Today, Jind and Haryana have permanently etched their names in the pages of history. From here today, the nation has been gifted its first Hydrogen Train: PM
Besides being completely emission-free, India's Hydrogen Train, stands as a remarkably successful testament to MAKE IN INDIA: PM
Whether it is railways or roadways, such strides in connectivity provides convenience and accelerates the pace of development manifold: PM
Our government has formulated a new National Sports Policy, the Khelo Bharat policy as well; Ranging from the Khelo India campaign to the TOPS Scheme, athletes today are being provided with unprecedented facilities: PM

భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.

హర్యానా గవర్నర్ శ్రీ అసిమ్ ఘోష్ గారు... అత్యంత ప్రజాదరణ కలిగిన, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ గారు... కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు... హాజరైన ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలకు, సాంకేతిక మాధ్యామాల ద్వారా అనేక ప్రదేశాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన హర్యానాలోని నా ప్రియమైన సోదరీ సోదరులందరికీ నమస్కారం!

ఇవి ఇక్కడికి నా కోసం తెచ్చిన కొన్ని ఫోటోలు... దయచేసి వీటిని తీసుకోండి. లేకపోతే వెనుక కూర్చున్నవారికి సరిగ్గా కనిపించదు. ఎస్పీజీ సిబ్బంది దయచేసి వీటిని తీసుకోండి. ఇంత అందమైన చిత్రాలను తెచ్చినందుకు ధన్యవాదాలు సోదరా. అటువైపు... ఒక చిన్న అమ్మాయి కూడా ఏదో తెచ్చింది. దయచేసి దాన్నీ తీసుకోండి. ఇక్కడా ఇద్దరు పెద్ద మనుషులు ఏవో తీసుకువచ్చినట్లున్నారు. అవీ తీసుకోండి. ఇక ఇప్పుడు, అందరూ దయచేసి సౌకర్యంగా కూర్చోండి. మీ ప్రేమకు, మీ కళాత్మక ఆరాధనకు మీ అందరికీ నా ధన్యవాదాలు.

మిత్రులారా,

ఈ వైభవోపేతమైన జింద్ గడ్డ నుంచి, మీ అందరికీ నా రామ్-రామ్ చెబుతూ నమస్కరిస్తున్నాను! ఈ పవిత్ర నేలకు రావడం నా హృదయాన్ని ఆనందంతో నింపుతోంది. ఇది ఒక సాధారణ ప్రదేశం కాదు - ఇది చరిత్ర, శౌర్యం, విశ్వాసం, గర్వానికి నెలవు. శక్తి పీఠ మాతా జయంతి ఆశీస్సులు ఈ నగరంపై ఎల్లప్పుడూ ఉంటాయి. జింద్‌కు రావడమంటే నాకు నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం లాంటిది. ఈ రోజు ఇక్కడ నాకు తెలిసినవారు ఎందరో కనిపిస్తున్నారు. నేను వారి స్కూటర్లపై ఇక్కడికి వచ్చేవాడినని చాలా మంది చెబుతుంటారు. దశాబ్దాల కిందట, నేను మొదటిసారిగా సంస్థాగత పని నిమిత్తం జింద్‌కు వచ్చాను. అప్పుడు మీరు నాపై చూపిన ఆప్యాయతను, ప్రేమను నేను ఎన్నటికీ మరచిపోలేను. ముర్రా గేదెల పాలు, పెరుగు, నెయ్యి, జింద్ దేశీ బురా, ఇక్కడి ఘేవార్ - ఇవన్నీ జింద్‌తో శాశ్వతంగా ముడిపడి ఉన్న జ్ఞాపకాలు.

