నమస్తే!

అహ్లాన్ వ సహ్లాన్ !!!

మీ యువ ఉత్సాహం, శక్తి ఇక్కడి వాతావరణాన్ని నిజంగా ఉత్తేజపరిచాయి. ఈ హాల్‌ సరిపోకపోవటంతో పక్కనే ఉన్న హాల్‌లోని తెరలపై ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సోదరీసోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత దూరం వచ్చి కూడా ఈ హాల్‌లోకి ప్రవేశించలేకపోయినందుకు వారు ఏమనుకుంటున్నారో మీరు ఊహించొచ్చు.

మిత్రులారా,

నా ముందు నేను ఒక మినీ-ఇండియాను చూస్తున్నాను. ఇక్కడ మలయాళీలు కూడా చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను.

సుఖమ్ ఆణో? 

కేవలం మలయాళం మాట్లాడేవారే కాదు.. తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ మాట్లాడే వారు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు.

నలమా?
బాగున్నారా?
చెన్నాగిద్దీరా?
కెమ్ ఛో?

మిత్రులారా,

ఈ రోజు మనమంతా ఒక కుటుంబంలా ఇక్కడ సమావేశమయ్యాం. ఈ రోజు మనం మన దేశాన్ని, మన 'టీమ్ ఇండియా'ను వేడుకగా చేసుకుంటున్నాం. 

 

మిత్రులారా,

భారతదేశంలో వైవిధ్యమే మన సంస్కృతికి బలమైన పునాది. జీవితంలో ప్రతి రోజు ఒక కొత్త రంగును నింపుతుంది. ప్రతి రుతువు ఒక వేడుకగా మారుతుంది. ప్రతి సంప్రదాయం ఒక సరికొత్త ఆలోచనను తెస్తుంది. అందుకే భారతీయులం ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ నివసించినా వైవిధ్యాన్ని గౌరవిస్తాం. మనం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటాం. ఈ రోజు ఒమన్‌లో కూడా నేను అదే స్ఫూర్తిని చూస్తున్నాను.

ఈ భారతీయ ప్రవాస సమాజం సహజీవనం, సహకారానికి ఒక సజీవ ఉదాహరణగా నిలిచింది.

మిత్రులారా,

భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఇటీవల మరో అద్భుతమైన గుర్తింపు లభించింది. మీకు తెలిసే ఉంటుంది.. యునెస్కో దీపావళిని అమూర్త వారసత్వ జాబితాలో చేర్చింది.

ఇప్పుడు దీపావళి దీపం కేవలం మన ఇళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి వెలుగునిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. దీపావళికి లభించిన ఈ ప్రపంచ గుర్తింపు మనం పంచుకునే కాంతిరేఖను గౌరవిస్తుంది. ఆ కాంతి ఆశ, సామరస్యం, మానవత్వాన్ని పెంచుతుంది.

మిత్రులారా,

ఈ రోజు మనమందరం భారత్-ఒమన్ " స్నేహానికి సంబంధించిన ఉత్సవం (మైత్రీ పర్వాన్ని)" చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాం. 

మైత్రి (ఎంఏఐటీఆర్ఐ) అంటే:

ఎం - సముద్ర వారసత్వం
ఏ - ఆకాంక్షలు
ఐ - ఆవిష్కరణ
టీ - నమ్మకం, సాంకేతికత
ఆర్ - గౌరవం
ఐ - సమ్మిళిత వృద్ధి

మరో రకంగా చెప్పాలంటే ఈ "మైత్రీ పర్వం" మన రెండు దేశాల మధ్య ఉన్న బంధం, మన ఉమ్మడి చరిత్ర, మన సుసంపన్నమైన భవిష్యత్తును వేడుకగా చేసుకుంటోంది. భారత్, ఒమన్ దేశాలు శతాబ్దాలుగా సాన్నిహిత్యాన్ని, శక్తిమంతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి.

హిందూ మహాసముద్రపు రుతుపవనాలు ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి మార్గనిర్దేశం చేశాయి. మన పూర్వీకులు లోథల్, మాండ్వి, తామ్రలిప్తి వంటి ఓడరేవుల నుంచి మస్కట్, సూర్, సలాలా వరకు చెక్క పడవల్లో ప్రయాణించారు.

మిత్రులారా,

మాండ్వి, మస్కట్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను వివరిస్తూ మన రాయబార కార్యాలయం ఒక పుస్తకాన్ని రూపొందించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఈ పుస్తకాన్ని చదివి మీ ఒమనీ స్నేహితులతో పంచుకోవాలని నేను కోరుతున్నాను.

 

పాఠశాలలో టీచర్లు హోంవర్క్ ఇస్తారు ఇక్కడేమో మోదీ గారు హోంవర్క్ ఇచ్చారని ఇప్పుడు మీరు అనుకోవచ్చు.

మిత్రులారా,

భారత్, ఒమన్ కేవలం భౌగోళికంగానే కాకుండా తరతరాలుగా అనుసంధానమై ఉన్న విషయాన్ని ఈ పుస్తకం తెలియజేస్తోంది. ఈ శతాబ్దాల నాటి బంధాలకు మీరే గొప్ప సంరక్షకులు.

మిత్రులారా,

"భారత్‌ గురించి తెలుసుకోండి" అనే క్విజ్‌లో ఒమన్ నుంచి భారీగా పాల్గొన్నారని నాకు తెలిసింది. ఒమన్ నుంచి  పది వేల మందికి పైగా ఈ క్విజ్‌లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

కానీ నేను ఇప్పుడే చప్పట్లు కొట్టను. ఒమన్ మొదటి స్థానంలో ఉండాలి! వీలైనంత ఎక్కువ మంది పాల్గొనటం ద్వారా ఇంకా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని నేను ఆశిస్తున్నాను. భారతీయ పిల్లలు ఖచ్చితంగా పాల్గొనాలి. అలాగే మీ ఒమనీ స్నేహితులను కూడా ఈ క్విజ్‌లో పాల్గొనాలని మీరు ప్రోత్సహించాలి.

మిత్రులారా,

వ్యాపారంతో మొదలైన భారత్-ఒమన్ సంబంధాలు ఇప్పుడు విద్య ద్వారా మరింత బలోపేతం అవుతున్నాయి. ఇక్కడి భారతీయ పాఠశాలల్లో సుమారు 46,000 మంది విద్యార్థులు చదువుతున్నారని.. వారిలో ఒమన్‌లోని ఇతర వర్గాలకు చెందిన వేలాది మంది పిల్లలు కూడా ఉన్నారన్న విషయం నాకు తెలిసింది. ఒమన్‌లో భారతీయ విద్యకు యాభై ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇది మన రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక ముఖ్యమైన ఘట్టం. 

మిత్రులారా,

దివంగత సుల్తాన్ ఖాబూస్ గారి కృషి లేకుండా భారతీయ పాఠశాలల విజయం సాధ్యమయ్యేది కాదు. మస్కట్‌లోని ఇండియన్ స్కూల్‌తో సహా భారతీయ పాఠశాలల కోసం ఆయన భూమి, అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించారు. గౌరవ సుల్తాన్ హైతం గారు ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక్కడి భారతీయ సమాజానికి అందిస్తున్న మద్దతు, రక్షణ పట్ల వారికి నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

మిత్రులారా,

మీకందరికీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం సుపరిచితమే. ఒమన్ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటుంటారు. పరీక్షలను ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ చర్చలు మార్గదర్శకంగా ఉంటూ అందరికీ సహాయపడుతున్నాయని నేను నమ్ముతున్నాను.

 

మిత్రులారా,

ఒమన్‌లో నివసిస్తున్న భారతీయులు తరచుగా భారతదేశానికి ప్రయాణిస్తుంటారు.. దేశంలోని ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. కొత్త పురోగతితో భారత్‌ ఎలా ముందుకు సాగుతుందో మీరందరూ చూస్తున్నారు. ఈ వేగం మా ఉద్దేశాన్ని తెలియజేస్తోంది.. మా పనితీరులో స్పష్టంగా కనిపిస్తుంది.

కొద్ది రోజుల క్రితమే ఆర్థిక వృద్ధి గణాంకాలు విడుదలయ్యాయి. మీకు తెలిసే ఉంటుంది.. భారత వృద్ధి 8 శాతం కంటే మించిపోయింది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందనేది దీని అర్థం. ప్రపంచమంతా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఇది సాధ్యమైంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కనీసం తక్కువ శాతం వృద్ధిని సాధించడానికి కూడా కష్టపడుతుంటే భారత్ మాత్రం అధిక వృద్ధి పథంలో కొనసాగుతోంది. ఇది నేటి భారతదేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. 

మిత్రులారా, 

నేడు భారతదేశం ప్రతి రంగంలోనూ మునుపెన్నడూ లేని వేగంతో పని చేస్తోంది. గత పదకొండు ఏళ్లకు సంబంధించిన కొన్ని గణాంకాలను నేను మీతో పంచుకుంటాను. అవి మిమ్మల్ని కూడా గర్వంతో నింపుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. 

ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నందున నేను విద్యా- నైపుణ్య రంగంతో ప్రారంభిస్తాను. గత పదకొండు ఏళ్లలో భారత్‌లో వేలాది కొత్త కళాశాలలు ఏర్పాటయ్యాయి. 

ఐఐటీల సంఖ్య పదహారు నుంచి ఇరవై మూడుకు పెరిగింది. పదకొండు ఏళ్ల క్రితం దేశంలో 13 ఐఐఎంలు ఉండేవి.. నేడు 21 ఉన్నాయి. అదేవిధంగా ఎయిమ్స్ విషయానికొస్తే.. 2014 కంటే ముందు కేవలం ఏడు మాత్రమే ఉండేవి నేడు దేశంలో 22 ఎయిమ్స్ ఉన్నాయి.

భారత్‌లో మెడికల్ కాలేజీల సంఖ్య 400 కంటే తక్కువగా ఉండేది.. నేడు దేశవ్యాప్తంగా సుమారు 800 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.

మిత్రులారా,

నేడు మనం అభివృద్ధి చెందిన భారత్‌ కోసం మన విద్యా, నైపుణ్య వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. ఇందులో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విధానంలో భాగంగా పద్నాలుగు వేలకు పైగా 'పీఎం శ్రీ' పాఠశాలలు వస్తున్నాయి. 

మిత్రులారా,

పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పెరిగినప్పుడు కేవలం భవనాలు నిర్మాణమే జరగదు.. దేశ భవిష్యత్తు బలోపేతం అవుతుంది.

మిత్రులారా,
దేశాభివృద్ధి వేగం, విస్తృతి విద్యారంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత పదకొండు సంవత్సరాల కాలంలో దేశంలో... అమర్చిన సౌరశక్తి సామర్థ్యం ముప్పై రెట్లు పెరిగింది, సౌర మాడ్యూళ్ల తయారీ పది రెట్లు వృద్ధి చెందింది. ఈ విధంగా దేశం హరిత వృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.

భారత్ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ వ్యవస్థకు నిలయంగా ఉంది. రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు, రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగానూ భారత్ ముందంజలో ఉంది.

 

మిత్రులారా,
మన దేశానికి వచ్చే వారంతా మన ఆధునిక మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. గత పదకొండు సంవత్సరాల కాలంలో మౌలిక సదుపాయాల్లో ఐదు రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది.

విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు వేగంతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నాం, రైల్వే మార్గాలను వేగంగా వేస్తున్నాం, రైల్వే విద్యుదీకరణ పనులూ వేగంగా సాగుతున్నాయి.

మిత్రులారా,
ఈ గణాంకాలు కేవలం విజయాలు మాత్రమే కాదు... ఇవి అభివృద్ధి చెందిన భారత్ దార్శనికత సాకారం దిశగా గొప్ప ముందడుగులు. ఇరవై ఒకటో శతాబ్దంలో దేశం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది, వేగంగా పనిచేస్తోంది, ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను సాధిస్తోంది. నిర్ణీత కాలపరిమితిలో ఫలితాలనూ అందిస్తుంది.

మిత్రులారా,
మరో గర్వకారణమైన విషయాన్ని పంచుకుంటాను. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలనూ ఈ రోజు భారత్ నిర్మిస్తోంది.

మన దేశ యూపీఐ... అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా నిలిచింది. ఈ చెల్లింపుల వ్యవస్థ పరిధిని మీకు తెలియజేయడం కోసం నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.

నేను ఇక్కడకు వచ్చి సుమారు 30 నిమిషాలు అయ్యింది. ఈ 30 నిమిషాల వ్యవధిలోనే, మన దేశంలో యూపీఐ ద్వారా సుమారు 1.4 కోట్ల రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. పెద్ద షోరూమ్‌ల నుంచి చిన్న వ్యాపారుల దాకా దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ చెల్లింపు వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు.

మిత్రులారా,
ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు... కాబట్టి నేను మరో ఆసక్తికరమైన ఉదాహరణను చెప్పాలనుకుంటున్నాను. దేశం ఒక ఆధునిక డిజిలాకర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దేశంలో బోర్డు పరీక్షలు నిర్వహించిన తరువాత వారి మార్క్ షీట్లను నేరుగా విద్యార్థుల డిజిలాకర్ ఖాతాల్లోకి అప్‌లోడ్ చేస్తారు. పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం దాకా ప్రభుత్వం జారీ చేసిన ఏ పత్రాన్ని అయినా డిజిలాకర్‌లో భద్రంగా ఉంచవచ్చు. ఇటువంటి అనేక డిజిటల్ వ్యవస్థలు దేశవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.

మిత్రులారా,
మన దేశం సాధించిన చంద్రయాన్ మిషన్ అద్భుతాన్ని మీరంతా చూశారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా మనం ఘనతను సాధించాం. అంతేకాకుండా, ఒకే మిషన్‌లో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి మనం అరుదైన రికార్డునూ సృష్టించాం.

గగన్‌యాన్ కార్యక్రమం కింద దేశం ఇప్పుడు మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాం. త్వరలోనే అంతరిక్ష కక్ష్యలో మన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటయ్యే రోజూ మరెంతో దూరంలో లేదు.

మిత్రులారా,
భారత అంతరిక్ష కార్యక్రమం కేవలం మన దేశ సరిహద్దులకే పరిమితం కాదు. మనం ఒమన్ అంతరిక్ష ఆకాంక్షలకూ మద్దతునిస్తున్నాం. ఆరు-ఏడు సంవత్సరాల కిందట, అంతరిక్ష సహకారం గురించిన ఒక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఇండియా-ఒమన్ స్పేస్ పోర్టల్‌ను ఇస్రో అభివృద్ధి చేసిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ అంతరిక్ష భాగస్వామ్యం ద్వారా ఒమన్ యువతకూ ప్రయోజనం కలిగేలా నిరంతర ప్రయత్నాలు సాగుతున్నాయి.

 

ఇక్కడ ఉన్న విద్యార్థులతో నేను మరో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ‘యువికా’ పేరుతో ఇస్రో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది వేలాది మంది భారతీయ విద్యార్థులను అంతరిక్ష విజ్ఞానంతో అనుసంధానిస్తుంది. ఈ కార్యక్రమంలో ఒమన్ విద్యార్థులకూ పాల్గొనే అవకాశాన్ని కల్పించడమే మా ప్రస్తుత ప్రయత్నం.

ఒమన్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని సందర్శించి అక్కడ కొంత సమయం గడపాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒమనీ యువత అంతరిక్ష ఆకాంక్షలను కొత్త శిఖరాలకు చేర్చడానికి ఒక అద్భుతమైన ప్రారంభం కాగలదు.

మిత్రులారా,
ఈ రోజు భారత్ తన సొంత సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడమే కాకుండా, ఈ పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా చేయడంపై కృషి చేస్తోంది.

సాఫ్ట్‌వేర్ అభివృద్ధి నుంచి పేరోల్ నిర్వహణ వరకు... డేటా విశ్లేషణ నుంచి కస్టమర్ సపోర్ట్ వరకు... అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లు భారత ప్రతిభా బలంతోనే ముందుకు సాగుతున్నాయి.

దశాబ్దాలుగా మన దేశం ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ప్రపంచ శక్తిగా వెలుగొందుతోంది. మనం తయారీ రంగాన్ని ఐటీ శక్తితో అనుసంధానిస్తున్నాం. దీని వెనుక ఉన్న సిద్ధాంతం 'వసుధైక కుటుంబ' భావన నుంచి స్ఫూర్తి పొందినదే. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఈ ఆలోచనే 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' అనే నినాదంలోనూ ప్రతిబింబిస్తుంది.

మిత్రులారా,
టీకాలైనా... సాధారణ మందులైనా... ప్రపంచం మనల్ని 'ప్రపంచ ఔషధ కేంద్రం' గా పిలుస్తోంది. దేశం అందించే సరసమైన, అధిక నాణ్యత గల ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి.

కోవిడ్ సమయంలోనూ మన దేశం ప్రపంచానికి దాదాపు 30 కోట్ల టీకాలను అందించింది. 'మేడ్ ఇన్ ఇండియా' కోవిడ్ టీకాల్లో సుమారు లక్ష టీకాలు ఒమన్ ప్రజలకూ ఉపయోగపడటం నాకు సంతోషం కలిగించింది.

మిత్రులారా,
గుర్తుంచుకోండి... మిగతా వారంతా తమ గురించి తామే ఆలోచిస్తున్న సమయంలోనూ భారత్ ఈ పనిని చేసింది. భారత్ ప్రపంచం గురించి ఆలోచించింది. భారత్ తమ 140 కోట్ల మంది పౌరులకు రికార్డు సమయంలో విజయవంతంగా టీకాలు వేయడంతో పాటుగా ప్రపంచ అవసరాలనూ తీర్చింది.

ఇది భారత్ నమూనా. ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచానికి కొత్త ఆశను అందించే నమూనా. అందుకే ఈ రోజు భారత్ 'మేక్ ఇన్ ఇండియా' చిప్‌లను తయారు చేస్తూ... ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. భారత్ సాధించే విజయం తమకూ సహకారాన్ని, మద్దతును అందిస్తుందనే ఆశను ఇతర దేశాల్లోనూ కల్పిస్తోంది.

మిత్రులారా,
మీరు ఒమన్‌లో చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో మీరు ఒమన్, భారత్ రెండు దేశాల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తారు. ప్రపంచానికి నాయకత్వం వహించబోయే తరం మీరే.

 

ఒమన్‌లో నివసిస్తున్న భారతీయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఒమన్ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తోంది. భారత ప్రభుత్వం మీ సౌకర్యం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తోంది. ఒమన్ వ్యాప్తంగా పదకొండు కాన్సులర్ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

మిత్రులారా,
గత దశాబ్దంలో ప్రపంచంలో తలెత్తిన ప్రతి సంక్షోభ సమయంలోనూ మన ప్రభుత్వం భారతీయులకు సహాయం చేయడానికి వేగంగా స్పందించింది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడ నివసిస్తున్నా... మన ప్రభుత్వం ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలుస్తోంది. వారికి మద్దతుగా ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్, ప్రత్యేక సహాయ పోర్టల్స్, ప్రవాసీ భారతీయ బీమా యోజన వంటి కార్యక్రమాలను చేపట్టింది.

మిత్రులారా,
ఈ ప్రాంతంలో భారత్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒమన్ మాకు మరింత ముఖ్యమైనది. భారత్-ఒమన్ సంబంధాలు ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అభ్యసనం, విద్యార్థుల రాకపోకలు, వ్యవస్థాపకత వంటి రంగాలకు విస్తరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

 

రాబోయే సంవత్సరాల్లో భారత్-ఒమన్ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే యువ ఆవిష్కర్తలు మీ నుంచే ఉద్భవిస్తారని నేను నమ్మకంగా ఉన్నాను. ఇక్కడ ఉన్న భారతీయ పాఠశాలలు ఇప్పుడే తమ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి. రాబోయే 50 సంవత్సరాల లక్ష్యాలతో మనం ఇప్పుడు ముందుకు సాగాలి. మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే:

పెద్ద కలలు కనండి.
లోతుగా నేర్చుకోండి.
ధైర్యంగా ఆవిష్కరణలు చేయండి.
ఎందుకంటే మీ భవిష్యత్తు కేవలం మీది మాత్రమే కాదు... యావత్ మానవజాతి భవిష్యత్తు.

మీ అందరికీ ఉజ్వలమైన, సుసంపన్నమైన భవిష్యత్తు లభించాలని కోరుకుంటూ నేను మరోసారి మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre allows 100% FDI in insurance via auto route

Media Coverage

Centre allows 100% FDI in insurance via auto route
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a fire mishap in Delhi’s Shahdara district
May 03, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a fire mishap in Delhi’s Shahdara district.

The Prime Minister extended his condolences to those who have lost their loved ones in this tragic mishap and prayed for the speedy recovery of the injured.

Shri Modi announced that an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister's National Relief Fund (PMNRF) would be given to the next of kin of each of those who lost their lives, and the injured would be given Rs. 50,000.

The Prime Minister posted on X:

"The loss of lives due to a fire mishap in Delhi’s Shahdara district is extremely distressing. Condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost their lives. The injured would be given Rs. 50,000: PM"