మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ (అంతర్జాతీయ సాంకేతికార్థిక సదస్సు)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తొలుత ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిని ఇంధన, వాణిజ్య నగరంగా, అపార అవకాశాల కూడలిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి, తన మిత్రుడైన గౌరవనీయ కీర్ స్టార్మర్‌ను ప్రత్యేకంగా స్వాగతిస్తూ- ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
ఐదేళ్ల కిందట ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్’ ప్రారంభించిన సమయంలో యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతున్నదని శ్రీ మోదీ గుర్తుచేశారు. అయితే, ఈ కార్యక్రమం నేడు ఆర్థిక ఆవిష్కరణ, సహకారాలకు అంతర్జాతీయ వేదికగా రూపొందిందని ఉద్ఘాటించారు. ఈ ఏడాది కార్యక్రమంలో ‘యూకే’ పాల్గొంటున్న నేపథ్యంలో రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య ఈ భాగస్వామ్యం ప్రపంచ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయగలదని విశ్వాసం వెలిబుచ్చారు. వేదికపై పెల్లుబుకుతున్న ఉత్సాహం, ఉత్తేజం, ఉరవడి అద్భుతమని శ్రీ మోదీ అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థతోపాటు దాని వృద్ధిపై ప్రపంచ విశ్వాసాన్ని ఈ వాతావరణం ప్రతిబింబిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న శ్రీ క్రిస్ గోపాలకృష్ణన్ సహా నిర్వాహకులను, పాల్గొన్నవారిని ప్రధానమంత్రి అభినందించారు.
“ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఎన్నికలకు లేదా విధాన రూపకల్పనకు మాత్రమే ప్రజాస్వామ్యం పరిమితం కాదు... మా పరిపాలనకూ అదొక బలమైన మూలస్తంభం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి సాంకేతిక పరిజ్ఞానమే సిసలైన ఉదాహరణ అని ఆయన ప్రకటించారు. సాంకేతిక అంతరం గురించి ప్రపంచం ఏనాటి నుంచో చర్చిస్తున్నదని, ఒకనాడు భారత్ కూడా దీనివల్ల ప్రభావితమైందని గుర్తుచేశారు. అయితే, గత దశాబ్దంలో భారతదేశం సాంకేతికతను విజయవంతంగా ప్రజాస్వామ్యీకరించిందని చెప్పారు. ఈ మేరకు “నేటి భారత్ ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక సార్వజనీన సమాజాలలో ఒకటిగా నిలుస్తోంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.

డిజిటల్ సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడంతో దేశంలోని ప్రతి ప్రాంతానికి, పౌరుడికి అది అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి వివరించారు. దేశంలో ఇప్పుడిది సుపరిపాలనకు నమూనాగా మారిందని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రజా ప్రయోజనాలు ప్రాతిపదికగా ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదని, దీన్ని వేదిక చేసుకుంటూ ప్రైవేట్ రంగం వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తున్నదని ఆయన చెప్పారు. సాంకేతికత కేవలం సౌలభ్యం సాధనం మాత్రమే కాదని, అది సమానత్వానికి భరోసా ఇవ్వగల ఉపకరణమని భారత్ రుజువు చేసిందన్నారు.
“భారత్ అనుసరిస్తున్న సమ్మిళిత విధానం బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా మార్చివేసింది” అని ప్రధానమంత్రి చెప్పారు. ఒకనాడు బ్యాంకింగ్ ఒక ప్రత్యేక హక్కుగా ఉండేదని, డిజిటల్ సాంకేతికత దాన్నొక సాధికారత కల్పన మాధ్యమంగా రూపుదిద్దిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు నేడు దైనందిన కార్యకలాపాల్లో భాగమయ్యాయని తెలిపారు. ఈ విజయం జన్‌ధన్, ఆధార్, మొబైల (జామ్) త్రయానికి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక్క ‘యూపీఐ’ ద్వారానే ప్రతి నెలా 20 బిలియన్ లావాదేవీలు సాగుతుండగా, వీటి విలువ రూ.25 లక్షల కోట్లకుపైగా ఉంటుందని వెల్లడించారు. అంటే- ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీలలో 50 ఒక్క భారత్‌లోనే నమోదవుతున్నాయని శ్రీ మోదీ వివరించారు.
