించడంలో నూతన ప్రమాణాలు నెలకొల్పిన దేశంగా మనం గుర్తింపు తెచ్చుకుంటున్నాం” అని శ్రీ మోదీ అన్నారు. ఈ విజయాలకు జి-20 చక్కని ఉదాహరణ అన్న ప్రధాని, జి-20 చరిత్రలోనే తొలిసారిగా 60 నగరాల్లో 200 కి పైగా సమావేశాలు ఏర్పాటయ్యాయని, వీటిలో ప్రజలందరికీ పాల్గొనే అవకాశాలు కల్పించడంతో జి-20 ప్రజా ఉద్యమంగా మారిందని చెప్పారు. “భారత్ నాయకత్వ పాత్రను ప్రపంచం గుర్తించింది... ఈ సమావేశాల్లో పాల్గొనేందుకే పరిమితమవక మనం నేతృత్వం వహించాం” అని శ్రీ మోదీ అన్నారు.
ప్రధాని ప్రభుత్వ సామర్థ్యం అంశంపై నానాటికీ తీవ్రమవుతున్న చర్చలను ప్రస్తావించి, ఈ విషయంలో భారత్ ఇతర దేశాల కన్నా 10-11 సంవత్సరాలు ముందుందన్నారు. గడచిన 11 సంవత్సరాల్లో చేసిన జాప్యాలను అంతం చేయడానికి ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించేందుకు సాంకేతికతను ఉపయోగించడం, కొత్త ప్రక్రియలను ప్రవేశపెట్టడం వంటి ప్రయత్నాలు చేశామన్నారు. వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి నియమపాలనకు సంబంధించిన 40,000కు పైగా నిబంధనలను రద్దు చేయడంతోపాటు 3,400 చట్ట నిబంధనలను అపరాధాల నిర్వచనం పరిధిలో నుంచి తప్పించామని తెలిపారు. ఈ సంస్కరణలకు నడుం బిగించిన వేళ ఎదురైన ప్రతిఘటనను ప్రధాని గుర్తుచేస్తూ, విమర్శకులు ఆ తరహా మార్పుల అవసరమేముందని ప్రశ్నించారన్నారు. ఏమైనా, ప్రభుత్వం అలాంటి ఒత్తిడికి తలొగ్గలేదని ఆయన స్పష్టంచేశారు. కొత్త ఫలితాలను రాబట్టాలంటే కొత్త దృష్టికోణాన్ని అవలంబించడం అవసరమన్నారు. ఈ తరహా ప్రయత్నాల ఫలితంగా వాణిజ్య నిర్వహణలో సౌలభ్యం తాలూకు ర్యాంకుల్లో మెరుగుదల చోటుచేసుకున్న సంగతిని కూడా ఆయన ప్రధానంగా చెబుతూ, భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహం వెల్లువెత్తుతోందన్నారు. రాష్ట్రాలలో, జిల్లాల్లో, బ్లాకు స్థాయిల్లో వేర్వేరు పనుల్లో జాప్యాన్ని నివారించి, ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఇది జరిగినప్పుడు మనం పెట్టుకున్న లక్ష్యాల్ని ప్రభావవంతమైన విధంగా సాధించుకోవచ్చన్నారు.

