శతాబ్దాలుగా భారత్, భూటాన్లది అత్యంత బలమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధం. ఈ ముఖ్యమైన సందర్భంలో పాల్గొనటం భారత్ ప్రాధాన్యత మాత్రమే కాదు.. నాది కూడా... కానీ ఈ రోజు చాలా బాధతో ఇక్కడికి వచ్చాను: పీఎం
నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన ఘటనతో అందరిలోనూ కలవరం. ఈ కుట్ర ఛేదించనున్న మన ఏజెన్సీలు నేరస్థులను క్షమించేది లేదు... నేరగాళ్లకు శిక్ష తప్పదు: పీఎం
వసుధైక కుటుంబం... భారత్ ప్రాచీన సైద్ధాంతిక నమ్మకం ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం... అందరి ఆనందాన్నీ మేం కోరుకుంటాం: పీఎం
భూటాన్ రాజు ప్రతిపాదించిన ‘‘స్థూల జాతీయ ఆనందం’’ ప్రపంచ అభివృద్ధిని లెక్కించేందుకు ఓ ముఖ్యమైన కొలమానం: పీఎం
భారత్, భూటాన్‌లు కేవలం సరిహద్దులతోనే కాదు, సంస్కృతులతోనూ అనుబంధం కలిగి ఉన్నాయి. మన బంధం విలువలు, భావోద్వేగాలు, శాంతి, ప్రగతి పునాదులపై నిలిచినది: పీఎం
ప్రపంచంలోని మొదటి కర్బన రహిత దేశంగా భూటాన్ మారటం అసాధారణ విజయం: పీఎం
తలసరి పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోని అగ్ర దేశాల్లో భూటాన్ ఒకటి. విద్యుత్తును 100% పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేస్తోంది... ఈ సామర్థ్యాన్ని పెంచుతూ ఇవాళ మరో కీలకమైన అడుగు వేయనున్న భూటాన్: పీఎం
అనుసంధానంతో అవకాశాలు, అవకాశాలతో అభివృద్ధి — శాంతి, సుసంపన్నత, ఉమ్మడి అభివృద్ధి మార్గంలో భారత్, భూటాన్: పీఎం

గౌరవ భూటాన్ రాజు గారూ,

గౌరవ నాలుగో రాజు గారూ,

గౌరవ రాజ కుటుంబ సభ్యులూ,

భూటాన్ ప్రధానమంత్రి గారూ,

ఇతర ప్రముఖులూ,

భూటాన్ సోదరీ సోదరులారా!

కుజుజాంగ్‌పో లా!

భూటాన్‌కు, భూటాన్ రాజకుటుంబానికి, ప్రపంచ శాంతిని విశ్వసించే వారందరికీ ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు.

భారత్ - భూటాన్ మధ్య శతాబ్దాలుగా బలమైన ఉమ్మడి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. అందుకే ఈ ముఖ్య కార్యక్రమంలో పాల్గొనడం నా బాధ్యత, భారత్ బాధ్యత కూడా..

కానీ నేడు నేనెంతో హృదయ భారంతో ఇక్కడికి వచ్చాను. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయానక ఘటన మనందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నష్టపోయిన కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ దుఃఖ సమయంలో దేశం వారికి అండగా ఉండి చేయూతనిస్తుంది.

ఈ కేసుకు సంబంధించి అన్ని సంస్థలు, ముఖ్య అధికారులతో నేను రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాను. చర్చలు సాగిస్తూనే.. ముక్కలుముక్కలుగా ఉన్న సమాచారాన్నంతా ఒక్క చోట చేరుస్తూ వచ్చాం.

మన ఏజెన్సీలు ఈ కుట్ర మూలాలను ఛేదిస్తాయి. బాధ్యులైన నేరస్తులను వదిలే ప్రసక్తే లేదు.

బాధ్యులందరినీ చట్టం ఎదుట నిలబెడతాం.

 

మిత్రులారా,

ఈ రోజు మనం ఓ వైపు గురు పద్మసంభవుడి ఆశీస్సులతో ప్రపంచ శాంతి ప్రార్థనోత్సవం కోసం ఇక్కడ సమావేశమమయ్యాం. మరోవైపు బుద్ధు భగవానుడి పవిత్ర పిప్రహ్వా అవశేషాలను ప్రదర్శనలో చూస్తున్నాం. దీనితోపాటు గౌరవ నాలుగో రాజు 70వ పుట్టిన రోజును కూడా మనం జరుపుకొంటున్నాం.