ఈ ఏడాది గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ ఇతివృత్తం భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ, మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. భారత డిజిటల్ శ్టాక్‌పై అంతర్జాతీయంగా చర్చ సాగుతున్నదని శ్రీ మోదీ గుర్తుచేశారు. “ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ), ఆధార్ సంధానిత చెల్లింపు వ్యవస్థ, భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ, భారత్-క్యుఆర్, డిజిలాకర్, డిజియాత్ర, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జెమ్)” వంటి కీలక సాంకేతికతలు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా రూపొందాయని ఆయన వివరించారు. వీటన్నిటితో కూడిన ఇండియా శ్టాక్ ఇప్పుడు కొత్త సార్వత్రికావరణ వ్యవస్థలకు బాటలు వేస్తుండటం తనకెంతో సంతృప్తినిస్తున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చిన్న దుకాణదారులతోపాటు ‘ఎంఎస్‌ఎంఈ’లకు దేశవ్యాప్త మార్కెట్ల సౌలభ్యం దిశగా ‘ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ఓఎన్‌డీసీ) తోడ్పడుతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్‌మెంట్ నెట్‌వర్క్’ (ఓసీఈఎన్) చిన్నతరహా పారిశ్రామికవేత్తలకు రుణ పరపతిని సులభం చేయడంతోపాటు ‘ఎంఎస్‌ఎంఈ'లకు రుణ కొరతను తీరుస్తున్నదని ఆయన తెలిపారు. భారత రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న డిజిటల్ కరెన్సీ విధానంతో మరింత మెరుగైన ఫలితాలు సమకూరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్ని విధాలుగా సాగుతున్న కృషితో దేశంలో ఇప్పటిదాకా నిబిడీకృతమైన సామర్థ్యం దేశ పురోగమనానికి చోదకశక్తిగా మారుతుందని స్పష్టం చేశారు.

“ఇండియా శ్టాక్ భారత్ విజయానికి ప్రతీక మాత్రమే కాదు- ప్రపంచానికి… ప్రత్యేకించి వర్ధమాన దేశాలకు అదొక ఆశాకిరణం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్ తన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా ప్రపంచవ్యాప్త డిజిటల్ సహకారం, భాగస్వామ్యాలను పెంచాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మేరకు తన అనుభవాన్ని, సార్వత్రిక వనరుల వేదికలను ప్రపంచ సార్వజనీన సరంజామా తరహాలో పంచుకుంటుందని ఆయన వివరించారు. దేశీయంగా రూపొందించిన ‘మాడ్యులర్ ఓపెన్-సోర్స్ ఐడెంటిటీ ప్లాట్‌ఫామ్’ (ఎంఓఎస్‌ఐపీ)ను ఇందుకు ఒక ముఖ్యమైన ఉదాహరణగా శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం 25 దేశాలు తమ సర్వాధికార డిజిటల్ గుర్తింపు వ్యవస్థల రూపకల్పన కోసం ఈ సాంకేతికతను అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర దేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడమేగాక దాని పురోగతిలో సాయం కూడా చేస్తున్నామని, ఇది డిజిటల్ సాధికారత కల్పనే తప్ప చేయూత కాదని ఆయన స్పష్టం చేశారు.
భారత ఫిన్‌టెక్ రంగం కృషిని కొనియాడుతూ- ప్రపంచ ఔచిత్యంగల దేశీయ ఉపకరణాలను అది రూపొందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కీలక రంగాల్లో పరస్పర వినియోగ ‘క్యూఆర్’ నెట్‌వర్క్, ఓపెన్ కామర్స్, ఓపెన్ ఫైనాన్స్ ఫ్రేమ్‌వర్క్ వంటివి భారత అంకుర సంస్థల వృద్ధికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాంకేతికతలని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో అంతర్జాతీయంగా అత్యధిక నిధులు సమకూర్చుకోగల మూడు ఫిన్‌టెక్ వ్యవస్థలలో భారత్ ఒకటిగా రూపొందిందని ఆయన వివరించారు.
భారత్ బలం కేవలం పరిమాణానికి మాత్రమే పరిమితం కాదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దీన్ని సార్వజనీనత, పునరుత్థాన శక్తి, స్థిరత్వాలతో ఏకీకృతం చేయడం దాకా విస్తరించిందని తెలిపారు. అలాగే పరిహార బాధ్యతలో రైటింగ్ పక్షపాత ధోరణి తగ్గింపు, మోసాల తక్షణ గుర్తింపు, వివిధ సేవల మెరుగుదలలో కృత్రిమ మేధ (ఏఐ) పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ సామర్థ్యాన్ని వెలికితీసే దిశగా డేటా, నైపుణ్యాలు, పరిపాలన రంగాల్లో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ‘ఏఐ’పై భారత్ దృక్పథాన్ని వివరిస్తూ- “కృత్రిమ మేధ రంగంలో మా విధానానికి మూడు కీలక సూత్రాలు- ‘సమాన లభ్యత, జనాభా నైపుణ్య స్థాయి, బాధ్యతాయుత వినియోగం’ ప్రాతిపదిక” అని ఆయన స్పష్టం చేశారు.

