• ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ సంతతి జీవనయాత్ర సాహస భరితం: ప్రధానమంత్రి
• 500 సంవత్సరాల తరువాత రామ్ లలా అయోధ్యకు తిరిగి రావడాన్ని మీరంతా చాలా సంతోషించి ఉంటారని నమ్ముతున్నా: ప్రధానమంత్రి
• భారతీయ ప్రవాసులు మాకు గర్వకారణం: ప్రధానమంత్రి
• ప్రపంచం అంతటా గర్మతీయ సమాజాన్ని సన్మానించడంతో పాటు వారితో బంధం ఏర్పరుచుకోవడానికి
అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా నేను ప్రకటించా: ప్రధానమంత్రి

 ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా గారు,

మంత్రివర్గ సభ్యులు,  
కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు,
ప్రవాస భారతీయులు,

 

సోదర సోదరీమణులారా, 
నమస్కారం  !
సీతారామ్!
జై శ్రీరామ్!

మిత్రులారా! ఒక విషయాన్ని మీరు గమనించాచారా... ఎంత కాకతాళీయమో కదూ...

ఈ సాయంత్రం వేళ ఇలా మీ అందరినీ కలవడం గర్వాన్నీ, అమితానందాన్నీ ఇస్తోంది. చక్కని ఆతిథ్యమిచ్చి, నా గురించి ఆత్మీయంగా మాట్లాడిన ప్రధానమంత్రి కమ్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!

 

కొద్ది సేపటి కిందటే... హమ్మింగ్ బర్డ్స్ కి పేరెన్నికగన్న ఈ అందమైన దేశాన్ని చేరుకున్నాను. రావడం రావడమే ఇక్కడి ప్రవాస భారతీయులైన మిమ్మల్ని కలుసుకుంటున్నాను.. మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారం కాబట్టి ఇది ఎంతో సహజంగా అనిపిస్తోంది నాకు.  మీరు నా పట్ల చూపుతున్న ఆదరణకు కృతజ్ఞుడిని.

మిత్రులారా!

ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో భారతీయుల గాథ ధైర్య సాహసాలకి సంబంధించింది అని నాకు ఎరుకే! మీ పూర్వీకులు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు ఎంతటి ధీమంతులనైనా కుంగదీసేవే! అయినప్పటికీ వారు ఆ కష్టాలని చెక్కుచెదరని ఆశావాదంతో, పట్టుదలతో జయించారు!  

వీరు గంగా యమునా నదులను విడిచి వెళ్ళి ఉండవచ్చు కానీ, రామాయణాన్ని మాత్రం తమ హృదయాలలో పదిలంగా దాచుకుని, మోసుకుని వెళ్ళారు! వారు వదిలిపెట్టింది పుట్టిన నేలనేగానీ, ఆత్మని మాత్రం కాదు. వారు కేవలం కాందిశీకులు కాదు.. శాశ్వతమైన నాగరికతకు దూతలు. వారి భాగస్వామ్యం, తోడ్పాటు, ఈ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, ఆధ్యాత్మికతను పరిపుష్టం చేశాయి! ఈ గొప్ప దేశంపై  మీరంతా చూపిన ప్రభావాన్ని ఒక్కసారి తలుచుకుని చూడండి!  


కమ్లా ప్రెసాద్ బిసేసా గారు.. ఈ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి! గౌరవ క్రిస్టీన్ కార్లా కంగాలూ గారు.. మహిళా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కీర్తిశేషులు శ్రీ బస్ దేవ్ పాండే గారు .. రైతు బిడ్డగా జన్మించి, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి, ప్రపంచ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక విఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు రుద్రనాథ్ కపిల్ దేవ్ గారు, సంగీతజ్ఞుడు సుందర్ పోపో, మేటి క్రికెట్ ఆటగాడు డారెన్ గంగ, తన అచంచల భక్తితో సముద్రంలో మందిరాన్ని నిర్మించిన సేవదాస్ సాధు.. ఈ దేశంలో విజయాలని అందుకున్న భారతీయ మూలాలు గలవారి జాబితా ఎంతో పెద్దది!

గర్మితీయుల పిల్లలైన మీరు ఇప్పుడు సంఘర్షణను ఎదుర్కొంటున్న వారిగా కాక, మీరు అందుకుంటున్న విజయాలు, మీ సేవ, మీ విలువల ఆధారంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆలోచిస్తే, మీరు ఇష్టంగా తినే డబల్స్, దాల్-పూరీ లో ఏదో మహత్తు ఉంది... ఉండాలి! అవే ఈ గొప్ప దేశంలో మీ విజయాన్ని రెండింతలు చేసి ఉంటాయి కదూ!  

 

మిత్రులారా!
25 ఏళ్ళ కిందట వచ్చినప్పుడు, అందరం లారా కవర్ డ్రైవ్ లు, పుల్ షాట్లనీ ఆస్వాదించేవాళ్ళం.. ఇప్పటి యువ హృదయాలని సునీల్ నారాయిన్, నికోలాస్ పూరణ్ అదే తరహా ఉత్సాహంతో నింపుతున్నారు!  అప్పటినుంచి ఇప్పటివరుకూ మన స్నేహం ఇంకా చిక్కబడింది!

 

బెనారస్, పాట్నా, కోల్ కత్తా,  ఢిల్లీ, ఇవన్నీ భారతదేశ నగరాల పేర్లే కావచ్చు కానీ, ఇక్కడ మాత్రం ఆత్మీయంగా వీధులకు పెట్టుకున్న పేర్లు! నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి పండుగలని ఇక్కడ అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రేమతో జరుపుకుంటారు! చౌతాల్, బైఠక్ గానా ఇంకా ఇక్కడ మార్మోగుతూనే ఉన్నాయి! 

పరిచయం ఉన్న ముఖాలలో తొంగి చూస్తున్న ఆత్మీయత నన్ను పలకరిస్తోంది... ఈ యువత కళ్ళలో... కలిసి ఎదగాలన్న ఉత్సాహం, తపనని చూస్తున్నాను.. మన ఈ బంధం సరిహద్దులు, తరాల అంతరాలను అధిగమించినది!

మిత్రులారా!

ప్రభు శ్రీరాముల వారి పై మీకు గల అచంచల భక్తిని నేనెరుగుదును!   

“ఏక్ సౌ అస్సీ సాల్  బీతల్ హో, మన్ న భూలల్ హో, భజన్ రామ్ కే, హర్ దిల్ మే గూంజల్ హో..” – “నూట ఎనభై ఏళ్ళు గడిచినా మనసు రాముని భజనను మరువలేదు, ప్రతి హృదయంలో ఆ పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంది!”
సాంగ్రే గ్రాండే, డౌ గ్రామంలో రామ్ లీలా ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయని విన్నాను.

“రామ్ ధామ్ దా పురీ సుహావ్నీ..
లోక్ సమస్త్ బిదిత్ అతి పావని..” అని శ్రీరామ్  చరిత్ మానస్ పేర్కొంటుంది.. అంటే,  “రాముని సన్నిధి ఎంతో మధురం, ఎంతో పవిత్రం అన్న విషయం లోకప్రసిద్ధం” రాముని క్షేత్రం మనోహరమైనది, ఆ నగర ప్రభావం ప్రపంచమంతటా ప్రసరించింది అని అర్ధం.

 

500 ఏళ్ళ తరువాత అయోధ్యకి బాల రాముని పునరాగమనం మీ అందరికీ సంతోషాన్ని కలిగించింది కదా!
రామ మందిర నిర్మాణానికి మీరు పవిత్ర జలాలను, శిలలను పంపారని మాకు గుర్తుంది. అదే భక్తి భావంతో నేను మీ కోసం అయోధ్య రామ మందిరాన్ని పోలిన మందిరాన్ని, సరయూ నది పవిత్ర జలాలనూ తీసుకొని వచ్చాను!

జన్మభూమి మమ పురీ సుహావ్నీ।
ఉత్తర్ దిశీ బహ్ సరయూ పావనీ।।
జా మజ్జన్ తే బినహి ప్రయాసా।
మమ సమీప్ నర్ పావహి బాసా।।

 

అయోధ్య వైభవం పవిత్ర సరయూ నుంచే ఉద్భవించిందని శ్రీరాముల వారు అంటారు. ఆ నదిలో మునక వేసిన వారు శ్రీరామునితో ఐక్యం కాగలరు!

 

సరయూ నది, సంగమ జలాలు కలిసిన ఆ తావున భక్తి విశ్వాసాల అమృతం దొరుకుతుంది. ఈ ప్రవాహధార మన విలువలని, సంస్కారాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది!

ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభ్ జరిగిందని మీకు తెలుసు.. ఆ మహా కుంభ్ పవిత్ర జలాలను మీ కోసం తీసుకుని వచ్చాను. ఇక్కడి గంగా ధారకు సరయూ-మహాకుంభ్ పవిత్ర జలాలను అర్పించవలసిందిగా ప్రధానమంత్రి కమ్లా గారిని అభ్యర్థిస్తున్నాను. ఈ పుణ్య జలాలు ట్రినిడాడ్, టొబాగో వాసులకు ఆశీస్సులు అందించు గాక!  

మిత్రులారా!

ఇక్కడి భారతీయ సమాజం బలాన్ని, సహకారాన్ని మేమెంతో గౌరవిస్తాం. ప్రపంచవ్యాప్తంగా గల 35 మిలియన్ల ప్రవాస భారతీయులు మాకు గర్వకారణం. గతంలో నేను చెప్పినట్టు, మీలో ఒక్కొక్కరూ ఒక్కో దేశానికి దూతలు – భారతీయ విలువలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దూతలు!

ఈ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ ను భువనేశ్వర్ లో ఏర్పాటు చేసినప్పుడు గౌరవ రాష్ట్రపతి క్రిస్టీన్ కార్లా కంగాలూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా భారత్ సందర్శనను కూడా మేం గౌరవంగా భావించాం.   

 

ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గల గర్మితియా సమూహాలను ఏకం చేసేందుకు,  గౌరవించేందుకు నేను అనేక పథకాలను ప్రకటించాను. ఉజ్జ్వలమైన భవిష్యత్తు లక్ష్యంగా గతాన్ని గ్రంథస్థం చేసి, ప్రజల మధ్య వారధులు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. గర్మితియా ప్రజల సమగ్ర వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాం.

గర్మితియాకు చెందిన వారి పూర్వీకులు భారతదేశంలోని ఏ గ్రామం, లేదా పట్టణం నుంచి వలస వెళ్ళినదీ, వారు నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతాల వివరాలు, వారి ఆచార్య వ్యవహారాల అధ్యయనం, ప్రపంచ స్థాయి గర్మితియా సదస్సుల ఏర్పాటు – ఈ దిశగా మేం కృషి చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు ట్రినిడాడ్, టొబాగోల్లోని మా సోదర సోదరీమణులకు కూడా ప్రయోజనం కలిగిస్తుంది.    

ట్రినిడాడ్, టొబాగోలోని ఆరో తరం ప్రవాస భారతీయులకు ఓసీఐ కార్డులను ఇవ్వగలమని తెలియజేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. భారత్ తో మీ సంబంధం రక్తబంధానికీ, పేర్లు, ఇంటిపేర్లకు  మాత్రమే పరిమితం కాదు – మీరు నేరుగా దేశంతో అనుబంధం కలవారు! భారత్ మీవంక చూస్తోంది.. మిమ్మల్ని ఆహ్వానిస్తోంది, మిమ్మల్ని సొంత మనుషులను చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది.

 

మిత్రులారా!
ప్రధానమంత్రి కమ్లా గారి పూర్వీకులు బీహార్ లోని బక్సర్ కు చెందిన వారు.. ఆమె స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికులు ఆమెని బీహార్ కీ బేటీ అని భావిస్తారు.
ఇక్కడ ఉన్న అనేకుల పూర్వీకులు కూడా బీహార్ కి చెందినవారే! బీహార్ ఘన వారసత్వం భారత్ కే కాక, ప్రపంచానికి కూడా గర్వకారణమే.  ప్రజాస్వామ్యం, రాజనీతి, కుటిలనీతి, ఉన్నత విద్య – అంశం ఏదైనా, బీహార్ అనేక శతాబ్దాల కిందటే ప్రపంచానికి నూతన మార్గాన్ని చూపింది. 21వ శతాబ్దపు ప్రపంచానికి కూడా బీహార్ నేల నుంచి తగిన ప్రేరణ, కొత్త అవకాశాలు లభిస్తాయని నాకు విశ్వాసం ఉంది.

మిత్రులారా!
భారతదేశం అభివృద్ధి చెందుతోందని తెలిసి మీరంతా సంతోషిస్తారని నాకు తెలుసు. నవీన భారతావనికి ఆకాశమే హద్దు! మేం పంపిన చంద్రయాన్ చంద్రుడిపైకి చేరుకుందని తెలిసినప్పుడు మీరంతా హర్షధ్వానాలు చేసి ఉంటారు కదా! వ్యోమనౌక ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని నామకరణం చేశాం!    

ఈ రంగంలో తాజా వార్త మీ చెవిన పడి ఉంటుంది కదా! మనం సంభాషించుకునే ఇదే సమయానికి ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిర్దేశిత కార్యకలాపాల్లో మునిగి ఉన్నారు! తదుపరి, గగన్ యాన్ పేరిట మానవ-సహిత మిషన్ అంతరిక్షంలోనికి ప్రయోగించాలని తలపెడుతున్నాం. చంద్రుడిపై భారతీయ వ్యోమగామి నడిచే రోజు... భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండటం, మరెంతో దూరం లేవు!

ఇప్పుడు మేము తారలని లెక్కించడంతో సంతృప్తి పడటం లేదు. ఆదిత్య మిషన్ రూపంలో చుక్కలకు చేరువగా వెళుతున్నాం. ఇప్పుడు మేం ‘చందామామా దూర్ కే..’ అని పాడుకోవడంతో సరిపుచ్చుకోవడం లేదు, మేము ఆయనకు చేరువవుతున్నాం మరి! మా కృషి, దీక్షతో అసంభావాలను సంభవాలుగా మార్చివేస్తున్నాం.

 

అయితే, అంతరిక్ష రంగంలో మేం సాధిస్తున్న విజయాలు కేవలం మావే అనుకోక, విజయ ఫలాలను  ప్రపంచమంతటితో పంచుకుంటున్నాం. 

మిత్రులారా!
అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... అతి త్వరలో ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది. దేశం సాధిస్తున్న ప్రగతి ఫలాలు నిరుపేదలను చేరి వారికి మేలు చేస్తున్నాయి.  

నిరుపేదలను సాధికారులను చేయడం ద్వారా, పేదరికాన్ని జయించవచ్చని భారత్ నిరూపించింది. దేశం పేదరికం నుంచి విముక్తి పొందగలదని, తొలిసారి కోట్ల ప్రజలకు విశ్వాసం కలిగింది!

గత దశాబ్ద కాలంలో భారత్ 250 మిలియన్ నిరుపేదలకు పేదరికం నుంచి విముక్తి కల్పించిందని ప్రపంచ బ్యాంక్ గుర్తించింది. మా యువత సృజనాత్మకత, ఉత్సాహాలే మా అభివృద్ధికి కారణాలు..

 

ఈనాడు అంకుర సంస్థల కేంద్రంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఈ అంకుర పరిశ్రమల్లో దాదాపు సగం సంస్థలని మహిళా డైరెక్టర్లే నిర్వహిస్తున్నారు! ఇందులో సుమారు 120 యూనికార్న్ హోదాను పొందాయి! ఏఐ, సెమీకండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పథకాలు ప్రగతి చోదకాలుగా ఉన్నాయి! నిజానికి సృజనాత్మకత పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదాల్చుతోంది!

భారత్ లో ప్రవేశపెట్టిన యూపీఐ – ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్’ వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులను సమూలంగా మార్చివేసింది! ప్రపంచ ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం లావాదేవీలు మా దేశంలోనే జరుగుతున్నాయి! ఈ ప్రాంతంలో యూపీఐను ఆమోదించి అమలు చేస్తున్న తొలి దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డబ్బు పంపడం, శుభోదయం మెసేజ్ పంపినంత సులభం! వెస్ట్ ఇండీస్ బౌలింగ్ కంటే మెరుపు వేగంతో లావాదేవీ పూర్తవుతుందని హామీ ఇస్తున్నాను!


మిత్రులారా!

దేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ భావిస్తోంది.. ప్రపంచ రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారులం మేమే! ప్రపంచానికి రైల్వే ఇంజన్లను కూడా మేం అందిస్తున్నాం!

 

గత దశాబ్దంలో మా రక్షణ ఎగుమతులు 20 రెట్లు పెరిగాయి! మాకోసం మేం తయారు చేసుకోవడానికే పరిమితమవక, ప్రపంచం కోసం మేం ఉత్పత్తి చేస్తున్నాం. మేం వృద్ధి చెందుతూ, ప్రపంచానికి కూడా మా పని ద్వారా మేలు జరగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం!

మిత్రులారా!

నేటి భారతం పుష్కలమైన అవకాశాలకు ఆలవాలం! వ్యాపారం, పర్యాటకం, విద్య, ఆరోగ్య సంరక్షణ – అవసరం ఏదైనా, భారత్ అన్నీ అందించగలదు!

మీ పెద్దలు ఎంతో శ్రమకోర్చి... 100 రోజులపాటు సప్త సముద్రాలను దాటి ఇక్కడికి వచ్చారు- సాత్ సముందర్ పార్! ఈ రోజున ప్రయాణ సమయం కొన్ని గంటలకు తగ్గిపోయింది! దేశాన్ని సోషల్ మీడియా ద్వారానే కాక, ప్రత్యక్షంగా సందర్శించమని మిమ్మల్ని కోరుతున్నాను!

 

మీ పూర్వీకుల గ్రామాలను సందర్శించండి.. వారు నడిచిన నేలపై పాదం మోపండి! మీ పిల్లలు, ఇరుగుపొరుగులను మీతో తీసుకుని రావడం మరువకండి! చిక్కని చాయ్, చక్కని కథలను ఆస్వాదించే ఎవరినైనా మీ వెంట రమ్మనవచ్చు, మీ అందరినీ చేతులు చాచి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం.. జీలేబీలు సిద్ధం!

నాపై కురిపించిన ఆత్మీయత, ప్రేమకు మరొక్కమారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ దేశ అత్యున్నత పురస్కారంతో నన్ను సన్మానించినందుకు ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు!
అనేకానేక ధన్యవాదాలు! నమస్కారం! సీతా రామ్! జై శ్రీరామ్!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India launches ORV Sagar Manthan, boosting ocean research fleet

Media Coverage

India launches ORV Sagar Manthan, boosting ocean research fleet
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam ahead of BRICS Summit, highlights importance of positive and meaningful dialogue
September 11, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that leaders from across the world will gather for the BRICS Summit in the coming days. He expressed confidence that the Summit will witness positive and meaningful discussions on various issues, guided by the aspiration for the welfare of the world.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“सद्भिरेव सहासीत सद्भिः कुर्वीत सङ्गतिम्।

सद्भिर्विवादं मैत्रीं च नासद्भिः किंचिदाचरेत्॥”

The Subhashitam conveys that a person should always live among the virtuous and cultivate their company. A person should engage in discussion and foster friendly relations with the virtuous, because mutual goodwill, dialogue and friendly relations strengthen peace and cooperation.

The Prime Minister wrote on X;

“अगले कुछ दिनों में दुनियाभर के नेता BRICS Summit के लिए जुटेंगे। पूर्ण विश्वास है कि सम्मेलन में विश्व कल्याण की कामना के साथ विभिन्न मुद्दों पर सकारात्मक और सार्थक चर्चा होगी।

सद्भिरेव सहासीत सद्भिः कुर्वीत सङ्गतिम्।

सद्भिर्विवादं मैत्रीं च नासद्भिः किंचिदाचरेत्॥”