· “నేడు ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ వృద్ధిని వేగిరపరుస్తాయి”
· “ఈ అమరావతి గడ్డ సంప్రదాయంతో ముడిపడిన ప్రగతికి ప్రతీక”
· “వికసిత ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ గారి స్వప్నం... ఆ మేరకు సమష్టి కృషితో అమరావతిని, రాష్ట్రాన్ని వికసిత భారత్‌కు వృద్ధి చోదకంగా మారుద్దాం”
· “శరవేగంగా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ సాగుతున్న దేశాల్లో నేడు భారత్‌ ఒకటిగా ఉంది”
· “పేదలు.. రైతులు.. యువత.. నారీశక్తి మూల స్తంభాలుగా వికసిత భారత్ రూపుదిద్దుకుంటుంది”
· “నాగాయలంకలో నిర్మించే ‘నవదుర్గ పరీక్షా వేదిక’ దుర్గామాత తరహాలో దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది... దీనిపై మన శాస్త్రవేత్తలతోపాటు రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు”

తల్లి దుర్గా భవాని కొలువున్న ఈ పుణ్యభూమి పై మీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ జీ, ముఖ్యమంత్రి, నా స్నేహితుడు శ్రీ చంద్రబాబు నాయుడు జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచర మంత్రులు, డైనమిక్  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఆంధ్రప్రదేశ్ లోని నా ప్రియమైన సోదరులు, సోదరీమణులు!

ఈవేళ పవిత్ర అమరావతి గడ్డపై నిల్చుని నా మనో నేత్రంతో వీక్షిస్తున్నది ఒక నగరాన్ని మాత్రమే కాదు.. ఒక స్వప్న సాకారాన్ని... ఓ కొత్త అమరావతిని.. సరికొత్త ఆంధ్రను దర్శిస్తున్నా. సంప్రదాయంతో ముడిపడిన పురోగమనానికి అమరావతిగడ్డ ఒక ప్రతీక. బౌద్ధ వారసత్వమైన శాంతితోపాటు వికసిత భారత్ ను  రూపుదిద్దే శక్తిని కూడా ఈ నేల అక్కున చేర్చుకుంటుంది. ఈ రోజు ఇక్కడ సుమారు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు  శంకుస్థాపనలు, ప్రారంభాలు జరిగాయి. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు, భారత అభివృద్ధి దృక్పథానికి బలమైన పునాదులు.  వీరభద్ర స్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వేంకటేశ్వర స్వామిలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గార్లకు నా అభినందనలు.

 

మిత్రులారా...

ఇతిహాసాల ప్రకారం ఇంద్రలోక రాజధాని అమరావతి కాగా, ఇప్పుడది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయింది. ఈ పరిణామం యాదృచ్చికం కాదు.  ప్రగతి పథంలో భారత్ పయనాన్ని బలోపేతం చేసే ‘స్వర్ణాంధ్ర’ సృష్టికి సానుకూల సంకేతం. వికసిత భారత్ దిశగా భారత్ పయనాన్ని ‘స్వర్ణాంధ్ర’ బలోపేతం చేస్తుంది. "స్వర్ణాంధ్ర" అనేది  అమరావతి దృక్పథానికి శక్తినిస్తుంది.

అమరావతి కేవలం ఒక నగరం కాదు.. అదొక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే సామర్థ్యం దీనికుంది.

మిత్రులారా..

అమరావతి ఆంధ్రప్రదేశ్ యువత కలలు సాకారం చేసే నగరమవుతుంది. భవిష్యత్తులో ఇది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ, పరిశుభ్ర ఇంధనం, కాలుష్యరహిత పరిశ్రమలు, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రముఖ నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఈ రంగాలలో వృద్ధిని వేగిరపరచేందుకు తగిన మౌలిక సదుపాయాల సత్వర కల్పనలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తోంది. టెక్నాలజీ విషయంలో ఇందాక చంద్రబాబు గారు నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. కానీ మీకో రహస్యం చెబుతా. నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయినా తొలినాళ్లలో హైదరాబాద్ లో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చాలా ఆసక్తిగా పరిశీలించేవాడ్ని. ఇప్పుడు వాటిని ఆచరణలోకి తెచ్చే అవకాశం వచ్చింది. స్వానుభవంతో చెబుతున్నా.. భవిష్యత్ సాంకేతికతలను ముందుగానే పసిగట్టి వాటిని సత్వరమే చేపట్టగల నేర్పరితనం చంద్రబాబు సొంతం.

మిత్రులారా...

ఈ ప్రజా రాజధానికి శంకుస్థాపన చేసే అవకాశం 2015లో నాకు లభించింది. కొన్నేళ్లుగా  ఈ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందించింది. ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా అవసరమైన చర్యలన్నీ చేపట్టింది. శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అడ్డంకులను అధిగమించి అభివృద్ధి కృషిని వేగవంతం చేసింది. హైకోర్టు, శాసనసభ, సచివాలయం, రాజ్ భవన్ వంటి కీలక వ్యవస్థల భావన సదుపాయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది.

మిత్రులారా...

అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ గారి స్వప్నం. సమష్టి కృషితో అమరావతిని, రాష్ట్రాన్ని వికసిత భారత్ కు వృద్ధి చోదకంగా మారుద్దాం. ఎన్టీఆర్ గారి కల నెరవేరుద్దాం. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్... (తెలుగులో మాట్లాడారు) ఇది మనం చెయ్యాలి. మనమే చేయాలి.

 

మిత్రులారా...

గత పదేళ్లలో  భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ విస్తృతంగా దృష్టి సారించింది. తదనుగుణంగా నేడు శరవేగంగా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ సాగుతున్న ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉంది. ఈ పురోగమనం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా గణనీయ ప్రయోజనం పొందుతోంది. ఇందులో భాగంగా రూ.వేల కోట్ల విలువైన రహదారి, రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయించిన నేపథ్యంలో ప్రగతి వేగం పుంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడో నవ్యానుసంధాన యుగంలో పయనిస్తోంది. తద్వారా జిల్లా నుంచి జిల్లాకు సంబంధాలు మెరుగుపడుతూ పొరుగు రాష్ట్రాలతో సంధానం కూడా మెరుగవుతుంది. దీంతో రైతులకు మరింత పెద్ద మార్కెట్ల సౌలభ్యం కలుగుతుంది.  రవాణా సామర్థ్యం పెరగడంతో పరిశ్రమలకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. పర్యాటక, తీర్థయాత్ర రంగాలు కూడా ఊపందుకుంటాయి.  ఉదాహరణకు రేణిగుంట-నాయుడుపేట రహదారి వల్ల తిరుపతి వెంకన్న దర్శనం మరింత సులువవుతుంది. తద్వారా అతి తక్కువ సమయంలోనే  భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగలుగుతారు.

మిత్రులారా...

వేగంగా వృద్ధిచెందిన ప్రతి దేశమూ తమ రైల్వే నెట్వర్క్లకు అత్యధిక ప్రాముఖ్యం ఇచ్చింది. మన దేశంలోనూ గత దశాబ్దం రైల్వేలకు రూపాంతరీకరణ కాలం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనూ రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. 2009-2014 మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా రైల్వే బడ్జెట్లో రూ.900 కోట్లకన్నా తక్కువే కేటాయింపులు జరిగాయి. నేడు ఒక్క ఆంధ్రప్రదేశ్ కే  రూ.9,000 కోట్లకుపైగా కేటాయించాం. అంటే ఈ కేటాయింపులు పదింతలు పెరిగాయి.

మిత్రులారా...

రైల్వే బడ్జెట్ పెంపుతో ఆంధ్రప్రదేశ్లో రైల్వేల విద్యుదీకరణ 100 శాతం పూర్తయింది. రాష్ట్రం నుంచి ఇప్పుడు 8 జతల ఆధునిక వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దీనికి తోడు అమృత్ భారత్ రైలు కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తోంది. గత పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 750కిపైగా రైలు ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మితమయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని 70కిపైగా రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఆధునికీకరిస్తున్నాం.

 

మిత్రులారా...

మౌలిక సదుపాయాల అభివృద్ధి బహుముఖ ప్రభావాన్ని చూపించడం తథ్యం. సిమెంటు, ఉక్కు వంటి ముడిపదార్ధాల రవాణాతోపాటు రవాణా సేవలు వంటి వివిధ రంగాలు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా గణనీయ ప్రయోజనం పొందుతాయి. . అలాగే బహుళ రంగ పరిశ్రమలు బలోపేతం కాగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన దేశ యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చి మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోనూ వేలాదిగా యువతకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తున్నాయి.

మిత్రులారా...

పేదలు, రైతులు, యువత, మహిళా సాధికారత అనే నాలుగు మూల స్తంభాల పునాదిపైనే వికసిత భారత్ ఆధారపడి ఉందని లోగడ ఎర్రకోట పైనుంచి చేసిన ప్రసంగంలో చెప్పాను. ఈ నాలుగు స్తంభాలూ మా ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు కేంద్రకంగా ఉన్నాయి.  రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాం. రైతులపై ఆర్థిక భారం తగ్గించడానికి గత పదేళ్లలో వారికి సబ్సిడీ ధరతో ఎరువులు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు లక్ష్యంగా వేలాది కొత్త, ఆధునిక విత్తన రకాలను పంపిణీ చేశాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రూ.5,500 కోట్ల విలువైన రైతుల క్లెయిమ్ లను పరిష్కరించాం. దీంతోపాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రాష్ట్రంలోని లక్షలాది రైతుల ఖాతాలకు రూ.17,500 కోట్లకుపైగా నేరుగా బదిలీ చేశాం.

 

మిత్రులారా...

దేశవ్యాప్తంగా నీటిపారుదల ప్రాజెక్టుల విస్తరణ వేగంగా సాగుతోంది.  నదుల అనుసంధాన కార్యక్రమాల ప్రారంభమయ్యాయి.  ప్రతి కమతానికీ నీరందుతూ రైతులకు నీటి కొరత లేకుండా చేయడం మా లక్ష్యం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఇది కోట్లాది ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పు తెస్తుంది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడంలో కేంద్రంలోని తమ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తుంది.

మిత్రులారా..

దేశాన్ని అంతరిక్ష శక్తిగా రూపొందించడంలో దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. శ్రీహరికోట నుంచి ప్రారంభమైన ప్రతి ప్రయోగం లక్షలాది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగేలా చేసింది. అలాగే అంతరిక్ష పరిశోధనల వైపు అడుగేసేలా దేశ యువతరాన్ని ప్రేరేపించింది. భా రత రక్షణ రంగంలో కొత్త రక్షణ వ్యవస్థ శ్రీకారం చుట్టుకుంది. ఇందులో భాగంగా డీఆర్డీఓ కొత్త క్షిపణి పరీక్షా కేంద్రానికి పునాది పడింది. ఈ దిశగా నాగాయలంకలోని నవదుర్గ పరీక్షా కేంద్రం రక్షణ సామర్థ్యాన్ని బహుగుణంగా పెంచుతుంది. దుర్గామాత దివ్య శక్తి నుంచి ఇది సంపూర్ణ బలం సంతరించుకోగలదని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ కీలక ఘట్టం సాకారమైన నేపథ్యంలో శాస్త్రవేత్తలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నా.

 

మిత్రులారా...

నేటి భారత్ బలం ఆయుధ శక్తిలో కాకుండా దాని ఐక్యతలో ఉంది. దేశవ్యాప్తంగా నగరాల్లో ఏర్పాటవు ‘ఏక్తా మాల్స్’ ద్వారా ఈ ఐక్యతా స్ఫూర్తి మరింత బలోపేతం అవుతుంది. విశాఖపట్నం లో కూడా త్వరలోనే ‘ఏక్తా మాల్’ ఏర్పాటవుతుంది. దేశవ్యాప్తంగాగల చేతివృత్తులవారు, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ఇక ఒకే వేదికపై ప్రదర్శిస్తారు. ఈ మాల్స్ సుసంపన్న భారతీయ వైవిధ్యంతో ప్రజలను అనుసంధానిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తాయి. తద్వారా “ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్” దార్శనికతను బలోపేతం చేస్తాయి.

ఇప్పుడే మనం చంద్రబాబు గారు మాట్లాడింది విన్నాం. జూన్ 21 న జరిగే  అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆంధ్రలో నిర్వహించాలని నన్ను ఆహ్వానించినందుకు చంద్రబాబుకు, ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు నేను కూడా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా. ఈ ఏడాది జరిగే వేడుకలకు ఓ ప్రాధాన్యం ఉంది. అది  అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పదేళ్లు పూర్తి కావడం.

ప్రపంచవ్యాప్తంగా యోగా కు ఆదరణ పెరుగుతోంది.  ఈసారి ప్రపంచం మొత్తం జూన్ 21న ఆంధ్ర వైపు చూస్తుంది. రాబోయే 50 రోజుల్లో యోగాపై ఆంధ్రవ్యాప్తంగా పోటీలు, ప్రపంచ రికార్డులను సృష్టించే పనిని చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన వాతావరణాన్నిసృష్టించాలి. ఆంధ్ర ప్రదేశ్, చంద్రబాబు నాయకత్వంలో ఇది కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా.

 

మిత్రులారా...

ఆంధ్రప్రదేశ్ లో కలలు కనేవారికి లేదా వాటిని సాకారం చేసుకోగల యువతకు కొరత లేదు. రాష్ట్రం నేడు సరైన మార్గంలో ముందడుగు వేస్తూ, సముచిత వృద్ధి వేగాన్ని సంతరించుకున్నదనే విశ్వాసం నాకుంది. ఇప్పుడు ఈ వృద్ధి వేగాన్ని మనం నిరంతరం ముందుకు తీసుకుపోవాలి.

అమరావతిని అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు దృక్పథం బృహత్తరమైనది, సాధించదగ్గది అని నేను బలంగా చెప్పగలను. అమరావతి మీద సారించిన దృష్టి రాబోయే మూడేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ జీడీపీని  ఎక్కడ నుంచి ఎక్కడికి  తీసుకువెళతాయో నేను స్పష్టంగా చెప్పగలను.

 

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు, ఆంధ్ర ప్రదేశ్ పురోగతి కోసం నేను మీతో భుజం భుజం కలిపి నడుస్తానని మరోసారి హామీ ఇస్తున్నా.

మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు.

 

మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది.

ధన్యవాదాలు!

భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

వందేమాతరం! వందే మాతరం!

వందేమాతరం! వందే మాతరం!

వందేమాతరం! వందే మాతరం!

వందేమాతరం! వందే మాతరం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre allows 100% FDI in insurance via auto route

Media Coverage

Centre allows 100% FDI in insurance via auto route
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a fire mishap in Delhi’s Shahdara district
May 03, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a fire mishap in Delhi’s Shahdara district.

The Prime Minister extended his condolences to those who have lost their loved ones in this tragic mishap and prayed for the speedy recovery of the injured.

Shri Modi announced that an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister's National Relief Fund (PMNRF) would be given to the next of kin of each of those who lost their lives, and the injured would be given Rs. 50,000.

The Prime Minister posted on X:

"The loss of lives due to a fire mishap in Delhi’s Shahdara district is extremely distressing. Condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost their lives. The injured would be given Rs. 50,000: PM"