జమ్మూ కాశ్మీర్‌, తెలంగాణ, ఒడిశాల్లో రైల్వేల రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్ని ప్రారంభించడం
ఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది: ప్రధానమంత్రి
ప్రస్తుతం, దేశం వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో తలమునకలైంది, దీనికోసం భారతీయ రైల్వేల్ని అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం: ప్రధాని
భారత్‌లో రైల్వేల అభివృద్ధిని నాలుగు కొలబద్దల్లో మేం ముందుకు తీసుకుపోతున్నాం: ప్రధానమంత్రి

నమస్కారం!

తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ గారు, నా మంత్రివర్గ సహచరులు - శ్రీ అశ్వనీ వైష్ణవ్ గారు, శ్రీ జి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ సోమయ్య గారు, శ్రీ రణవీత్ సింగ్ బిట్టూ గారు, శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, విశిష్ట అతిథులు, సోదర, సోదరీమణులారా!

ఈ రోజు గురు గోవింద్ సింగ్ జయంతి. ఆయన బోధనలు, ఆదర్శవంతమైన జీవితం బలమైన భారత దేశాన్ని నిర్మించే దిశగా మనకు స్పూర్తినిస్తూనే ఉంటుంది. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

స్నేహితులారా,

2025 మొదలైనప్పటి నుంచే రవాణా సౌకర్యాల అభివృద్ధిలో అసాధారణ వేగాన్ని భారత్ కొనసాగిస్తోంది. నిన్ననే, ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లో నమో భారత్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించే, ఢిల్లీ మెట్రోలో ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నిన్న భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది - మనదేశంలో మెట్రో వ్యవస్థ విస్తరణ వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. ఈ రోజు కొన్ని కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నాం. భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నాం. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుంచి, తూర్పున ఒడిశా, దక్షిణాన తెలంగాణ వరకు, దేశంలో ‘ఆధునిక రవాణా’ వ్యవస్థలకు ఇది ముఖ్యమైన రోజు. ఈ మూడు రాష్ట్రాల్లో చేపట్టిన ఆధునిక అభివృద్ధి కార్యక్రమాలు యావత్ దేశాభివృద్ధిని సూచిస్తున్నాయి. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ మంత్రం మనలో విశ్వాసాన్ని నింపడంతో పాటు, వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) అనే లక్ష్యానికి జీవం పోస్తుంది. ఈ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ఈ మూడు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులందరికీ అభినందనలు. ఈ రోజు ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ పుట్టినరోజు కూడా. అందరి తరఫునా ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మన దేశం స్థిరంగా ప్రయాణిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో రైల్వేల అభివృద్ధి ప్రధానం. గత దశాబ్దంగా, భారతీయ రైల్వేలు చారిత్రక మార్పులను సంతరించుకున్నాయి. రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనలో సాధించిన అసాధారణ పురోగతి జాతీయ చిత్రాన్ని మార్చడంతో పాటు, ప్రజల్లో ధైర్యాన్ని పెంచుతుంది.

స్నేహితులారా,

నాలుగు ప్రధానాంశాలపై దృష్టి సారించి రైల్వేలను అభివృద్ధి చేయడంలో మనం ముందుకు వెళుతున్నాం. మొదటిది రైల్వేల్లో మౌలిక వసతులను ఆధునికీకరించడం, రెండోది ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల ఏర్పాటు, మూడోది దేశంలోని ప్రతీ మూలకు రైల్వే వ్యవస్థల విస్తరణ, నాలుగోది రైల్వేల ద్వారా ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమలకు తోడ్పాటు. ఈ దార్శనికతకు నిదర్శనమే నేటి కార్యక్రమం. కొత్తగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లు, రైల్వే టెర్మినళ్లు భారతీయ రైల్వేలను 21వ శతాబ్దపు ఆధునిక వ్యవస్థగా మార్చేందుకు దోహదపడతాయి. ఈ అభివృద్ది కార్యక్రమాలు ఆర్థిక సంక్షేమం దిశగా వ్యవస్థను ప్రోత్సహిస్తాయి. రైల్వే కార్యకలాపాలను విస్తరింపజేస్తాయి. పెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. నూతన ఉద్యోగాలను కల్పిస్తాయి.

 

మిత్రులారా,

2014లో భారతీయ రైల్వేలను ఆధునికీకరించే ప్రక్రియను మేం మొదలుపెట్టాం. వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ స్టేషన్లు, నమో భారత్ రైళ్లు భారతీయ రైల్వేలో నూతన ప్రమాణాలను నిర్దేశించాయి.  తక్కువ సమయంలో ఎక్కువ విజయాలను సాధించాలని ఆకాంక్షాత్మక భారత్ నేడు ప్రయత్నిస్తోంది. సుదూర గమ్యాలను సైతం వేగంగా చేరుకోవాలని ప్రయాణికులు భావిస్తుండటంతో దేశవ్యాప్తంగా హైస్పీడు రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం, వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ మార్గాల్లో 136 సర్వీసుల ద్వారా ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ట్రయల్ రన్‌లో భాగంగా వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించిన వీడియోను చూశాను. ఇలాంటి ఘనతలు ప్రతి భారతీయుడికీ గర్వకారణంగా నిలుస్తాయి. ఈ విజయాలు ఆరంభం మాత్రమే, భారత్‌లో మొదటి  బుల్లెట్ రైలు కార్యకలాపాలు  ప్రారంభమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.

స్నేహితులారా,

బయలుదేరే స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు భారతీయ రైల్వేల ద్వారా చేసే ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనేదే మా లక్ష్యం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 1,300 అమృత్ భారత్ స్టేషన్లు పునర్నిర్మితమవుతున్నాయి. గత పదేళ్లలో రైలు అనుసంధానంలో వృద్ధి నమోదైంది. 2014 లో దేశంలో 35 శాతం రైల్వే లైన్లను మాత్రమే విద్యుద్దీకరణ చేశారు. ఇప్పుడు 100 శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణకు చేరువలో భారత్ ఉంది. అలాగే రైల్వేల పరిధిని సైతం గణనీయంగా విస్తరించాం. గత పదేళ్లలో 30,000 కి.మీ.లకు పైగా కొత్త రైల్వే ట్రాకులు వేశాం. వందల సంఖ్యలో ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు నిర్మించాం. బ్రాడ్‌గేజ్ లైన్లలో మానవ రహిత క్రాసింగ్‌ పూర్తిగా తొలగిపోయాయి. ఫలితంగా ప్రమాదాలు తగ్గి ప్రయాణికుల భద్రత మెరుగవుతుంది. అంతేకాకుండా, సరకు రవాణా కారిడార్ల వంటి అధునాతన రైల్వే వ్యవస్థల అభివృద్ధి వేగంగా జరగుతోంది. ఈ ప్రత్యేక కారిడార్లు సాధారణ ట్రాకులపై భారాన్ని తగ్గించి, హైస్పీడు రైళ్ల కార్యకలాపాలకు అవకాశాలను సృష్టిస్తాయి.

మిత్రులారా,

భారతీయ రైల్వేల్లో వస్తున్న మార్పులు ఉద్యోగ అవకాశాలను కూడా మెరుగుపరుస్తున్నాయి. మేడిన్ ఇండియా తరహా కార్యక్రమాలు, మెట్రోలు, రైల్వేల కోసం ఆధునిక కోచ్‌లు, స్టేషన్ల పునర్నిర్మాణం, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ‘వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్’ లాంటి కార్యక్రమాల అమలు ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతోంది. గడచిన దశాబ్దంలో లక్షలాది యువత రైల్వేల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు పొందారు. కొత్త రైలు కోచుల నిర్మాణానికి ఉపయోగించే ముడి పదార్థాలు ఇతర పరిశ్రమల నుంచి వస్తాయని గుర్తించడం ముఖ్యం. ఈ పరిశ్రమల్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ఎన్నో ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది. రైల్వే అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మొదటి గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని భారత్ ప్రారంభించుకుంది. ఇది ఓ కీలకమైన ముందడుగు.

 

స్నేహితులారా,

రైల్వే వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కొత్త ప్రధాన కార్యాలయాలు, డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. జమ్మూ డివిజన్ - జమ్మూ కాశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాకుండా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లోని పలు నగరాలకు కూడా ప్రయోజనం అందిస్తుంది. అదనంగా లే – లదాఖ్  ప్రజలకు గొప్ప ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

మిత్రులారా,

రైల్వే మౌలిక వసతుల్లో జమ్మూ కాశ్మీర్‌ అద్భుతమైన ఘనతలను సాధిస్తోంది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం గురించి దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. దీనిలో భాగంగా నిర్మిస్తున్న  ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. అలాగే దేశంలో మొదటి కేబుల్-స్టేడ్ రైల్ వంతెన అయిన అంజి ఖాడ్ రైలు వంతెన కూడా ఈ ప్రాజెక్టులో ఒక భాగమే. అసమానమైన ఇంజినీరింగ్ ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఈ రెండు వంతెనలు ఈ ప్రాంతంలో ఆర్థిక పురోగతి, సంక్షేమాన్ని తీసుకుచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

స్నేహితులారా,

జగన్నాథుని ఆశీస్సులతో సమృద్ధిగా సహజ వనరులతో, విస్తృతమైన తీరప్రాంతాన్ని కలిగి ఉన్న ఒడిశా అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఒడిశాలో కొత్త రైల్వే లైన్లపై దృష్టి సారిస్తూ, రూ. 70,000 కోట్లకు పైగా పెట్టుబడులతో అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన ఏడు గతి శక్తి సరకు రవాణా టెర్మినళ్లు వాణిజ్యాన్ని, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ రోజు రాయగడ డివిజన్‌కు వేసిన పునాది రాయి ఈ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరిస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఒడిశాలో పర్యాటకం, వాణిజ్యం, ఉద్యోగ అవకాశాలను మెరుగపరుస్తాయి. ముఖ్యంగా గిరిజన జనాభా అధికంగా ఉన్న దక్షిణ ఒడిశాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. జన్మన్ యోజన లాంటి కార్యక్రమాల ద్వారా అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాం. ఈ మౌలిక వసతులు వారికి వరంగా మారతాయి.

 

 

మిత్రులారా,

తెలంగాణలో చర్లపల్లి  కొత్త టెర్మినల్ స్టేషన్ను ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. బాహ్య వలయ రహదారితో అనుసంధానమయ్యే ఈ స్టేషన్ ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఆధునిక ప్లాట్‌ఫాంలు, లిఫ్టులు, ఎస్కలేటర్ల వంటి అధునాతన సౌకర్యాలు ఈ స్టేషన్లో ఉన్నాయి. గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ స్టేషన్ సౌర విద్యుత్తుతో పనిచేస్తుంది. ఈ టెర్మినల్ ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ టెర్మినళ్లపై పడే భారాన్ని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. జీవన సౌలభ్యంతో పాటు సులభతర వ్యాపార విధానాన్ని కూడా పెంచుతుంది.

మిత్రులారా,

నేడు దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గణనీయమైన కృషి జరుగుతోంది. ఎక్స్‌ ప్రెస్ మార్గాలు, జల మార్గాలు, మెట్రో వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. దేశంలోని విమానాశ్రయాలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తున్నాయి. 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపై 150కి చేరుకుంది. 2014లో 5 నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉంటే ఇప్పుడు అవి 21 నగరాలకు విస్తరించాయి. ఈ అద్భుతమైన ప్రగతితో సరితూగేలా రైల్వేలు సైతం నిరంతరం ఆధునికీకరణ చెందుతున్నాయి.

స్నేహితులారా,

ప్రతి పౌరుడి సమష్టి ఆకాంక్షగా మారిన వికసిత్ భారత్ ప్రణాళికలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ భాగమే. మనందరం కలసి ఈ మార్గంలో పురోగతిని వేగవంతం చేస్తామని విశ్వసిస్తున్నాను. ఈ విజయాలు సాధించినందుకు గాను మరోసారి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security