 

మిత్రులారా,

సంవత్సరాలు గడిచినా... జింద్ నెయ్యి, ఘేవార్ ఏమాత్రం మారలేదు. జింద్ స్ఫూర్తి మాత్రం రూపాంతరం చెందింది. ఈ రోజు జింద్ బీజేపీ-ఎన్‌డీఏ సుపరిపాలన నమూనాకు ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో, హర్యానా మొత్తం ఒక కొత్త అభివృద్ధి పథంలోకి ప్రవేశించింది. డబుల్-ఇంజిన్ బీజేపీ ప్రభుత్వ లక్ష్యానికి నేటి కార్యక్రమం కొత్త శక్తినిస్తోంది.

మిత్రులారా,

జింద్, హర్యానాల పేర్లు ఈ రోజు చరిత్ర పుటల్లో చోటు సంపాదించాయి. ఇక్కడి నుంచే దేశం తన తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తోంది.

మీకు గుర్తుండిపోతుంది... మిత్రులారా,

దేశంలో మొదటి రైలు బొంబాయి (ప్రస్తుత ముంబై)- థానే మధ్య నడిచిందని మనం ఇప్పటికీ చదువుతూ, వింటూ ఉంటాం. అదే విధంగా, భవిష్యత్తులో హైడ్రోజన్ రైలు ప్రస్తావన వచ్చినప్పుడల్లా... జింద్, సోనిపత్, హర్యానా పేర్లూ తప్పకుండా గుర్తుకు వస్తాయి. భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఈ గొప్ప ముందడుగు కోసం మీ అందరికీ, యావత్ దేశానికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు హర్యానాకు రూ. 14,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు లభించాయి. వీటిలో అనేక రైల్వే, హైవే ప్రాజెక్టులు, మన వారసత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు, హర్యానా సేవకు అంకితమైన రెండు కొత్త వైద్య కళాశాలలూ ఉన్నాయి. భివానీలో పండిట్ నేకీ రామ్ శర్మ వైద్య కళాశాల, నార్నౌల్‌లో మహర్షి చ్యవాన్ వైద్య కళాశాల, రావు తులారామ్ ఆసుపత్రి వీటిలో ఉన్నాయి. ఇవి హర్యానా ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తాయి. ఇక్కడి యువత వైద్యులుగా, ఇతర వైద్య నిపుణులుగా మారడానికి ఇవి కొత్త మార్గాలను తెరుస్తాయి. ఈ ప్రాజెక్టులన్నింటి కోసం, హర్యానాలోని నా సోదరీ సోదరులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు నేను జింద్, హర్యానా ప్రజలను మరో కారణం కోసమూ అభినందించాలి. మీరు 'స్వచ్ఛతా సే స్వాగత్' కార్యక్రమాన్ని చాలా ప్రాధాన్యమైనదిగా తీసుకున్న తీరు... నేను రాకముందే ఇక్కడి ప్రజలు కొత్త ఉత్సాహంతో పరిశుభ్రతా ఉద్యమంలో పాల్గొన్న విధానం హృదయానికి హత్తుకునేలా ఉంది. గత వారం రోజులుగా మీ పరిశుభ్రతా ఉద్యమం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించడం నేను చూశాను. కొంతమంది సోషల్ మీడియాలో... "మోదీ జీ, దయచేసి మా జింద్ శుభ్రంగా ఉండేందుకు మీరు పదే పదే రండి" అని పోస్టులు పెడుతున్నారు. ఈ భావనను వ్యక్తం చేసిన పెద్దమనిషికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈ రోజు నేను జింద్ ప్రజలను ఒక విషయం అడగడానికి వచ్చాను. చెప్పండి... పరిశుభ్రత కోసం మోదీ రావడం అవసరమా? జింద్ ప్రజలు, హర్యానా ప్రజలు ఇకపై మురికిని సృష్టించకూడదని నిర్ణయించుకుంటే... జింద్ మురిగ్గా మారుతుందా? హర్యానా ఎప్పుడైనా మురిగ్గా మారుతుందా? చేయాల్సిన పని చాలా సులభం – దీని కోసం మోదీ రావలసిన అవసరం లేదు. పరిశుభ్రత మన స్వభావంగా, మన సంస్కృతిగా మారాలని... దానిని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని మీరు నిర్ణయించుకుంటే చాలు.

 

మిత్రులారా,

మనం రైల్వేల చరిత్రను పరిశీలిస్తే, 19వ శతాబ్దంలో రైల్వే వ్యవస్థ ఆవిరి యంత్రాలతో నడిచే రైళ్లతో గుర్తింపు పొందింది. 20వ శతాబ్దంలో డీజిల్, విద్యుత్తుతో నడిచే రైళ్లకు పేరుగాంచింది. ఇప్పుడు, 21వ శతాబ్దం హైడ్రోజన్‌తో నడిచే రైళ్లతో గుర్తింపును పొందనుంది. భారతీయ రైల్వే ఈ 21వ శతాబ్దపు సాంకేతికతలో ఈ రోజు కీలక ముందడుగు వేసింది. ఈ రోజు జింద్-సోనిపత్ మధ్య హైడ్రోజన్ రైలు నడుస్తోంది. ప్రస్తుతానికి, ఈ ప్రయాణం 90 కిలోమీటర్లు ఉంటుంది. భవిష్యత్తులో, దీని విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి... సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి... అనే విషయాలపై దశలవారీ సమగ్ర విచారణ తర్వాత మేం ముందుకు వెళ్తాం. హైడ్రోజన్ రైళ్లు 7-8 సంవత్సరాల కిందటే ప్రపంచంలో ఉనికిలోకి వచ్చాయి. ప్రస్తుతం 3 లేదా 4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉంది. ఆ దేశాల్లోనూ హైడ్రోజన్ రైళ్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భారత హైడ్రోజన్ రైలు సామర్థ్యం గురించి వినడం... మీలో గర్వం నింపుతుంది - భారతీయులందరూ గర్వపడతారు.

మిత్రులారా,

జింద్-సోనిపత్ మధ్య నడుస్తున్న హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ రైలు. ఈ హైడ్రోజన్ రైలుకు 3,200 హార్స్‌పవర్ ఉంది. భారత హైడ్రోజన్ రైలు అత్యంత శక్తిమంతమైనది మాత్రమే కాదు... అత్యంత పొడవైనది కూడా. ఇతర దేశాల్లో, హైడ్రోజన్ రైళ్లు మూడు లేదా నాలుగు కోచ్‌లతో నడుస్తాయి. భారత్ తన మొట్టమొదటి ప్రయత్నంలోనే 10 కోచ్‌ల హైడ్రోజన్ రైలును నడిపి, ప్రపంచ స్థాయిలో తనదైన గుర్తింపును చాటింది.

మిత్రులారా,

మీకు గర్వకారణమైన మరో విషయం చెబుతాను. భారత హైడ్రోజన్ రైలు పొగ రహితమైనది మాత్రమే కాదు, ఇది 'మేక్ ఇన్ ఇండియా'కు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ కూడా. ఈ హైడ్రోజన్ రైలును భారతీయ ఇంజనీర్లు రూపొందించగా, ఒక భారతీయ కంపెనీ నిర్మించింది.

మిత్రులారా,

ఈ హైడ్రోజన్ రైలు ఇతర రైళ్ల కంటే పూర్తిగా భిన్నమైనది. దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థ, ప్రత్యేక మౌలిక సదుపాయాలు అవసరం. ఇక్కడ జింద్‌లో దీని కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. రాబోయే కాలంలో, ఇక్కడ హైడ్రోజన్ రైళ్లకు సంబంధించిన మరిన్ని మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు. హైడ్రోజన్ రైలు నెట్‌వర్క్ అవసరాలను తీర్చడానికి కొత్త ఫ్యాక్టరీలనూ ఏర్పాటు చేస్తారు. అంటే, ఈ రైలు హర్యానా యువతకు అనేక నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.

మిత్రులారా, 

గడచిన 12 సంవత్సరాలలో భారతీయ రైల్వేలో వచ్చిన ప్రధాన మార్పులు భారతదేశానికి మరో ప్రయోజనాన్ని చేకూర్చాయి. గత కొన్ని నెలలుగా పశ్చిమ ఆసియాలో హార్ముజ్ జలసంధి ప్రాంతం, ఇరాన్, గల్ఫ్ దేశాల వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని ఉండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశం ఏ సముద్ర మార్గం గుండా అయితే పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్,  మన రైతులకు అవసరమైన ఎరువులను దిగుమతి చేసుకుంటుందో, ఆ మార్గమే ఇప్పుడు సంక్షోభాలతో ఒక యుద్ధ క్షేత్రంగా మారిపోయింది.

 

మిత్రులారా, 

ఇలాంటి పరిస్థితి 2014కు ముందు గనుక ఏర్పడి ఉంటే, భారతదేశ మొత్తం రైల్వే వ్యవస్థే స్తంభించిపోయి ఉండేది. ఎందుకంటే, 2014 నాటికి దేశంలోని అత్యధిక శాతం రైళ్లు కేవలం డీజిల్‌తోనే నడిచేవి. ఒక్కసారి ఊహించుకోండి -  ఒకవేళ డీజిల్ దిగుమతులు గనుక నిలిచిపోయి ఉంటే, ఆ రైళ్లు ఎలా నడిచేవి? దేశం ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చేది.

కానీ, మిత్రులారా, 

ఇది 2014 నాటి పరిస్థితి కాదు. ఇక్కడ ఉన్నది మోదీ. ఆయన అన్నీ ముందే ఆలోచిస్తారు, ఆ ఆలోచనలకు తగ్గ పరిష్కారాలను క్షేత్రస్థాయిలో నిజం చేసి చూపిస్తారు. ఒక్కసారి ఊహించండి  -  భారతీయ రైల్వేల విద్యుద్దీకరణ దాదాపు ఒక శతాబ్దం క్రితం, 1925లోనే ప్రారంభమైంది. అయితే, 1925 నుంచి  2014 వరకు, దాదాపు 90 సంవత్సరాల కాలంలో కేవలం 30 శాతం రైల్వే నెట్‌వర్క్ మాత్రమే విద్యుద్దీకరణకు నోచుకుంది.  అంటే మూడో వంతు కంటే తక్కువ. మిగిలిన 70 శాతం నెట్‌వర్క్ అప్పటికీ డీజిల్‌పైనే నడిచేది. అదే పద్ధతిలో గనుక ముందుకు సాగి ఉంటే, దేశంలో పూర్తి విద్యుద్దీకరణ సాధించడానికి మరో 200 నుంచి 300 ఏళ్లు పట్టి ఉండేది. బహుశా రైల్వేలు ఎప్పటికీ విద్యుద్దీకరణకు నోచుకునేవి కావు, రైళ్లు కూడా నిరంతరం డీజిల్‌తోనే నడుస్తూ ఉండేవి. కానీ, గత 12 ఏళ్లలో భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో దాదాపు 99 శాతం విద్యుద్దీకరణ పూర్తయింది. హర్యానాలో అయితే రైల్వే విద్యుదీకరణ వంద శాతం పూర్తయింది. ఈ కారణం చేతనే, బయట యుద్ధాలు, చమురు సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ రైల్వేలు ఆగలేదు. భారత అభివృద్ధి ఇంజన్ నిలిచిపోలేదు. రైళ్లు నిరంతరాయంగా పరుగులు తీస్తూనే ఉన్నాయి.

మిత్రులారా, 

రైలు మార్గాలైనా, రోడ్లయినా సరే, అనుసంధాన ప్రాజెక్టులు ప్రజలకు సౌకర్యాన్ని చేకూర్చడంతో పాటు అభివృద్ధి వేగాన్ని కూడా ఎన్నో రెట్లు పెంచుతాయి. ఈరోజు ఎన్నో రహదారులతో అనుసంధానమవుతున్న జింద్‌ నగరం సాక్షిగా, ఇదే వేదిక నుంచి మూడు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ - అమృత్‌సర్ - కత్రా ఎక్స్‌ప్రెస్‌వే లోని హర్యానా విభాగాన్ని ప్రారంభించాం. జింద్ - గోహనా జాతీయ రహదారిని జాతికి అంకితం చేశాం. అంబాలా - కాలా అంబ్ నాలుగు వరుసల రహదారి హర్యానా,  హిమాచల్ ప్రదేశ్  రెండు రాష్ట్రాల ప్రజలకూ ఎంతో సౌకర్యాన్ని చేకూరుస్తుంది.

మిత్రులారా, 

ఇప్పుడు జింద్ ఐదు జాతీయ రహదారులతో అనుసంధానించిన జిల్లాగా మారింది. ఇటువంటి అద్భుతమైన అనుసంధానం వల్ల రైతులు, పశుపోషకులు తమ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు తరలించడం మరింత తక్కువ వ్యయం, సులభతరంగా మారుతుంది. దీనివల్ల పరిశ్రమలు బలోపేతం కావడమే కాకుండా, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. 

 

మిత్రులారా, 

నేను ఈ మధ్యే ఇండోనేషియా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్ పర్యటనలను విజయవంతంగా ముగించుకుని రావడం మీకు తెలుసు. అక్కడ జరిగిన కీలక ఒప్పందాలను గురించి వార్తల్లో చూశారు. అయితే మీడియాలో పెద్దగా చర్చకు రాని ఓ ముఖ్యమైన అంశం మన దేశ యువత భవిష్యత్తుకు, ముఖ్యంగా క్రీడల పురిటిగడ్డ హర్యానా యువశక్తికి ఎంతో ప్రాధాన్యత కలిగినది.

మిత్రులారా, 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో అక్కడి ప్రభుత్వాలతో క్రీడా రంగానికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరిపాను. రాబోయే రోజుల్లో క్రీడా పరిశ్రమ,  క్రీడాకారుల శిక్షణతో  పాటు మరెన్నో రంగాలలో భారత్ ఈ రెండు దేశాలతో కలిసి పని చేయబోతోంది. దీనివల్ల హర్యానాకు చెందిన యువ క్రీడాకారులకు కూడా ఎంతగానో లబ్ధి చేకూరుతుంది.

మిత్రులారా, 

నేడు భారతదేశంలో క్రీడలను శరీర దారుఢ్యం, ఉపాధికి ఒక ప్రధాన మాధ్యమంగా మారుస్తున్నారు. మన ప్రభుత్వం ఒక కొత్త జాతీయ క్రీడా విధానాన్నీ, ఖేలో భారత్ విధానాన్నీ రూపొందించింది. ఖేలో ఇండియా ప్రచారం నుంచి టాప్స్ పథకం వరకు, క్రీడాకారులు మునుపెన్నడూ లేని విధంగా వసతులనూ, ఆర్థిక సహాయాన్నీ పొందుతున్నారు. ఇక్కడ హర్యానాలో కూడా, బీజేపీ ప్రభుత్వం క్రీడలను,  క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తోంది.

మిత్రులారా, 

ఈనాటి కార్యక్రమం హైడ్రోజన్ రైలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కావచ్చు.  కానీ ఇక్కడి యువతకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 2030లో భారతదేశం కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోందని, అలాగే 2036లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు భారతదేశం సిద్ధమవుతోందని మీ అందరికీ తెలుసు. అందువల్ల, ప్రతి క్రీడాకారుడు తీవ్రంగా శ్రమించి, తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలి. డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వం మీకు ప్రతి సౌకర్యాన్ని కల్పిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. 2036 ఒలింపిక్స్‌ను చూడాలనుకునే వారు -  నేటి 5 నుంచి  12-15 సంవత్సరాల వయస్సు గల పిల్లలు - మనం వారిపై దృష్టి పెట్టాలి. రాబోయే కాలంలో, వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోందని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దీని కోసం కూడా బాగా సిద్ధం కావాలని హర్యానాలోని నా మిత్రులను కోరుతున్నాను. హర్యానా కుమారులు,   కుమార్తెలు ఎప్పటిలాగే, ఈ ఆటలలో కూడా తమ జెండాను ఎగురవేస్తారనే నమ్మకం నాకు ఉంది.

 

మిత్రులారా, 

హర్యానాలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' అనే మంత్రంతో పనిచేస్తోంది. నాయబ్ సింగ్  నాయకత్వంలో హర్యానా ప్రభుత్వం యువత, రైతులు, అక్కాచెల్లెళ్ళు, కుమార్తెల కోసం అద్భుతమైన పనులు చేస్తోంది. లంచాలు లేదా పక్షపాతం లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం కోసం హర్యానా ప్రభుత్వం చూపిన మార్గం అంత సులభం కాదు, కానీ ఈ బీజేపీ ప్రభుత్వం దీనిని సాధ్యం చేసింది.

మిత్రులారా, 

ఇక్కడి రైతుల సంక్షేమం కూడా మా ప్రాధాన్యత. హర్యానాలోనే అతిపెద్ద మార్కెట్లలో జింద్ మండీ ఒకటి. డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వం వల్ల హర్యానా రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా హర్యానా రైతులకు దాదాపు రూ. 8,000 కోట్లు అందాయి. ఇందులో ఒక్క జింద్ జిల్లా రైతులే రూ. 600 కోట్లకు పైగా అందుకున్నారు.

మిత్రులారా, 

మన దేశం విలువలు, సంస్కృతి కలిగిన భూమి. ఈ ప్రాంతం ఆ గొప్ప వారసత్వానికి ఒక అద్భుతమైన కేంద్రం. ఇది మహారాజా రంజిత్ సింగ్ కీర్తి నిలిచిన, పాండవుల విశ్వాసం సజీవంగా ఉన్న జింద్ నేల. పాండు-పిండారా రామ్‌రాయ్ వంటి పవిత్ర స్థలాలు నేటికీ మిలియన్ల మంది యాత్రికులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.

 

మిత్రులారా, 

భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన ఈ వారసత్వాన్నే నేటి భారతదేశం కాపాడుకుంటూ గౌరవపూర్వకంగా తదుపరి తరానికి అందిస్తోంది. ఇదే స్ఫూర్తితో, ఈరోజు కురుక్షేత్రలో సిక్కు మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. హర్యానాలో ఏర్పాటు కాబోతున్న ఈ కొత్త మ్యూజియం భారతదేశ గొప్ప గురు సంప్రదాయాన్ని భావితరాలకు ముందుకు తీసుకెళ్తుంది.

మిత్రులారా, 

హర్యానా ఇప్పుడు వేగవంతమైన అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వ్యవసాయం,  పరిశ్రమలు - ఇవి హర్యానాను శక్తిమంతం చేస్తున్న రెండు చక్రాలు. ఈ రోజు ప్రారంభించిన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు హర్యానా వృద్ధిని మరింత వేగవంతం చేస్తాయి. హర్యానా సాధిస్తున్న ఈ వేగవంతమైన వృద్ధి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ ప్రయాణానికి మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ ఆకాంక్షలతో, భారత మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైన సందర్భంగా మీ అందరికీ, అలాగే దేశ ప్రజలందరికీ మరోసారి నా అభినందనలు. నాతో కలిసి చెప్పండి -

భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data

Media Coverage

Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles loss of lives in firecracker factory mishap in Kaushambi
August 31, 2026
PM announces ex-gratia from Prime Minister’s National Relief Fund

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the loss of lives in a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. Shri Modi conveyed his condolences to the bereaved families and prayed for the speedy recovery of the injured.

Shri Modi also announced an ex-gratia of ₹2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) to the next of kin of each deceased and ₹50,000 for the injured.

The Prime Minister posted on X;

Extremely saddened by the loss of lives due to a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi