నేడు ప్రారంభిస్తున్న ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు.. మరింత బలమైన అనుసంధానం, ఆర్థిక – పర్యాటక రంగాలకు ఊతం
25 ఏళ్లు పూర్తిచేసుకుని 26వ యేట అడుగుపెట్టిన ఉత్తరాఖండ్.. ఈ ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రహదారి మరో మైలురాయి
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌తో ఈ ప్రాంతంలో విప్లవాత్మక మార్పు
ఈ కారిడార్‌తో సమయం ఆదా: తక్కువ వ్యయంతో, వేగంగా ప్రయాణం.. ప్రజలకు పెట్రోలు, డీజిలుపై తగ్గనున్న ఖర్చులు
చార్జీలు, రవాణా ఖర్చుల్లోనూ తగ్గుదల.. మెరుగైన ఉపాధి అవకాశాలు
మన పర్వతాలు, ఈ అడవులు, ఈ దేవభూమి వారసత్వం... ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలు: వీటిని పరిశుభ్రంగా ఉంచడం మన కర్తవ్యం

 

భారత్‌ మాతా కీ జై!

భారత్‌ మాతా కీ జై!

భారత్‌ మాతా కీ జై!

   ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ అజయ్ టమ్టా, సాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్, శ్రీ విజయ్ బహుగుణ, శ్రీ తీరథ్‌ సింగ్ రావత్, శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.

మిత్రులారా!

దేవభూమిగా పేరుపడిన ఉత్తరాఖండ్ అనే ఈ పవిత్ర గడ్డపైనుంచి మీ అందరికీ వందనాలు అర్పిస్తున్నాను. అలాగే, అత్యధిక సంఖ్యలో హాజరైన పూజ్య సాధువులకూ నమస్సులు. రాష్ట్రంలోని పెద్దలు, తాతయ్యలు, నానమ్మలు, ప్రియ సోదరీసోదరులు, అక్కచెల్లెళ్లందరికీ కూడా సగౌరవ నమస్కారం!

ఈ రాష్ట్ర వాస్తవ్యులే కాకుండా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ నుంచి కూడా ఎంతోమంది సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ స్వాగతం పలికే ముందు.. ఇక్కడికి రావడంలో గంటకు పైగా ఆలస్యమైనందుకు క్షంతవ్యుణ్ని. నా వల్ల అన్నిచోట్లా మీరందరూ చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. అయితే, నేను సకాలంలోనే బయల్దేరినా, కాళీమాత ఆలయం నుంచి ఇక్కడి దాకా దాదాపు 12 కిలోమీటర్ల రోడ్‌షోలో ప్రజల ఉత్సాహోద్వేగాల ఫలితంగా కారు వేగంగా నడవడం సాధ్యం కాలేదు. అందుకే, జనాన్ని పలకరిస్తూ, ఆ ‘జనార్దనుడి’ ఆశీస్సులు అందుకుని, ఇక్కడికి చేరేసరికి గంటకు పైగా ఆలస్యం తప్పలేదు. అందుకే... మిమ్మల్ని క్షమాపణ కోరాను. ఈ 12 కిలోమీటర్ల మేర ఇంతటి వేసవి తీవ్రతను భరిస్తూ ఈ జనసంద్రం ఇక్కడ గుమికూడింది. ఉత్తరాఖండ్‌  తల్లులు, సోదరీసోదరుల ప్రేమ, అశేష ఆశీస్సులు పొందడం ఇవాళ నాకో కొత్త శక్తిని, స్ఫూర్తిని ఇచ్చాయి. ఇందుకుగాను ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 

మిత్రులారా!

దేశవ్యాప్తంగా ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బైశాఖి, బొహాగ్‌బిహు, పుత్తాండు వంటి పేర్లతో సంవత్సరాది ఉత్సవాలు చేసుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ఇక కొద్ది రోజుల్లో యమునోత్రి, గంగోత్రి, బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా ప్రారంభం కానుంది. దేశంలోని కోట్లాది భక్తులు ఈ పవిత్ర సందర్భం కోసం ఎంతో భక్తిశ్రద్ధలతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేనిక్కడి పంచ బద్రి, పంచ కేదార్, పంచ ప్రయాగ అధిష్ఠాన దేవతలకు గౌరవ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే, సంతలా మాతకూ శిరసాభివందనం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేముందు ‘దాత్ కాళీమాత’ దర్శన భాగ్యం కలిగింది. డెహ్రాడూన్ నగరానికి ఆ మాత అపార అనుగ్రహం ఉంది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ వంటి ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి కావడంలో మాత ఆశీస్సులు ఎంతో బలాన్నిచ్చాయి.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తికాగా, ఈ 26వ వార్షికోత్సవం సందర్భంగా నేడు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో ఈ రాష్ట్ర ప్రగతికి మరో గొప్ప విజయం తోడైంది. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది... బాబా కేదార్ దర్శనం తర్వాత ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఉత్తరాఖండ్‌కే చెందుతుందని అప్రయత్నంగా నా నోట మాట వెలువడింది. ద్వంద్వ చోదక ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రజల కృషి వల్ల ఈ యువ రాష్ట్రం ప్రగతికి కొత్త కోణాలను జోడిస్తుండటం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో అధికభాగం ఉత్తరప్రదేశ్‌ గుండా వెళ్తుంది. దీనివల్ల ఘజియాబాద్, బాఘ్‌పత్, బరౌత్, షామ్లీ, సహారన్‌పూర్ వంటి చాలా నగరాలు ఎంతో ప్రయోజనం పొందుతాయి. పర్యాటక రంగ ప్రగతి రీత్యా ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్టు సాకారంపై యావద్దేశానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ జయంతి నేపథ్యంలో కోట్లాది దేశ ప్రజల తరపున ఆ మహనీయుడికి నా నివాళి. గడచిన దశాబ్దంలో మా ప్రభుత్వం అమలు విధానాలు, తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ గౌరవాన్ని పునఃస్థాపించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత రాజ్యాంగం ఇవాళ దేశమంతటికీ వర్తిస్తుంది. మావోయిజం-నక్సలిజం అంతమైన వందల జిల్లాల్లోనూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనులు సాగుతున్నాయి. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు కావాలన్నది మన రాజ్యాంగ ఆకాంక్ష. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ఆ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని ముందడుగు వేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

మిత్రులారా!

పేదలు, అణగారిన వర్గాలు, పీడితులకు సమన్యాయం చేసే వ్యవస్థను అందించడానికి బాబాసాహెబ్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో ప్రతి పేదకూ, అణగారిన వ్యక్తికి వాస్తవిక సామాజిక న్యాయ ప్రదానంలో నిమగ్నమైంది. ఇక సామాజిక న్యాయానికి గొప్ప మాధ్యమం దేశ సమతుల ప్రగతి, అందరికీ సౌకర్యాలు, శ్రేయస్సు. అందుకే, బాబాసాహెబ్ ఆధునిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ ఆవశ్యకతను గట్టిగా సమర్థించారు.

 

మిత్రులారా!

ప్రజలు తరచూ తమ భవిష్యత్తు ఎలా ఉంటుందనే అంశంపై అరచేతిలోని గీతలను చూసి అంచనా వేస్తుంటారు. ఆ మేరకు భవిష్యవాణి చెప్పేవారు ఆ గీతలను చూసి ప్రతి వ్యక్తి భవిష్యత్తు గురించి చెబుతుంటారు. అయితే, నాకు ఈ జ్యోతిష శాస్త్రం గురించి తెలియదుగానీ, ఇదీ ఒక శాస్త్రమేనంటారు. ఇప్పుడిది ఒక వ్యక్తి చేతిలోని గీతలలో ఇమిడిన అతని విధిరాతను చెబుతుంది. అయితే, నేను దాన్ని జాతి జీవనానికి అన్వయించి చూస్తున్నాను. ఒక దేశం విధి గురించి ఆ గీతలు ఏం చెబుతున్నాయి? ఒక దేశపు భాగ్యరేఖలంటే రోడ్లు, జాతీయ రహదారులు, ఎక్స్‌ ప్రెస్‌వేలు, విమాన మార్గాలు, రైల్వేలు, జలమార్గాలు... ఇవే!  గత దశాబ్దం నుంచీ వికసిత భారత్‌ను రూపుదిద్దడం కోసం ఈ ప్రగతి భాగ్యరేఖల నిర్మాణంలో నిమగ్నమైంది. ఇవన్నీ కేవలం వర్తమానానికి పరిమితమైన సౌకర్యాలు కావు... భావితరాల శ్రేయస్సుకూ హామీ... మోదీ హామీకి నిదర్శనాలు.

ఈ మేరకు గత దశాబ్దంలో మా ప్రభుత్వం ఈ పురోగమనం కోసం అసాధారణ రీతిలో పెట్టుబడులు పెడుతూ వచ్చింది. శ్రీ నితిన్‌ గడ్కరీ ఇప్పుడే మీకు ఉత్తరాఖండ్‌ సంబంధిత అనేక గణాంకాలను వివరించారు. అయితే, నేనొక అంకె చెబుతాను వినండి... ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం 2014 దాకా దేశం మొత్తం మీద ఒక ఏడాదిలో కనీసం రూ.2 లక్షల కోట్లు కూడా వెచ్చించలేదు. అయితే, ఇప్పుడొక వాస్తవం చెబుతున్నా... అదేమిటంటే- మునుపటితో పోల్చినపుడు ఇప్పుడిది 6 రెట్లకు పైగా.. రూ.12 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో ఇక్కడే..  ఈ ఉత్తరాఖండ్‌లోనే రూ.2.5 కోట్లకుపైగా మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు గమనించండి... 2014కు ముందు యావద్దేశానికీ రూ.2 లక్షల కోట్లు కాగా, నేడు ఒక్క ఉత్తరాఖండ్‌కే రూ.2.5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. ఉత్తరాఖండ్ గ్రామాలలో ఒక చిన్న రోడ్డు కోసం ప్రజలు ఒకప్పుడు తరతరాలుగా ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ, ఇవాళ ద్వంద్వ చోదక ప్రభుత్వ కృషితో  గ్రామగ్రామానికీ రహదారి సౌలభ్యం కలుగుతోంది. అందుకే లోగడ నిర్మానుష్యమైన గ్రామాలు నేడు మళ్లీ జీవకళతో విలసిల్లుతున్నాయి. చార్‌ధామ్ మహామార్గ్‌, రైలు మార్గాల విస్తరణ, కేదార్‌నాథ్ సహా హేమకుండ్ సాహిబ్ రోప్‌వే- ఈ విధంగా అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతం నలుమూలలా జీవన గమ్యాలుగా రూపొందుతున్నాయి.

మిత్రులారా!

నేటి 21వ శతాబ్దపు భారత్‌ పని వేగం, స్థాయి గురించి యావత్ ప్రపంచం ఇప్పుడు చర్చించుకుంటోంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ గురించి నేనిప్పుడు ఉటంకిస్తాను. కొన్ని వారాల కిందటే ఢిల్లీ మెట్రో విస్తరణ పూర్తికాగా, మీరట్‌లో మెట్రో సేవలు మొదలయ్యాయి. ఢిల్లీ-మీరట్ ‘నమో భారత్’ రైలును దేశానికి అంకితం చేయగా, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. విమానాల కోసం ‘ఎంఆర్‌ఓ’ సదుపాయం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ క్రమంలో ఇప్పుడిక డెహ్రాడూన్-ఢిల్లీ ఎక్స్‌ ప్రెస్‌వే ప్రారంభమవుతోంది.

మిత్రులారా!

ఇంత చిన్న ప్రాంతంలో.. ఇంత తక్కువ సమయంలోనే ఇవన్నీ సాగుతున్నాయి. దీన్నిబట్టి, దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ఎంత భారీ స్థాయిలో సాగుతున్నదో ఒక్కసారి ఊహించండి. అందుకే నేనంటాను- ఈ 21వ శతాబ్దపు భారత ఆధునిక మౌలిక సదుపాయాల నవశకం అపూర్వం.. అనూహ్యం!

మిత్రులారా!

దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే అనేక ఆర్థిక కారిడార్ల కార్యకలాపాలు నేడు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీ-ముంబై, బెంగళూరు-ముంబై, తూర్పు తీరం, అమృత్‌సర్-కోల్‌కతా కారిడార్ల వంటివి దేశంలో నిర్మితమవుతున్నాయి. ఈ ఆర్థిక కారిడార్లే ప్రగతికి కొత్త ద్వారాలు.. ముఖద్వారాలు మాత్రమే కాదు... అందరి ఆశల దారం కూడా వీటితో ముడిపడి ఉంది. ఈ ఆర్థిక కారిడార్లు  రహదారులతోపాటు కొత్త వ్యాపార-వాణిజ్యాలకు సరికొత్త బాటలు వేస్తాయి. ఇవన్నీ కర్మాగారాలు, గిడ్డంగుల కోసం ఒక పూర్తి నెట్‌వర్క్‌కు పునాది వేస్తాయి.

మిత్రులారా!

డెహ్రాడూన్-ఢిల్లీ ఆర్థిక  కారిడార్ ద్వారా ఈ మొత్తం ప్రాంతం ముఖచిత్రం మారిపోనుంది. దీనివల్ల కలిగే మొదటి ప్రయోజనం, ఇది సమయాన్ని ఆదా చేస్తుంది.  ప్రయాణం ఖర్చు తక్కువగా, వేగంగా మారుతుంది. ప్రజల పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గుతాయి. ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక రెండవ ప్రధాన ప్రయోజనం ఉపాధి రూపంలో లభిస్తుంది. ప్రస్తుతం దీని నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో వేలాది మంది కార్మికులకు పని దొరికింది. దీనితో పాటు, ఇంజనీర్లు, ఇతర నైపుణ్యం కలిగిన సిబ్బంది, రవాణా రంగంతో సంబంధం ఉన్న భాగస్వాములకు కూడా భారీ స్థాయిలో ఉపాధి లభించింది. ఇప్పుడు రైతులు, పశుపోషకుల ఉత్పత్తులు కూడా వేగంగా పెద్ద పెద్ద మార్కెట్లకు, ప్రధాన విపణి కేంద్రాలకు చేరుతాయి.

 

మిత్రులారా!

ఈ అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేష్, ముస్సోరీ, చార్‌ధామ్ యాత్రలకు ఇది అత్యంత కీలకమైన మార్గంగా మారుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందినప్పుడు, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఆదాయం లభిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. హోటళ్లు, దాబా యజమానులు, టాక్సీలు, ఆటోలు లేదా హోమ్‌స్టేలు ఇలా అందరూ దీని ద్వారా లాభపడతారు.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ నేడు శీతాకాల పర్యాటకం, శీతాకాల క్రీడలు, 'వెడ్ ఇన్ ఇండియా' వంటి వివాహ వేడుకలకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా మారుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. 

మిత్రులారా!

ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థకు ఏడాది పొడవునా కొనసాగే పర్యాటకం చాలా అవసరం. అందుకే శీతాకాలంలో జరిగే ఆధ్యాత్మిక యాత్రల విషయంలో నేను చాలా పట్టుదలగా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ యాత్రల్లో పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతుండటం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను 2023లో ఆది కైలాసం, ఓం పర్వతం యాత్రకు వెళ్లాను. అంతకుముందు నేను తరచుగా వెళ్లేవాడిని. కానీ మధ్యలో అస్సలు వెళ్లలేకపోయాను. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వెళ్లాను. నేను 2023లో అక్కడికి వెళ్లిన తర్వాత, అప్పటి నుంచి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారని ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా నాకు చెప్పారు. గతంలో శీతాకాల యాత్ర కోసం అక్కడికి కేవలం వందల సంఖ్యలో మాత్రమే ప్రజలు వెళ్లేవారు. కానీ 2025 సంవత్సరంలో, సుమారు 40 వేల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర స్థలాలను సందర్శించారు. ఒకప్పుడు వెయ్యి మంది కూడా వెళ్లని చోటికి, ఇప్పుడు నలభై వేల మంది చేరుకుంటున్నారంటే ఇక్కడి ప్రజల జీవనోపాధికి ఎంతటి బలం చేకూరుతుందో ఆలోచించండి. అదేవిధంగా, 2024 శీతాకాల చార్‌ధామ్ యాత్రలో దాదాపు ఎనభై వేల మంది భక్తులు రాగా, 2025 నాటికి ఈ సంఖ్య లక్షన్నర మార్కును దాటిపోయింది.

మిత్రులారా!

అభివృద్ధి, ప్రకృతి, సంస్కృతి కలిసి ఉండే వికసిత భారతాన్ని నిర్మించే పనిలో మనం నిమగ్నమై ఉన్నాం. అందుకే, నేడు జరుగుతున్న ప్రతి నిర్మాణం కూడా అభివృద్ధి, ప్రకృతి, సంస్కృతి తో కూడిన  'త్రివేణి' విలువల ఆధారంగానే రూపుదిద్దుకుంటోంది. మౌలిక సదుపాయాల వల్ల ప్రజలకు  సౌకర్యం ఉండాలి. అదే సమయంలో అక్కడ నివసించే వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్నదే మా ప్రయత్నం. అందుకే సుమారు 12 కిలోమీటర్ల పొడవునా వన్యప్రాణుల కోసం ఎత్తైన వంతెన మార్గం (ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్‌) నిర్మించాం. ఏనుగులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. 

 

మిత్రులారా!

దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు,  యాత్రికులకు ఈ రోజు నాదో విన్నపం. మన పర్వతాలు, ఈ అటవీ ప్రాంతాలు, ఈ దేవభూమి వారసత్వం - ఇవన్నీ ఎంతో పవిత్రమైన ప్రదేశాలు. ఇటువంటి ప్రాంతాలను శుభ్రంగా, నిర్మలంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ఇక్కడ నివసించే వారిదే కాకుండా, ప్రయాణికులుగా ఇక్కడికి వచ్చే వారి బాధ్యత కూడా. ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ సీసాలు, చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉండటం దేవభూమి పవిత్రతను దెబ్బతీస్తాయి. అందుకే మన దేవభూమిలోని ఈ పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.

మిత్రులారా!

వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా కూడా జరగనుంది. ఈ భక్తి సంగమాన్ని దివ్యంగా, భవ్యంగా, అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో మనం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదు.  

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌లో నందా దేవి రాజ్‌ జాత్ యాత్ర కూడా జరుగుతుంది. ఇది కేవలం ఒక విశ్వాస పండుగ మాత్రమే కాదు. మన సాంస్కృతిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ నందా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి, పూర్తి గౌరవమర్యాదలతో వీడ్కోలు పలుకుతారు. ఈ యాత్రలో సోదరీమణులు, కుమార్తెల భాగస్వామ్యం దీనికి ఒక ప్రత్యేకతను చేకూరుస్తుంది. నందా మాతకు ప్రణామం చేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు కుమార్తెలకు నేను ఒక ప్రత్యేక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో మీ పాత్ర చాలా పెద్దది. ఈ దేశపు కుమార్తెలు, తల్లులు, అక్కాచెల్లెళ్ల పాత్రను నేను చాలా కీలకంగా చూస్తున్నాను. అక్కాచెల్లెళ్ళు, కుమార్తెల సౌకర్యం, భద్రత, ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యం  ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రస్తుతం ప్రపంచంలో ఎంతటి పెద్ద సంక్షోభం వచ్చిందో మీరు చూస్తున్నారు. దీనివల్ల ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఎంతటి హాహాకారాలు వ్యక్తమవుతున్నాయో మనకు తెలుసు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, మన ఆడబిడ్డలకు ఎక్కువ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నదే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం.

 

మిత్రులారా!

అక్కాచెల్లెళ్ళు,  కుమార్తెల భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన మైలురాయి ఇప్పుడు దేశం ముందుకు వచ్చింది. నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత, పార్లమెంటు 'నారీ శక్తి వందన్ అధినియం'ను ఆమోదించింది. దీని ద్వారా శాసనసభలు, లోక్‌సభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్‌ ఖరారు అయింది. ఈ ముఖ్యమైన చట్టానికి అన్ని పార్టీలు ముందుకు వచ్చి మద్దతు తెలిపాయి. ఇప్పుడు మహిళలకు ఈ హక్కు లభించినందున, దీనిని అమలు చేయడంలో ఏమాత్రం ఆలస్యం జరగకూడదు. ఇప్పుడు ఇది కచ్చితంగా అమలు కావాలి. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల నుంచి, అలాగే ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల నుంచి ఏ ఎన్నికలు జరిగినా, ఈ చట్టం 2029 నుంచే అమలులోకి వస్తుంది. ఇది దేశం మనోభావం. దేశంలోని ప్రతి సోదరి, కుమార్తెల ఆకాంక్ష. ఈ మాతృశక్తి ఆకాంక్షకు తలవంచి, ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ఒక ప్రత్యేక చర్చ జరగనుంది. రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏకాభిప్రాయంతో దేశంలోని అక్కాచెల్లెళ్ళు, కుమార్తెల హక్కులకు సంబంధించిన ఈ పనిని ముందుకు తీసుకెళ్లి పూర్తి చేయాలి. నేడు దేశంలోని సోదరీమణులందరి పేరిట నేను ఒక బహిరంగ లేఖ రాశాను. బహుశా సోషల్ మీడియా ద్వారా నా ఈ లేఖ మీ వద్దకు చేరి ఉండవచ్చు.టీవీ, వార్తాపత్రికల వారు కూడా ఈ లేఖ గురించి ప్రస్తావిస్తూ ఉండవచ్చు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దేశంలోని తల్లులను, అక్కాచెల్లెళ్లను నేను మనసారా ఆహ్వానించాను. దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్ళు కచ్చితంగా ఈ లేఖను చదువుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు అందులోని ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటారు. ఇంతటి గొప్ప పవిత్ర కార్యం చేసేందుకు 16,17,18 తేదీలలో పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు కూడా వారి ఆశీస్సులు లభిస్తాయి. నేడు ఈ దేవభూమినుంచి దేశంలోని రాజకీయ పార్టీలన్నింటికీ నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. నారీ శక్తి వందన్ అధినియం సవరణకు చిత్తశుద్ధితో మద్దతు ఇవ్వండి. 2029 నాటికి, మన దేశ జనాభాలో 50 శాతం ఉన్న మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు వారి హక్కును అందిద్దాం.

మిత్రులారా!

నేను ఉత్తరాఖండ్‌కు వచ్చి సైన్యం గురించి మాట్లాడకపోతే, ఆ ప్రసంగం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఈ గర్హీ కంటోన్మెంట్, ఈ సభా వేదిక ఉత్తరాఖండ్ గొప్ప సైనిక సంప్రదాయానికి నిదర్శనం. ఇక్కడికి సమీపంలో దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి. 1962 యుద్ధంలో షహీద్ జస్వంత్ సింగ్ రావత్ ప్రదర్శించిన పరాక్రమాన్ని దేశం ఎన్నటికీ మరువలేదు.

మిత్రులారా!

సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కావచ్చు లేదా మన సైనిక కుటుంబాల సౌకర్యం, గౌరవం కావచ్చు. మా ప్రభుత్వం వీటి కోసం నిరంతరం కృషి చేస్తోంది. 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' (ఓఆర్ఓపీ) ద్వారా మా ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు లక్షా పాతిక వేల కోట్ల రూపాయలను మాజీ సైనికుల ఖాతాల్లో జమ చేసింది. ఉత్తరాఖండ్‌లోని వేలాది కుటుంబాలు కూడా దీని వల్ల ప్రయోజనం పొందాయి. ఇది కాకుండా, ఈ ఏడాది మాజీ సైనికుల ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్) బడ్జెట్‌ను కూడా ముప్పై ఆరు శాతం పెంచాం. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మాజీ సైనికుల కోసం ఇంటి వద్దకే మందుల పంపిణీ సౌకర్యాన్ని కూడా ప్రారంభించాం. మాజీ సైనికుల పిల్లల విద్యా గ్రాంట్‌ను కూడా రెట్టింపు చేశాం. అలాగే, కుమార్తెల వివాహానికి అందించే సహాయాన్ని 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాం. 

మిత్రులారా!

దేశభక్తి, దైవభక్తి, ప్రగతి వంటి ప్రతి కోణాన్ని జోడిస్తూ మనం దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలి. మరొకసారి ఢిల్లీ ప్రజలకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు, అలాగే దేశప్రజలందరికీ ఈ అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వే సందర్భంగా నా అనేకానేక శుభాకాంక్షలు.  

నాతో కలసి చెప్పండి - 

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

 అనేకానేక ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
FIIs pour over $1 billion into Indian stocks, biggest weekly buying since June 2025

Media Coverage

FIIs pour over $1 billion into Indian stocks, biggest weekly buying since June 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives due to boat capsizing in South 24 Parganas district of West Bengal
July 13, 2026
Prime Minister announces ex-gratia

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal.

The Prime Minister conveyed his thoughts to the bereaved families in this hour of grief and prayed for the speedy recovery of the injured.

The Prime Minister announced that an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.

The Prime Minister’s Office posted on X;

“The loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal is deeply painful. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”