రష్యా సమాఖ్య భద్రతా మండలి కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఎన్.ఎస్.ఏ. మరియు ఈ.ఏ.ఎం. లతో ఈ రోజు తాను జరిపిన ఫలవంతమైన సమావేశం గురించి కార్యదర్శి శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్ ముందుగా ప్రధానమంత్రికి వివరించారు. భారతదేశంతో 'ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్టంగా కొనసాగించడానికి రష్యా బలమైన నిబద్ధతను ఆయన వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో కార్యదర్శి శ్రీ పాత్రుషెవ్ నేతృత్వంలోని రష్యా ప్రతినిధి బృందం భారతదేశంలో పర్యటిస్తున్నందుకు ప్రధానమంత్రి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భారత-రష్యా భాగస్వామ్యం పట్ల నిరంతరం శ్రద్ధ చూపుతున్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయన కార్యదర్శి శ్రీ పాత్రుషేవ్ ను కోరారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం కోసం సమీప భవిష్యత్తులో భారతదేశంలో అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు స్వాగతం పలకడానికి తాను ఎదురుచూస్తున్నానని కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.


