ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ద్వారా వ్యవసాయం, గ్రామీణ పరివర్తనకు ఊతం: పీఎం
వ్యవసాయ రంగాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్న ప్రభుత్వం.. ప్రధానంగా రైతుల సమస్యలను తగ్గించటానికి, ప్రాథమిక ఆర్థిక భద్రతను కల్పించటానికి చర్యలు: పీఎం
వ్యవసాయంలో లాభదాయకమైన పద్ధతులను విస్తరిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల రంగంగా వ్యవసాయం: పీఎం
ఎగుమతులే లక్ష్యంగా ఉత్పత్తిని పెంచితే ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గా ఉపాధి అవకాశాలు: పీఎం
ఎగుమతుల వృద్ధికి ప్రధాన వేదికగా మత్స్య రంగం.. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతికి తోడ్పడే అత్యంత విలువైన, ప్రభావవంతమైన రంగం: పీఎం
అగ్రిస్టాక్ ద్వారా వ్యవసాయ రంగానికి డిజిటల్ బహిరంగ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న ప్రభుత్వం: పీఎం
వ్యవస్థల స్వీకరణ, సంస్థల భాగస్వామ్యం, వ్యవస్థాపకుల ఆవిష్కరణలతోనే సాంకేతికత ఫలాలు: పీఎం

"వ్యవసాయం, గ్రామీణ పరివర్తన" అంశంపై పోస్ట్ బడ్జెట్ మూడో వెబినార్‌ను ఉద్దేశించి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సాంకేతికత, ఆర్థిక వృద్ధిపై గతంలో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకుంటూ, బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములందరూ ఎంతో సహకారాన్ని అందించారని ప్రధానమంత్రి తెలిపారు. "బడ్జెట్ అనంతరం, దేశ సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి ప్రయోజనాలను పొందటం ముఖ్యం. ఈ దిశగా మీ సూచనలు, ఈ వెబినార్ ఎంతో కీలకమైనవి" అని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, దేశ దీర్ఘకాలిక అభివృద్ధికి వ్యూహాత్మక ఆధారమని ప్రధానమంత్రి అన్నారు. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' వంటి పథకాలతో పాటు రైతులకు 1.5 రెట్ల రాబడినిచ్చే 'కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)’ సంస్కరణల గురించి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. "మా ప్రభుత్వం నిరంతరం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూనే ఉంది" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

విజయవంతంగా సాగుతున్న ప్రస్తుత పథకాల గణాంకాలను వెల్లడిస్తూ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటివరకు 10 కోట్ల మంది రైతులు రూ.4 లక్షల కోట్లకు పైగా నగదును అందుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు. 'పీఎం ఫసల్ బీమా యోజన' ద్వారా దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా బీమా క్లెయిమ్స్ పరిష్కారమయ్యాని చెప్పారు. 75 శాతానికి పైగా సంస్థాగత రుణాల విస్తృతి పెరిగిందని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. "ఇలాంటి అనేక ప్రయత్నాలు రైతులకు నష్ట భయాలను తగ్గించి, కనీస ఆర్థిక భద్రతను కల్పించాయి" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల రికార్డు స్థాయి ఉత్పత్తిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, 21వ శతాబ్దపు రెండో త్రైమాసికం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రంగానికి నూతన శక్తినివ్వాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ద్వారా పునరుత్తేజిత ప్రయత్నాలు జరిగాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ వెబినార్ లో జరిగిన చర్చలు బడ్జెట్ నిబంధనలు వేగంగా అమలయ్యేలా చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. "బడ్జెట్ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో వీలైనంత త్వరగా అమలు చేయటానికి ఈ వెబినార్ లో జరిపే చర్చలు, వచ్చే సూచనలు సహాయపడతాయని నమ్ముతున్నా" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మారుతున్న అంతర్జాతీయ డిమాండ్ ను గుర్తించి, భారతీయ వ్యవసాయాన్ని ఎగుమతులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారతదేశంలోని వైవిధ్యమైన వాతావారణాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ.. ఉత్పాదకతను పెంచి, ఎగుమతి సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. "ఎగుమతులే లక్ష్యంగా వ్యవసాయాన్ని మార్చాలనే అంశంపై ఈ వెబినార్‌లో చర్చ జరగటం అత్యవసరం" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

లాభదాయక వ్యవసాయంపై దృష్టి సారిస్తూ.. కోకో, జీడిపప్పు, చందనం వంటి వాటిని ప్రాంతాల వారీగా ప్రోత్సహించేందుకు బడ్జెట్ ప్రతిపాదనలను ప్రధానమంత్రి వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అగరు చెట్లు, హిమాలయ రాష్ట్రాల్లో సమశీతోష్ణ పరిస్థితుల్లో పండే నట్స్ వంటి పంటల ప్రోత్సాహానికి బడ్జెట్ ప్రతిపాదనలను కూడా శ్రీ నరేంద్ర మోదీ కీలకంగా ప్రస్తావించారు. ఎగుమతి ఆధారిత ఉత్పత్తి ద్వారా ప్రాసెసింగ్, విలువ జోడింపుతో గ్రామీణ ఉపాధి పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. "లాభదాయక వ్యవసాయాన్ని మనం కలిసికట్టుగా విస్తరిస్తే, అది వ్యవసాయ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల రంగంగా మారుస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

అంతర్జాతీయ గుర్తింపు, నాణ్యతా ప్రమాణాలను అందుకోవటానికి నిపుణులు, పరిశ్రమలు, రైతుల సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. స్థానిక రైతులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించటానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలియజేశారు. "ఈ అంశాలన్నింటిపై జరిగే చర్చలు ఈ వెబినార్ ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

మత్స్య రంగానికి సంబంధించి, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు భారత్ అని ప్రధానమంత్రి తెలిపారు. వివిధ జలాశయాలు, చెరువుల ద్వారా మనదేశంలో ప్రస్తుతం సుమారు 4.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతుండగా.. అదనంగా మరో 20 లక్షల టన్నుల ఉత్పత్తికి అవకాశముందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. "ఎగుమతుల వృద్ధికి ప్రధాన వేదికగా మత్స్య రంగం మారగలదు" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

నీలి ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవటానికి చేప పిల్లలను పెంచే కేంద్రాలు, వాటికి ఆహారం, రవాణా రంగాల్లో సరికొత్త వాణిజ్య నమూనాల అవసరముందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మత్స్య శాఖ, స్థానిక వర్గాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని ప్రోత్సహించారు. "గ్రామీణ సుసంపన్నతకు అత్యధిక విలువ, అత్యంత ప్రభావం చూపే రంగంగా ఇది మారగలదు. మీరంతా దీనిపై చర్చించాలి" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

నేడు భారత్ ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగానూ, గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలోనూ ఉందని ప్రధానమంత్రి చెప్పారు. మేలుజాతి పశుసంతతిని పెంపొందించడం, రోగ నిరోధకత, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహణపై దృష్టి సారిస్తూ.. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. పశుసంతతి ఆరోగ్యం అత్యంత కీలకమైన అంశమన్న శ్రీ మోదీ.. ‘‘నేను చెప్పిన వన్ ఎర్త్ - వన్ హెల్త్’లో ఈ పశుసంతతి ఆరోగ్యం కూడా అంతర్భాగమే’’ అన్నారు.

టీకాల ఉత్పత్తిలో దేశ స్వావలంబనను ప్రస్తావిస్తూ.. జాతీయ గోకుల్ మిషన్ కింద సాంకేతికతను విస్తరించామనీ, పశుపోషక రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను అందించామనీ ప్రధానమంత్రి వివరించారు. గాలికుంటు వ్యాధి నుంచి పశువులను కాపాడుకునేందుకు ఇప్పటికే 125 కోట్లకు పైగా డోసుల టీకాలు వేసినట్టు తెలిపారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కూడా ప్రారంభించాం’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

 

నష్ట భయాన్ని తగ్గించుకునేందుకు.. ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా, వివిధ పంటలను పండించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి సూచించారు. నూనెగింజలు, పప్పుధాన్యాలు, సేంద్రియ వ్యవసాయ మిషన్ల వంటి కార్యక్రమాలను.. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక సాధనాలుగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘‘అందుకే, వివిధ రకాల పంటలను సాగు చేయడంపై మేం దృష్టి సారిస్తున్నాం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని గుర్తు చేశారు. రాష్ట్రాలు తమ బడ్జెటులో ఆ రంగానికి ప్రాధాన్యమిస్తూ బాధ్యతను నెరవేర్చాలని ప్రధానమంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రభావం క్షేత్ర స్థాయి వరకు బలంగా ఉండాలంటే.. జిల్లా స్థాయి వరకు బడ్జెట్ అంశాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ రంగంలో సాంకేతికతను అనుసంధానించడంపై ప్రధానమంత్రి విస్తృతంగా మాట్లాడారు. ఇ-నామ్, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, భూముల డిజిటల్ సర్వే వంటి అంశాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంలో సాంకేతికతను ఏకీకృతం చేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోందని శ్రీ మోదీ ప్రత్యేకంగా పునరుద్ఘాటించారు.

కృత్రిమ మేధ ఆధారిత వేదికలు, డిజిటల్ సర్వేల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. వ్యవస్థలూ, పారిశ్రామికవేత్తలూ సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సంప్రదాయ పద్ధతులతో సాంకేతికతను సమర్థంగా మిళితం చేయగల విషయమై సూచనలు అందించాలని ఆయన కోరారు. ‘‘ఈ వెబినార్‌లో వచ్చే సూచనలు.. సాంకేతికతను మనం ఏ విధంగా సరైన పద్ధతిలో ఏకీకృతం చేయాలన్న అంశంలో కీలక పాత్ర పోషిస్తాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.

పీఎం ఆవాస్ యోజన, పీఎం గ్రామ సడక్ యోజన వంటి పథకాల ద్వారా గ్రామీణ సుసంపన్నతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై స్వయం సహాయక బృందాల ప్రభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘గ్రామీణ ప్రాంతాలను సుసంపన్నం చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

‘లాఖ్ పతి దీదీ’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. 2029 నాటికి మరో 3 కోట్ల విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యమని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడమెలాగన్న అంశంపై సూచనలు చేయాలని కోరారు. ‘‘ఈ లక్ష్యాన్ని ఇంకా వేగంగా సాధించేందుకు మీరిచ్చే సూచనలు కీలకమైనవి’’ అని ఆయన అన్నారు.

భారీగా నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అగ్రి-ఫిన్‌టెక్, సరఫరా వ్యవస్థల్లో ఆవిష్కరణల అవసరాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు లక్ష్యంగా.. ఈ కీలక రంగాల్లో పెట్టుబడులను పెంచాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘‘నేటి మీ మేధోమథనంతో వచ్చే ఆలోచనామృతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నవోత్తేజాన్నిస్తుందన్న నమ్మకం నాకుంది’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Isro’s GSLV-F17 successfully places EOS-05 Earth observation satellite in geosynchronous orbit

Media Coverage

Isro’s GSLV-F17 successfully places EOS-05 Earth observation satellite in geosynchronous orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi lauds ISRO for successful launch of GSLV-F17 carrying EOS-05
September 04, 2026

Prime Minister Shri Narendra Modi today hailed yet another outstanding achievement by ISRO, calling it a proud moment for the nation.

The Prime Minister stated that the successful launch of GSLV-F17 carrying EOS-05, India’s first-ever imaging satellite from Geosynchronous orbit, is a reflection of the excellence, innovation, and growing capabilities that define India’s space sector.

Shri Modi further noted that the growing partnership between ISRO and the Indian industry is adding new strength and scale to the space programme, expanding India’s capabilities across the entire space ecosystem.

In a post on X, the Prime Minister shared:

"Yet another outstanding achievement by ISRO and a proud moment for our nation.

The successful launch of GSLV-F17 carrying EOS-05, India’s first-ever imaging satellite from Geosynchronous orbit is a reflection of the excellence, innovation and growing capabilities that define India’s space sector.
The growing partnership between ISRO and Indian industry is adding new strength and scale to our space programme and expanding India’s capabilities across the entire space ecosystem."