‘‘గత 10-11 సంవత్సరాల్లో సాధించిన విజయాలతో అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన పునాది పడింది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. ప్రస్తుతం దేశం ఈ దృఢ పునాదుల మీద వికసిత్ భారత్ అనే ఒక గొప్ప భవనాన్ని నిర్మించడం మొదలుపెడుతోందంటూ, రాబోయే కాలంలో సవాళ్లు కూడా పొంచి ఉన్నాయన్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది జనాభాను కలిగి ఉన్న దేశంగా మారిందని, కనీస సదుపాయాలను అందరికీ కలగజేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకూ అందేటట్టు చూడాలంటే ఆఖరి లబ్ధిదారు వరకు చేరుకోవడంపైన శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పౌరుల అవసరాలు రోజురోజుకూ మారుతున్నాయి. వారి ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయని ఆయన చెబుతూ పౌర సేవ సందర్భానికి తగినట్లుగా తనను తాను తీర్చిదిద్దుకోవాలంటే అందుకు సమకాలీన సవాళ్లను గుర్తెరగాలని ఆయన తెలిపారు. కొత్త ప్రమాణాలను ఏర్పరచుకొంటూ, మునుపటి పోలికలను విడిచిపెట్టి శరవేగంగా ముందుకు కదలాలని శ్రీ మోదీ స్పష్టంచేశారు. 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలన్న దార్శనికతకు అనుగుణంగా ప్రగతిని కొలవాలనీ, ప్రతి ఒక్క రంగంలోనూ లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడు పయనిస్తున్న వేగం సరిపోతుందా అనేది పరిశీలించుకోవాలనీ, అవసరమైన చోటల్లా ప్రయత్నాలను వేగవంతం చేయాలనీ ఆయన సూచించారు. ఇవాళ సాంకేతిక రంగంలో అందుబాటులో ఉన్న ఆధునికతను ఆయన ప్రస్తావిస్తూ ఈ బలాన్ని వినియోగించుకోండని హితవు పలికారు.
గత పదేళ్లలో పూర్తి చేసిన పనులను శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ... పేదల కోసం 4 కోట్ల ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. మరో 3 కోట్ల మందికి గృహ వసతిని కల్పించే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. త్వరలో ప్రతి గ్రామీణ కుటుంబానికి నల్లా కనెక్షనును సమకూర్చాలనేదే ధ్యేయమనీ, దీనిలో భాగంగా రాబోయే అయిదారేళ్లలో 12 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు నీటిని నల్లా ద్వారా అందిస్తారన్నారు. సమాజంలో నిరాదరణకు గురైన వర్గాల వారి కోసం గత 10 సంవత్సరాల్లో 11 కోట్లకుపైగా మరుగుదొడ్లను నిర్మించినట్లు కూడా ఆయన చెప్పారు. వ్యర్థాల నిర్వహణలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆదరణకు నోచుకోని లక్షల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించే ఏర్పాటు చేశామన్నారు. పౌరులకు పోషణను మెరుగుపరచడానికి సరికొత్త నిబద్ధత ప్రదర్శించాలని శ్రీ మోదీ పునరుద్ఘాటిస్తూ సమాజంలో అందరూ చక్కని ఆహారాన్ని అందుకోవాలన్నదే అంతిమ ధ్యేయమని స్పష్టంచేశారు. ఈ విధానం గత దశాబ్దకాలంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేసిందని, ఇది క్రమంగా పేదలంటూ ఉండని భారత్ నిర్మాణానికి బాటను వేస్తుందన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

పారిశ్రామికీకరణ, ఔత్సాహిక పారిశ్రామికత్వం.. ఈ రెండిటి జోరుకు పగ్గం వేసే నియంత్రణదారు పాత్రను ఇదివరకటి అధికార యంత్రాంగం పోషించిందని ప్రధాని చెబుతూ, దేశం ఈ రకమైన మానసిక ధోరణి నుంచి బయటపడి ముందుకు కదిలిందన్నారు. దేశం ఇప్పుడు పౌరుల్లో వాణిజ్య సంస్థల్ని ఏర్పాటు చేయాలన్న వైఖరిని ప్రోత్సహించడంతోపాటు వారికెదురయ్యే అడ్డంకుల్ని జయించడంలో వారికి సహాయపడే వాతావరణాన్ని పెంచిపోషిస్తోందని ప్రధాని చెప్పారు. ‘‘సివిల్ సర్వీసులు ఒక సహాయకారిగా మారితీరాల్సి ఉంది, అవి వాటి భూమికను కేవలం నియమావళి గ్రంథాల సంరక్షణదారు స్థాయి నుంచి ముందుకు కదలి వృద్ధికి తోడ్పడే స్థాయికి మెరుగుపరచుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఎమ్ఎమ్ఎస్ఈ రంగాన్ని ఒక ఉదాహరణగా ఆయన చెబుతూ, యుద్ధ ప్రాతిపదికన తయారీ రంగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ మిషన్ విజయవంతం కావడం ఎమ్ఎస్ఎమ్ఈలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచంలో చోటు చేసుకొంటున్న మార్పుల మధ్య భారత్‌లో ఎమ్ఎమ్ఎస్ఈలు, అంకుర సంస్థలు, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇదివరకు ఎరుగని ఒక కొత్త అవకాశాన్ని పొందుతున్నారని ప్రధాని చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో మరింత పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందనీ, ఎమ్ఎస్ఎమ్ఈలు ఒక్క చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచే కాకుండా ప్రపంచ స్థాయిలో సైతం పోటీకి ఎదురొడ్డాల్సివస్తోందన్నారు. ఏదైనా ఒక చిన్న దేశం తన పరిశ్రమలకు నియమాల అనుసరణలో మరింత సౌలభ్యాన్ని అందించిన పక్షంలో, ఆ దేశం భారతీయ అంకుర సంస్థలను తోసిరాజని ముందుకు దూసుకుపోగలుగుతుందన్నారు. ఈ కారణంగా, ప్రపంచ స్థాయి అత్యుత్తమ పద్ధతులతో పోలిస్తే భారత్ తన స్థితిని నిరంతర ప్రాతిపదికన లెక్కగట్టుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ఉత్పాదనలను రూపొందించడమే భారతీయ పరిశ్రమల లక్ష్యం కాగా ప్రపంచంలో నియమాల అనుసరణలో సౌలభ్యం పరంగా అత్యుత్తమ వాతావరణాన్ని అందించడమే భారత్‌లో అధికార యంత్రాంగం లక్ష్యం కావాలని ప్రధాని చెప్పారు.
టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో సాయపడే నైపుణ్యాలను ప్రభుత్వ అధికారులు సాధించాలనీ, ఆ నైపుణ్యాలను స్మార్ట్ గవర్నెన్స్ కోసం, ఇంక్లూసివ్ గవర్నెన్స్ కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉందనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు. ‘‘టెక్నాలజీ యుగంలో, పాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం ఒక్కటే కాదు, అది సాధ్యమయ్యేలా అనేక రెట్లు పెంచడంతో సైతం ముడిపడి ఉన్న అంశం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విధానాలను, పథకాలను టెక్నాలజీని ఉపయోగించుకొంటూ మరింత తెలివిగానూ, సులభమైనవిగాను తీర్చిదిద్దడానికి ప్రాముఖ్యాన్నివ్వాలని ఆయన అన్నారు. నిర్దుష్టమైన విధానాల రూపకల్పన, అమలుకు గాను డేటా ఆధారితమైన నిర్ణయాల్ని తీసుకోవడంలో ప్రావీణ్యాన్ని సంపాదించాలని ఆయన ప్రధానంగా చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ ఫిజిక్స్‌లలో కొత్త కొత్త మార్పులు వేగంగా సంభవిస్తున్నాయని, వీటిని బట్టి చూస్తూ ఉంటే టెక్నాలజీ లో రాబోయే విప్లవం డిజిటల్ యుగాన్ని, సమాచార యుగాన్ని అధిగమించగలదని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రకమైన సాంకేతిక విప్లవానికి సన్నద్ధులుగా ప్రభుత్వ అధికారులు తమను తాము మలచుకోవాలని ఆయన కోరుతూ, అప్పుడు వారు ఉత్తమ సేవలను అందించడంతోపాటు పౌరుల ఆకాంక్షలను కూడా నెరవేర్చగలుగుతారన్నారు. రాబోయే కాలానికి తగ్గట్టు సివిల్ సర్వీసును తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వ అధికారుల సేవల్లో సామర్థ్యాలను పెంచడానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని, ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ‘మిషన్ కర్మయోగి’తోపాటు ‘సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్’లు ముఖ్య పాత్రను పోషిస్తాయన్నారు.

