· “వారసత్వ సహిత పురోగమనం’ తారకమంత్రంగా నవ భారత్‌ ముందడుగు”
· “రుషులు.. జ్ఞానులు.. సాధువులకు మన దేశం పుట్టినిల్లు- సమాజం క్లిష్ట దశలో ఉన్నపుడల్లా వీరిలో ఎవరో ఒక మహనీయుడు ఈ నేలపై అవతరించి సమాజానికి మార్గనిర్దేశం చేస్తుంటారు”
· “పేదలు.. అణగారిన వర్గాల సముద్ధరణ సంకల్పానికి ప్రతీక ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మంత్రం.. ఈ సేవా స్ఫూర్తే ప్రభుత్వ విధానాలకు... నిబద్ధతకు నిదర్శనం”
· “భారత్‌ వంటి దేశంలో సంస్కృతి మన జాతి ప్రతిష్ఠతో ముడిపడి ఉండటమే కాదు.. మన సామర్థ్యాన్ని బలోపేతం చేసేదీ ఆ సంస్కృతే”

జై సచ్చిదానంద జీ!!!

స్వామి శ్రీ విచార్ పూర్ణానంద మహారాజ్, మధ్యప్రదేశ్‌ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంటు సభ్యులు శ్రీ వి.డి.శర్మ, శ్రీ జనార్దన్‌ సింగ్ సిగ్రివాల్, వేదికను అలంకరించిన ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదరీ సోదరులతోపాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్ సహా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సమూహానికి నా అభివందనాలు.

మిత్రులారా!

శ్రీ ఆనంద్‌పూర్ ధామ్‌ సందర్శనతో ఇవాళ నా హృదయం ఉప్పొంగింది. నేనిప్పుడే గురూజీ మహారాజ్ ఆలయానికి వెళ్లాను... ఆయన సన్నిధిలో నిజంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది.

 

మిత్రులారా!

సాధుజనుల తపోఫలంతో ఏ నేలన అణువణువూ పవిత్రత అలముకుందో, ఎక్కడ పరమార్థం (పరోపకార పరాయణత్వం) ఒక సంప్రదాయంగా వేళ్లూనుకున్నదో, మానవాళి శ్రేయస్సుకు సేవా సంకల్పం ఎక్కడ బాటలు పరచిందో అది ఎంతమాత్రం సాధారణ ప్రదేశం కాదు. అటువంటి ఈ అశోక్ నగర్‌ గడ్డపై పాదం మోపాలంటే దుఃఖం భయపడుతుందన్నది సాధు వచనం. ఇవాళ బైశాఖి వేడుకలతోపాటు శ్రీ గురూజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకెంతో సంతోషం కలిగించింది. ఈ పవిత్ర సందర్భాన ప్రథమ పదషాహి శ్రీశ్రీ 108వ స్వామి శ్రీ అద్వైతానంద మహారాజ్ సహా ఇతర పదషాహి సాధువులందరికీ శిరసాభివందనం చేస్తున్నాను. ద్వితీయ పదషాహి గారు 1936లో ఇదే రోజున మహాసమాధిలోకి వెళ్లారని, 1964లో ఇదే రోజున శ్రీ తృతీయ పదషాహి శివైక్యం చెందారని నాకు సమాచారం అందింది. ఈ చారిత్రక సంఘటనల నేపథ్యంలో మహనీయులైన ఆ సద్గురువులిద్దరికీ సగౌరవ ప్రణామం ఆచరిస్తున్నాను. అంతేకాకుండా మాతా జగేశ్వరి దేవి, మాతా బీజాసన, క్షేత్ర మాత అయిన మాతా జానకి కరీలాకు వందనం అర్పిస్తున్నాను. అలాగే బైశాఖి, శ్రీ గురు మహారాజ్ జయంతి వేడుకల నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా!

రుషులు, జ్ఞానులు, సాధువులకు మన దేశం పుట్టినిల్లు. ఈ భారత దేశం... మన సమాజం క్లిష్ట దశను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒక మహనీయుడు లేదా గురువు ఈ నేలపై అవతరించి సమాజానికి సరికొత్త దిశను నిర్దేశిస్తూంటారు. పూజ్య స్వామి శ్రీ అద్వైతానంద మహారాజ్ జీవితం ఇందుకు నిదర్శనం. ఆది శంకరాచార్య వంటి ఆచార్యులు నిగూఢ అద్వైత తత్త్వ జ్ఞానాన్ని విశదీకరించిన కాలం ఒకటుంది. అయితే వలసపాలన సమయంలో ఈ జ్ఞానం విస్మరణకు గురికావడం మొదలైంది. కానీ, అదే సమయంలో రుషులు, సాధువులు అవతరించి అద్వైత సిద్ధాంతంతో దేశంలో ఆత్మ చైతన్యం రగిలించారు. ఈ సంప్రదాయంలో భాగంగా పూజ్య శ్రీ అద్వైతానంద మహారాజ్ మనందరి కోసం అద్వైత జ్ఞానాన్ని సరళీకరించిన ఫలితంగా సామాన్యులకూ అది అందుబాటులోకి వచ్చింది.

 

మిత్రులారా!

ప్రపంచంలో భౌతిక పురోగమనం నడుమన యుద్ధాలు, సంఘర్షణలు, నైతిక విలువల క్షీణత వంటి అంతర్జాతీయ ఆందోళనకర అంశాలను మనం ఎదుర్కొంటున్నాం. ఈ సవాళ్లన్నిటికీ కారణమేమిటి? “నేను-ఇతరులు” అనే స్వార్థపూరిత ధోరణే దీనికంతటికీ మూలం! ఇటువంటి మనస్తత్వమే మనుషుల మధ్య అగాధం ఏర్పరుస్తుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గమేమిటా అని ప్రపంచ మధనపడుతోంది. అయితే, ఆ పరిష్కారం అద్వైత తత్త్వంలో ఉంది. అది ద్వంద్వ స్వభావాన్ని ఎంతమాత్రం ప్రబోధించదు. అద్వైతమంటే ప్రతి జీవిలో ఒకేతరహా దైవత్వాన్ని చూడటం! మరికాస్త లోతుగా చూస్తే యావత్ సృష్టిని దైవస్వరూపంగా భావించగలగడమే అద్వైతం. ఈ సిద్ధాంతాన్ని పరమహంస దయాళ్ మహారాజ్- “నీవే నేను-నేనే నీవు” అని అత్యద్భుతంగా సూత్రీకరించారు. ఇదెంతో మనోజ్ఞ భావనో గమనించారా! “నాది-నీది” అనే భేదభావాన్ని ఈ ఆలోచన రూపుమాపుతుంది. ఇందులోని వైశిష్ట్యాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తే అన్నిరకాల విభేదాలకూ పరిష్కారం సునాయాసంగా లభిస్తుంది.

మిత్రులారా!

ఇంతకుముందే నేను ఆరో పదషాహి స్వామి శ్రీ విచార పూర్ణానంద మహారాజ్‌తో కొద్దిసేపు ముచ్చటించాను. ప్రథమ పదషాహి శ్రీ పరమహంస దయాళ్ మహారాజ్ బోధనల గురించి ఆయన వివరించారు. దాంతోపాటు ఆనంద్‌పూర్ ధామ్ సేవా కార్యక్రమాలను కూడా వెల్లడించారు. ఈ ధామ్‌లో రూపుదిద్దుకున్న ఐదు విశిష్ట సాధన మార్గాలను విశదీకరిస్తూ వాటిలో నిస్వార్థ సేవ ఒకటని ఆయన చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలకు నిస్వార్థ సేవ, మానవ సేవను మాధవ సేవగా పరిగణించడం భారతీయ సంస్కృతికి పునాది వంటివి. ఈ సంస్కృతిని ఆనంద్‌పూర్ ట్రస్ట్ అంకితభావంతో కొనసాగించడం ఎంతో ముదావహం. ఇందులో భాగంగానే ఈ ట్రస్టు నిర్వహిస్తున్న ఆస్పత్రిలో వేలాది రోగులకు చికిత్స అందిస్తున్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. గో సేవ లక్ష్యంగా ఆధునిక గోశాల ఏర్పాటు చేశారు. నవతరం సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు... మానవాళి సంక్షేమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ఆనంద్‌పూర్ ధామ్ విశేషంగా కృషి చేస్తున్నది. ఆశ్రమ ప్రబోధాలను ఆచరించే ధార్మిక జనుల కఠోర శ్రమతో వేలాది ఎకరాల బంజరు భూమి నేడు పచ్చదనం సంతరించుకున్నదని నేను విన్నాను. వారు నాటిన వేలాది మొక్కలు వృక్షాలుగా ఎదిగి, నిస్వార్థ  సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని విని ఎంతో సంతోషిస్తున్నాను.

 

సోదరీ సోదరులారా, 

ఈ సేవా స్ఫూర్తి నేడు మా ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన వల్ల నేడు  నిరుపేదలంతా ఆహారం విషయంలో ఆందోళన లేకుండా ఉన్నారు. ఆయుష్మాన్ యోజన వల్ల నేడు ప్రతి పేదవాడు, వృద్ధుడు చికిత్స విషయంలో ఆందోళన లేకుండా ఉన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వల్ల నేడు  పేదవారిలో పక్కా ఇల్లు లేదనే చింత తొలగిపోయింది. జల్ జీవన్ మిషన్ యోజన వల్ల నేడు ప్రతి గ్రామంలో నీటి సమస్య పరిష్కారమవుతోంది. దేశంలో కొత్త  ఏఐఐఎంఎస్ లు, ఐఐటీలు, ఐఐఎంలు  రికార్డు స్థాయిలో ఏర్పాటవుతున్నాయి. నిరుపేద విద్యార్థుల  కలలు సాకారం అవుతున్నాయి. పర్యావరణాన్ని, ప్రకృతిని పరిరక్షించడం కోసం ప్రభుత్వం ‘ఏక్ పేడ్ మా కే నామ్’  ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్లాది చెట్లు నాటారు. ఈ విధంగా దేశం విస్తృత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయగలగడం వెనుక ఉన్న ప్రధాన కారణం మన సేవాస్ఫూర్తి మాత్రమే. నిరుపేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకున్న సంకల్పం, 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' మంత్రం, ఈ సేవా భావమే  నేడు ప్రభుత్వ విధానంగా, నిబద్ధతగా మారింది.

మిత్రులారా,

సేవ చేయాలనే సంకల్పంతో కలిసి పనిచేస్తే ఇతరులకు మేలు జరగడమే కాదు. సేవాభావం మన వ్యక్తిత్వాన్ని కూడా పెంచుతుంది. మన ఆలోచనలను విస్తృతంగా చేస్తుంది. సేవ మనల్ని  వ్యక్తిగత పరిధి నుంచి  బయటకు తెచ్చి సమాజం, దేశం, మానవత్వం అనే విశాల లక్ష్యాలతో మనల్ని అనుసంధానిస్తుంది. సేవ చేయడం కోసం కలిసి, ఐక్యంగా పని చేయడం నేర్చుకుంటాం. జీవితంలోని వివిధ కోణాలను మనం అర్థం చేసుకుంటాం. మీరంతా సేవా కార్యక్రమాలకు అంకితమైన వ్యక్తులు. మీరు మీ జీవితంలో కష్టాలతో పోరాడి, ఆపై వాటిని అధిగమించి ఉంటారు, సేవ చేసేటప్పుడు ఇవన్నీ మనం సులభంగా నేర్చుకుంటాం. అందుకే నేను చెబుతున్నాను... సేవ ఒక సాధన, అది ప్రతి వ్యక్తి స్నానం చేయాల్సిన గంగ వంటిది. 

 

మిత్రులారా,

అశోక్ నగర్, ఆనందపూర్ ధామ్ వంటి ప్రాంతాలు దేశానికి ఎంతో ఇచ్చాయి. ఈ ప్రాంతాల అభివృద్ధి కూడా మన బాధ్యతే. ఈ ప్రాంతం కళ, సాంస్కృతిక వైభవం సహజసిద్ధమైన అందాలను సంతరించుకుంది. ఇక్కడ అభివృద్ధి, వారసత్వానికి అపార అవకాశాలున్నాయి. అందుకే ఎంపీ, అశోక్ నగర్ లో అభివృద్ధిని శరవేగంగా పెంచుతున్నాం. చందేరి చేనేతను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు చందేరి చీరకు జీఐ ట్యాగ్ ఇచ్చారు. ప్రాన్‌పూర్‌లో క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ టూరిజం విలేజ్ ప్రారంభమైంది. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును ఇస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఉజ్జయినిలో జరిగే సింహస్థ మహోత్సవానికి సన్నాహాలు ప్రారంభించింది. 

సోదరీ సోదరులారా,

కొద్ది రోజుల క్రితం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలో రామ వనగమన మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ రామ వనగమన మార్గంలో కీలకమైన భాగం మధ్యప్రదేశ్ మీదుగా వెళ్తుంది. మన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అద్భుతమైనది.. ఆహ్లాదకరమైనది. ఈ కార్యకలాపాల ద్వారా దాని ప్రఖ్యాతి మరింత బలోపేతం అవుతుంది.

 

మిత్రులారా,

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా ఎదగాలని మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది. కచ్చితంగా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. అయితే ఈ ప్రయాణంలో మనం ఎప్పుడూ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అభివృద్ధి పథంలో ప్రపంచంలోని అనేక దేశాలు తమ సంస్కృతికి దూరమై తమ సంప్రదాయాలను మరచిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ భారతదేశంలో మన ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవాలి. భారతదేశం వంటి దేశంలో మన సంస్కృతి మన అస్తిత్వంతో ముడిపడి ఉందని మనం గుర్తుంచుకోవాలి. మన సంస్కృతే మన బలం. ఆనందపూర్ ధామ్ ట్రస్ట్ ఈ దిశగా అనేక పనులు చేస్తుండటం సంతోషంగా ఉంది. అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని ఆనందపూర్ ధామ్ సేవా కార్యక్రమాలు కొత్త శక్తితో ముందుకు తీసుకువెడతాయని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ బైశాఖి, శ్రీ గురు మహరాజ్ జయంతి సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అభినందనలు. జై శ్రీ సచ్చిదానంద.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"