* బీహార్ అభివృద్ధి చెందుతుంది.. దేశాభ్యుదయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది: పీఎం
* గత దశాబ్దంలో 25 కోట్ల మంది భారతీయలు పేదరికాన్ని ఓడించారు: ప్రధాని
* మేడిన్ ఇండియాకు ప్రధాన కేంద్రంగా మారబోతున్న బీహార్లోని మర్హౌరా లోకోమోటివ్ కర్మాగారం నుంచి తయారైన మొదటి ఇంజిన్ ఆఫ్రికాకు ఎగుమతి అవుతోంది: పీఎం

భారత్ మాతాకీ జై! 

భారత్ మాతాకీ జై! 

భారత్ మాతాకీ జై!

అందరికీ నమస్కారం. బాబా మహేంద్రనాథ్, బాబా హంసనాథ్, సోహగరా ధామ్, తావే భవానీమాత, అంబికా భవానీ మాత, భారత మొదటి రాష్ట్రపతి దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ల పవిత్ర భూమిపై మీ అందరికి హార్దిక స్వాగతం! 

బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్,  ఇక్కడి ప్రజల సేవకు అంకితమైన ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జితన్ రామ్ మాంఝీ, గిరిరాజ్ సింగ్, లలన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, రామ్ నాథ్ ఠాకూర్ , నిత్యానంద్ రాయ్, సతీష్ చంద్ర దూబే, రాజ్ భూషణ్ చౌదరి, బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, పార్లమెంటులో నా సహచరుడు ఉపేంద్ర కుష్వాహా, బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, ఇతర మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఇంకా బీహార్ లోని నా ప్రియమైన సోదర సోదరీమణులారా!

 

ఈ శివాన్ భూమి మన స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిదాయక ప్రదేశం. ఇది మన ప్రజాస్వామ్యానికీ, దేశానికీ, రాజ్యాంగానికీ దన్నుగా ఉన్న భూమి. దేశానికి రాజేంద్రబాబు లాంటి గొప్ప కొడుకును శివాన్  అందించింది. రాజ్యాంగ రూపకల్పనలో, దేశానికి దిశానిర్దేశం చేయడంలో రాజేంద్రబాబు కీలక పాత్ర పోషించారు. బ్రజ్ కిశోర్ ప్రసాద్ వంటి గొప్ప సంఘ సంస్కర్తను కూడా శివాన్ దేశానికి అందించింది. బ్రజ్ బాబు మహిళా సాధికారతే తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారు.  

మిత్రులారా, 

ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అలాంటి మహానుభావుల జీవిత లక్ష్యాన్ని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకువెళ్లడం సంతోషంగా ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగమే నేటి కార్యక్రమం. నేడు ఈ వేదిక నుంచి వేల కోట్ల రూపాయల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్ ను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తాయి. బీహార్ ను సుసంపన్నం చేస్తాయి. బీహార్ లోని శివాన్, ససారం, బక్సర్, మోతీహరి, బేతియా, ఆరా వంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో ఈ ప్రాజెక్టులు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇవి సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన పేదలు, బడుగు, బలహీనులు, దళితులు, మహాదళితులు, అత్యంత వెనుకబడిన ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా బీహార్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేను మీ  మధ్యకు వస్తుండగా, నిన్న వర్షం కురిసింది. పొద్దున కూడా వర్షం వచ్చింది. అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు. నేను హృదయపూర్వకంగా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అవుతుంది.

సోదర సోదరీమణులారా,

నేను నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో నేను ప్రపంచంలోని ప్రధాన సంపన్న దేశాల నేతలతో మాట్లాడాను. భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన పురోగతికి నాయకులందరూ చాలా ముగ్ధులయ్యారు. భారత్‌  ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారడాన్ని వారు చూస్తారు. ఈ మార్గంలో బీహార్ పాత్ర కీలకమనేది నిశ్చితం. బీహార్ అభివృద్ధి చెందడంతో పాటు దేశాభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

 

మిత్రులారా, 

నా ఈ నమ్మకానికి కారణం మీ బీహార్ ప్రజల శక్తి. మీరు అందరూ కలిసికట్టుగా బీహార్‌లో ఆటవిక పాలనకు ముగింపు పలికారు. ఇక్కడి యువత 20 ఏళ్ల కిందట బీహార్ ఎదుర్కొన్న పరిస్థితులను కేవలం కథల్లో, కథనాల్లోనే విన్నారు. ఆటవిక పాలన సాగించినవారు బీహార్‌ను ఏ స్థితికి తీసుకెళ్లారో వారికి తెలియదు. భారతదేశ అభివృద్ధికి శతాబ్దాలుగా నాయకత్వం వహించిన బీహార్‌ను, పంజా (హస్తం), లాంతర్  గుర్తులు కలిగిన పార్టీల కబంధ హస్తాల ద్వారా వలసలకు చిహ్నంగా మార్చేశారు.

మిత్రులారా, 

బీహార్‌లో జీవించే ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైనది ఆత్మగౌరవం. నా బీహారీ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా పనిచేస్తారు. కానీ ఆత్మగౌరవంతో మాత్రం వారెప్పుడూ రాజీ పడరు. కానీ పంజా (హస్తం), లాంతర్  గుర్తులు కలిగిన పార్టీల వ్యక్తులు కలిసి బీహార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.

పేదరికం బీహార్ దౌర్భాగ్యంగా మారేంత దోపిడీకి వీరు కారణమయ్యారు. అనేక సవాళ్లను అధిగమించి, నితీష్ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బీహార్ ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చింది. నేను బీహార్ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మేము చాలా చేసి ఉండవచ్చు... చేస్తున్నాం. ఇంకా దానిని కొనసాగిస్తాం. కానీ మోదీ ఇంతటితో ప్రశాంతంగా, మౌనంగా ఉండేది లేదు. నేను బీహార్ కోసం ఇంకా చాలా చేయాలి. నేను ఇక్కడ ప్రతి గ్రామానికి చేయాలి.  నేను ఇక్కడ ప్రతి ఇంటికీ చేయాలి. నేను ఇక్కడ ప్రతి యువకుడి కోసం చేయాలి. నేను గత 10-11 సంవత్సరాల గురించి మాత్రమే మాట్లాడితే, ఈ 10 సంవత్సరాలలో, బీహార్ లో సుమారు 55 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం జరిగింది. 1.5 కోట్లకు పైగా గృహాలకు విద్యుత్ కనెక్షన్లు, 1.5 కోట్లకు పైగా ప్రజలకు నీటి కనెక్షన్లు లభించాయి. 45 వేలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ రోజు బీహార్ లోని చిన్న నగరాల్లో కూడా కొత్త స్టార్టప్ లు ప్రారంభమవుతున్నాయి.

 

మిత్రులారా,

బీహార్‌లో పురోగతి వేగం నిరంతరం పెరుగుతోంది. ఈ పెరుగుదలను కొనసాగించవలసిందే...  అయితే, ఇక్కడ గతంలో  ఆటవిక రాజ్యాన్ని తెచ్చినవారు మళ్ళీ ఏదో ఒక విధంగా ఆ పాత పనులను చేసే అవకాశం కోసం, ఆరాచకాన్ని తిరిగి తెచ్చేందుకు  పొంచి ఉన్నారు. వారు బీహార్ ఆర్థిక వనరులను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. నా ప్రియమైన బీహార్ సోదర సోదరీమణులారా, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. సుసంపన్న బీహార్ కి అడ్డుకట్టలు వేద్దామనుకుంటున్న వారిని కచ్చితంగా వెయ్యి ఆమడల దూరంలో ఉంచవలసిందే!

మిత్రులారా,

మన దేశం దశాబ్దాల పాటు గరీబీ హఠావో నినాదాన్ని విన్నది. మీ రెండు, మూడు తరాల్లో కూడా ప్రతి ఎన్నికల్లోనూ గరీబీ హఠావో గరీబీ హఠావో అని నినాదాలు చేశాయి. కానీ మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు, ఎన్డీయేకి అవకాశం ఇచ్చినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం పేదరికాన్ని నిజంగా ఎలా తగ్గించవచ్చో చేసి చూపింది. గత దశాబ్దంలో, రికార్డు స్థాయిలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని జయించారు. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు భారతదేశం సాధించిన ఈ గొప్ప విజయాన్ని ప్రశంసిస్తున్నాయి. భారతదేశం సాధించిన ఈ అద్భుతమైన విజయంలో బీహార్ పాత్ర, మన నితీష్ జీ ప్రభుత్వ పాత్ర ఎంతైనా ఉంది. గతంలో, బీహార్ జనాభాలో సగానికి పైగా అత్యంత నిరుపేదల వర్గానికి చెందినవారే!  గత దశాబ్దంలో బీహార్‌లోని దాదాపు 3.75 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి పొందారు.

మిత్రులారా,

స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో దశాబ్దాల తర్వాత కూడా, చాలా మంది నిరుపేదలగానే బతుకీడ్చవలసిన దుర్భర పరిస్థితి ఉండేది.. ఒక పక్క నినాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉండేవి. మరోపక్క  పేదరికం పెరుగుతూనే పోయేది..  బీహార్ ప్రజల కృషిలో, దేశప్రజల కృషిలో లోపం వల్ల ఇది జరగలేదు. కేవలం ముందుకు సాగే మార్గం కనపడకపోవడం వల్లనే ఆ పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పార్టీ  లైసెన్స్ రాజ్ విధానం దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పేదరికంలో మగ్గేలా చేసింది. పేదలు మరింత తీవ్రమైన పేదరికంలోకి వెళ్లిపోయారు. ప్రతి చిన్న పనికీ పెద్ద పనికీ కోటా-పర్మిట్ ఉండవలసిందే! చిన్న చిన్న పనులకి కూడా అనుమతులు అనివార్యంగా ఉండేవి! కాంగ్రెస్-ఆర్జేడీ పాలనలో పేదలకు ఇళ్ళు లభించలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందే రేషన్ ను మధ్యవర్తులు స్వాహా చేసేవారు. వైద్య ఖర్చులు పేదలకు అందుబాటులో ఉండేవి కావు.. చదువు, ఉద్యోగాల కోసం అష్టకష్టాలు పడవలసి వచ్చేది.. ఇక విద్యుత్తు, నీటి కనెక్షన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి వచ్చేది. గ్యాస్ కనెక్షన్ కోసం ఎంపీల సిఫార్సు అవసరమయ్యే దారుణమైన పరిస్థితులు ఉండేవి! లంచాలో సిఫార్సులో లేనిది ఉద్యోగం లభించే ప్రసక్తే లేదు.. ఇటువంటి పరిస్థితుల్లో అతిపెద్ద బాధితులు ఎవరు? బాధితుల్లో అత్యధికులు నా దళిత సమాజం, మహాదళిత సమాజం, వెనుకబడిన సమాజం, అత్యంత వెనుకబడిన సమాజాలకి చెందినవారే.. నా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములే అప్పటి పరిస్థితుల వల్ల నష్టపోయారు. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ వారికి అందమైన కలలను చూపి మోసం చేసిన కొన్ని కుటుంబాల వారు  స్వయంగా లక్షాధికారులు, బిలియనీర్లుగా మారారు.

 

మిత్రులారా,

గత 11 సంవత్సరాలుగా మా ప్రభుత్వం పేదల మార్గంలోని ప్రతి కష్టాన్ని తొలగించడానికి కృషి చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తాం. ఇన్నేళ్ళుగా పడిన కష్టం, చేసిన కృషి ఈరోజున గొప్ప ఫలితాలను చూపిస్తోంది. ఇప్పుడు పేదలకు ఇళ్ళు ఉన్నాయి. ఈరోజు కొంతమందికి  కొత్తగా నిర్మించిన ఇంటి తాళం చెవులను అప్పగించే అవకాశం నాకు దక్కింది. అవి పొందిన కుటుంబాలు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాయో! ఆ కుటుంబ వ్యక్తుల ముఖాల్లో ఎంతో సంతృప్తిని చూశాను. వారు తీవ్రమైన భావోద్వేగానికి లోను కావడం గమనించాను.