వేగంగా మారిపోతున్న కాలంలో ప్రపంచ సవాళ్లను నిశితంగా పరిశీలిస్తుండాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రత్యేకించి ఆహారం, నీరు, ఇంధన భద్రత.. ఇవి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొత్త సమస్యల్ని తెస్తున్నాయన్నారు. దీంతో నిత్య జీవనం, ఉపాధి ప్రభావితం అవుతున్నాయని ఆయన చెప్పారు. దేశీయ, విదేశీయ కారకాల మధ్య పరస్పర సంబంధం పెరిగిపోతూ ఉండడాన్ని గ్రహించడానికి ప్రాధాన్యాన్నివ్వాలని సూచించారు. వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులు, మహమ్మారులు, సైబర్ నేరాల వంటి ముప్పుల విషయంలో చురుకుగా ముందుకు కదిలి తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రపంచమంతటా తలెత్తుతున్న ఈ సమస్యలను దీటుగా ఎదుర్కోవడానికి స్థానిక వ్యూహాలను రూపొందించుకొని, వీటితో పక్కాగా పోరాడే ధీరత్వాన్ని అలవరచుకోవాల్సి ఉందని తెలిపారు.
ఎర్రకోట నుంచి మొదలుపెట్టిన ‘‘పంచ్ ప్రణ్’’ (అయిదు సంకల్పాల) భావనను శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరిద్దామన్న సంకల్పం, బానిస మనస్తత్వాన్నుంచి విముక్తి, వారసత్వాన్ని చూసుకొని గర్వించడం, ఏకత్వంలో ఉన్న శక్తిని గ్రహించడం, కర్తవ్యాలను నిజాయతీతో పూర్తి చేయాలన్న ఈ అయిదు సంకల్పాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ సిద్ధాంతాల ముఖ్య సారథులు ప్రభుత్వాధికారులేనన్నారు. ‘‘మీరు సౌకర్యానికి బదులుగా నిజాయతీకీ, కఠోరత్వానికి బదులుగా నూతన ఆవిష్కరణకూ, ఏమీ చేయని జడత్వ స్థితికి బదులు సేవకూ ప్రాధాన్యాన్నిస్తే దేశాన్ని ప్రగతిపథంలో మునుముందుకు తీసుకుపోగలుగుతారు’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారుల పట్ల తన పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ వృత్తి ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్న యువ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, వ్యక్తిగత విజయంలో సామాజిక తోడ్పాట్లు ఇమిడిఉంటాయని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగ్గట్టు సమాజానికి ఏదైనా అందించాలనే కోరుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. సమాజానికి ముఖ్య తోడ్పాటును అందించగలిగిన సామర్థ్యం, విశేషాధికారం పౌర సేవల అధికారులకు ఉంటుందని ఆయన అన్నారు. వారికి దేశం, దేశ ప్రజలు అందించిన ఈ అవకాశాన్ని వారు వీలయినంత ఎక్కువగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంస్కరణలలో మరింత కొత్త వాటిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఈ విషయమై ప్రభుత్వాధికారులు ఆలోచనలు చేయాలనీ, అన్ని రంగాల్లో చాలా వేగవంతమైన మార్పులు, విస్తృతంగా చోటుచేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక ఇంధన రంగ లక్ష్యాలు, దేశం లోపల భద్రత, అవినీతిని నిర్మూలించడం, సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, క్రీడలు, ఒలింపిక్స్‌కు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవడం... ఇలా ప్రతి రంగంలో నూతన సంస్కరణలను అమలులోకి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. ఇంతవరకు సాధించిన విజయాలను మరెన్నో రెట్లు పెంచాల్సి ఉందని, ప్రగతికి ఉన్న ప్రమాణాలను నిర్దేశించాలని ఆయన అన్నారు. సాంకేతికత చోదక శక్తిగా ఉన్న ప్రపంచంలో మానవీయ నిర్ణయాలకు ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాధికారులు స్పందనశీలురుగా నడుచుకోవాలనీ, అణగారిన వర్గాల