షేర్ చేయండి
 
Comments
గీత మ‌న‌ను ఆలోచించేలా చేస్తుంది, ప్ర‌శ్న‌లు వేసేలా మ‌న‌కు స్ఫూర్తి ని క‌లిగిస్తుంది, చ‌ర్చించేలా ప్రోత్స‌హిస్తుంది, మ‌న బుద్ధి ని ఏ విష‌యాన్ని అయినా స్వీక‌రించేందుకు సిద్ధం గా ఉంచుతుంది : ప్ర‌ధాన మంత్రి

విశిష్ట అతిథులు... మిత్రులారా...

వణక్కం! (నమస్కారం)

ఇదొక విశిష్ట కార్యక్రమం... ఇందులో భాగంగా స్వామి చిద్భావానందగారి వ్యాఖ్యానసహిత భగవద్గీత ఎలక్ట్రానిక్ ప్రతిని ఆవిష్కరిస్తున్నాం. ఈ పుస్తకం రూపకల్పనలో పాలుపంచుకున్న వారందరికీ నా అభినందనలు. సంప్రదాయాలు, సాంకేతిక పరిజ్ఞాన మేళవింపుతో కూడిన మీ కృషికి నా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్‌ పుస్తకాలకు- ముఖ్యంగా యువతరంలో ఆదరణ మెండుగా ఉంటోంది. కాబట్టి పవిత్ర గీతా ప్రబోధంతో యువత అనుసంధానానికి ఈ కృషి తోడ్పడుతుంది.

మిత్రులారా...

నిత్యనూతన భగవద్గీతతో ఉజ్వల తమిళ సంస్కృతికిగల అనుబంధాన్ని ఈ ఎలక్ట్రానిక్‌ పుస్తకం మరింత దృఢం చేస్తుంది. ఆ మేరకు ప్రపంచవ్యాప్తంగాగల చైతన్యవంతులైన తమిళ ప్రవాసులకు ఇది సులభంగా అందుబాటులోకి వస్తుంది. వారు చక్కగా ఈ పుస్తకాన్ని చదువుకోగలరు. తమిళ ప్రవాసులు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తూ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయినప్పటికీ, తమ సాంస్కృతిక మూలాలపట్ల వారెంతో గర్విస్తారు. వారు ఎక్కడికి వెళ్లినా తమిళ సంస్కృతి గొప్పతనాన్ని వెంటబెట్టుకు వెళ్తారు.

మిత్రులారా...

స్వామి చిద్భావానందకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భారత పునరుజ్జీవనం కోసం మనోవాక్కాయ కర్మలద్వారా తన జీవితాన్ని ఆయన అంకింత చేశారు. విదేశాల్లో విద్యాభ్యాసం ఆయన ఆకాంక్ష కాగా, విధి మరోవిధంగా తలచింది. రోడ్డు పక్కన పాతపుస్తకాలు విక్రయించే వ్యక్తివద్ద చూసిన ‘‘మద్రాసులో స్వామి వివేకానంద ఉపన్యాసాలు’’ పుస్తకం ఆయన జీవన గమనాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ పుస్తకం చదివాక- మాతృభూమి అన్నిటికన్నా మిన్న అనీ, ప్రజాసేవకు ప్రాధాన్యమివ్వాలనే స్ఫూర్తి ఆయనలో రగిలింది. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు:

 

यद्य यद्य आचरति श्रेष्ठ: तत्त तत्त एव इतरे जनः। (యద్ యద్‌ ఆచరతి శ్రేష్ఠః తత్‌ తత్‌ ఏవ ఇతరే జనః)

सयत् प्रमाणम कुरुते लोक: तद अनु वर्तते।। (సయతు ప్రమాణం కురుతే లోక: తద్ అనువర్తతే).

అంటే- “మహనీయులు ఏం చేసినా, ఆ స్ఫూర్తితో అనేకమంది వారిని అనుసరిస్తారు” అని అర్థం. ఆ విధంగా స్వామి చిద్భావానంద ఒకవైపు స్వామి వివేకానంద నుంచి ప్రేరణ పొందారు... మరోవైపు తన ఆదర్శప్రాయ కార్యాచరణతో ప్రపంచానికి స్ఫూర్తినిచ్చారు. స్వామి చిద్భావానంద చేసిన చిరస్మరణీయ కృషిని శ్రీ రామకృష్ణ తపోవనం ఆశ్రమం ఆయన బాటలోనే ముందుకు తీసుకెళ్తోంది. ఆ మేరకు సామాజిక సేవ, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగాల్లో వారు ప్రశంసనీయ కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులోనూ వారి కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

మిత్రులారా...

పవిత్ర గీతా సౌందర్యం దాని లోతు, వైవిధ్యం, సరళతలోనే ఉంది. అడుగు తడబడిన బిడ్డకు అక్కున చేర్చుకునే మాతృమూర్తిగా ఆచార్య వినోబా భావే గీతను అభివర్ణించారు. మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్, మహాకవి సుబ్రమణియ భారతివంటి మహనీయులు గీతనుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. గీత మనలో ఆలోచనా స్రవంతిని కదిలిస్తుంది... ప్రశ్నించేలా మనల్ని ఉత్తేజ పరుస్తుంది... చర్చను ప్రోత్సహిస్తుంది. నిష్కపట మనస్కులను చేస్తుంది. గీతనుంచి స్ఫూర్తి పొందిన వారెవరైనా సదా కరుణా స్వభావులై ప్రజాస్వామ్య భావనలు కలిగి ఉంటారు.

మిత్రులారా...

పవిత్ర భగవద్గీత ఓ శాంతియుత, సుందర పరిస్థితుల మధ్య ఆవిర్భవించిందని ఎవరైనా భావించవచ్చు... కానీ, ఇది యుద్ధ వాతావరణం నడుమ భగవద్గీత రూపంలో ప్రపంచానికి లభించిన ఓ జీవిత పాఠమని మీకందరికీ తెలిసిందే. అన్నిటికీ సంబంధించి మనం ఆశించగల జ్ఞానప్రదాయని భగవద్గీత. అయితే, శ్రీ కృష్ణుని నోట ఈ జ్ఞాన ప్రవాహానికి కారణమేమిటని మీరు ఎన్నడైనా యోచించారా? ఇదొక విషాదం లేదా విచారం... భగవద్గీత అన్నది విషాదం నుంచి విజయం దాకా ప్రయనంలో ప్రతిబింబించే ఆలోచనల నిధి. భగవద్గీత ఆవిర్భావంలో సంఘర్షణ, విషాదం ఉన్నాయి. మానవాళి నేటికీ ఇలాంటి వైరుధ్యాలు, సవాళ్లను ఎదుర్కొంటున్నదని చాలామంది భావిస్తున్నారు. జీవితంలో ఓసారి మనకెదురయ్యే అంతర్జాతీయ మహమ్మారితో ప్రపంచం నేడు భీకర యుద్ధం చేస్తోంది. దీని ఆర్థిక, సామాజిక పర్యవసానాలు కూడా విస్తృతమైనవే. ఇటువంటి సమయంలో శ్రీమద్ భగవద్గీత చూపిన మార్గం సదా వర్తించేదిగా మారుతుంది. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లనుంచి మరోసారి విజయం సాధించగల శక్తిని ఇస్తూ దిశానిర్దేశం చేస్తుంది. భారతదేశంలో మనం ఇలాంటి అనేక సందర్భాలను చూశాం. కోవిడ్‌-19పై మన ప్రజా భాగస్వామ్యసహిత పోరాటం, జనావళిలో తిరుగులేని స్ఫూర్తి, మన పౌరుల సాటిలేని ధైర్యం... వీటన్నిటికీ గీతా ప్రబోధమే వెన్నుదన్నుగా ఉన్నదని మనం చెప్పవచ్చు. అదేవిధంగా నిస్వార్థ స్ఫూర్తి కూడా ఇందులో భాగమే. పరస్పర సహకారం దిశగా ప్రజలు ఎంతదూరమైనా వెళ్లగలగడం మనం పలుమార్లు చూస్తూనే ఉన్నాం... ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి కూడా చూశాం.

మిత్రులారా...

యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో నిరుడు ఒక ఆసక్తికరమైన వ్యాసం ప్రచురితమైంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రచురించే ఈ పత్రికను గుండెజబ్బుల చికిత్స రంగంలో సమకాలీన నిపుణులు సమీక్షిస్తుంటారు. ఇందులో ప్రచురితమైన వ్యాసం- ఇతరత్రా అంశాలతోపాటు కోవిడ్‌ సమయంలో భగవద్గీత ఏ విధంగా అత్యంత సముచితమైనదో కూడా చర్చించింది. సంపూర్ణ జీవనానికి కచ్చితమైన మార్గదర్శినిగా భగవద్గీతను ఈ వ్యాసం పేర్కొంది. ఇందులో అర్జునుడిని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, ఆస్పత్రులను వైరస్‌పై పోరులో యుద్ధ క్షేత్రాలుగా అభివర్ణించింది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు భయాన్ని, సవాళ్లను అధిగమిస్తూ విధులు నిర్వర్తించడాన్ని ఈ వ్యాసం అభినందించింది.

మిత్రులారా...

భగవద్గీత ఇచ్చే కీలక సందేశం కార్యాచరణే... శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు:

नियतं कुरु कर्म त्वं (నియతం కురు కర్మ త్వమ్‌

कर्म ज्यायो ह्यकर्मणः। కర్మ జ్యాయోహ్య కర్మణాః

शरीर यात्रापि च ते శరీర యత్రపి చ తే

न प्रसिद्ध्ये दकर्मणः।। న ప్రసిదుధ్యే దకర్మణః)

అంటే- క్రియాశూన్యంగా ఉండటంకన్న కార్యాచరణకు ఉపక్రమించడం మిన్న అని ప్రబోధించాడు. వాస్తవానికి కార్యాచరణ లేనిదే మన శరీరంపట్ల మనం జాగ్రత్త వహించలేం. నేడు 130 కోట్ల మంది భారతీయులు తమ కార్యాచరణను నిర్ణయించుకున్నారు. ఆ మేరకు భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసేందుకు కంకణబద్ధులయ్యారు. దీర్ఘకాలంలో మన దేశం స్వావలంబన సాధించడమే ప్రతి ఒక్కరికీ లక్ష్యం. మనకోసం మాత్రమేగాక విస్తృత మానవాళి కోసం సంపద, విలువలు సృష్టించడమే స్వయం సమృద్ధ భారతం కీలక లక్ష్యం. స్వయం సమృద్ధ భారతం ప్రపంచానికే మేలు చేస్తుందన్నది మన విశ్వాసం. ఇటీవల కొంతకాలం కిందట ప్రపంచానికి మందులు అవసరమైన సందర్భంగా భారతదేశం తన శక్తివంచన లేకుండా వాటి సరఫరాకు కృషిచేసింది. అటుపైన సత్వరం టీకాలను అందుబాటులోకి తేవడంలో మన శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారు. ఇక నేడు భారతదేశంలో తయారైన టీకాలు ప్రపంచం నలుమూలలకూ చేరడం గర్వకారణం. స్వయంగా కోలుకోవడమేగాక అదే సమయంలో మనం మానవాళికి సాయపడాలని ఆకాంక్షిస్తున్నాం. భగవద్గీత మనకు బోధిస్తున్నదీ సరిగ్గా ఇదే.

మిత్రులారా...

భగవద్గీతపై కనీసం ఒక్కసారి దృష్టి సారించాల్సిందిగా నేను యువ మిత్రులను ప్రత్యేకంగా కోరుతున్నాను. అందులోని ప్రబోధాలు అత్యంత ఆచరణాత్మకం మాత్రమేగాక సాపేక్షమైనవి. నేటి ఉరుకులు-పరుగుల జీవితాల్లో శాంతి, ప్రశాంతతలనిచ్చే ఒయాసిస్సు వంటిది భగవద్గీత. జీవితంలోని అనేక కోణాల్లో ఆచరణాత్మక మార్గదర్శిని. ఆ మేరకు “కర్మణ్యే-వాధికారస్తే మా ఫలేషు కదాచన” అన్న ప్రసిద్ధ పద్యపాదాన్ని ఎన్నడూ విస్మరించకండి. అది మన మనసులోని ఓటమి భయాన్నుంచి విముక్తి కల్పించి, కార్యాచరణపై దృష్టి సారించేలా చేస్తుంది. నిజమైన జ్ఞానం ప్రాముఖ్యాన్ని ‘జ్ఞానయోగ’ అధ్యాయం వివరిస్తుంది. అలాగే భక్తి భావన గురించి బోధించే ‘భక్తియోగం’ ఒక అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రతి అధ్యాయంలో అనుసరణీయమైనది, సానుకూల మనస్థితి సాధనకు దోహదం చేసేది ఒకటి ఉంటుంది. అన్నిటినీ మించి సర్వశక్తియుతుడైన పవిత్ర దైవ ప్రకాశంలో ప్రతి ఒక్కరం ఒక అణువేనని కూడా గీత స్పష్టం చేస్తుంది.

స్వామి వివేకానంద బోధించింది కూడా ఇదే. ఆ మేరకు నా యువ మిత్రులు అనేక క్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఏంచేయాలో తెలియని అయోమయ స్థితిని ఎదుర్కొంటున్న అర్జునుడి స్థానంలో నేనే ఉన్నట్లయితే శ్రీ కృష్ణుడు నన్ను ఏమి చేయమనేవాడు?అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే- హఠాత్తుగా మిమ్మల్ని మీరు సొంత ఇష్టాయిష్టాలనుంచి వేరుచేసి చూసుకుంటారు. తదనుగుణంగా నిత్యనూతనమైన భగవద్గీత సూత్రాల వెలుగులో దృష్టి సారించడం మొదలు పెడతారు. ఆ విధంగా గీత మిమ్మల్ని సరైన మార్గం వైపు నడిపిస్తుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో స్వామి చిద్భావానంద వ్యాఖ్యానంతో కూడిన ఎలక్ట్రానిక్‌ పుస్తకావిష్కరణపై మీకందరికీ మరోసారి నా అభినందనలు.

 

ధన్యవాదాలు...

వణక్కం!

 

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport

Media Coverage

PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2021
July 24, 2021
షేర్ చేయండి
 
Comments

PM Modi addressed the nation on Ashadha Purnima-Dhamma Chakra Day

Nation’s progress is steadfast under the leadership of Modi Govt.