మిత్రులారా,

గత దశాబ్దంలో, దేశంలోని నాలుగు కోట్లకు పైగా పేదలకు పక్కా ఇళ్ళు అందాయి. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, సమాధానం చెబుతారా? అడుగుతున్నాను, చెప్పండి మరి.. నేను ఇప్పుడే చెప్పాను, నాలుగు కోట్ల మందికి, అంటే, నాలుగు కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్ళు లభిస్తాయి అని..  ఎంత మందికి? బిగ్గరగా చెప్పండి!! ఎంత మందికి? నాలుగు కోట్ల మందికి! ఒక్కసారి ఊహించుకోండి. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్ళు లభిస్తున్నాయి. ఇల్లంటే కేవలం నాలుగు గోడలు కాదు. ఆ ఇళ్ళలో నివసించేవారు తమ భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటారు.. తీర్మానాలు చేసుకుంటారు!  రాబోయే రోజుల్లో మరో మూడు కోట్ల కాంక్రీట్ ఇళ్ళు సిద్ధమవుతాయి. నేను ఇంతకు ముందు మీతో చెప్పినట్టు, నా ఈ సేవ ఆగదు, నిరంతరం నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నా పనిని కొనసాగిస్తాను. వెరసి, ఏం జరిగినా, అది మునుపటి కంటే ఎంతో బాగుంది కదూ.. అయినా మీ  మోదీ ప్రశాంతంగా నిద్రపోడు. పగలూ రాత్రి పని చేస్తూనే ఉంటాడు…  మీ కోసం పనిచేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మీరు నా కుటుంబ సభ్యులు. నా కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడూ వెనుకబడి ఉండకూడదని, బాధలు పడకూడదని నేను తీర్మానించుకున్నాను. బీహార్‌లోని నా పేద సోదర సోదరీమణులు, దళిత సోదరసోదరీమణులు, మహాదళిత సోదరసోదరీమణులు, వెనుకబడిన సోదరసోదరీమణులు, అత్యంత వెనుకబడిన సోదరసోదరీమణులు, నేను అమలు చేస్తున్న అన్ని పథకాలు మొదట మీ అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద బీహార్‌లో 57 లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం జరిగింది.

 

ఇక్కడ సివాన్ జిల్లాలో కూడా పేదల కోసం లక్షా పది వేలకు పైగా ఇళ్ళు తయారయ్యాయి. ఈ అంకెలు కేవలం ఒక జిల్లాకి చెందినవి. నేను ఒక జిల్లా గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఈ పని మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదాహరణకు ఈరోజు బీహార్‌లోని 50 వేలకు పైగా కుటుంబాలకు పక్కా ఇళ్ళకు సంబంధించి వాయిదా సొమ్ము అందజేశాం. నాకు ఆనందాన్ని రెట్టింపు చేసేది ఏమిటో మీకు తెలుసా? ఈ ఇళ్ళలో ఎక్కువ భాగం తల్లులు, సోదరీమణుల పేరిట ఉన్నాయి. తమ పేరు మీద ఎటువంటి ఆస్తి లేని నా సోదరీమణులు, కుమార్తెలు ఇప్పుడు సొంత ఇంటి యజమానులుగా మారుతున్నారు.

మిత్రులారా,

మా ప్రభుత్వం ఇళ్లతో పాటు ఉచిత రేషన్, విద్యుత్, తాగునీటి సౌకర్యాలనూ అందిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో, దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా కొత్త కుటుంబాలకు కుళాయి నీరు అందింది. ఇందులో భాగంగా, సివాన్‌లోని నాలుగున్నర లక్షలకు పైగా కుటుంబాలకు మొదటిసారిగా కుళాయి నీరు లభించింది. గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి, ప్రతి నగరంలో సరిపడా తాగునీరు అందించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. గడిచిన కొన్నేళ్లలో, బీహార్‌లోని అనేక నగరాల్లో నీటి పైపులైన్లు, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు మరిన్ని నగరాల్లో పైప్‌లైన్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం కోసం ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులన్నీ పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాలను మెరుగుపరుస్తాయి.

 

సోదరసోదరీమణులారా,

ఆర్జేడీ, కాంగ్రెస్ చర్యలు ఎప్పుడూ బీహార్ అభివృద్ధికి, పెట్టుబడులకు వ్యతిరేకమే. వారు అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడల్లా.. వారి పాలనలో మూతపడిన దుకాణాలు, వ్యాపారాలు, పరిశ్రమలే ప్రజలకు గుర్తుకు వస్తాయి. అందువల్ల వారు బీహార్ యువత హృదయాల్లో ఎప్పుడూ స్థానం సంపాదించలేకపోయారు. వారి పాలనలో ప్రజలు పేలవమైన మౌలిక సదుపాయాలు, మాఫియా పాలన, గూండాగిరీ, అవినీతితో అనేక కష్టాలు అనుభవించారు.

