దేశవాసులారా.. జులై 2 నుంచి 9వ తేదీ వరకూ నేను అయిదు దేశాల పర్యటనలో ఉంటాను. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన ఈరోజు ప్రారంభమవుతుంది.

అధ్యక్షుడు శ్రీ జాన్ ద్రమని మహామా ఆహ్వానం మేరకు 2,3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తాను. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో కీలక భాగస్వామి అయిన ఘనా.. ఆఫ్రికన్ యూనియన్, పశ్చిమాఫ్రికా దేశాల ఆర్థిక కూటమిలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. చారిత్రికంగా ఇరు దేశాల మధ్య గల సంబంధాల బలోపేతం సహా సహకారం మరిన్ని రంగాలకు విస్తరించగలదని ఆశిస్తున్నాను. పెట్టుబడులు, ఇంధనం, ఆరోగ్యం, భద్రత, సామర్థ్య పెంపు, అభివృద్ధి భాగస్వామ్య రంగాల్లో సహకార అవకాశాలను చర్చించేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ప్రజాస్వామ్య దేశమైన ఘనా పార్లమెంటులో ప్రసంగించే అవకాశాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

చారిత్రకంగా బలమైన సాంస్కృతిక సంబంధాలు, ఇరు దేశ ప్రజల మధ్య స్నేహమూ గల ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో జులై 3,4వ తేదీల్లో పర్యటిస్తాను. ఈ సంవత్సరం జరిగిన  ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి, గౌరవనీయ క్రిస్టీన్ కార్లా కంగాలూ... ఇటీవలే రెండో సారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన శ్రీమతి కమలా పెర్సాద్- బిస్సెస్సర్ లతో నేను సమావేశమవుతాను. భారతీయులు 180 ఏళ్ళ కిందట తొలిసారి ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అడుగు పెట్టారు. ఇటువంటి ప్రత్యేకమైన వారసత్వ బంధాలను, ఆత్మీయతను పునరుద్ధరించుకునే  అవకాశం ఈ పర్యటన కల్పిస్తుంది.

తదనంతరం, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి బయలుదేరి బ్యూనస్ ఎయిర్స్ చేరుకుంటాను. 57 ఏళ్ళ అనంతరం భారత ప్రధాని అర్జెంటీనా దేశానికి చేపడుతున్న ద్వైపాక్షిక పర్యటన ఇది. లాటిన్ అమెరికా ప్రాంతంలో అర్జెంటీనా ముఖ్యమైన ఆర్థిక భాగస్వామి మాత్రమే కాక, జీ-20 కూటమిలో కూడా కీలక సభ్య దేశం. అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలేతో జరిపే చర్చలు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సందర్భంగా గత సంవత్సరం అధ్యక్షుడితో సమావేశమవడం గుర్తుకు వస్తోంది. ఇరు పక్షాలకూ ప్రయోజనం చేకూర్చే సంబంధాల బలోపేతం సహా  వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఇంధనం, వాణిజ్యం, పర్యాటకం, సాంకేతిక, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలమని ఆశిస్తున్నాను.

జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ  లూయిజ్ ఇనాసియో లూలా  డిసిల్వాతో చర్చిస్తాను.

వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఉమ్మడి చరిత్ర గల విశ్వసనీయ భాగస్వామి నమీబియా, ఈ యాత్రలో నా చివరి గమ్యస్థానం. గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నేతుంబో నంది-న్దైత్వాతో జరపబోయే సమావేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మన ప్రజలు, మన ప్రాంతాలు, విస్తృత గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం సహకారం ప్రాతిపదికగా  కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. స్వేచ్ఛ, అభివృద్ధి పట్ల ఇరుదేశాలకు గల నిబద్ధతకు సంకేతంగా నమీబియా పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో నా ప్రసంగం ఏర్పాటవడం నాకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నాను.

నా పర్యటన అట్లాంటిక్ మహాసముద్రానికి రెండు వైపులా గల ఈ అయిదు దేశాల పరస్పర స్నేహ బంధాలను పటిష్ఠ పరిచి, గ్లోబల్ సౌత్ దేశాల సహకార బలోపేతానికి దారితీయగలదని... బ్రిక్స్, ఆఫ్రికన్ యూనియన్, ఎకోవాస్, కారికోమ్ వంటి బహుళ ప్రయోజన వేదికల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచగలదని విశ్వసిస్తున్నాను.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Record demand for made-in-India cars

Media Coverage

Record demand for made-in-India cars
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology