ప్రపంచ అంతరిక్ష-విమానయాన రంగాల్లో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్
ఉడాన్ పథకం విజయం భారత పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయం
ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థల పెట్టుబడులకు అద్భుత అవకాశాలను భారత్ అందిస్తోంది: ప్రధానమంత్రి

మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు, మురళీధర్ మొహోల్, ఐఏటీఏ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ పీటర్ ఎల్బర్స్, ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్, ఇండిగో డైరెక్టర్ రాహుల్ భాటియా, అతిథులు, ఆహూతులందరికీ!

ఐఏటీఏ 81 వార్షిక సర్వ సభ్య సమావేశానికి, వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన అతిథులందరికీ స్వాగతం. మీ రాక మాకు గౌరవ ప్రదం. నాలుగు దశాబ్దాల తర్వాత భారత్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నాలుగు దశాబ్దాల్లో, భారత్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. నేటి భారత్ ఎన్నడూ లేని విశ్వాసంతో నిండి ఉంది. మేం అంతర్జాతీయ వైమానిక వ్యవస్థలో విస్తృతమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా.. విధానపరమైన నాయకత్వం, ఆవిష్కరణలు, సమ్రగాభివృద్ధికి చిహ్నంగా నిలిచాం. అంతర్జాతీయంగా అంతరిక్షం - వైమానిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. గడచిన దశాబ్దంలో భారత్ పౌర విమానయాన రంగంలో సాధించిన చారిత్రక పురోగతి గురించి మీ అందరికీ తెలిసిందే.

స్నేహితులారా,

ఈ సదస్సు, ఈ చర్చలు విమానయానం గురించి మాత్రమే కాదు - అంతర్జాతీయ సహకారం, వాతావరణ ఒప్పందాలు, నిష్పక్షపాతమైన వృద్ధికి సంబంధించిన మన ఉమ్మడి జాబితాను ముందుకు తీసుకెళ్లే మాధ్యమంగా పనిచేస్తుంది. ఈ సదస్సులో జరిగే చర్చలు ప్రపంచ విమానయాన రంగానికి సరికొత్త దిశను అందిస్తాయి. ఈ రంగంలో ఉన్న విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకొని సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని నేను విశ్వసిస్తున్నాను.

స్నేహితులారా,

ఇప్పుడు మనం వందల కిలోమీటర్ల దూరాలను, ఖండాతర ప్రయాణాలను కొన్ని గంటల్లోనే పూర్తి చేయగలుగుతున్నాం. కానీ, 21వ శతాబ్దపు ఆకాంక్షలు, అనంతమైన మన ఊహలు ఇంకా ఆగలేదు. ప్రస్తుతం ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధి మునుపెన్నడూ లేని వేగంతో పురోగమిస్తున్నాయి. మన ప్రయాణ వేగం పెరగడంతో సుదూర ప్రాంతాలు మనం గమ్యస్థానాలుగా మారుతున్నాయి. భూమి మీద ఉన్న నగరాలకు మాత్రమే మన ప్రయాణ ప్రణాళికలు పరిమితం కాని సమయంలో మనం ఉన్నాం. అంతరిక్ష విమానాలు, గ్రహాంతర ప్రయాణాలను వాణిజ్యీకరించాలని మానవాళి ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో దీన్ని పౌర విమానయానంతో అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవ రూపం దాల్చేందుకు సమయం పడుతుంది. భవిష్యత్తులో సాధించే గొప్ప మార్పులు, ఆవిష్కరణలకు కేంద్రంగా విమానయాన రంగం మారుతుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. భారత్‌కున్న మూడు బలాల ఆధారంగా నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. మొదటిది భారత్‌కు విస్తారమైన మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ వినియోగదారుల సమూహం మాత్రమే కాదు.. అది కాలానుగుణంగా మారుతున్న భారతీయ సమాజపు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. రెండోది, మా దగ్గర జనాభా, సాంకేతికత, ఆవిష్కరణల్లో కనబరుస్తున్న ప్రతిభ – మా యువత నవ యుగ ఆవిష్కర్తలు.. కృత్రిమ మేధ, రోబోటిక్స్, హరిత ఇంధనం తరహా రంగాల్లో పురోగతులను ముందుకు నడిపిస్తున్నారు. మూడోది, పరిశ్రమల కోసం స్వేచ్ఛాయుత, సహకారాత్మక విధాన వ్యవస్థను మేం కలిగి ఉన్నాం. ఈ మూడు సామర్థ్యాలను ఉపయోగించి భారత్ విమానయాన రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి మనందరం కలసి పనిచేయాలి.

 

స్నేహితులారా,

ఇటీవలి సంవత్సరాల్లో పౌర విమానయానంలో భారత్ అపూర్వమైన ప్రగతిని సాధించింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ ఎదిగింది. విజయవంతమైన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం భారత పౌరవిమానయాన చరిత్రలో సువర్ణ చరిత్రను లిఖించింది. ఈ పథకం ద్వారా 15 మిలియన్ల మందికి పైగా ప్రయాణికులు చౌక విమానయానాన్ని వినియోగించుకున్నారు. వారిలో చాలా మంది మొదటిసారిగా విమానంలో ప్రయాణించినవారు ఉన్నారు. మా ఎయిర్ లైన్స్ సంస్థలు రెండంకెల వృద్ధిని నిలకడగా సాధిస్తున్నాయి. భారతీయ, విదేశీ విమానయాన సంస్థలు నడుపుతున్న విమానాల ద్వారా ఏటా 240 మిలియన్ల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలో ఎన్నో దేశాల జనాభా మొత్తం కంటే ఎక్కువ. 2030 నాటికి 500 మిలియన్ల మంది ప్రయణికులను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, మన దేశంలో ఏటా 3.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా విమానాల ద్వారా జరుగుతోంది. ఈ దశాబ్దపు చివరి నాటికి ఇది 10 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా.

స్నేహితులారా,

ఇవి అంకెలు మాత్రమే కాదు - నవ భారత సామర్థ్యానికి ప్రతీకలు. ఈ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొనేలా భవిష్యత్ ప్రణాళికను రూపొందిచడంపై భారత్ పనిచేస్తోంది. కేంద్ర మంత్రి నాయుడు గారు పేర్కొన్నట్టుగా, 2014లో భారత్‌లో 74 విమానాశ్రయాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 162కు పెరిగింది. భారత విమానయాన సంస్థలు 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. భారతీయ విమానయాన రంగం అత్యున్నత స్థాయికి ఎదిగే ప్రయాణంలో టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్పు భౌగోళిక సరిహద్దులను అధిగమించడానికి మాత్రమే కాదు.. సుస్థిరత, పర్యావరణహితమైన రవాణా, సమాన అవకాశాల దిశగా ప్రపంచాన్ని నడిపిస్తుంది.

స్నేహితులారా,

ప్రస్తుతం మా విమానాశ్రయాల నిర్వహణ సామర్థ్యం ఏడాదికి 500 మిలియన్ల ప్రయాణికులకు చేరుకుంది. సాంకేతికత ద్వారా ప్రయాణ అనుభవాన్ని అందించడంలో నూతన ప్రమాణాలను నెలకొల్పిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. భద్రత, సామర్థ్యం, సుస్థిరత అంశాల్లోనూ మేం అదే స్థాయిలో దృ‌ష్టి సారించాం. పర్యావరణ హితమైన విమాన ఇంధనాలు, హరిత సాంకేతికతలపై పెట్టుబడులు, కర్బన ఉద్గారాలను తగ్గించడం, ప్రగతి, గ్రహాన్ని పరిరక్షణకు హామీ ఇచ్చే దిశగా మేం ప్రయాణిస్తున్నాం.

మిత్రులారా,

ఇక్కడికి వచ్చిన మా అంతర్జాతీయ అతిథులను ఒక విషయంలో నేను ప్రత్యేకంగా ప్రోత్సహించదలచుకొన్నాను... అది... వారు ‘డిజి యాత్ర యాప్’ గురించి తెలుసుకొవాలన్న విషయమే. ఈ డిజి యాత్ర విమానయానంలో చోటుచేసుకొన్న డిజిటల్ మాధ్యమ నవకల్పనకో ఉదాహరణ. ఇది ముఖాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగించే సాంకేతికతను ఉపయోగించుకొంటూ, విమానాశ్రయంలో ప్రవేశం మొదలు బోర్డింగ్ గేటు వరకు ఇబ్బందులు ఎంతమాత్రమూ ఎదురు కాని యాత్రా సంబంధిత సేవలను అందిస్తుంది. కాగితాలనుగానీ, ఐడీనిగానీ చూపనక్కర్లేదు. భారత్‌లోని ఈ తరహా నూతన ఆవిష్కరణలు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాకు మెరుగైన సేవలను అందించే ఒక అనుభవాన్ని సంపాదించుకొన్నాయి కాబట్టి ఇవి అనేక ఇతర దేశాల్లోనూ మేలు చేయగలవనే నేను అనుకుంటున్నాను. ఇది ఒక సురక్షిత, తెలివైన పరిష్కారాలతో కూడిన ఒక నమూనా, ఇది గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల)కు కూడా ప్రేరణాత్మకంగా మారగలుగుతుంది.

 

మిత్రులారా,

భారత్‌లో విమానయాన రంగం శరవేగంగా విస్తరిస్తూ ఉండటానికి గల ప్రధాన కారణాల్లో, అదే పనిగా సంస్కరణలు తీసుకువస్తూ ఉండాలన్న మా నిబద్ధత కూడా ఒక కారణం. తయారీలో ప్రపంచ కూడలి (గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్)గా భారత్‌ను రూపొందించడానికి మా వల్ల సాద్యం అయ్యే ప్రతి ఒక్క నిర్ణయాన్నీ మేం తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం బడ్జెటులో, మేం ‘మిషన్ మాన్యుఫాక్చరింగ్’ను ప్రకటించాం. ఈ ఏడాది మొదట్లో- నాయుడు గారు ప్రస్తావించినట్లుగా- మేం ‘ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇన్ ఏర్‌క్రాఫ్ట్‌స్ బిల్లు’కు భారత పార్లమెంటులో ఆమోదం తెలిపాం. ఇది ‘కేప్ టౌన్ కన్వెన్షన్‌’ మా దేశంలో చట్టపరమైన బలాన్ని అందించింది. దీని ఫలితంగా, ప్రపంచంలో విమానాలను అద్దెకిచ్చే కంపెనీలకు ఒక కొత్త అవకాశం లభించింది. మీలో చాలా మందికి ఇప్పటికే తెలుసు... జీఐఎఫ్‌టీ సిటీ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ)లో ప్రోత్సాహకాలు లభిస్తున్నాయన్న సంగతి. ఈ ప్రోత్సాహకాలు విమానాలను అద్దెకివ్వడానికి భారతదేశాన్ని ఒక ఆకర్షణీయ దేశంగా చేశాయి.

మిత్రులారా,

కొత్త భారతీయ విమాన చట్టం మా విమానయాన చట్టాలను ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా మలుస్తోంది. అంటే, భారత్‌లో విమానయాన రంగ చట్టాలు ఇప్పుడు సులభం అయ్యాయని, నియమాలు ఇదివరకటి కన్నా వ్యాపారానుకూలంగా రూపొందాయని, పన్ను స్వరూపం సరళమైందనీ అర్థం. ఈ కారణంగా, భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచంలో పెద్ద విమానయాన వాణిజ్య సంస్థలకు ఇది ఎంతో చక్కని అవకాశం.

మిత్రులారా,

విమానయాన రంగంలో వృద్ధికి అర్థం కొత్త ఫ్లయిట్లు, కొత్త ఉద్యోగాలతో పాటు కొత్త కొత్త అవకాశాలు అందిరావడం అనే. విమానయాన రంగం పైలట్లకు, సిబ్బందికీ, ఇంజినీర్లతో పాటుగా గ్రౌండ్ స్టాఫ్‌కు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. మరో ఆశాజనక రంగంగా ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) నిలుస్తోంది. మా నూతన ఎంఆర్ఓ విధానాలు విమానాల నిర్వహణకు భారత్‌ను ఒక గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ప్రయత్నాలను వేగవంతం చేశాయి. 2014లో, భారత్‌లో 96 ఎంఆర్ఓ సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం, ఈ సంఖ్య 154కు వృద్ధి చెందింది. ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం ఎఫ్‌డీఐ, జీఎస్‌టీ తగ్గింపు, పన్ను క్రమబద్ధీకరణ వంటి సంస్కరణలు ఎంఆర్ఓ రంగానికి కొత్త జోరును అందించాయి. ఇక 2030 నాటికి, 400 కోట్ల డాలర్ల విలువ కలిగిన ఎంఆర్ఓ కూడలిగా భారత్‌ను అభివృద్ధి చేయడం మా లక్ష్యం.

మిత్రులారా,

భారత్‌ను ప్రపంచం ఒక్క విమానయాన మార్కెటుగానే కాకుండా, వేల్యూ-చైన్ లీడర్‌గా కూడా చూడాలని మేం కోరుకొంటున్నాం. డిజైన్ మొదలు డెలివరీ వరకు, భారత్ ప్రపంచ విమానయాన సరఫరా వ్యవస్థలో ఓ అంతర్భాగంగా ఎదుగుతోంది. మా దిశ, మా వేగం సరి అయినవిగా ఉన్నాయి.. మరి ఇదే కారణం మేం శరవేగంగా ముందుకు పోతూనే ఉంటామన్న నమ్మకాన్ని మాలో కలిగిస్తోంది. విమానయాన కంపెనీలన్నింటికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే - అది...‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ)తో పాటుగా ‘డిజైన్ ఇన్ ఇండియా’ (భారత్‌లో రూపురేఖలు తీర్చిదిద్దండి) అనేదే.

 

మిత్రులారా,

భారత్ విమానయాన రంగంలో మరో దృఢమైన స్తంభం ఏదంటే అది అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగిపోతున్న నమూనాయే. ప్రస్తుతం, మా దేశంలో 15 శాతానికి పైగా పైలట్లు మహిళలే...ఇది ప్రపంచ సగటుకు మూడు రెట్లు. ప్రపంచ వ్యాప్తంగా, క్యాబిన్ సిబ్బంది విధులను నిర్వహిస్తున్న వారిలో మహిళల సగటు ప్రాతినిధ్యం దాదాపు 70 శాతంగా ఉంటే, ఇండియాలో ఇది 86 శాతంగా ఉంది. భారత్ ఎంఆర్ఓ రంగంలో మహిళా ఇంజినీర్ల సంఖ్య కూడా ప్రపంచ సగటును మించుతోంది.

మిత్రులారా,

ప్రస్తుతం విమానయాన రంగంలో మరో కీలక భాగం డ్రోన్ సాంకేతికత. భారత్ దీనిని ఓ ఆధునిక సాంకేతికతగా మాత్రమే ఉపయోగించుకోవడం లేదు, దీనిని ఆర్థిక సేవలను అందరికీ అందజేయడానికి, సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోవడానికి ఒక సాధనంగా కూడా ఉపయోగించుకొంటోంది. డ్రోన్ల ద్వారా, మేం మహిళా స్వయంసహాక బృందాలకు సాధికారతను సమకూరుస్తున్నాం. దీంతో వ్యవసాయం, డెలివరీ సర్వీసులతో పాటు ఇతర చాలా ముఖ్య రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఇదివరకటి కన్నా అధికం అయింది.

 

మిత్రులారా,


 

విమానయానంలో సురక్షకు మేం సదా పెద్ద పీట వేస్తూవస్తున్నాం. భారత్ తన నియమావళిని ఐసీఏఓ నిర్దేశించిన ప్రపంచ ప్రమాణాలతో తులతూగేవిగా చూసుకొంది. ఇటీవలే, మా ప్రయత్నాలను ఐసీఏఓ సురక్ష ఆడిట్ విభాగం మెచ్చుకొంది. ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సమావేశంలో ఢిల్లీ డిక్లరేషనును ఆమోదించారంటేనే అది భారత్ బలమైన నిబద్ధతకు ఒక నిదర్శనంగా ఉంది. భారత్ ఓపెన్ స్కైస్ తో పాటు గ్లోబల్ కనెక్టివిటీ విధానాలకు మద్దతు పలుకుతూ వచ్చింది. షికాగో సమ్మేళనం సూత్రాలను మేం పరిరక్షిస్తున్నాం. రాబోయే కాలంలో అందరికి సులభంగా అందుబాటులో ఉండే, అందరూ భరించగలిగే ఖర్చుతో కూడిన, సురక్షితమైన వైమానిక ప్రయాణాన్ని సమకూర్చడానికి మనమంతా కలిసి పనిచేద్దాం. విమానయాన రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మీరంతా కొత్త కొత్త పద్ధతులను ఆవిష్కరిస్తారని నేను నమ్ముతున్నాను. మీకందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions