దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.
నాగరికత అనుసంధానం, ఉమ్మడి విలువలు, పరస్పర సద్భావనతోపాటు స్వేచ్ఛాయుత, సార్వత్రిక ఇండో- పసిఫిక్ పట్ల నిబద్ధత ప్రాతిపదికలుగా ఉన్న భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవశ్యకతను ఇరువురు నేతలూ పునరుద్ఘాటించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సమృద్ధి, స్థిరత్వం కోసం భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

భారత్- జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరమైన పురోగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వారిద్దరూ.. రక్షణ - భద్రత, వాణిజ్యం - పెట్టుబడి, ఎస్ఎంఈలు, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు, సెమీ కండక్లర్లు, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతికత - ఆవిష్కరణ, ప్రజా సంబంధాల వంటి విస్తృత శ్రేణి రంగాల్లో అంగీకారం కుదిరిన అంశాలను సత్వరం అమలు చేయాలని పిలుపునిచ్చారు. వ్యూహాత్మక రంగాల్లో భారత్ - జపాన్ మధ్య సహకారానికి గల అవకాశాలపైనా చర్చించిన వారు.. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. 2026 ఫిబ్రవరిలో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఏఐ సదస్సుకు జపాన్ ప్రధానమంత్రి తకైచీ బలమైన మద్దతు ప్రకటించారు.
భారత్, జపాన్ విలువైన భాగస్వాములుగా, విశ్వసనీయ మిత్రులుగా కొనసాగుతాయని వారిద్దరూ స్పష్టం చేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అత్యావశ్యకమన్నారు.
సంప్రదింపులను కొనసాగించాలని, వీలైనంత త్వరగా మళ్లీ సమావేశమవ్వాలని ఇద్దరు నేతలూ అంగీకరించారు.
Had a productive meeting with Prime Minister Sanae Takaichi of Japan. We discussed ways to add momentum to bilateral cooperation in areas such as innovation, defence, talent mobility and more. We are also looking to enhance trade ties between our nations. A strong India-Japan… pic.twitter.com/4UexmElSwQ
— Narendra Modi (@narendramodi) November 23, 2025