మిత్రులారా,

బీహార్‌లోని ప్రతిభావంతులైన యువత నేడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనిని గమనిస్తున్నారు. దానిని అంచనా వేస్తున్నారు. ఎన్‌డీయే ప్రభుత్వం నిర్మిస్తున్న సరికొత్త బీహార్‌కు మధుర రైలింజను కర్మాగారం ఒక చక్కని ఉదాహరణ. నేడు మధుర రైలింజను తయారీ ఫ్యాక్టరీ నుంచి మొదటి ఇంజను ఆఫ్రికాకు ఎగుమతి అవుతోంది. ఇది మీరు తయారు చేసిందే.. ఇప్పుడు ఇదే ఇంజను అక్కడ రైలును లాగుతుంది. చూడండి, బీహార్‌ను ఆఫ్రికాలో కూడా ప్రశంసించబోతున్నారు. గతంలోని లాంతరు-పంజా ప్రభుత్వాలు వెనకబడిన ప్రాంతంగా నిర్లక్ష్యం చేసిన అదే సరన్ జిల్లాలో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని నిర్మించాం. నేడు ఈ జిల్లా ప్రపంచ తయారీ, ఎగుమతి రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. జంగిల్ రాజ్ వ్యక్తులు బీహార్ అభివృద్ధి ఇంజనును నిలిపేశారు. ఇప్పుడు అదే బీహార్‌లో తయారైన ఇంజను ఆఫ్రికాలో రైళ్లను నడుపుతోంది. ఇది చాలా గర్వకారణం. బీహార్ కచ్చితంగా మేడ్ ఇన్ ఇండియాకు ప్రధాన కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడి నుంచే మఖానా, పండ్లు, కూరగాయలు విదేశాలకు వెళ్తాయి. బీహార్ ఫ్యాక్టరీల్లో తయారైన వస్తువులు ప్రపంచ మార్కెట్లకు కూడా చేరుతాయి. బీహార్ యువత తయారు చేసిన వస్తువులు స్వయం-సమృద్ధ భారత్‌కు బలాన్నిస్తాయి.

మిత్రులారా,

బీహార్‌లో నిర్మిస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాలు ఈ విషయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నేడు బీహార్‌లో రోడ్డు, రైలు, విమాన, జలమార్గాల వంటి ప్రతీ మౌలిక సదుపాయాల అబివృద్ధి కోసం అపారమైన పెట్టుబడులు వస్తున్నాయి. బీహార్‌కు నిరంతరం కొత్త రైళ్లు వస్తూనే ఉన్నాయి. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లూ ఇక్కడ నడుస్తున్నాయి. ఈ రోజు మనం మరో పెద్ద ప్రారంభం చేయబోతున్నాం. సావన్ ప్రారంభానికి ముందు, నేడు బాబా హరిహరనాథ్ భూమి నుంచి బాబా గోరఖ్‌నాథ్ భూమిని అనుసంధానిస్తూ వందే భారత్ రైలు నడుస్తోంది. పాట్నా నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్లే కొత్త వందే భారత్ రైలు పూర్వాంచల్ శివ భక్తుల కోసం సరికొత్త ప్రయాణ అనుభూతినిస్తుంది. ఈ రైలు బుద్ధుని తపోభూమిని ఆయన మహాపరినిర్వాణ భూమి అయిన కుషీనగర్‌తో అనుసంధానిస్తోంది.

మిత్రులారా,

ఇటువంటి ప్రయత్నాలు బీహార్‌లో పరిశ్రమలకు ఊతం ఇవ్వడమే కాకుండా పర్యాటక రంగానికి కూడా ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. దీంతో ప్రపంచ పర్యాటక రంగంలో బీహార్ పేరు మరింత ప్రముఖంగా వినిపిస్తుంది. దీని అర్థం బీహార్ యువతకు అనేక ఉపాధి అవకాశాలూ లభిస్తాయి.

మిత్రులారా,

దేశంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే అవకాశం పొందాలి. ఎవరిపైనా వివక్ష చూపకూడదు. ఇదే మన రాజ్యాంగ స్ఫూర్తి. మేం కూడా అదే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. కానీ లాంతరు-పంజాతో వచ్చే కొందరు వ్యక్తులు - పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ అంటున్నారు. ఇదే వారి రాజకీయాల లక్ష్యం. వారి సొంత కుటుంబాల ప్రయోజనం కోసం వారు దేశంలోని, బీహార్‌లోని కోట్లాది కుటుంబాలకు హాని కలిగించడానికి కూడా వెనుకాడరు. బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఈ రకమైన రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించేవారు. అందుకే ఈ వ్యక్తులు అడుగడుగునా బాబా సాహెబ్‌ను అవమానించారు. బాబా సాహెబ్ విషయంలో ఆర్‌జేడీ వ్యవహరించిన తీరును ఇప్పుడు దేశం మొత్తం చూసింది. బాబా సాహెబ్‌ను అవమానించినందుకు క్షమాపణ చెప్పమని కోరుతూ బీహార్‌లో పోస్టర్లు చూస్తున్నా. కానీ వారు ఎప్పటికీ క్షమాపణ చెప్పరని నాకు తెలుసు. ఎందుకంటే వారికి దళితులు, మహాదళితులు, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తమ పాదాల వద్ద ఉంచుకుంటుంటే, మోదీ మాత్రం బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని తన హృదయంలో ఉంచుకుంటున్నారు. బాబా సాహెబ్‌ను అవమానించడం ద్వారా ఈ వ్యక్తులు తమను తాము బాబా సాహెబ్ కంటే గొప్ప వారిగా చూపించుకోవాలనుకుంటున్నారు. బాబా సాహెబ్‌కు జరిగిన ఈ అవమానాన్ని బీహార్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.

 

మిత్రులారా,

బీహార్ వేగవంతమైన పురోగతికి అవసరమైన లాంచింగ్ ప్యాడ్ నితీష్ జీ కృషితో సిద్ధం అయింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం బీహార్‌ను పురోగతిలో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. నాకు బీహార్ యువతపై నమ్మకం ఉంది. మనమంతా కలిసికట్టుగా బీహార్ ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరిస్తాం. బీహార్‌ను అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు శక్తిమంతమైన ఇంజన్‌గా మారుస్తాం. ఈ నమ్మకంతోనే, అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. నాతో పాటు అందరూ పిడికిలెత్తి చెప్పండి.. భారత్ మాతా కీ జై! త్రివర్ణ పతాకం ఉన్న వారు త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ చెప్పండి.

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

అందరికీ ధన్యవదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Urban India's consumer confidence rebounds in July, retains top global spot: Report

Media Coverage

Urban India's consumer confidence rebounds in July, retains top global spot: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Global Tiger Day, reaffirms commitment to tiger conservation
July 29, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended greetings to all wildlife enthusiasts on Global Tiger Day.

The Prime Minister said that the people of India are proud that the country is home to almost 70 per cent of the global tiger population.

He noted that India’s tiger conservation efforts are inspired by the country’s centuries-old culture of living in harmony with nature and powered by the collective will of its people.

Shri Modi reaffirmed the commitment to science-based conservation, community participation and sustainable development that strengthens tiger conservation.

Shri Modi also lauded the efforts and dedication of forest personnel, scientists and conservationists for their key role in tiger protection. The Prime Minister added that India remains committed to empowering local communities and reducing human-wildlife conflict.

In a thread posts on X, Shri Modi said;

“Greetings to all wildlife enthusiasts on Global Tiger Day. The people of India are proud of the fact that we are home to almost 70% of the global tiger population. India’s tiger conservation efforts are inspired by our centuries-old culture of living in harmony with nature and powered by the collective will of our people. We also reaffirm our commitment to science-based conservation, community participation and sustainable development that strengthens tiger conservation.”

“The efforts and dedication of our forest personnel, scientists and conservationists have also played a key role in tiger protection. In that spirit, India remains committed to empowering local communities and reducing human-wildlife conflict.”