స్వయంసమృద్ధి అందించే అండదండలతో అంతరిక్ష లక్ష్యాలను సాధించడంలోనే భారత్ విజయ రహస్యం దాగి ఉంది: ప్రధాని
* భావి సాహసయాత్రలకు సారథ్యం వహించగల 40-50 మంది రోదసీ యాత్రికుల జట్టును భారత్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది: ప్రధాని
* ఇండియా ఎదుట ఇప్పుడు రెండు వ్యూహాత్మక సాహసయాత్రలు ఉన్నాయి.. అవి ఒకటి గగన్‌యాన్, రెండోది అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం: ప్రధాని
* వ్యోమగామి శ్రీ శుక్లా చేసిన ప్రయాణం మన దేశ అంతరిక్ష ఆకాంక్షల్లో మొదటి మెట్టు మాత్రమే: ప్రధాని

ప్రధానమంత్రి – ఓ అత్యద్భుత ప్రయాణం చేసొచ్చారు మీరంతా...

శుభాన్షు శుక్లా – అవును సర్.

ప్రధానమంత్రి – తప్పకుండా మీకో భిన్నమైన అనుభవమే కదా ఇది. మీ అనుభూతులను తెలుసుకోవాలనుకుంటున్నాను.

శుభాన్షు శుక్లా – సర్, మేమక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం, పరిసరాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి లేదు.

ప్రధానమంత్రి – సీటింగ్ సదుపాయం విషయానికొస్తే, అది అలాగే ఉంటుందా?

శుభాన్షు శుక్లా – అవును సర్. అలాగే ఉంటుంది.

ప్రధానమంత్రి – మీరు మొత్తం 23-24 గంటలు అదే స్థలంలో గడపాలా?

శుభాన్షు శుక్లా – అవును సర్. కానీ ఒకసారి అంతరిక్షానికి చేరుకున్నాక, కొక్కీని తీసేసి సీటు నుంచి పైకి లేవొచ్చు. క్యాప్సూల్ లోపల తేలుతూ, కదులుతూ పనులు చేసుకోవచ్చు.

ప్రధానమంత్రి – లోపల అంత స్థలం ఉంటుందా?

శుభాన్షు శుక్లా – మరీ ఎక్కువ కాదు సర్. కొద్దిగా ఉంటుంది.

 

ప్రధానమంత్రి – అంటే, మీ ఫైటర్ జెట్‌లోని కాక్ పిట్ కన్నా పెద్ద స్థలమేనా?

శుభాన్షు శుక్లా – అంతకన్నా నయమే సర్. కానీ అక్కడికి చేరుకున్నాక చాలా మార్పులొస్తాయి. ఉదాహరణకు, గుండె కొట్టుకోవడం నెమ్మదిస్తుంది. చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, నాలుగైదు రోజుల్లో శరీరం దానికి అలవాటుపడిపోయి, అక్కడ సాధారణ స్థితికి చేరుకుంటాం. తిరిగొచ్చాకా అవే మార్పులుంటాయి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. తిరిగొచ్చిన వెంటనే నడవలేం. నా వరకైతే నాకు అనారోగ్యంగా అనిపించలేదు. నేను బాగానే ఉన్నాను. అయినా, నేను మొదటి అడుగు వేసినప్పుడు పడిపోబోయాను. అక్కడున్నవారు నన్ను పట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత రెండో, మూడో అడుగులు... నడవాలని మనసుకు తెలిసినా, ఇప్పుడిది కొత్త వాతావరణమని మెదడుకు అర్థమయ్యేందుకు సమయం పడుతుంది.

ప్రధానమంత్రి – అయితే ఇది కేవలం శరీరానికిచ్చే శిక్షణ మాత్రమే కాదు, అంతకు మించిన మానసిక శిక్షణ.. అవునా?

శుభాన్షు శుక్లా – అవును సర్. ఇది మనసుకు ఇచ్చే శిక్షణ. శరీరానికి బలముంది. కండరాలకు శక్తి ఉంది. కానీ, మెదడును మళ్లీ సిద్ధపరచుకోవాలి. ఇది కొత్త వాతావరణమని, ఇక్కడ నడవాలంటే ఇంత శ్రమ లేదా బలం అవసరమని మెదడు మళ్ళీ అర్థం చేసుకోవాలి. దాన్ని మళ్లీ నేర్చుకోవాలి సర్.

ప్రధానమంత్రి – అందరికన్నా ఎక్కువ కాలం అక్కడ ఎవరున్నారు, ఎంతకాలం ఉన్నారు?

శుభాన్షు శుక్లా – సర్, ప్రస్తుతానికి.. ఈ మిషన్ మొదలైనప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలలుగా కొంతమంది అక్కడే ఉన్నారు.

ప్రధానమంత్రి – వారినేనా మీరక్కడ కలిసింది...

శుభాన్షు శుక్లా – అవును. వారిలో కొందరు డిసెంబరులో తిరిగొస్తున్నారు.

ప్రధానమంత్రి – పెసలు, మెంతి ప్రాధాన్యం ఏమిటి?

శుభాన్షు శుక్లా – అది చాలా ముఖ్యమైంది సర్. ఈ విషయాల గురించి వారికి తెలియకపోవడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అంతరిక్ష కేంద్రంలో ఆహారం ఓ పెద్ద సవాలు. అక్కడ స్థలం చాలా పరిమితం. సరుకులెంతో విలువైనవి. చిన్న స్థలంలోనే గరిష్ఠంగా కేలరీలు, పోషకాలను సర్దేలా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారక్కడ. అన్ని రకాల ప్రయోగాలూ జరుగుతున్నాయి సర్. వీటిని పెంచడం చాలా సులభం. అంతరిక్ష కేంద్రంలో వారికి ఎక్కువ వనరులేమీ అవసరం లేదు. ఓ చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి వాటిని వదిలేస్తే.. ఎనిమిది రోజుల్లో మొలకలు మంచిగా కనిపించడం మొదలవుతుంది సర్. స్టేషన్‌లోనే అవి పెరగడం చూశాను. ఇవే మన దేశ రహస్యాలని నేనంటాను సర్. మైక్రో గ్రావిటీపై పరిశోధన చేసే అవకాశం మనకు లభించగానే, ఇవీ అక్కడికి వచ్చేశాయి. ఎవరికి తెలుసు... ఇది మన ఆహార భద్రత సమస్యను పరిష్కరించొచ్చు. ఇది వ్యోమగాములకు స్టేషన్‌లో ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ పరిష్కారం దొరికితే, భూమిపై కూడా ఆహార భద్రత సవాళ్లను పరిష్కరించడంలో అది మనకు సహాయపడుతుంది సర్.

 

ప్రధానమంత్రి – ఇప్పుడు ఓ భారతీయుడు అక్కడికెళ్లాడు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు అక్కడొక భారతీయుడిని చూసి ఆ సమయంలో ఏమనుకున్నారు? వాళ్లు ఏమడిగారు? దేని గురించి మాట్లాడారు?

శుభాన్షు శుక్లా – అవును సర్. గత సంవత్సర కాలంగా నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే.. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా.. వారంతా నన్ను సంతోషంగా కలుస్తూ, మాట్లాడడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు. మనమేం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అడిగి తెలుసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా.. అంతరిక్ష రంగంలో భారత్ పురోగతి గురించి అందరికీ తెలుసు. గగన్‌యాన్ గురించి చాలా మంది నాకన్నా కూడా ఉత్సాహంగా ఉన్నారు సర్. మన మిషన్ ఎప్పుడు ప్రారంభమవుతుందని వాళ్లు నన్ను అడిగారు. నా సహచర సిబ్బంది అయితే.. గగన్ యాన్ ఎప్పుడు ప్రారంభమయినా తమను ఆహ్వానించాలని, త్వరలోనే మన వాహనంలో కూర్చోవాలనుకుంటున్నామని నోట్ రాసి, నాతో సంతకం కూడా చేయించుకున్నారు. బ్రహ్మాండమైన ఉత్సాహం నాకక్కడ కనిపించింది.

ప్రధానమంత్రి – వాళ్ళు మిమ్మల్ని టెక్ జీనియస్ అని పిలిచేవారు. కారణమేంటి?

శుభాన్షు శుక్లా – లేదు సర్. అలా అనడం వారి గొప్పతనం. కానీ సర్.. వైమానిక దళంలో, అనంతరం టెస్ట్ పైలట్‌గా నేను కఠోర శిక్షణ పొందాను. ఇక పెద్దగా చదవాల్సిన అవసరం లేదని వైమానిక దళంలో చేరిన సమయంలో నేననుకున్నాను. కానీ తర్వాత నేను చాలా చదవాల్సి వచ్చింది. టెస్ట్ పైలట్ అయిన తర్వాత.. అది అప్లయిడ్ ఇంజినీరింగ్ విభాగం వంటిది. మాకు మరింత శిక్షణ కూడా ఇచ్చారు. మన శాస్త్రవేత్తలు రెండు, మూడు, నాలుగేళ్ల వరకు కూడా మాకు నేర్పించారు. అందుకే సర్.. మనం ఈ మిషన్ కోసం వెళ్లే నాటికి సంసిద్ధులపై ఉన్నామని నేననుకుంటున్నాను.

ప్రధానమంత్రి – నేనిచ్చిన హోంవర్క్‌లో నువ్వు ఎంతవరకు పురోగతి సాధించావు?

శుభాన్షు శుక్లా – చాలా మంచి పురోగతి ఉంది సర్. ఆ తర్వాత జనాలు నన్ను చూసి చాలా నవ్వారు. ఆ మీటింగ్ తర్వాత.. “మీ ప్రధానమంత్రి మీకు హోంవర్క్ ఇచ్చారు” అని వాళ్ళు నన్ను ఆటపట్టించారు కూడా. అవును, నిజమే అని నేనన్నాను. ఇది మనం తెలుసుకోవడం చాలా అవసరమని నాకనిపించింది.. అందుకే వెళ్లాను. మిషన్ విజయవంతమైంది సర్. మేం తిరిగొచ్చాం. ఇది ముగింపు కాదు, ఆరంభం.

 

ప్రధానమంత్రి – ఆ రోజు నేను కూడా అదే చెప్పాను.

శుభాన్షు శుక్లా – అవును సర్, ఆ రోజు మీరు చెప్పారు...

ప్రధానమంత్రి – ఇదే మన తొలి అడుగు.

శుభాన్షు శుక్లా – నిజమే సర్, మొదటి అడుగు. మనం ఎంత నేర్చుకోవచ్చు, ఎంత మనవెంట తీసుకురావచ్చన్నదే ఈ తొలి అడుగు ముఖ్య ఉద్దేశం.

ప్రధానమంత్రి – చూడు, మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటంటే.. పెద్ద సంఖ్యలో వ్యోమగాములు మనకుండాలి. మన దగ్గర 40-50 మంది సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు, ‘‘నేనిది చేయాలి’’ అనుకునే పిల్లలు కూడా బహుశా చాలా తక్కువ మందే ఉండి ఉంటారు. కానీ మీ ప్రయాణం తర్వాత బహుశా వారిలో నమ్మకం బలపడుతుంది. దాని పట్ల ఆకర్షణ కూడా బాగా పెరుగుతుంది.

శుభాన్షు శుక్లా – సర్, నా చిన్నతనంలో 1984లో రాకేశ్ శర్మ సర్ అంతరిక్షంలోకి వెళ్ళారు. కానీ వ్యోమగామి కావాలనే ఆలోచన నా మనసులోకి ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే మనకు అలాంటి ఏర్పాట్లు లేవు, ఏమీ లేదు. కానీ ఈసారి నేను స్టేషన్‌లో ఉన్నప్పుడు పిల్లలతో మూడుసార్లు మాట్లాడాను.. ఒకసారి ఓ కార్యక్రమంలో నేరుగా, రెండుసార్లు రేడియో ద్వారా వారితో సంభాషించాను. ఈ మూడు సార్లూ, వారిలో కనీసం ఒక్కరైనా “సర్, నేను వ్యోమగామిని కావాలంటే ఏం చేయాలి?” అని అడిగేవారు. ఇది మన దేశం సాధించిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను సర్. నేడు భారత్‌లో పిల్లలు కేవలం కలలు కనడానికే పరిమితం కాబోరు. అది సాధ్యమవుతుందని, ఆ అవకాశం ఉందని, కలను సాకారం చేసుకోగలమని వారికి తెలుసు. సర్, మీరు చెప్పినట్టు.. ఇదిప్పుడు నా బాధ్యత. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మంది ఈ స్థాయికి చేరుకునేలా సహాయపడడం నా కర్తవ్యం.

ప్రధానమంత్రి – ఇప్పుడిక అంతరిక్ష కేంద్రం, గగన్‌యాన్...

శుభాన్షు శుక్లా – సర్!  

ప్రధానమంత్రి – ఈ రెండూ మన ప్రధాన లక్ష్యాలు...

శుభాన్షు శుక్లా – సర్!

ప్రధానమంత్రి –ఈ విషయంలో మీ అనుభవం చాలా విలువైంది.

 

శుభాన్షు శుక్లా – నాకూ నమ్మకముంది సర్. ముఖ్యంగా మీ నాయకత్వంలో మన ప్రభుత్వం అంతరిక్ష కార్యక్రమం పట్ల చూపిన నిబద్ధత అలాంటిది. వైఫల్యాలు ఎదురైనప్పటికీ, ఏటా స్థిరంగా బడ్జెటును కేటాయిస్తున్నారు. ఉదాహరణకు, చంద్రయాన్-2 విజయవంతం కాలేదు. అయినా మేము ముందుకు సాగుతామని చెప్పాం. చంద్రయాన్-3 విజయవంతమైంది. వైఫల్యాల తర్వాత కూడా అలాంటి మద్దతు లభిస్తే సర్.. నేడు ప్రపంచమంతా చూస్తోంది. కచ్చితంగా ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం, స్థాయి రెండూ మనకున్నాయి. భారత్ నేతృత్వంలో అంతరిక్ష కేంద్రం ఉండి, ఇతర దేశాల భాగస్వామ్యం కూడా ఉంటే.. అది చాలా శక్తిమంతమైన సాధనం కావచ్చు. అంతరిక్ష సంబంధ తయారీలో ఆత్మనిర్భరత గురించి మీరు చెప్పిన మాటలు కూడా నేను విన్నాను సర్. ఈ విషయాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మీరు మాకిచ్చిన లక్ష్యాలు - గగన్‌యాన్, బీఏఎస్, ఆపై చంద్రునిపైకి వెళ్లడం... నిజంగా చాలా గొప్ప స్వప్నాలు సర్.

ప్రధానమంత్రి –స్వావలంబనతోనే మనం దీన్ని సాధిస్తే చాలా మంచిది.

శుభాన్షు శుక్లా – కచ్చితంగా సర్.

శుభాన్షు శుక్లా – అంతరిక్షం నుంచి భారత్ ఛాయా చిత్రాలను తీయడానికి కూడా నేను ప్రయత్నించాను సర్. ఇక్కడే భారత్ ప్రారంభమవుతుంది. ఈ త్రికోణాకృతి బెంగళూరు సర్. ఇది హైదరాబాద్. సర్, ఈ మెరుపు చూడండి.. ఇది వెలుగుతోంది. ఈ ప్రాంతమంతా పర్వతాలున్నాయి. మేం దాటిన ఈ చీకటి ప్రాంతం హిమాలయాలు. పైన ఉన్నవన్నీ నక్షత్రాలు సర్. మేము దాటుతుండగా, వెనుక నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు సర్.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From strategic partnership upgrade to defence roadmap: Key outcomes of PM Modi–Meloni meeting in Rome

Media Coverage

From strategic partnership upgrade to defence roadmap: Key outcomes of PM Modi–Meloni meeting in Rome
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మే 2026
May 21, 2026

Appreciation by Citizens on Leadership That Delivers: PM Modi's Journey of Development, Diplomacy & Farmer-First Progress