విన్నపాలను వినాలనీ, వారి సంఘర్షణలను అర్థం చేసుకోవడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యాన్నివ్వాలనీ ప్రధాని సూచించారు. ‘‘నాగరిక్ దేవో భవ’’ సూత్రాన్ని ఆయన ఉదాహరించారు. ఇది ‘‘అతిథి దేవో భవ’’ వంటిదేనన్నారు. ప్రభుత్వాధికారులు తాము పరిపాలకులమని గాక, అభివృద్ధి చెందిన భారత్ భవన శిల్పులమన్న అభిప్రాయాన్ని కలిగిఉంటూ వారి బాధ్యతలను అంకితభావంతో, కరుణతో నెరవేర్చాలని పిలుపునిచ్చి ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రధానమంత్రికి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శక్తికాంత దాస్, క్యాబినెట్ సెక్రటరీ శ్రీ టి.వి. సోమనాథన్, పాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
నేపథ్యం
పౌరులకు ప్రయోజనాలకు అందించేందుకు ఉద్యోగులు అంకితం కావాలని, సార్వజనిక సేవకు కట్టుబడి ఉండాలనీ, పనిలో ప్రావీణ్యాన్ని సాధించాలనీ ప్రధాని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ సంవత్సరంలో, జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి, ప్రగతి కోసం తపిస్తున్న బ్లాకుల కార్యక్రమాలతోపాటు ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమం, నూతన ఆవిష్కరణ.. ఈ కేటగిరీల్లో 16 మంది ప్రభుత్వ అధికారులకు పురస్కారాలను ప్రధానమంత్రి అందజేశారు. సాధారణ పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాధికారులు చూపిన ప్రతిభకు వారిని ఈ పురస్కారాలతో సన్మానించారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
The policies we are working on today, the decisions we are making, are going to shape the future of the next thousand years: PM pic.twitter.com/TitQW8U8cE
— PMO India (@PMOIndia) April 21, 2025
India's aspirational society – youth, farmers, women – their dreams are soaring to unprecedented heights.
— PMO India (@PMOIndia) April 21, 2025
To fulfil these extraordinary aspirations, extraordinary speed is essential. pic.twitter.com/r85pFJEZLT
Ensuring holistic development of India. pic.twitter.com/mmlHRlxLI5
— PMO India (@PMOIndia) April 21, 2025
Quality in governance is determined by how deeply schemes reach the people and their real impact on the ground. pic.twitter.com/K746QolEam
— PMO India (@PMOIndia) April 21, 2025
In the past 10 years, India has moved beyond incremental change to witness impactful transformation. pic.twitter.com/kRDEXzCB4I
— PMO India (@PMOIndia) April 21, 2025
India is setting new benchmarks in governance, transparency and innovation. pic.twitter.com/uxAM3yzljB
— PMO India (@PMOIndia) April 21, 2025
The approach of 'Janbhagidari' turned the G20 into a people's movement and the world acknowledged… India is not just participating, it is leading: PM @narendramodi pic.twitter.com/uyN4GlcefI
— PMO India (@PMOIndia) April 21, 2025
In the age of technology, governance is not about managing systems, it is about multiplying possibilities: PM @narendramodi pic.twitter.com/hIXnEsJ0YT
— PMO India (@PMOIndia) April 21, 2025
Making Civil Services future-ready. pic.twitter.com/FqSJetVPta
— PMO India (@PMOIndia) April 21, 2025