ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా.. జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్ మధ్య గంగా నది తీరం వెంబడి సరికొత్త లింక్/కనెక్టర్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 46.039 కిలోమీటర్ల ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ‘మిశ్రమ వార్షిక చెల్లింపు విధానం (హ్యామ్)’లో చేపట్టనున్నారు. దీని మొత్తం వ్యయం రూ.14,447.64 కోట్లు కాగా.. ఇందులో సివిల్ నిర్మాణ పనుల కోసం రూ.6,037.85 కోట్లు (జీఎస్టీ మినహా ప్రజా సదుపాయాల మార్పిడి వ్యయం సహా), జాతీయ రహదారుల (ఓ) కింద భూసేకరణ కోసం రూ.541.11 కోట్లు కేటాయించారు. ఆరు వరుసల ఎత్తయిన ప్రధాన వాహన మార్గాన్నీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కేబుల్ వంతెననూ, అత్యాధునిక సాంకేతికతతో వాహనదారులూ పాదచారులిద్దరికీ సేవలందించే ప్రత్యేకమైన వంతెననూ, మెట్ల మార్గాలూ, ర్యాంపు మార్గాలూ, లింక్ రోడ్లనూ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు.

 

ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్డుల మధ్య అంతరాయాల్లేకుండా సాఫీగా ప్రయాణించవచ్చు. దీనివల్ల నగర రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడమే కాకుండా, నగరంలో రవాణా సదుపాయాలు మెరుగువుతాయి. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఈ కారిడార్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో సగటు ప్రయాణ సమయం ప్రస్తుతం 60 నిమిషాలుగా ఉండగా.. అది 20 నిమిషాలకు తగ్గుతుందని అంచనా. అంటే దాదాపు 67 శాతం ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే జాతీయ రహదారి-19 నుంచి కాశీ రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయం కూడా దాదాపు 50 నిమిషాల నుంచి 25 నిమిషాలకు తగ్గుతుంది. దాంతో ప్రయాణికులకు 25 నిమిషాల సమయం (దాదాపు 50 శాతం) కలిసివస్తుంది.

 

పీఎం గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళికకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ కారిడార్.. బహు విధ రవాణా సాధనాల ద్వారా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రధాన జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం, రామ్‌నగర్ ఐడబ్ల్యూఏఐ ఓడరేవులకు అంతరాయాల్లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తుంది. అదే సమయంలో కాశీ విశ్వనాథ ఆలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, నమో ఘాట్, రామ్‌నగర్ కోట, వారణాసి ఘాట్‌ల వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక కేంద్రాలకు రవాణా సదుపాయాన్ని ఈ ప్రాజెక్టు గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ విధంగా కీలక ఆర్థిక, సామాజిక, సరుకు రవాణా కేంద్రాలను అనుసంధానించడం ద్వారా.. ఈ ప్రాజెక్టు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. రోడ్డు భద్రతను మెరుగుపరుస్తుంది. పర్యాటకం, తీర్థయాత్రలు మరింత సులభతరమవుతాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సుస్థిర ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

 

జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్డు (జాతీయ రహదారి – 135బీ), రామ్‌ నగర్/బీహెచ్‌యూ, ఇతర ప్రధాన పట్టణ ప్రాంతాల మధ్య వేగవంతమైన, నియంత్రిత ప్రవేశం కలిగిన అనుసంధానాన్ని కల్పించడం ద్వారా.. వారణాసి, చందౌలీలలోని రహదారులపై రద్దీని తగ్గించే విప్లవాత్మక పట్టణ రవాణా ప్రాజెక్టుగా ఈ కారిడార్‌ను రూపొందించారు. ఏటా 15 కోట్ల మందిరి పైగా పర్యాటకులు, యాత్రికులు వారణాసిని సందర్శిస్తున్న నేపథ్యంలో.. కాశీ విశ్వనాథ ఆలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, నమో ఘాట్, రామ్‌నగర్ కోట, వారణాసి ఘాట్లు, కాశీ రైల్వే స్టేషన్‌ వంటి ప్రముఖ మతపరమైన, విద్యాపరమైన, సాంస్కృతిక ప్రదేశాలకు రవాణా సదుపాయాలను ఈ ప్రాజెక్టు గణనీయంగా మెరుగుపరుస్తుంది. అదే సమయంలో నగరంలోని ప్రస్తుత రహదారులపై రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. బీహెచ్‌యూ/లంక, సామ్నే ఘాట్ల మధ్య నిర్మించనున్న ఎత్తయిన మార్గంతో స్థానిక ప్రయాణాలనూ, ఇతర ప్రధాన ప్రయాణాలనూ వేరు చేయడం ద్వారా.. అత్యంత రద్దీగా ఉండే లంక జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.

 

నియంత్రిత రాకపోకల ద్వారా ఈ ప్రాజెక్టు రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. వాహన నిర్వహణ ఖర్చులను, ఉద్గారాలను తగ్గిస్తుంది. ప్రయాణంలో విశ్వసనీయతను పెంచుతుంది. ప్రయాణాలు, సరుకు రవాణాలో సామర్థ్యాన్ని పెంచుతుంది. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ కేంద్రం నుంచి ట్రాఫిక్‌ను మళ్లించడం ద్వారా... జాతీయ రహదారి-19, బీహెచ్‌యూ -రామ్‌నగర్ కారిడార్, జాతీయ రహదారి-35లపై రద్దీని కూడా తగ్గిస్తుంది.

 

అనేక అద్భుతమైన ఇంజినీరింగ్ విశేషాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. గంగానదిపై 910 మీటర్ల పొడవైన అద్భుతమైన కేబుల్ వంతెననూ, కాశీ విశ్వనాథుడి ఆలయానికి పాదచారులు తేలిగ్గా చేరుకునేందుకు 1.32 కిలోమీటర్ల ఎక్స్‌ట్రాడోజ్డ్ ఉమ్మడి వంతెనను నిర్మిస్తున్నారు. అలాగే ప్రస్తుత/ప్రతిపాదిత మాలవీయ వంతెనపై రైల్ ఓవర్ బ్రిడ్జి, అత్యవసరంగా వాహనాలను నిలిపి ఉంచేందుకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు, శబ్ద కాలుష్య నిరోధక ఏర్పాట్లు, వారణాసి సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తిని చాటేలా ముఖద్వారాలపై లైటింగ్ వంటి విశేషాలున్నాయి. ఇవి రవాణా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, నగర రూపురేఖలను మారుస్తాయి. వారణాసికి సరికొత్త హంగులను చేకూర్చి.. దేశంలోని అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా నగరం స్థానాన్ని ఇవి మరింత సుస్థిరం చేయనున్నాయి.

 

పీఎం గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళికకు అనుగుణంగా రూపొందించిన ఈ కారిడార్.. బహువిధ రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక ఆర్థిక కేంద్రం (చందౌలీ సెజ్), ఒక సామాజిక కేంద్రం (అభిలషణీయ జిల్లా అయిన చందౌలీ)తోపాటు ఆరు ప్రధాన సరుకు రవాణా కేంద్రాలైన లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం, కాశీ రైల్వే స్టేషన్, బనారస్ రైల్వే స్టేషన్, వారణాసి నగర రైల్వే స్టేషన్, పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, రామ్‌నగర్ ఐడబ్ల్యూఏఐ ఓడరేవులను పరస్పరం అనుసంధానించనున్నారు. ఈ ప్రధాన రవాణా కేంద్రాలనూ, కాశీ విశ్వనాథ ఆలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, నమో ఘాట్, రాంనగర్ కోట, వారణాసి ఘాట్ల వంటి ప్రముఖ పర్యాటక స్థలాలతో అంతరాయాల్లేకుండా అనుసంధానించడం ద్వారా.. బహువిధ రవాణా సమన్వయాన్ని ఈ ప్రాజెక్టు మెరుగుపరుస్తుంది. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంతోపాటు.. పర్యాటకం, తీర్థయాత్రలను మరింత సులభతరం చేస్తుంది. తద్వారా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సుస్థిర ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది.

 

మొత్తమ్మీద ప్రతిపాదిత గంగా ఎలివేటెడ్ కారిడార్ వారణాసిలో ఒక అత్యాధునిక, అత్యున్నత నగర రవాణా మార్గంగా నిలవనుంది. మరింత వేగవంతమైన, సురక్షితమైన, అత్యంత నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందించడం, ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడం, బహువిధ రవాణా సమన్వయాన్ని బలోపేతం చేయడం, పర్యాటక, ఆధ్యాత్మిక మౌలిక వసతులను పెంపొందించడం ద్వారా.. ఈ ప్రాజెక్టు నగరంలో రవాణా వ్యవస్థ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంది. పీఎం గతి శక్తి, వికసిత భారత్ దార్శనికతలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో సుస్థిర ఆర్థిక వృద్ధికి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తోడ్పడనుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump

Media Coverage

India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఆగష్టు 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi