وزیر اعظم مودی کا ایناڈو کو انٹرویو

Published By : Admin | May 5, 2024 | 09:25 IST

Narendra Modi: దేశానికే హైదరాబాద్‌ గ్రోత్‌ సెంటర్‌

పనిలోనే విశ్రాంతి

రోజుకు ఎన్ని గంటలు పని చేశానని లెక్కలేసుకునే వ్యక్తిని కాదు. కొన్ని అలవాట్లను చిన్నప్పుడే నేర్చుకొని ఇప్పటికీ పాటిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తా. నా జీవితంలో పనికి, విశ్రాంతికి మధ్య తేడా లేదు. పనిలోనే విశ్రాంతి వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాను.

ప్రధాని మోదీ

ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం అడుగంటిన పరిస్థితుల్లో అధికార పగ్గాలు చేపట్టిన నేను భారత్‌ను ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీపడగలమన్న స్థాయికి తీసుకెళ్లగలిగా. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టంలోని నిబంధనల అమలు దిశగా పదేళ్లుగా పని చేశాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం.

తెలంగాణకు, భారతదేశానికి హైదరాబాద్‌ నగరం ఒక గ్రోత్‌సెంటర్‌. ఈ నగరాన్ని అన్నివైపులా స్పీడ్‌ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ‘వందే భారత్‌ మెట్రో’ ప్రయోజనం పొందే నగరాల్లో హైదరాబాద్‌ ఉండబోతోంది. భవిష్యత్తులో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను చూస్తుంది.

ప్రధాని మోదీ

మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమై... ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్న భరోసా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ఏయే పనులు మొదలు పెట్టాలన్న దానిపై ప్రణాళికలు రచించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతి మాటలోనూ గెలుపుపై ధీమా కనిపించింది. ప్రస్తుతం భారత్‌ కాలం నడుస్తోందని, శతాబ్దాల తర్వాత వచ్చిన ఈ అత్యుత్తమ అవకాశాన్ని చేజార్చుకోవద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ నుంచి దండిగా ఆదాయం వస్తున్నా కేంద్రం మాకేమీ ఇవ్వడంలేదని అక్కడి ప్రభుత్వాలు ఆరోపించడం వారి చేతగానితనానికి నిదర్శనం. భారాస, కాంగ్రెస్‌లకు తెలంగాణ ఏటీఎంగా మారింది. భారాసను దించడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది. కాంగ్రెస్‌ను దించడానికి అంత సమయం పట్టదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు.

ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు

‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
మానుకొండ నాగేశ్వరరావు, చల్లా విజయభాస్కర్‌
దిల్లీ నుంచి ఈనాడు ప్రతినిధులు

370 సీట్లన్నది కేవలం ఎన్నికల నినాదం కాదు. అది ప్రజల కోరిక. మోదీ గ్యారంటీలను అమలు చేస్తారని మాపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం. ఆర్టికల్‌ 370 రద్దు అన్నది కోట్ల మంది ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష. మేం రద్దు చేసినప్పుడు ప్రజల్లో నిజమైన సంతృప్తికర భావన కలిగింది. అందుకే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన పార్టీకి 370కిపైగా సీట్లు, కూటమికి 400కుపైగా సీట్లు ఇవ్వాలన్న సహజ సిద్ధమైన భావోద్వేగం వారిలో కలిగింది. ఈ నినాదం వెనకున్న అసలు విషయం ఇది. ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కుని మైనారిటీలకు ఇవ్వాలన్న కాంగ్రెస్‌ ఆలోచనను చూసి మేం అప్రమత్తమయ్యాం. మన రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రక్షించడానికి మాకు 400కుపైగా సీట్లు అవసరం

భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరగదని గ్యారంటీ ఇస్తున్నా.

మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పసుపు బోర్డు పనులు ప్రారంభిస్తాం.