ఇండియా ‘ఏఐ’ మిషన్ కింద దేశంలోని వనరులను ప్రతి ఆవిష్కర్తకు, అంకుర సంస్థకు అందుబాటులో ఉంచే దిశగా ప్రభుత్వం హై-సామర్థ్యంగల కంప్యూటింగ్ సామర్థ్యాన్ని రూపొందిస్తున్నదని చెప్పారు. అలాగే ప్రతి జిల్లాకు, ప్రతి భాషలో ‘ఏఐ’ ప్రయోజనాలను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు. దేశంలోని ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్ హబ్, స్వదేశీ ‘ఏఐ’ నమూనాలు ఇందుకు చురుగ్గా తోడ్పడుతున్నాయని ఆయన వెల్లడించారు.
నైతిక కృత్రిమ మేధ సంబంధిత అంతర్జాతీయ చట్రం రూపకల్పనకు భారత్ సదా మద్దతిచ్చిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు (డీపీఐ) దాని అభ్యసన భాండాగారంతో కూడిన భారత్ అనుభవం ప్రపంచానికి ఎంతో విలువైన ఉపకరణం కాగలదని పేర్కొన్నారు. కృత్రిమ మేధను ముందుకు తీసుకెళ్లే తన ప్రస్తుత విధానాన్నే ‘డీపీఐ’ విషయంలోనూ భారత్ అనుసరించిందని చెబుతూ- “భారత్ విషయంలో ‘ఏఐ’ అంటే- సర్వాంశ సమ్మేళనం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఏఐ విషయంలో విశ్వసనీయత, భద్రత నిబంధనలపై అంతర్జాతీయంగా ఎడతెగని చర్చల నడుమ భారత్ ఇప్పటికే ఒక విశ్వసనీయతా కవచాన్ని సృష్టించిందని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మేరకు డేటా, గోప్యత సంబంధిత సమస్యల పరిష్కారానికి భారత ఏఐ మిషన్ సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు సార్వజనీన అనువర్తనాల రూపకల్పన దిశగా ఆవిష్కర్తల కోసం తగిన వేదికల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. “చెల్లింపులలో వేగం, భరోసాకు భారత్ ప్రాధాన్యమిస్తుంది. రుణాల విషయంలో ఆమోదాలు, సౌలభ్యంపై దృష్టి సారిస్తుంది. బీమా రంగంలో ప్రభావశీల పాలసీలు, సకాలంలో క్లెయిమ్‌ల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడుల విషయంలో లభ్యత, పారదర్శకత దిశగా ఫలితాలు సాధించాలని నిర్దేశించుకుంది. ఈ ప్రగతిశీల మార్పులకు ఏఐ చోదకశక్తిగా ఉంటుంది” అని ప్రధానమంత్రి విశదీకరించారు. ఈ లక్ష్యాలన్నీ సాకారం కావాలంటే ప్రజా ప్రాధాన్యంతో ఏఐ అనువర్తనాలను రూపొందించాలని చెప్పారు. లోపాల సత్వర పరిష్కారంపై తొలిసారి డిజిటల్ ఆర్థిక సౌకర్యం వినియోగదారులకు కూడా ఇవి విశ్వాసం కలిగించేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక సేవలపై నమ్మకాన్ని, సార్వజనీతను మరింత బలోపేతం చేయగలిగేది ఈ విశ్వాసమేనని చెప్పారు.
కృత్రిమ మేధ భద్రతపై కొన్నేళ్ల కిందట ‘యూకే’లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్‌లో ఏఐ ప్రభావంపై ఇలాంటి సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆ మేరకు భద్రతపై చర్చలు అక్కడ ప్రారంభం కాగా, దాని ప్రభావంపై ఇక్కడ చర్చలు ఉంటాయని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో ఉభయతారక భాగస్వామ్య నమూనాను భారత్ - యూకే ప్రపంచానికి సుబోధకం చేశాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అదే తరహాలో ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లోనూ తమ సహకారం ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశోధన, ప్రపంచ ఆర్థిక నైపుణ్యంలో యూకే సామర్థ్యానికి భారత పరిమాణం, ప్రతిభ తోడైతే ఈ రెండు దేశాలు ప్రపంచానికి కొత్త అవకాశాల బాటలు వేయగలవని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంకుర సంస్థలు, వ్యవస్థలు, ఆవిష్కరణ కూడళ్ల మధ్య సంబంధాల విస్తృతిపై నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. కొత్త అంకుర సంస్థలకు చేయూత, ఎదుగుదలలో మార్గనిర్దేశం చేయగల అవకాశాలను యూకే-ఇండియా ఫిన్‌టెక్ కారిడార్ సృష్టిస్తుందని చెప్పారు. అలాగే లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ‘గిఫ్ట్’ సిటీల మధ్య సహకార విస్తృతికి మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి కంపెనీలు గరిష్ఠ ప్రయోజనాలను పొందడంలో రెండు దేశాల మధ్యగల ఈ ఆర్థిక ఏకీకరణ దోహదం చేస్తుందని ఆయన అన్నారు.

ఫిన్‌టెక్ రంగంలో భాగస్వాములందరిపై గురుతర బాధ్యతలున్నాయని ఈ సందర్భంగా శ్రీ మోదీ స్పష్టం చేశారు. కాబట్టి, భారత్‌తో సహకార విస్తృతికి యూకే సహా ప్రతి ప్రపంచ భాగస్వామి సిద్ధం కావాలని ఆహ్వానం పలికారు. భారత్ వృద్ధిలో భాగస్వామ్యానికి ప్రతి పెట్టుబడిదారునూ ఆయన స్వాగతించారు. అటు మానవాళి-ఇటు భూగోళం… రెండింటినీ సుసంపన్నం చేసే సాంకేతిక పరిజ్ఞాన సహిత ఫిన్‌టెక్ ప్రపంచ సృష్టే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో ఆవిష్కరణలు వృద్ధికి పరిమితం కాకుండా శ్రేయస్సును లక్షించేవిగా, ఆర్థిక రంగం సంఖ్యలను మాత్రమేగాక మానవాళి ప్రగతిపైనా దృష్టి సారించేదిగా ఉండాలని సూచించారు. ఈ దిశగా కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ, హాజరైన వారందరికీ శుభాకాంక్షలతో ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి గౌరవనీయ కీర్ స్టార్మర్, భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం
ప్రపంచవ్యాప్త ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలు, కేంద్ర బ్యాంకర్లు, నియంత్రణ సంస్థలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, అగ్ర పారిశ్రామికవేత్తలను ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ ఒకే వేదికపైకి తెచ్చింది. ఏఐ చోదకంగా, ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్, ఆవిష్కరణ, సార్వజనీనత సహితంగా “మెరుగైన ప్రపంచం కోసం ఆర్థిక సాధికారత” ఇతివృత్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం- నైతికత, సుస్థిర ఆర్థిక భవిష్యత్తు దిశగా సాంకేతికత, మానవ మేధ సమ్మేళనం ప్రాధాన్యాన్ని ప్రముఖంగా చాటింది.
ఈ ఏడాది కార్యక్రమంలో 75కుపైగా దేశాల నుంచి 100,000 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేసిన నేపథ్యంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ వేదికగా నిలిచింది. ఈ మేరకు దాదాపు 7,500 కంపెనీలు, 800 మంది వక్తలు, 400 మంది ప్రదర్శకులు, జాతీయ-అంతర్జాతీయ అధికార పరిధికి ప్రాతినిధ్యం వహించే 70 నియంత్రణ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.

ఇందులో పాల్గొంటున్న అంతర్జాతీయ సంస్థలలో- “సింగపూర్ మానిటరీ అథారిటీ, జర్మనీ డ్యూష్ బుండెస్‌బ్యాంక్, బాంక్ డి ఫ్రాన్స్, స్విస్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్‌వైజరీ అథారిటీ” వంటి ప్రసిద్ధ నియంత్రణ సంస్థలున్నాయి. ఆర్థిక విధానాలపై చర్చలు, సహకారం దిశగా గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ స్థాయిని ఈ సంస్థల భాగస్వామ్యం స్పష్టం చేస్తోంది.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
India has made the democratic spirit a strong pillar of its governance. pic.twitter.com/BrG41f8MCr
— PMO India (@PMOIndia) October 9, 2025
In the past decade, India has achieved the democratisation of technology.
— PMO India (@PMOIndia) October 9, 2025
Today's India is among the most technologically inclusive societies in the world. pic.twitter.com/p8KhlLVwxe
We have democratised digital technology, making it accessible to every citizen and every region of the country. pic.twitter.com/i3bYd4y1JM
— PMO India (@PMOIndia) October 9, 2025
India has shown that technology is not just a tool of convenience, but also a means to ensure equality. pic.twitter.com/D4DhdONfFJ
— PMO India (@PMOIndia) October 9, 2025
India Stack is a beacon of hope for the world, especially for the nations of the Global South. pic.twitter.com/kwOmdENh5S
— PMO India (@PMOIndia) October 9, 2025
We are not only sharing technology with other countries but also helping them develop it.
— PMO India (@PMOIndia) October 9, 2025
And this is not digital aid, it is digital empowerment. pic.twitter.com/b0gxgBvxOS
Thanks to the efforts of India's fintech community, our Swadeshi solutions are gaining global relevance. pic.twitter.com/bdJuzjXMK7
— PMO India (@PMOIndia) October 9, 2025
In the field of AI, India's approach is based on three key principles:
— PMO India (@PMOIndia) October 9, 2025
Equitable access.
Population-scale skilling.
Responsible deployment. pic.twitter.com/Ox0SNJiKBs
India has always supported a global framework for ethical AI. pic.twitter.com/rz0lO4VFUE
— PMO India (@PMOIndia) October 9, 2025


