మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ జీ,
ప్రధాని నవీన్ చంద్ర రాంగులామ్ జీ,
మారిషస్‌లోని సోదరీమణులు, సోదరులారా,

మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇచ్చినందుకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఇది నా ఒక్కరికి లభించిన గౌరవం ఎంతమాత్రం కాదు. ఇది నూటనలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. ఇది భారత్, మారిషస్‌ల మధ్య వందల సంవత్సరాలుగా నెలకొన్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలకు లభించిన ఒక కానుక, ఒక ప్రశంస. ప్రాంతీయ శాంతి, ప్రగతి, భద్రత, నిరంతర అభివృద్ధి సాధనల పట్ల మన నిబద్ధతకు లభించిన గుర్తింపు. మరి, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల సమష్టి ఆశలు, ఆకాంక్షల ప్రతీక అని కూడా చెప్పవచ్చు. నేను ఈ అవార్డును పూర్తి నమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. వందల ఏళ్ల కిందట భారత్ నుంచి మారిషస్‌కు వచ్చిన మీ పూర్వికులకు, వారి తదుపరి తరాల వారికి దీనిని అంకితం చేస్తున్నాను. వారు ఎంతో కష్టపడి మారిషస్ అభివృద్ధిలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించారు, ఈ దేశంలో చైతన్యభరిత వైవిధ్యానికి కూడా తోడ్పడ్డారు. ఈ పురస్కారాన్ని నేనొక బాధ్యతగా కూడా స్వీకరిస్తున్నాను. భారత్-మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి అవసరమైన ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేస్తామన్న మా నిబద్ధతను నేను పునరుద్ఘాటిస్తున్నాను.

Thank you very much.