ఈ కార్యక్రమం, ఎంతో ఆదరాభిమానాలతో హాజరైన మీరంతా భారత్ - భూటాన్ మధ్య బలమైన బంధానికి నిదర్శనం.

మిత్రులారా,

భారత్‌లో మన పూర్వీకులు మనకు ‘వసుధైవ కుటుంబకం’ అని బోధించారు. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబమని అర్థం.

‘సర్వే భవంతు సుఖినః’ అంటాం మనం. అంటే ఈ భూమిపై ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండుగాక.

మనం అంటాం –

ద్యోః శాంతిః

అంతరిక్షం శాంతిః

పృథివీ శాంతిః

ఆపః శాంతిః

ఓషధయః శాంతిః

అంటే విశ్వంలో, ఆకాశంలో, అంతరిక్షంలో, భూమిపై, నీటిలో, ఔషధాల్లో, మొక్కల్లో, అన్ని జీవరాశుల్లో శాంతి నెలకొనాలని అర్థం. ఈ స్ఫూర్తితో భారత్ నేడు భూటాన్‌లో ప్రపంచ శాంతి ప్రార్థనోత్సవంలో పాల్గొన్నది.

నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులంతా కలిసి ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నారు. 140 కోట్ల భాతీయుల ప్రార్థనలూ ఇందులో భాగంగా ఉన్నాయి.

చాలామందికి తెలిసుండకపోవచ్చు గానీ.. నా జన్మస్థలి వాద్‌నగర్ ఎప్పటినుంచో బౌద్ధ వారసత్వానికి పవిత్ర కేంద్రంగా ఉంది. నా కార్య స్థలి వారణాసి కూడా పూజనీయ బౌద్ధ భక్తి కేంద్రం. అందుకే ఈ వేడుకలో పాల్గొనడం నాకెంతో ప్రత్యేకమైనది. భూటాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఈ శాంతి దీపం వెలుగులు ప్రసరింపజేయాలని ప్రార్థిస్తున్నాను.

 

మిత్రులారా,

గౌరవ భూటాన్ నాలుగో రాజు జీవితం జ్ఞానం, నిరాడంబరత, ధైర్యం, నిస్వార్థ దేశ సేవల సమ్మేళనం.

16 ఏళ్ల వయస్సులోనే ఓ గొప్ప బాధ్యతను ఆయన స్వీకరించారు. ఆయన తన దేశానికి తండ్రిలా ప్రేమను పంచి.. ఓ దార్శనికుడిగా ముందుకు నడిపారు. తన 34 ఏళ్ల పాలన కాలంలో భూటాన్ వారసత్వమూ, అభివృద్ధీ రెండింటినీ ఆయన ముందుకు తీసుకెళ్లారు.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడంలోనూ, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలోనూ గౌరవ భూటాన్ రాజు నిశ్చయాత్మక పాత్ర పోషించారు.

మీరు ప్రవేశపెట్టిన ‘స్థూల జాతీయానందం’ భావన నేడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి ముఖ్య కొలమానంగా మారింది. దేశ పురోగతి అంటే జీడీపీ మాత్రమే కాదని, మానవాళి శ్రేయస్సుకూ సంబంధించినదని మీరు చాటిచెప్పారు.

మిత్రులారా,

భారత్ - భూటాన్ మధ్య మైత్రిని బలోపేతం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన వేసిన పునాదిపై మన రెండు దేశాల బంధమూ ఎప్పటికప్పుడు పురోగమిస్తోంది.

భారతీయులందరి తరఫునా గౌరవ రాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.

మిత్రులారా,

సరిహద్దులు మాత్రమే కాదు.. సంస్కృతులు కూడా భారత్‌ను, భూటాన్‌ను అనుసంధానిస్తున్నాయి. విలువలు, భావోద్వేగాలు, శాంతి, పురోగతులు మన సంబంధానికి మూలాధారం.

2014లో నేను ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొదటి విదేశీ పర్యటన భూటాన్‌లోనే.. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నా హృదయాన్ని తాకుతున్నాయి. భారత్, భూటాన్ మైత్రి గాఢమైనది, శక్తిమంతమైనది. కష్ట సమయాల్లో ఒకరికొకరం అండగా ఉన్నాం. సవాళ్లను కలిసి ఎదుర్కొన్నాం. నేడు అభివృద్ధి, సుసంపన్నత దిశగా మనం పురోగమిస్తున్న తరుణంలో ఈ బంధం మరింత బలపడుతోంది.

గౌరవ రాజు భూటాన్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు. భారత్ - భూటాన్ మధ్య విశ్వాసం, అభివృద్ధితో ముడిపడి ఉన్న ఈ భాగస్వామ్యం మొత్తం ప్రాంతానికీ ఆదర్శంగా నిలుస్తోంది.

 

మిత్రులారా,

మన రెండు దేశాలూ శరవేగంగా పురోగమిస్తున్న ఈ తరుణంలో.. మన ఇంధన భాగస్వామ్యం ఈ వృద్ధిని మరింత వేగవంతం చేస్తోంది. భారత్, భూటాన్ జలవిద్యుత్ భాగస్వామ్యానికి కూడా గౌరవ నాలుగో రాజు నేతృత్వంలో శంకుస్థాపన జరిగింది.

పర్యావరణ పరిరక్షణ దిశగా గౌరవ నాలుగో రాజు, గౌరవ అయిదో రాజు ఇద్దరూ సుస్థిరాభివృద్ధి భావనను ప్రోత్సహించారు. ఆయన దార్శనికత ఫలితంగా.. కర్బనోద్గారాలు లేని మొదటి దేశంగా భూటాన్ నిలిచింది. ఇది భూటాన్ సాధించిన ఘనవిజయం. తలసరి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలోనూ నేడు భూటాన్ అగ్రదేశాల్లో ఒకటిగా ఉంది.

మిత్రులారా,

భూటాన్ ప్రస్తుతం తన విద్యుత్తులో 100 శాతం పునరుత్పాదక శక్తి నుంచే ఉత్పత్తి చేస్తోంది. ఈ పురోగతిని ముందుకు తీసుకెళ్లేలా.. నేడు మరో ముఖ్యమైన అడుగు వేయబడుతోంది. 1,000 మెగావాట్లకు పైగా సామర్థ్యంతో కొత్త జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఇది భూటాన్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం పెంచుతుంది. అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన మరో జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయి.

మన భాగస్వామ్యం జలవిద్యుత్తుకు మాత్రమే పరిమితం కాదు. మనమిప్పుడు సౌరశక్తిలో కలిసికట్టుగా భారీ ముందడుగు వేస్తున్నాం. దీనికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు కూడా ఈ రోజు జరిగాయి.

మిత్రులారా,

నేడు ఇంధన సహకారంతోపాటు.. భారత్, భూటాన్ మధ్య అనుసంధానాన్ని పెంచడంపైనా దృష్టి సారిస్తున్నాం.

మనందరికీ తెలుసు:
అనుసంధానం అవకాశాలను సృష్టిస్తుంది.

అవకాశం సంపదను సృష్టిస్తుంది.

ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. భారత విస్తృత రైల్వే వ్యవస్థతో గెలెఫు, సాంస్టేలను అనుసంధానించాలని నిర్ణయించాం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భూటాన్ పరిశ్రమలు, రైతులకు భారత్‌లోని పెద్ద మార్కెట్లు సులభంగా అందుబాటులోకి వస్తాయి.

 

మిత్రులారా,

రైలు, రోడ్డు అనుసంధానంతోపాటు సరిహద్దు మౌలికక సదుపాయాల్లోనూ మనం వేగంగా పురోగమిస్తున్నాం.

భూటాన్ రాజు కల అయిన 'గెలేఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ' ప్రాజెక్టుకు భారత్ పూర్తి సహకారాన్ని అందిస్తోంది. ఈ రోజు నేను మరొక ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాను. సమీప భవిష్యత్తులోనే గెలెఫు సమీపంలో భారత్ ఓ ఇమ్మిగ్రేషన్ చెక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఇక్కడికి వచ్చే సందర్శకులు, పెట్టుబడిదారులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా,

భారత్, భూటాన్ పురోగతి, శ్రేయస్సులకు సన్నిహిత సంబంధముంది. ఈ స్ఫూర్తితోనే గతేడాది భారత ప్రభుత్వం భూటాన్ పంచవర్ష ప్రణాళికకు చేయూతగా రూ. పది వేల కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. రోడ్ల నుంచి వ్యవసాయం వరకు, ఆర్థికం నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు.. అన్ని రంగాల్లో ఈ నిధులను వినియోగిస్తున్నారు. ఇది భూటాన్ ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గతంలో భూటాన్ ప్రజలకు అవసరమైన వస్తువుల నిరంతర సరఫరా కోసం భారత్ అనేక చర్యలు తీసుకుంది.

అలాగే ఇప్పుడు ఇక్కడ యూపీఐ చెల్లింపులు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. భారత్‌ను సందర్శించే సమయంలో భూటాన్ పౌరులకు కూడా యూపీఐ సేవలు అందుబాటులో ఉండేలా మేం కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

భారత్, భూటాన్ మధ్య బలమైన భాగస్వామ్యం వల్ల మన యువతే అందరికన్నా ఎక్కువగా లబ్ధి పొందుతోంది. దేశ సేవ, స్వచ్ఛంద కార్యక్రమాలు, ఆవిష్కరణల్లో రాజు గారు అద్భుతమైన చొరవ తీసుకున్నారు. యువతకు సాధికారత, వారిని సాంకేతిక సన్నద్ధులను చేయాలనే ఆయన దార్శనికత భూటాన్ యువతకు విశేష స్ఫూర్తినిస్తోంది.

విద్య, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, అంతరిక్షం, సంస్కృతి వంటి అనేక రంగాలలో భారత్, భూటాన్ యువత మధ్య సహకారం విస్తరిస్తోంది. నేడు ఉపగ్రహ నిర్మాణంలోనూ మన యువత కలిసి పనిచేస్తున్నారు. ఇది మన రెండు దేశాలకు గర్వకారణమైన విజయం.

మిత్రులారా,

మన ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వమే భారత్ - భూటాన్ మైత్రికి బలమైన ప్రాతిపదికల్లో ఒకటి. రెండు నెలల కిందటే రాజ్‌గిర్‌లో రాయల్ భూటానీ ఆలయం ప్రారంభమైంది. ఈ స్ఫూర్తితో ఇప్పుడు ఈ తరహా కార్యక్రమాలు భారత్‌లో ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి.

 

వారణాసిలో భూటాన్ ఆలయం, అతిథి గృహ నిర్మాణాలపైనా భూటాన్ ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఇందుకోసం అవసరమైన భూమిని భారత ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఆలయాలు మన రెండు దేశాల మధ్య ప్రతిష్ఠాత్మకమైన సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేస్తూనే ఉంటాయి.

మిత్రులారా,

శాంతి, సమృద్ధి, పరస్పర అభివృద్ధిలో భారత్, భూటాన్ కలిసి ముందుకు సాగాలని నేను ప్రార్థిస్తున్నాను. బుద్ధ భగవానుడు, గురు రింపోచేల ఆశీస్సులు మన ఇరు దేశాలకూ మార్గనిర్దేశం చేసి రక్షించు గాక...

మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 ధన్యవాదాలు!!!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auto industry contributes over ₹22.75 lakh crore to Indian economy: SIAM

Media Coverage

Auto industry contributes over ₹22.75 lakh crore to Indian economy: SIAM
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Italian PM Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history
September 04, 2026

Prime Minister Shri Narendra Modi today congratulated Italian Prime Minister Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history.

The Prime Minister stated that this milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership. He further noted that her friendship has been instrumental in strengthening the India-Italy Special Strategic Partnership, adding that he looks forward to continuing their close cooperation to build a prosperous future for the people of both countries. He extended his best wishes for her continued success in the years ahead.

In a post on X, the Prime Minister shared:

"Congratulations to my friend Prime Minister Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history. This milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership.

Her friendship has also been instrumental in strengthening the India-Italy Special Strategic
Partnership and I look forward to continuing our close cooperation to build a prosperous future for the people of our countries.

My best wishes for her continued success in the years ahead.

@GiorgiaMeloni"