* శాంతి, సంస్కృతుల సంగమమే అరుణాచల్ ప్రదేశ్, ఇది భారత్‌కు గర్వకారణం: పీఎం
* దేశానికి అష్టలక్ష్మి... ఈశాన్య భారతం: పీఎం
* దేశాభివృద్ధికి ఈశాన్య భారతం చోదక శక్తిగా మారుతోంది: పీఎం
* ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్న వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం: పీఎం
* 5 శాతం,18 శాతానికి సవరించిన జీఎస్టీ.. ఎన్నో వస్తువులపై తగ్గిన పన్నులు: పీఎం

భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

జై హింద్! జై హింద్! జై హింద్!

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవ కే.టీ. పర్నాయక్ గారు, ప్రజాదరణతో.. చైతన్యవంతమైన పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు కిరణ్ రిజిజు గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, నా సహ పార్లమెంటు సభ్యులు నబమ్ రెబియా గారు, తపిర్ గావ్ గారు, అందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అరుణాచల్ ప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదరీ సోదరులారా,

బోమ్యెరుంగ్ డోనీ పోలో! సర్వశక్తిమంతుడైన డోనీ పోలో మనందరినీ ఆశీర్వదిస్తారు!

మిత్రులారా,

హెలిప్యాడ్ నుంచి ఈ మైదానానికి వచ్చే మార్గంలో త్రివర్ణ పతాకంతో స్వాగతిస్తున్న పిల్లలను, మువ్వన్నెల జెండా చేతపట్టుకుని నిలుచున్న ఎంతోమంది బిడ్డలనూ నేను కలిశాను. అరుణాచల్ మర్యాద, ఆప్యాయతలు నాకు గొప్ప అనుభూతినిచ్చాయి. ఇక్కడి స్వాగతం చాలా గొప్పగా ఉంది.. అది నా రాకనూ ఆలస్యం చేసింది.. దాని కోసం నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ పవిత్రమైన అరుణాచల్ భూమి ఉదయించే సూర్యుని భూమి మాత్రమే కాదు.. దేశభక్తి శిఖరాగ్రానికి చేరుకునే భూమి కూడా. మన త్రివర్ణ పతాక మొదటి రంగు కాషాయం లాగే అరుణాచల్ ప్రధాన రంగు కాషాయమే. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి శౌర్యానికీ.. సరళతకు చిహ్నం. నేను క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు కూడా చాలాసార్లు అరుణాచల్‌కు వచ్చాను. నేను ఇక్కడి నుంచి లెక్కలేనన్ని జ్ఞాపకాలను తీసుకువెళుతూనే ఉన్నాను. వాటిని గుర్తు చేసుకోవడం ఎల్లప్పుడూ నన్ను ఆనందంతో నింపుతుంది. మీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక విలువైన జ్ఞాపకం. మీరు నాపై కురిపించే ప్రేమ, ఆప్యాయతలు జీవితంలో ఒకరు పొందగల గొప్ప అదృష్టంగా నేను నమ్ముతున్నాను. తవాంగ్ మఠం నుంచి నామ్సాయ్ గోల్డెన్ పగోడా వరకు అరుణాచల్ ప్రాంతం శాంతి, సంస్కృతిల సంగమం. ఇది భరతమాతకు గర్వకారణం.. నేను ఈ పవిత్ర భూమికి భక్తితో నమస్కరిస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ రోజు నా అరుణాచల్ పర్యటన మూడు కారణాల వల్ల చాలా ప్రత్యేకమైనది. మొదటిది, నవరాత్రి మొదటి రోజున ఈ అందమైన పర్వతాలను చూసే అదృష్టం నాకు లభించింది. ఈ నవరాత్రి తొలి రోజున మనం హిమవంతుడి కుమార్తె అయిన మాతా శైలపుత్రిని పూజిస్తాం. రెండో కారణం, నేటి నుంచి దేశవ్యాప్తంగా తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఈ రోజే "జీఎస్టీ పొదుపు పండగ" ప్రారంభమవుతోంది. ఈ పండగ సీజన్‌లో దేశ ప్రజలు రెట్టింపు ఆనందాన్ని పొందారు. మూడో కారణం, ఈ శుభ దినాన అరుణాచల్‌కు అనేక కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు అందుతున్నాయి. నేడు అరుణాచల్‌కు విద్యుత్, కనెక్టివిటీ, పర్యాటకం, ఆరోగ్యం సహా బహుళ రంగాల ప్రాజెక్టులు కానుకగా లభించాయి. ఇది బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ "డబుల్ బెనిఫిట్"కి ఒక గొప్ప ఉదాహరణ. ఈ ప్రాజెక్టుల కోసం నేను అరుణాచల్ ప్రజలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఇక్కడికి రాకముందు చిన్న వ్యాపారులను కలవడానికి, వారి దుకాణాల్లో ఉత్పత్తులను చూడటానికి, మరింత ముఖ్యంగా వారి శక్తినీ, ఉత్సాహాన్నీ చూసే అవకాశం నాకు లభించింది. వ్యాపారులు, చేతివృత్తులవారు, ప్రజల్లో ఈ పొదుపు పండగ ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.

మిత్రులారా,

సూర్యుని మొదటి కిరణాలు అరుణాచల్ నేలపై పడినప్పటికీ.. వేగవంతమైన అభివృద్ధి కిరణాలు ఇక్కడికి చేరుకోవడానికి అనేక దశాబ్దాలు పట్టింది. 2014కి ముందు కూడా నేను చాలాసార్లు అరుణాచల్‌ను సందర్శించాను. మీ మధ్యే నివసించాను. ప్రకృతి ఇక్కడి భూమికి, కష్టపడి పనిచేసే ప్రజలకు ఇచ్చిన ఔదార్యాన్నీ, అపారమైన సామర్థ్యాన్నీ ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు ఢిల్లీలో కూర్చుని దేశాన్ని పరిపాలించిన వారు అరుణాచల్‌ను విస్మరించారు. ఇక్కడ చాలా తక్కువ మంది నివసిస్తున్నారు.. కేవలం రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే ఉన్నాయి.. అప్పుడు అరుణాచల్‌పై దృష్టి పెట్టడం ఎందుకని కాంగ్రెస్ వంటి పార్టీలు భావించాయి. ఇటువంటి కాంగ్రెస్ మనస్తత్వం అరుణాచల్‌కు, మొత్తం ఈశాన్య ప్రాంతానికీ చాలా హాని చేసింది. దీంతో మన ఈశాన్య ప్రాంతం మొత్తం అభివృద్ధిలో చాలా వెనుకబడింది.

 

మిత్రులారా,

మీరు 2014లో దేశానికి సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినప్పుడు.. నేను దేశాన్ని ఈ కాంగ్రెస్ మనస్తత్వం నుంచి విముక్తి చేయాలని నిశ్చయించుకున్నాను. ఒక రాష్ట్రంలో ఓట్ల సంఖ్య.. సీట్ల సంఖ్య మాకు స్ఫూర్తి కాదు. దేశానికే తొలి ప్రాధాన్యం.. మా మార్గదర్శక సూత్రం. నాగరిక్ దేవో భవ... మా పాలన మంత్రం. ఎవరూ పట్టించుకోని వారిని మోదీ గౌరవిస్తారు. అందుకే కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య ప్రాంతం 2014 నుంచి మా అభివృద్ధి ప్రాధాన్యాలకు కేంద్రంగా మారింది. ఈశాన్య ప్రాంత బడ్జెట్‌ను మేం చాలా రెట్లు పెంచాం. మూరుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ, సేవలను అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాం. ఇది మాత్రమే కాదు.. కేవలం ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వం నడపకుండా.. అధికారులు, మంత్రులు తరచూ ఈశాన్య ప్రాంతంలో పర్యటిస్తూ.. రాత్రిపూట ఇక్కడే బస చేస్తూ.. ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకున్నాం.

మిత్రులారా,

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక కేంద్ర మంత్రి రెండు-మూడు నెలలకోసారి ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించేవారు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ఈశాన్య ప్రాంతానికి ఇప్పటికే 800 కంటే ఎక్కువసార్లు పర్యటించారు. ఏదో నామమాత్రంగా పర్యటించి వెళ్లిపోవడం కాదు. మన మంత్రులు వచ్చినప్పుడు వారు మారుమూల ప్రాంతాలకు, జిల్లాలకు, మండలాలకు వెళుతున్నారు. కనీసం ఒక రాత్రి ఇక్కడ బస చేస్తున్నారు. నేను ప్రధానమంత్రిగా 70 సార్లు ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించాను. గత వారం నేను మిజోరం, మణిపూర్, అస్సాం రాష్ట్రాలకు వెళ్లాను. నేను గౌహతిలో రాత్రి బస చేసాను. ఈశాన్య ప్రాంతం నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. అందుకే మేం ఈ హృదయ దూరాన్ని తొలగించి.. ఢిల్లీని మీ దగ్గరకు తీసుకువచ్చాం.

మిత్రులారా,

ఈశాన్యంలోని ఎనిమిది రాష్ట్రాలను మేం 'అష్ట లక్ష్ములు’గా గౌరవిస్తాం. అందుకే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడటానికి మేం ఎప్పటికీ అనుమతించలేం. ఈ ప్రాంత వృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోంది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని రాష్ట్రాలతో పంచుకుంటుందని మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర పన్నుల నుంచి అరుణాచల్ ప్రదేశ్ పదేళ్లలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు మాత్రమే పొందింది. కానీ ఇప్పుడు కేంద్రంలోని మన బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ పదేళ్లలో అరుణాచల్ లక్ష కోట్ల రూపాయలకు పైగా అందుకుంది. అంటే బీజేపీ ప్రభుత్వం అరుణాచల్‌కు 16 రెట్లు ఎక్కువ డబ్బును ఇచ్చింది. ఇది పన్ను వాటా మాత్రమే. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల్లోనూ పెట్టుబడులు పెడుతోంది. ఇక్కడ ప్రధాన ప్రాజెక్టులను అమలు చేస్తోంది. అందుకే ఈ రోజు మీరు అరుణాచల్ అంతటా ఇంత విస్తృతమైన, వేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నారు.

 

మిత్రులారా,

సరైన ఉద్దేశంతో పని జరిగినప్పుడు, నిజాయితీతో ప్రయత్నాలు జరిగినప్పుడు ఫలితాలు కచ్చితంగా కనిపిస్తాయి. మన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారుతోంది. ఇక్కడ ప్రధానంగా సుపరిపాలనపై దృష్టి ఉంది. మా ప్రభుత్వానికి పౌరుల సంక్షేమం కంటే మరేదీ ముఖ్యం కాదు. మీ జీవితాలను సులభతరం చేయడానికి, మీ జీవన సౌలభ్యానికీ మేం కృషి చేస్తున్నాం. ప్రయాణంలో మీ ఇబ్బందులు తొలగిస్తూ ప్రయాణ సౌలభ్యాన్ని అందించాం. ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, వైద్య చికిత్సను సులభతరం చేస్తున్నాం. పిల్లలకు చదువుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యా సౌలభ్యాన్ని అందించాం. మీ వ్యాపార, వాణిజ్యాలకు మద్దతు కోసం వ్యాపార సౌలభ్యాన్ని అందించాం. ఈ లక్ష్యాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. గతంలో రహదారి గురించిన ఆలోచనే అసాధ్యం అనిపించిన ప్రాంతాల్లో నేడు ఆధునిక రహదారులు నిర్మితమవుతున్నాయి. సెలా టన్నెల్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఒకప్పుడు ఊహించలేనివి.. కానీ నేడు సెలా టన్నెల్ అరుణాచల్ గుర్తింపు కోసం ప్రధాన చిహ్నంగా మారింది.

మిత్రులారా,

అరుణాచల్‌ సహా ఈశాన్యంలోని మారుమూల ప్రాంతాల్లో హెలిపోర్ట్‌లను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అందుకే ఈ ప్రాంతాలను ఉడాన్ పథకం ద్వారా అనుసంధానించాం. హోలోంగి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం కూడా పూర్తయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి విమానాలున్నాయి. ఇది సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు, పర్యాటకులకు మాత్రమే కాకుండా, రైతులకు, చిన్న పరిశ్రమలకూ ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన మార్కెట్లకు పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను రవాణా చేయడం ఇప్పుడు చాలా సులభమైంది.

 

మిత్రులారా,

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో మనమంతా పనిచేస్తున్నాం. దేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుంది. ప్రతి రాష్ట్రం జాతీయ లక్ష్యాలతో భుజం కలిపి నడిచినప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుంది. ఈ జాతీయ లక్ష్యాలను సాధించడంలో ఈశాన్య ప్రాంతం ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విద్యుత్ రంగం దీనికి చక్కటి ఉదాహరణ. 2030 నాటికి సాంప్రదాయేతర వనరుల నుంచి 500 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం భారత్ లక్ష్యం. సౌర విద్యుత్, పవన విద్యుత్, జల విద్యుత్ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నాం. అరుణాచల్ ప్రదేశ్ కూడా దేశంతో పాటు ముందడుగు వేస్తోంది. ఈ రోజు ప్రారంభించిన రెండు విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తిదారుగా అరుణాచల్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇక్కడ అభివృద్ధి పనుల కోసం సరసమైన ధరకు విద్యుత్‌ లభిస్తుంది. కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. కష్టమైన అభివృద్ధి పని వచ్చినప్పుడల్లా వారు దానిని చేపట్టకుండా పారిపోతారు. వారి ఈ అలవాటు కారణంగానే ఈశాన్య ప్రాంతం, అరుణాచల్ చాలా నష్టపోయాయి. మారుమూల, పర్వత ప్రాంతాలు, అడవుల్లోని లోయలు, అభివృద్ధి ఒక సవాలుగా ఉన్న అన్ని ప్రాంతాలనూ కాంగ్రెస్ వదిలివేసింది, వాటిని "వెనకబడినవి"గా ప్రకటించింది.. వాటి అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. ఇందులో ఈశాన్యంలోని గిరిజన ప్రాంతాలు, జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలను కాంగ్రెస్ "దేశంలోని చివరి గ్రామాలు"గా ప్రకటించి నిర్లక్ష్యం చేసింది. ఇలా తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటూ.. కాంగ్రెస్ తన వైఫల్యాలను దాచడానికి ప్రయత్నించింది. ఫలితంగా, గిరిజన, సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజల వలసలు నిరంతరం కొనసాగాయి.

మిత్రులారా, 

మన భాజపా ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది. కాంగ్రెస్ గతంలో "వెనుకబడిన జిల్లాలు"అనే పేరుతో పిలిచిన వాటిని మేం ‘ఆకాంక్షిత జిల్లాలుగా’ మార్చాం.  వాటి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చాం. కాంగ్రెస్ ‘చివరి గ్రామాలు’గా పరిగణించిన సరిహద్దు గ్రామాలను దేశంలోని మొదటి గ్రామాలుగా గౌరవించటాన్ని ప్రారంభించాం. దీని ఫలితాలు నేడు కనిపిస్తున్నాయి. అభివృద్ధిలో సరిహద్దు గ్రామాలు కొత్త ఉత్తేజాన్ని చూస్తున్నాయి. వైబ్రంట్ గ్రామాల కార్యక్రమం విజయం సాధించి.. ప్రజల జీవితాలను మరింత సులభతరం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా 450కి పైగా సరిహద్దు గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందాయి. వీటికి రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలు అందాయి. గతంలో సరిహద్దు గ్రామాల ప్రజల పట్టణాలకు వలస వెళ్లారు. కానీ ఇప్పుడు ఈ గ్రామాలు పర్యాటక కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. 

మిత్రులారా, 

అరుణాచల్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి గణనీయమైన అవకాశాలున్నాయి. కొత్త ప్రాంతాలకు అనుసంధానత పెరుగుతున్నందున.. ఇక్కడ పర్యాటకం క్రమంగా పెరుగుతోంది. గత దశాబ్దంలో అరుణాచల్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య రెట్టింపు కావడం అనేది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. కానీ అరుణాచల్ సామర్థ్యం ప్రకృతి ఆధారిత, సాంస్కృతిక పర్యాటకానికి పరిమితం కాకూడదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమావేశ, కాన్సర్ట్ పర్యాటకం పెరుగుతోందన్న.. తవాంగ్‌లో రాబోతున్న ఆధునిక కన్వెన్షన్ సెంటర్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త రంగాలకు విస్తరిస్తుంది. ప్రభుత్వ చేపట్టిన ‘వైబ్రంట్ గ్రామాలు’ అనే కార్యక్రమం మన సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమంగా ఉంది. ఇది అరుణాచల్‌కు ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది. 

 

మిత్రులారా, 

నేడు ఢిల్లీలో, ఈటానగర్‌లో భాజపా ప్రభుత్వాలు ఉన్నందున రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సామర్థ్యం అభివృద్ధిపైనే దృష్టి సారించింది. ఇక్కడ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పనులు ప్రారంభమవటాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ వైద్య కళాశాలలు వస్తున్నాయి.. ఆయుష్మాన్ పథకం కింద ఇక్కడ చాలా మంది ఉచిత చికిత్సను పొందుతున్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగా ఇదంతా సాధ్యమైంది.

మిత్రులారా, 

డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి కారణంగా అరుణాచల్ వ్యవసాయం, ఉద్యానవనాలలో కూడా ముందుకు సాగుతోంది. ఇక్కడి నుంచి వచ్చే కివీ, నారింజ, యాలకులు, అనాస.. రాష్ట్రానికి కొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే మొత్తం కూడా ఇక్కడి రైతులకు చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. 

మిత్రులారా, 

మా అత్యున్నత ప్రాధాన్యతలలో.. మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు సాధికారత కల్పించడం ఒకటి. మూడు కోట్ల 'లక్‌పతి దీదీల'ను తయారు చేయటం అనేది ఒక భారీ లక్ష్యం.. ఇది మోదీ లక్ష్యం. పెమా ఖండూ గారు, ఆయన బృందం ఈ లక్ష్యానికి కూడా ఊతం ఇవ్వటం పట్ల  సంతోషంగా ఉన్నాను. ఉద్యోగినుల హాస్టళ్లను పెద్ద సంఖ్యలో నిర్మించేందుకు ఇక్కడ మొదలైన పనులు.. మన కుమార్తెలకు గొప్ప అధునిక సౌకర్యాలను అందిస్తాయి. 

మిత్రులారా, 

ఇవాళ నేనిక్కడ తల్లులు, అక్కాచెల్లెళ్ల భారీ సమావేశాన్ని చూస్తున్నాను. మీ అందరికీ జీఎస్టీ పొదుపు పండగ విషయంలో మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇప్పటి నుండి మీ నెలవారీ ఇంటి ఖర్చులో మీకు అవసరమైన ఉపశమనం లభిస్తుంది. వంటగది వస్తువులు, పిల్లల విద్యకు సంబంధించినవి బట్టలు,  బూట్లు.. ఇలా ప్రతిదీ ఇప్పుడు మరింత తక్కువ ధరకే దొరుకుతాయి.

 

మిత్రులారా, 

2014కు ముందు ఉన్న పరిస్థితులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చాలా ఇబ్బందులు ఉండేవి.. ధరల పెరుగుదల ఆకాశాన్ని తాకింది.. ప్రతిచోటా భారీ మోసాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతూనే ఉంది. అప్పుడు సంవత్సరానికి కేవలం రెండు లక్షల రూపాయలు సంపాదించే వారు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉండేది. ఇది 11 సంవత్సరాల క్రితం పరిస్థితి.. అప్పుడు రెండు లక్షల రూపాయల ఆదాయంపై కూడా పన్ను ఉంది. అనేక ముఖ్యమైన వస్తువులపై కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతానికి పైగా పన్ను వసూలు చేసింది. పిల్లల టోఫేలపై కూడా పన్ను చాలా ఎక్కువగా ఉండేది. 

 

మిత్రులారా, 

మీ ఆదాయం, పొదుపు.. రెండింటినీ పెంచేందుకు కృషి చేస్తానని ఆ సమయంలో నేను మీకు హామీ ఇచ్చాను. కొన్నేళ్లుగా దేశం అనేక పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కొంది. కానీ మేం నిరంతరాయంగా ఆదాయపు పన్నును తగ్గిస్తూనే వచ్చాం. ఒక్కసారి ఆలోచించండి.. 11 సంవత్సరాల కిందట రెండు లక్షల రూపాయల ఆదాయంపై పన్ను ఉండేది.. ఈ సంవత్సరం మేం 12 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పూర్తి పన్ను రహితంగా చేశాం. నేటి నుంచి జీఎస్టీ కేవలం 5 శాతం, 18 శాతం.. అంటే రెండు స్లాబ్‌లుగానే ఉంటుంది. అనేక వస్తువులపై ఎలాంటి పన్ను లేదు. ఇతర వస్తువులకు పన్ను గణనీయంగా తగ్గింది. మీరు కొత్త ఇల్లు నిర్మించాలనుకున్నా.. దిచక్రవాహనం కొనాలనుకున్నా, భోజనం చేయాలనుకున్నా, ప్రయాణించాలనుకున్నా.. ఇప్పుడు ప్రతిదీ మరింత అందుబాటు ధరల్లోకి మారింది. ఈ జీఎస్టీ పొదుపు అనే పండగ మీకు నిజంగా గుర్తుండి పోతుంది. 

మిత్రులారా, 

నమస్కారం చెప్పే కంటే ముందే ‘జై హింద్’ అని చెప్పే అరుణాచల్ ప్రత్యేకతను నేను అభినందిస్తాను. మీ కంటే దేశమే ముందు అని భావించే వాళ్లు మీరు. 'వికసిత్ భారత్'ను తయారు చేసేందుకు మనందరం కలిసి పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో దేశం కూడా మన నుంచి ఒకటి ఆశిస్తుంది. అదే 'ఆత్మనిర్భరత' (స్వయం సమృద్ధి). స్వావలంబనగా మారినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ స్వావలంబన కోసం స్వదేశీ మంత్రం చాలా అవసరం. మనం స్వదేశీని పాటించాలని, దేశంలో తయారైన వాటిని మాత్రమే కొనుగోలు- విక్రయం చేయాలని.. కాలం, దేశం డిమాండ్ చేస్తున్నాయి. గర్వంగా చెప్పండి - ఇది స్వదేశీ. మీరందరూ నాతో చెబుతారా! నేను "గర్వంగా చెప్పండి" అని చెప్పినప్పుడు, మీరు "ఇది స్వదేశీ" అని అనండి. గర్వంగా చెప్పండి - ఇది స్వదేశీ! గర్వంగా చెప్పండి - ఇది స్వదేశీ! గర్వంగా చెప్పండి - ఇది స్వదేశీ! గర్వంగా చెప్పండి - ఇది స్వదేశీ!. ఈ మంత్రాన్ని పాటించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది.. అరుణాచల్, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇవాల్టి అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో నేను మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు పవిత్రమైన నవరాత్రి పండగ మాత్రమే కాదు.. పొదుపు పండగ కూడా ఉంది. ఈ గొప్ప వేడుకలో మీరంతా భాగమైనందున.. మీరు ఒకటి చేయాలని కోరుతున్నాను. దయచేసి మీ మొబైల్ ఫోన్‌లను తీసి, ఫ్లాష్‌లైట్‌లను వేసి పైకి ఎత్తి.. చుట్టూ చూడండి. ఇది పొదుపు పండగ తీరు.. ఇది దాని బలం. నవరాత్రిలో ఈ మొదటి రోజున ప్రతిచోటా వెలుగు ఉంది.. అరుణాచల్ కాంతిరేఖలు దేశం అంతటా వ్యాపించాయి. మీ చుట్టూ చూడండి.. మెరుస్తోన్న నక్షత్రాల వలె లైట్లన్నీ ప్రకాశిస్తున్నాయి. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre allows 100% FDI in insurance via auto route

Media Coverage

Centre allows 100% FDI in insurance via auto route
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates GalaxEye on the successful launch of Mission Drishti
May 03, 2026

Prime Minister Shri Narendra Modi has congratulated the founders and the entire team of GalaxEye on the successful launch of Mission Drishti.

The Prime Minister noted that Mission Drishti by GalaxEye marks a major achievement in India's space journey. Shri Modi highlighted that the successful launch of the world’s first OptoSAR satellite and the largest privately-built satellite in India is a testament to the youth’s passion for innovation and nation-building. He also extended his heartiest congratulations and best wishes to the founders and the entire team of GalaxEye.

The Prime Minister posted on X:

"Mission Drishti by GalaxEye marks a major achievement in our space journey. The successful launch of the world’s first OptoSAR satellite and the largest privately-built satellite in India is a testament to our youth’s passion for innovation and nation-building.

Heartiest congratulations and best wishes to the founders and the entire team of GalaxEye."