ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. అరుణాచల్ ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో రూ. 8146.21 కోట్ల వ్యయంతో టాటో-II జల విద్యుత్ ప్రాజెక్టు (హెచ్‌ఈపీ) నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు 72 నెలల పడుతుందన్న అంచనా ఉంది.
700 ఎండబ్ల్యూ (4 x 175 ఎండబ్ల్యూ) స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు 2738.06 ఎంయూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు ఉపయోగపడనుంది. అంతేకాకుండా జాతీయ గ్రిడ్ సమతుల్యతకు దోహదం చేయనుంది.
ఈశాన్య ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఈపీసీఓ), అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ను చేపడతాయి. రోడ్లు, వంతెనలు, విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 458.79 కోట్లు అందించనుంది. జాయింట్ వెంచర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ వాటా కింద రూ. 436.13 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ సమకూరుస్తుంది .
ప్రాజెక్టు నుంచి 12 శాతం విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పొందనుంది. స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి (ఎల్ఏడీఎఫ్) కోసం ప్రాజెక్టు వ్యయంలో ఒక శాతాన్ని కేటాయించనున్నారు. ఈ రెండింటి ద్వారా రాష్ట్రం లబ్ధి పొందనుంది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. దీనితో పాటు సామాజిక-ఆర్థిక అభివృద్ధి కూడా జరగనుంది.
ఈ ప్రాజెక్టు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలతో సహా స్థానిక సరఫరాదారులు, సంస్థలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనాన్ని అందించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 32.88 కిలోమీటర్ల రోడ్లు, వంతెనలను నిర్మించనున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను కూడా గణనీయంగా మెరుగుపరచనున్నారు. వీటిని ప్రాజెక్టు కోసం నిర్మించినప్పటికీ ఎక్కువగా స్థానికులే ఉపయోగించుకోనున్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ స్థలాలు, ఆట స్థలాలు మొదలైన కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్రాజెక్టు ద్వారా సంబంధింత జిల్లా కూడా అభివృద్ధి చెందనుంది. ప్రాజెక్టు నిధుల నుంచి ప్రత్యేకంగా కేటాయించిన రూ. 20 కోట్లతో వీటికి ఆర్థిక సహాయం అందించనున్నారు. పలు రకాల పరిహార కార్యక్రమాలు, ఉపాధి, సీఎస్ఆర్ కార్యకలాపాల ద్వారా స్థానిక ప్రజలు కూడా ప్రయోజనం పొందనున్నారు.
Congratulations to my sisters and brothers of Arunachal Pradesh on the Cabinet approval for funding the Tato-II Hydro Electric Project (HEP) in Shi Yomi District. This is a vital project and will benefit the state's growth trajectory. https://t.co/4YIJJjQqjt
— Narendra Modi (@narendramodi) August 12, 2025