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మనసుల్లో నమ్మకం, విశ్వాసం నెలకొల్పడమే గత పదేళ్లలో తాము సాధించిన ప్రధాన విజయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తవ్విన గోతులను తొలి ఐదేళ్లలో పూడ్చిన తాను.. మలి ఐదేళ్లలో దేశం ముందడుగు కోసం బలమైన పునాది వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్‌ సమయం నడుస్తోందని, ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దేశానికి సేవ చేస్తూ.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండటాన్ని దైవ కృపగానే భావిస్తాను. భారత్‌ తన గమ్యాన్ని చేరుకోవడంలో సాయం చేయడానికి ఏదో దైవశక్తి నా ద్వారా పని చేస్తోందని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. ఆ ఆలోచనే నన్ను మరింత తదేకంగా, అంకిత భావంతో పనిచేసేలా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలవల్ల 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడగలిగారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమల్లోకి తెచ్చి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో జరిగే రూ.3.5 లక్షల కోట్ల అవినీతిని నిర్మూలించగలిగాం. మేం డిజిటల్‌ చెల్లింపుల గురించి మాట్లాడినప్పుడు ఎగతాళి చేశారు. కాలం గిర్రున తిరిగి 2024లోకి అడుగు పెట్టేటప్పటికి భారత్‌ ఈ రంగాన్ని శాసించే స్థాయికి చేరింది. ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో మొదలుపెట్టి మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేవరకూ వచ్చాం. ఈ దేశ చట్టాలకు లోబడి శ్రీరామచంద్ర ప్రభువుకు సొంత ఇంటిని తిరిగి తెచ్చివ్వగలిగాం.

2014కు ముందు పదేళ్లు సగటు ద్రవ్యోల్బణం 8%పైనే ఉండేది. చాలా ఏళ్లు అది రెండంకెల సాయిలోనూ కొనసాగింది. గత పదేళ్ల కాలంలో కొవిడ్‌, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదల లాంటి సమస్యలు చుట్టుముట్టినప్పటికీ ద్రవ్యోల్బణం సగటున 5%కి పరిమితమయ్యేలా చర్యలు తీసుకున్నాం.

తొలి 100 రోజుల్లో కార్యాచరణ..

స్వాతంత్య్ర శత వసంతోత్సవాలు జరుపుకొనే నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో పని చేస్తున్నాం. మూడోసారి అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లో దీనిపై కార్యాచరణ మొదలుపెడతాం. ముఖ్యమంత్రిగా పని చేసిన విస్తృతానుభవం ఉన్న అతి కొద్ది మంది ప్రధాన మంత్రుల్లో నేను ఒకడిని. అందువల్ల రాష్ట్రాల ఆందోళనలను అర్థం చేసుకోగలుగుతాను’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

మీరు మంచి ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి¨ చిహ్నంగా కనిపిస్తారు. మీ ఆరోగ్య రహస్యమేమిటి? రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు? సెలవు తీసుకోకుండా నిరంతరం పని చేయడానికి స్ఫూర్తి ఏమిటి?

రోజుకు ఎన్ని గంటలు పని చేశానని లెక్కలేసుకునే వ్యక్తిని కాదు. కొన్ని అలవాట్లను చిన్నప్పుడే నేర్చుకుని ఇప్పటికీ పాటిస్తున్నాను. హిమాలయ పొత్తిళ్లలో గడిపిన రోజుల్లో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నాన పానాదులు పూర్తి చేసేవాణ్ని. అప్పటి నుంచీ అదే అలవాటును కొనసాగిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తా. నేను గంటల తరబడి నిద్రపోలేను. నా జీవితంలో పనికి, విశ్రాంతికి మధ్య తేడా లేదు. పనిలోనే విశ్రాంతి వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాను.

గత పదేళ్ల భారాస, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనల మధ్య ఏమైనా తేడా గుర్తించారా?

ఇది చాలా మంచి ప్రశ్న. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను తెలంగాణ ప్రజలూ గుర్తించలేకపోతున్నారు. ఒకే నాణేనికున్న రెండు పార్శ్వాలు భారాస, కాంగ్రెస్‌లు. రెండు ప్రభుత్వాలు కొండంత హామీలిచ్చాయి. కానీ గోరంతే చేశాయి.. చేస్తున్నాయి. ఒక విషయంలో రెండూ బాగున్నాయి.. అదే అవినీతి. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమాను ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి బలవంతంగా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దేశానికి మంచిపేరు తెస్తే, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ భారత్‌ పరువును దిగజారుస్తోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్‌, భారాసలు రెండూ భాగస్వాములే. భారాసను ఇంటికి పంపడానికి ప్రజలు పదేళ్లు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు.

ఈ ఎన్నికలు మీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా చూస్తారా?

మనం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. మా ప్రభుత్వ కఠోర శ్రమ, ట్రాక్‌ రికార్డును దేశ ప్రజలు చూశారు. దశాబ్ద కాలంలో దేశాన్ని ఎలా రూపాంతరం చెందించామన్నది గుర్తించారు. కాబట్టి ప్రజలంతా ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకునేలా మేం దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని వారు నమ్ముతున్నారు.

ప్రభుత్వంలో ఉన్నవారిపై అరుదుగా కనిపించే సానుకూలతను నేను ప్రతి చోటా చూస్తున్నాను. నేను ఎక్కడికెళ్లినా తల్లులు, చెల్లెళ్లు ఆశీర్వదిస్తున్నారు. దేశ భవిష్యత్తుపై యువత అత్యంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు ఓటేయడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో తామే పోటీ చేస్తున్నట్లుగా భాగస్వాములవుతున్నారు. మాకు వేసే ప్రతి ఓటు వికసిత భారత్‌కేనని ప్రజలకు తెలుసు.
ఒకవైపు మేం చేసిన పనులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతుంటే.. ప్రతిపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయి. చేయడానికి పని, భవిష్యత్తు గురించి ఆలోచనలు లేకపోవడంతో అవి నాపై దాడే లక్ష్యంగా చేసుకోవడంతోపాటు దూషించడానికి పరిమితమవుతున్నాయి. మోదీని గద్దెదింపడమే వాటి ఎజెండాగా మారింది.

తెలంగాణ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నా కేంద్రం తమకు తగినన్ని నిధులు ఇవ్వడంలేదని అక్కడి ప్రభుత్వాలు ఆరోపించడం వారి చేతగానితనానికి నిదర్శనం. స్వీయ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దీన్ని సాకుగా చూపుతున్నారు. 2004-2014 మధ్యలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.1,32,384 కోట్లు వస్తే, 2014-24 మధ్యలో తెలంగాణకు రూ.1,62,288 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,94,602 కోట్ల వాటా దక్కింది. గత ప్రభుత్వాల నాటి కాలంతో పోలిస్తే మా హయాంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.

వచ్చే ఐదేళ్లలో మీ ముఖ్యమైన ప్రాధాన్యాలేంటి?

వికసిత భారత్‌ దిశగా అభివృద్ధిని వేగవంతం చేయడమే మా మొట్టమొదటి ప్రాధాన్యాంశం. మూడోసారి అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లో దీనిపై కార్యాచరణ మొదలుపెడతాం. తర్వాత వచ్చే 5 ఏళ్లకు పూర్తి స్థాయి ప్రణాళిక అమలు చేస్తాం. 2014లో బాధ్యతలు చేపట్టినప్పుడు దేశానికి జరిగిన నష్టాన్ని నివారించడానికి మిషన్‌ మోడ్‌లో పని చేశాం. ఎక్కడ సంపూర్ణమైన మరమ్మతు అవసరమో అక్కడ చేశాం. యూపీయే ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన దుష్పరిపాలన, తప్పులు, లోపాలను సరిదిద్దడం మాకు తలకు మించిన భారంగా పరిణమించింది. రెండో విడతలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో నిమగ్నమయ్యాం.

మూడో విడతలో ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి బలమైన పునాది వేయబోతున్నాం. మూడో విడతలో ప్రతి భారతీయుడి కల నెరవేరుతుంది. సొంత శక్తితో భారత్‌ ప్రపంచ నేతగా ఎదిగే సమయం వచ్చింది.

ఈ రోజు చిన్న బొమ్మల నుంచి చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వరకూ, వందే భారత్‌ రైళ్ల నుంచి ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వేల వరకూ, మొబైల్‌ ఫోన్ల నుంచి సూపర్‌ కంప్యూటర్ల వరకూ అన్నీ మన ముంగిటకొస్తున్నాయి. మనం ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు, జెట్స్‌ తయారు చేస్తున్నాం. మూడో విడతలో వికసిత్‌ భారత్‌ కలను నెరవేర్చే దిశలో పెద్ద ముందడుగు వేయబోతున్నాం. ఇప్పటివరకూ మీరు చూసింది ట్రైలర్‌ మాత్రమే. అసలు మున్ముందు చూస్తారు.

పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తున్నా కేంద్రం తగిన నిధులు కేటాయించడం లేదన్న విమర్శలకు ఏమని సమాధానం చెబుతారు?

ఇందులో నిజాలు తెలిసీ ప్రతిపక్షాలు పదేపదే ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అవి దీన్ని ఉయోగించుకుంటున్నాయి. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. పన్నుల్లో రాష్ట్రాలకు ఎంత వాటా పంపిణీ చేయాలన్న దానిపై రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆర్థిక సంఘం ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను ఏకంగా 32% నుంచి 42%కి పెంచింది. ఆ సిఫార్సులను ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా అమలు చేసింది. దానివల్ల రాష్ట్రాలకు వచ్చే వాటా భారీగా పెరిగింది. మూలధన వ్యయం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం చేస్తోంది. ఈ పథకం కింద తెలంగాణకు రూ.1,156 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,226 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వాల నాటితో పోలిస్తే మా హయాంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.

భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో మీ నాయకత్వంద్వారా దేశం ఎంత ముందడుగు వేసింది? ఆ ఆర్థిక పురోగతి ఫలాలను ప్రజలు ఎప్పటి నుంచి అనుభవించగలుగుతారు?

అభివృద్ధి ఫలాలను మనం తొలి నుంచీ దక్కించుకోవడం లేదని ఎవరైనా భావిస్తే వాళ్లు పెద్ద విషయాలను చూడలేదేమో అనిపిస్తుంది. మన చుట్టుపక్కలున్న ప్రపంచ దేశాలు ద్రవ్యోల్బణం, అధిక ధరలతో సతమతమవుతున్న తరుణంలో భారత్‌లో అందుకు భిన్న పరిస్థితులున్నాయి. మన విశిష్టమైన అభివృద్ధి ప్రస్థానానికి ఇదే ప్రత్యక్ష, ప్రబల సంకేతం. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటి కంటే మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. గత పదేళ్ల కాలంలో కొవిడ్‌, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదల లాంటి సమస్యలు చుట్టుముట్టినప్పటికీ ద్రవ్యోల్బణం సగటున 5%కి పరిమితమయ్యేలా చర్యలు తీసుకున్నాం.

16 ఏళ్ల గరిష్ఠానికి పీఎంఐ

తయారీ రంగం పీఎంఐ 16 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. చిన్న చిన్న తయారీ సంస్థలూ తమకు అందిన కొత్త ఆర్డర్లను పూర్తి చేయడంలో తలమునకలై ఉన్నాయి. మన మార్కెట్లు కొత్త శిఖరాలకు చేరుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశ, విదేశీ పెట్టుబడులు, ఐపీవోల్లో నిరంతర వృద్ధిని చూస్తున్నాం. అందువల్ల ఫలాల గురించి మాట్లాడేటప్పుడు ఈ కొలమానాలన్నింటినీ కలిపి చూడండి. ఒకవైపు ఉపాధిపరంగా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో అభివృద్ధి మార్గాలు కనిపిస్తున్నాయి. ఆదాయాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఖర్చులు తగ్గుతున్నాయి. అభివృద్ధి చక్రంలో భాగస్వాములు కావడానికి మునుపెన్నడూ లేని అవకాశాలు మన ముందున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి జీవ రేఖ అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో మీ సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది పూర్తయితే దేశానికి రాష్ట్రం ధాన్యాగారంగా మారడం ఖాయం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు మీరేమైనా హామీ ఇస్తారా?

అది జాతీయ ప్రాజెక్టు. పోలవరం పూర్తిచేసే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నా. దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే రూ.15వేల కోట్లకుపైగా విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మేం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్మాణ పనులను రోజువారీగా పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అంశాల్లో సాయం చేయడానికి వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నాం.

పదేళ్ల పదవీ కాలాన్ని నెమరేసుకుంటే ఏమనిపిస్తుంది? మీరు సాధించిన పెద్ద విజయాలేంటి? చేయాలనుకుని చేయలేకపోయిన పనులేంటి? అనుకోకుండా దక్కిన విజయాలేమైనా ఉన్నాయా? ఈ పదేళ్లలో మీకు సంతృప్తినిచ్చినదేంటి?
140 కోట్ల మంది ప్రజల మనసుల్లో నమ్మకం, విశ్వాసం నెలకొల్పడమే మేం సాధించిన ప్రధాన విజయం. ఈ దేశంలో పరిస్థితులు ఎప్పుడూ మారవు.. మెరుగుపడవన్న నిరాశ 2014 నాటికి ప్రజల్లో ఉండేది. అవినీతి అన్నది భారతీయ జీవన విధానంలో ఎల్లకాలం అంతర్భాగమై ఉంటుందని వారు అనుకున్నారు. పేదలను వారి తల రాతకు వారిని వదిలేస్తాయని, మధ్య తరగతి ప్రజలను ఎప్పటికీ పట్టించుకోవని ప్రభుత్వాలపై అభిప్రాయం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన మేం ప్రభుత్వ పని సంస్కృతిని మార్చేశాం. తమ సమస్యలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలను ప్రభుత్వం కనుగొంటుందని మొట్టమొదటిసారిగా భావించారు. మా ప్రయత్నాల కారణంగా 4 కోట్ల కుటుంబాలకు సొంత ఇంటి నీడ దొరికింది. ఇజ్జత్‌ఘర్‌ల పేరుతో నిర్మించిన మరుగు దొడ్లు మహిళల గౌరవాన్ని నిలబెట్టాయి. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందుతోంది. గ్యాస్‌ కనెక్షన్లు అందించడంవల్ల 11 కోట్ల మంది మహిళలు ప్రాణాంతకమైన పొగ పీల్చే అవసరం లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో వంట చేయగలుగుతున్నారు. ఇవన్నీ ప్రజల జీవన ప్రమాణాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలవల్ల 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడగలిగారు.

మరోవైపు డిజిటల్‌ చెల్లింపులను చూడండి. నేను దీని గురించి ప్రస్తావించినప్పుడు.. నగదు లేకుండా వీధి వ్యాపారులు ఎలా తమ వస్తువులను అమ్ముకోగలుగుతారని, వారికి ఇంటర్నెట్‌ ఉంటుందా అని మాజీ ఆర్థిక మంత్రి ఒకరు ప్రశ్నించారు. కాలం గిర్రున తిరిగి 2024లోకి అడుగుపెట్టేప్పటికి భారత్‌ ఈ రంగాన్ని శాసించే స్థాయికి చేరింది. ఇప్పుడు ఏ సందుకెళ్లినా, ఏ దుకాణాన్ని చూసినా క్యూఆర్‌ కోడ్‌ దర్శనమిస్తోంది. ఈ డిజిటల్‌ చెల్లింపులు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

నేను దేనికీ అంత సులభంగా సంతృప్తి చెందను. ఎప్పుడూ దేశానికి ఏదైనా చేయాలని తపన పడుతుంటాను. మరింత కఠోరంగా, వేగంగా పని చేయడానికి ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను.

జీరో బ్యాలెన్స్‌ ఖాతాలపై నవ్వారు

భారత్‌ సాధించిన డిజిటల్‌ విప్లవం.. మరీ ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీని ఉదాహరణగా తీసుకోండి. నేను జీరో బ్యాలెన్స్‌ బ్యాంకు ఖాతాల గురించి మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వారు. డబ్బులు లేనప్పుడు బ్యాంకు ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏముందని, పేదలకు బ్యాంకు సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కానీ మేం దాన్ని సవాలుగా స్వీకరించి, భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థను సమాయత్తం చేశాం. ఈ రోజు ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.36 లక్షల కోట్లను ప్రభుత్వం ఉంచింది. ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమల్లోకి తెచ్చి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో జరిగే రూ.3.5 లక్షల కోట్ల అవినీతిని నిర్మూలించగలిగాం.

భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు భారీగా తగ్గిపోతాయనే భయాందోళనలు ఏర్పడ్డాయి. ఈ విషయంలో అక్కడి ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు?

ముఖ్యమంత్రిగా పని చేసిన విస్తృతానుభవం ఉన్న అతి కొద్ది మంది ప్రధాన మంత్రుల్లో నేను ఒకణ్ని. అందువల్ల నేను రాష్ట్రాల ఆందోళనలను అర్థం చేసుకోగలుగుతాను. జాతీయ ఆశయాలతోపాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చాలన్నదే మా లక్ష్యం. మన ఏకత్వాన్ని విశ్వసించే ప్రజలకు ఇచ్చే హామీ ఏంటంటే.. నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని విభజించదు. ఏ ప్రాంతానికీ అనుచిత ప్రయోజనం కల్పించదు. అది మన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా, తగిన విధంగా ప్రాతినిధ్యం కల్పించడానికి చేసే కసరత్తే. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రక్రియే నియోజకవర్గాల పునర్విభజన. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగదని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఉత్తరం-దక్షిణం, పేదలు-ధనికులు, కులం- మతం పేరుతో విభజించడానికి ఇప్పటికీ చాలా మంది బ్రిటిష్‌ కాలం నాటి ఎత్తులు వేస్తున్నారు.

కాలక్రమంలో ఓటర్లు ఎంతో పరిణితి చెందారు. దాన్ని వారి చర్యల ద్వారా మనం చూశాం. అన్ని మతాల అభివృద్ధికి అవకాశం కల్పించే వికసిత భారత్‌ నిర్మాణం కోసం ప్రజలంతా ఐక్యంగా ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. అందువల్ల ప్రజలెవరూ మోసపోరు. విడిపోరు. గోడలపై రాసినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ చూడలేకపోయినా ప్రజలు ఓటు ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపుతారని నమ్ముతున్నాను

మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏం చేయబోతున్నారు?

యువతకు ఉద్యోగాలు కల్పించడంలో గత అన్ని ప్రభుత్వాల కంటే మా రికార్డు ఉత్తమంగా ఉంది. మాకున్న అత్యంత ప్రాధాన్యాంశాల్లో ఇది ఒకటి. ఈ విషయంలో మేం గణనీయ పురోగతి సాధించాం. వార్షిక పీఎల్‌ఎఫ్‌ఎస్‌ డేటా ప్రకారం 2017-23 మధ్యకాలంలో కార్మికులు, జనాభా నిష్పత్తి 56% దాటిపోగా, నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 3.2%కి పడిపోయింది. ప్రపంచంలోనే అతి కనిష్ఠ నిరుద్యోగ రేటు ఇదే. ఎంతో మంది కార్మిక శక్తిలో చేరడాన్ని మనం చూస్తున్నాం. గత ఆరున్నరేళ్లలో ఈపీఎఫ్‌వోలో నికరంగా 6.17 కోట్ల మంది కొత్త చందాదారులు చేరడం సంఘటిత ఉద్యోగ మార్కెట్‌ వృద్ధిని సూచిస్తోంది. ముద్ర రుణాల ద్వారా 8 కోట్ల కొత్త వ్యాపారాలు ఏర్పడటానికి సాయం చేశాం. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 6 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. అది రెట్టింపు దిశగా వెళ్తోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం గత దశాబ్ద కాలంలో 3 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించింది. రోజ్‌గార్‌ మేళా ద్వారా లక్షల మంది యువతను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తున్నాం. స్టార్టప్‌లు ఇప్పటివరకూ లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించాయి.

పదేళ్లకు ముందు చాలా వ్యవస్థలు మనుగడలోనే లేవు. ఉదాహరణకు క్రీడా రంగాన్ని తీసుకుంటే మేం ఈ రంగాన్ని ఆకర్షణీయమైన కెరీర్‌గా తీర్చిదిద్దాం. శిక్షకులు, విశ్లేషకులు, పౌష్టికాహార నిపుణులు, గ్రౌండ్‌ స్టాఫ్‌ రూపంలో ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పించాం. అంతరిక్షం, డ్రోన్లు, స్టార్టప్‌లు, హరిత ఇంధనంలాంటి రంగాలు వేగంగా వికసిస్తున్నాయి.

మౌలిక వసతుల కోసం ఆశ్చర్యపోయే విధంగా మేం రూ.11.11 లక్షల కోట్లు కేటాయించాం. చరిత్రలో ఇదే అత్యధికం.

ప్రపంచం పారిశ్రామికం 4.0వైపు మళ్లుతున్న తరుణంలో ఉద్యోగాల గుణం వేగంగా మారిపోతోంది. ఈ మార్పును ముందు చూపుతో గ్రహించి మనం అందిపుచ్చుకుంటున్నాం. ఉద్యోగాల కల్పనలో భారత్‌ భవిష్యత్తులో కూడా ముందుంటుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను.

ఈరోజు మనం మొబైళ్ల తయారీలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. మన రక్షణ ఎగుమతులు రూ.21వేల కోట్లను దాటాయి. సౌర విద్యుత్తు పరికరాల తయారీలో ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశంగా అవతరించబోతున్నాం. ఇంత విస్తృత స్థాయిలో మనం చేస్తున్న పనులు కొత్త ఉద్యోగాలు సృష్టించవనుకుంటున్నారా?

కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సాయం చేయడం లేదని భారాస, కాంగ్రెస్‌ రెండూ ఆరోపిస్తున్నాయి కదా? దీనికి ఏం సమాధానం చెబుతారు?
మా ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా మద్దతు పలికింది. ఇక ముందూ కొనసాగిస్తుంది. వృద్ధికి తెలంగాణలో విస్తృత అవకాశాలున్నప్పటికీ దాని పురోగతికి భారాస, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బ్రేకులు వేశాయి. ఆ ప్రభుత్వాల వైఫల్యాల గురించి ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారు. ఎయిమ్స్‌ బీబీనగర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ ఐఐటీలో మౌలిక వసతుల బలోపేతం, కాజీపేటలో వ్యాగన్ల తయారీ యూనిట్‌, రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్‌టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, వరంగల్‌లో పీఎం మిత్ర పార్కు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మీవద్ద ఉన్న ప్రణాళికలేంటి? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయబోతున్నారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నాం. ఈ దిశలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లోని మాదిగ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపింది. అలాగే వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నాం. పీఎం ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, రక్షిత మంచినీరు, మరుగు దొడ్లు, ఉచిత ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు, జన్‌ధన్‌ ఖాతాలు, బీమా ప్రయోజనాలు, నైపుణ్యం, స్కాలర్‌షిప్‌ల మంజూరు లాంటి పథకాలను వారికి సాధ్యమైనంత తక్కువ సమయంలో సంతృప్తికర స్థాయిలో అందించేందుకు మిషన్‌ మోడ్‌లో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాం. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిని కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి హోదాకు సమానమైన జాతీయ ఎస్సీ కమిషన్‌లో సభ్యులుగా నియమించాం.

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏమైనా మార్గసూచీ ఉందా?

అప్పట్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మేం చిత్తశుద్ధితో పని చేశాం. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా 2014 నుంచి ఇప్పటివరకూ 33 సమీక్షా సమావేశాలను నిర్వహించాం.

రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటంవల్ల 89 సంస్థలు/కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు. ఇందులో కొన్ని సంస్థల విభజనపై రెండు రాష్ట్రాలూ కోర్టుల్లో కేసులు వేశాయి. అది విభజన చట్టంలోని నిబంధనల అమల్లో జాప్యానికి దారి తీసింది.

రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నది మా ప్రభుత్వ విధానం. సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కేవలం సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించగలదు.
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐసర్‌, గిరిజన విశ్వవిద్యాలయం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పెట్రోలియం యూనివర్సిటీ, ఎయిమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశాం. ఆంధ్రప్రదేశ్‌ను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి మేం కసరత్తు చేస్తున్నాం. వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌ తరహాలో అభివృద్ధి చేస్తున్నాం.

తెలంగాణలోని ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. భూమి ఇవ్వడానికి గత భారాస ప్రభుత్వం ఐదేళ్లు జాప్యం చేసినప్పటికీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చట్టం చేశాం. కాజీపేటకు రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్‌ మంజూరు చేశాం. 9 ఉమ్మడి జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక సాయం కింద రూ.2,250 కోట్లు విడుదల చేశాం. కానీ అక్కడి ప్రభుత్వాలు గత పదేళ్లలో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి సమస్యలను పెండింగ్‌లో పెట్టే పంథాను అనుసరించాయి.

చాలా చేశాం

వాస్తవానికి మేం రెండు రాష్ట్రాలకు చాలా చేశాం. 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 2015-20 మధ్యకాలంలో రూ.22వేల కోట్లు, 2020-26 మధ్యకాలంలో రూ.35వేల కోట్ల గ్రాంటు ఇచ్చాం.. ఇవ్వబోతున్నాం. దీనికితోడు వనరుల లోటు భర్తీ, 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విదేశీ సాయం కింద చేపట్టిన ప్రాజెక్టుల రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2014-23 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.35వేల కోట్లకుపైగా విడుదల చేశాం.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినా దాన్ని సాకారం చేసే విషయంలో ఆ తర్వాత చర్యలేమీ చేపట్టలేదు.ఈ విషయంలో ఏదైనా ముందడుగు ఆశించొచ్చా?

రైతులకు సాధికారత కల్పించడానికి మా ప్రభుత్వం తీసుకున్న ముఖ్య చర్యల్లో పసుపు బోర్డు ఒకటి. ప్రధాన కార్యాలయం ఖరారు దగ్గరి నుంచి అధికారుల గుర్తింపు వరకూ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఈ పనులపై కొంత ప్రభావం పడింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తాం. దేశంలో పసుపు రంగానికి ప్రోత్సాహం, అభివృద్ధికి ఈ బోర్డు దోహదం చేస్తుంది. పరిశోధన, మార్కెట్‌ సౌకర్యాల అభివృద్ధి, వినియోగం పెంపు, విలువ జోడింపు లాంటి అంశాలపై ఈ బోర్డు పని చేస్తుంది.

హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయబోతోంది? హైదరాబాద్‌-ముంబయి మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదన ఉంది. వీటిని సాకారం చేయడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు?

తెలంగాణకు, భారత దేశానికి హైదరాబాద్‌ నగరం ఒక గ్రోత్‌ సెంటర్‌. మేం పట్టణీకరణను సమస్యగా కంటే అవకాశంగానే చూస్తున్నాం. హైదరాబాద్‌లో రద్దీని నివారించడానికి పలు రకాలుగా పని చేస్తున్నాం. 6 ముఖ్యమైన జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్‌ను అన్ని వైపులా స్పీడ్‌ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. నగరంలోని అన్ని ప్రాంతాల వారికి సులభమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తేవడానికి ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం. వందే భారత్‌ మెట్రో ప్రయోజనం పొందే నగరాల్లో హైదరాబాద్‌ ఉండబోతోంది.

హైదరాబాద్‌కు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌

ముంబయి- అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు త్వరలో పూర్తి కాబోతోంది. అలాంటి కారిడార్లు దేశంలో దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పాం. వివిధ గమ్య స్థానాలపై ఇప్పటికే రైల్వేశాఖ అధ్యయనం ప్రారంభించింది. దక్షిణాదిలో హైదరాబాద్‌ ముఖ్య నగరం కాబట్టి భవిష్యత్తులో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను కచ్చితంగా చూస్తుంది.

2001వ సంవత్సరంలో గుజరాత్‌లో సంభవించిన భయంకర భూకంపం అనంతరం బాధితుల కోసం పాకిస్తాన్ సరిహద్దుల్లోని కచ్ జిల్లాలో కావ్డా అనే గ్రామాన్ని తెలుగు ప్రజల సహకారంతో ‘ఈనాడు’ సంస్థ నిర్మించిన విషయాన్ని గుర్తుచేసినప్పుడు ప్రధాని చాలా సంతోషించారు. మళ్లీ ఎప్పుడైనా అక్కడకు వెళ్ళారా అని అయన అడిగారు. లేదని చెప్పగా ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్లి అభివృద్ధిని చూడండి.. వీలైతే కచ్ ఎడారిలో సెప్టెంబర్ తర్వాత జరిగే రణ్ ఉత్సవ సమయంలో ఒకసారి మీ ఎడిటోరియల్‌ బోర్డు సమావేశం నిర్వహించండని సూచించారు.

Following is the clipping of the interview:

Source: Eenadu

Explore More
وزیراعظم نریندر مودی کا 78 ویں یوم آزادی کے موقع پر لال قلعہ کی فصیل سے خطاب کا متن

Popular Speeches

وزیراعظم نریندر مودی کا 78 ویں یوم آزادی کے موقع پر لال قلعہ کی فصیل سے خطاب کا متن
Private investment and job growth set to boost economy: CII Survey

Media Coverage

Private investment and job growth set to boost economy: CII Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates the Indian women’s team on winning the Kho Kho World Cup
January 19, 2025

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian women’s team on winning the first-ever Kho Kho World Cup.

He wrote in a post on X:

“Congratulations to the Indian women’s team on winning the first-ever Kho Kho World Cup! This historic victory is a result of their unparalleled skill, determination and teamwork.

This triumph has brought more spotlight to one of India’s oldest traditional sports, inspiring countless young athletes across the nation. May this achievement also pave the way for more youngsters to pursue this sport in the times to come.”