India and the UK have successfully finalised the Free Trade Agreement: PM
India is becoming a vibrant hub of trade and commerce: PM
Nation First - Over the past decade, India has consistently followed this very policy: PM
Today, when one sees India, then they can be rest assured that Democracy can deliver: PM
India is moving from GDP- centric approach towards Gross Empowerment of People (GEP) - centric progress: PM
India is showing the world how tradition and technology can thrive together: PM
Self-reliance has always been a part of our economic DNA: PM

నమస్కారములు,

 

ఈరోజు పొద్దున్న నుంచీ భారత్ మండపం ఒక శక్తిమంతమైన వేదికగా మారింది. కొద్ది నిమిషాల క్రితం మీ బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది. ఈ సదస్సు పూర్తి వైవిధ్యంతో కూడినది. ఇక్కడ హాజరైన చాలా మంది ప్రముఖులు ఈ సదస్సుకు నిండుదనం తెచ్చారు. మీ అనుభవం కూడా చాలా విలువైనదని నేను నమ్ముతున్నా. ఈ సదస్సులో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక విధమైన ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా మన డ్రోన్ దీదీలు, లఖ్పతి దీదీలు ఉత్సాహంగా తమ అనుభవాలను పంచుకోవడాన్ని నేను ఇప్పుడే ఈ వ్యాఖ్యాతలందరినీ కలిసినప్పుడు చూడగలిగాను. వారు తమ ప్రతి మాటా గుర్తుంచుకున్నారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన సందర్భం.

 

మిత్రులారా...

 

 ప్రతి రంగంలోనూ తన గొంతు పెంచుకుంటూ మారుతున్న భారత్ కు ఇది ప్రతిబింబం. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించడమనేది పురోగమిస్తున్న భారత్ అతిపెద్ద కల. దీన్ని సాధించే సామర్థ్యం, వనరులు, సంకల్ప శక్తి మన దేశానికి ఉన్నాయి. "లేవండి.. పరుగులు తీయండి.. లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు" అని స్వామి వివేకానంద తరచు చెప్పేవారు.. ఈ రోజు నేను ప్రతి భారతీయుడిలో ఆ స్ఫూర్తిని చూడగలుగుతున్నా. ఇటువంటి ప్రయత్నాలు, చర్చలు, ముఖ్యంగా యువత భాగస్వామ్యం 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు అద్భుతమైన సదస్సును నిర్వహించారు. నా స్నేహితుడు అతిదేబ్ సర్కార్ జీ, నా పాత సహచరుడు రజనీష్, యావత్ ఏబీపీ నెట్వర్క్ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా.

 

మిత్రులారా...

 

ఈ రోజు భారత్ కు చారిత్రాత్మక రోజు. కొద్దిసేపటి క్రితం, నేను ఇక్కడికి రాకముందు బ్రిటన్ ప్రధానితో మాట్లాడాను. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు అయినట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ప్రపంచంలోని రెండు ప్రధాన, బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పర వాణిజ్యం, ఆర్థిక సహకారంపై ఈ ఒప్పందం రెండు దేశాల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది. ముఖ్యంగా మన యువతకు ఇది గొప్ప వార్త. ఇది భారత్ లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుంది. భారతీయ వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఇటీవల యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ వంటి దేశాలతోనూ ఇదేమాదిరి వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిన విషయం మీకు తెలుసు. భారత్ కేవలం సంస్కరణలను అమలు చేయడమే కాదు, ఆయా ప్రపంచ దేశాలతో చురుగ్గా వ్యవహరిస్తూ వాణిజ్య కార్యకలాపాలకు ఒక శక్తిమంతమైన కేంద్రంగా రూపాంతరం చెందుతోందని ఇది నిరూపిస్తుంది.

 

మిత్రులారా...

 

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మన లక్ష్యాలను సాధించడానికి, దేశ ప్రయోజనాలకు మొదటి స్థానం ఇవ్వడం, దేశ సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండటం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ మన దేశంలో దశాబ్దాలుగా దీనికి విరుద్ధమైన మనస్తత్వంతో వ్యవహరించడం వల్ల దేశం చాలా ఇబ్బందులు పడింది. దేశం చాలా బాధపడింది. గతంలో ఏదైనా ప్రముఖ నిర్ణయం తీసుకునే ముందో లేదా ముఖ్యమైన అడుగు వేసేముందో ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది? దీనివల్ల మనకు ఓట్లు వస్తాయా? కుర్చీ సురక్షితంగా ఉంటుందా? ఓటు బ్యాంకు పడిపోతుందా? అని నాయకులు ఆలోచించేవారు. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రావడం వల్ల ప్రధాన నిర్ణయాలు, పెద్ద సంస్కరణలు వాయిదా పడుతూ వచ్చాయి.

 

మిత్రులారా...

 

ఈ తరహా దృక్పథంతో ఏ దేశం కూడా ముందుకు పోదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు "దేశ ప్రయోజనాలకే ప్రథమ స్థానం" అన్న ఆలోచన కలిగితేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. గత దశాబ్దంలో భారత్ ఇదే విధానంతో ముందుకు సాగింది. దాని ఫలితాలను మనమిప్పుడు చూస్తున్నాం.

 

మిత్రులారా...

 

దశాబ్దాలుగా నిలిచిపోయిన, ఆలస్యమైన లేదా పట్టాలు తప్పిన, రాజకీయ సంకల్పం లేక ఆగిపోయిన ఎన్నో నిర్ణయాల విషయంలో గత 10-11 ఏళ్లలో మా ప్రభుత్వం ఒకదాని తరువాత ఒకటి నిర్ణయాలు తీసుకుంది. ఉదాహరణకు, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మన బ్యాంకింగ్ రంగాన్ని తీసుకోండి. అంతకుముందు బ్యాంకుల నష్టాల గురించి మాట్లాడకుండా ఏ సమావేశమూ పూర్తయ్యేది కాదు. 2014 కి ముందు మన దేశంలో బ్యాంకులు పూర్తిగా పతనమయ్యే దశలో ఉన్నాయి. కానీ నేటి పరిస్థితి ఏమిటి? నేడు, భారతదేశ బ్యాంకింగ్ రంగం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యవస్థలలో ఒకటి. మన బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. డిపాజిటర్లకు ఆ ప్రయోజనాలు దక్కుతున్నాయి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చిన్న బ్యాంకులను విలీనం చేయడం, వాటి సామర్థ్యాలను పెంచడం వంటి బ్యాంకింగ్ సంస్కరణలను మా ప్రభుత్వం నిరంతరం అమలు చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఎయిరిండియా పరిస్థితి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సంస్థ మునిగిపోతోంది. ఏటా వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నాయి. అయినప్పటికీ మునుపటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడానికి సంకోచించాయి. మేం నిర్ణయం తీసుకుని ఆ నష్టాల బారి నుంచి తప్పించాం. ఎందుకు? ఎందుకంటే మాకు దేశ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యం కాబట్టి.

మిత్రులారా...

 

ప్రభుత్వం పేదలకు ఒక రూపాయి ఇస్తుంటే అందులో 85 పైసలు వృథా అవుతాయని మన దేశ మాజీ ప్రధాని ఒకసారి అంగీకరించారు. ప్రభుత్వాలు మారాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ పేదలకు చేరాల్సిన మొత్తం వారికి చేరేలా కచ్చితమైన చర్యలు తీసుకోలేదు. ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే మొత్తం 100 పైసలు లబ్ధిదారునికి చేరాలనేది మా లక్ష్యం. దీని కోసం, మేం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేశాం. ఇది ప్రభుత్వ పథకాలలో లీకేజీని ఆపి ఉద్దేశించిన గ్రహీతలకు ప్రయోజనాలు నేరుగా చేరేలా చేసింది. నేనో విషయం చెబుతా.. ప్రభుత్వ ఫైళ్ళ ప్రకారం 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నారు. అవును, 10 కోట్లు! ఇంకా పుట్టని వ్యక్తులు కూడా ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా పొందుతున్నారు. ఈ దుర్వ్యవస్థకు బాధ్యులు మునుపటి ప్రభుత్వాలే. మా ప్రభుత్వం ఈ 10 కోట్ల నకిలీ పేర్లను తొలగించి మొత్తం ప్రయోజనాన్ని డీబీటీ ద్వారా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా చూసింది. ఫలితంగా 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా -అవును అక్షరాలా మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా- పక్కదారి పట్టకుండా కాపాడగలిగాం. మరో మాటలో చెప్పాలంటే మేం మీ డబ్బును ఆదా చేశాం. మీ డబ్బును కాపాడాం. కానీ మోదీకి మాత్రం నిందలు మిగిలాయి.

 

మిత్రులారా...

 

వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) ను తీసుకోండి. ఇది అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. గతంలో ఇది ప్రభుత్వ ఖజానాపై భారం వేస్తుందనే సాకుతో పక్కన పెట్టేశారు. కానీ మా ప్రభుత్వం దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారి ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చింది. నేడు లక్షలాది సైనిక కుటుంబాలు ఓఆర్ఓపీ ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. ఇప్పటివరకు, మా ప్రభుత్వం ఈ పథకం కింద మాజీ సైనికులకు 1.25 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేసింది.

 

మిత్రులారా...

 

దశాబ్దాలుగా దేశంలో పేద కుటుంబాలకు రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. దాన్ని అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల విషయంలో గత కొన్నేళ్లుగా ఏమి జరిగిందో దేశంలోని ప్రతి ఒక్కరూ చూశారు. దీన్ని ఆలస్యం చేయడం వెనుక స్వార్థపూరిత ప్రయోజనాలున్నాయి. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరం. అందుకే మా ప్రభుత్వం లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని రూపొందించి నారీ శక్తికి మరింత సాధికారత కల్పించింది.

 

మిత్రులారా...

 

ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతో ఎవరూ చర్చించడానికి కూడా ఇష్టపడని అనేక సమస్యలు గతంలో ఉన్నాయి. ఉదాహరణకు ట్రిపుల్ తలాక్ అంశాన్ని తీసుకోండి. ఇది ఎందరో ముస్లిం మహిళల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కానీ ఆ సమయంలో అధికారంలో ఉన్నవారు పట్టించుకోలేదు. మహిళల ప్రయోజనాల కోసం, ముస్లిం కుటుంబాల సంక్షేమం కోసం ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా, దశాబ్దాలుగా వక్ఫ్ చట్టాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ గొప్ప ఉద్దేశం ఓటు బ్యాంకు కారణంగా పక్కకెళ్ళిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు వక్ఫ్ చట్టానికి అవసరమైన సవరణలు జరిగాయి. ముస్లిం తల్లులు, సోదరీమణులతో పాటు పేద, అట్టడుగున ఉన్న (పాస్మండా) ముస్లింలకు నిజంగా ఇవి ప్రయోజనం చేకూర్చే సంస్కరణలే.

 

మిత్రులారా...

 

అంతగా చర్చకు నోచుకోని మరో ప్రధానాంశం నదుల అనుసంధానం. నీటి గురించి అతిదేబ్ జీ ఇప్పుడే అడిగారు... "ఏమి చేస్తారు?" అని. దశాబ్దాలుగా మన దేశంలో నదీ జలాలు ఉద్రిక్తత, వివాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. కానీ మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నదులను అనుసంధానించడానికి భారీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కెన్-బెత్వా లింక్ ప్రాజెక్ట్, పార్వతి-కలిసింద్-చంబల్ లింక్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టులు లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ రోజుల్లో, నీటి గురించి మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. దాని అర్థం ఏమిటో మీ అందరికీ చాలా త్వరగా తెలుస్తుంది. ఇంతకుముందు భారత్ కు హక్కుగా ఉన్న నీరు కూడా మన సరిహద్దుల వెలుపల ప్రవహించేది. ఇప్పుడు, భారతదేశపు నీరు భారతదేశపు ప్రయోజనాల కోసమే ప్రవహిస్తుంది. భారత్ లోనే ఉంటుంది. భారత్ కే ఉపయోగపడుతుంది.

 

మిత్రులారా...

 

చాలా దశాబ్దాల తరువాత చివరకు కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారని ప్రజలు తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దశాబ్దాల నిరీక్షణ తరువాత ఢిల్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ స్మారక చిహ్నాన్ని నిర్మించింది మా ప్రభుత్వమే అన్న విషయం గురించి పెద్దగా మాట్లాడుకోరు. అటల్ జీ ప్రభుత్వ హయాంలో ఈ ఆలోచన మొదలైనా ఈ ప్రాజెక్ట్ ఒక దశాబ్దం పాటు నిలిచిపోయింది. మన ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడమే కాదు, పంచతీర్థ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా, ప్రపంచవ్యాప్తంగానూ బాబాసాహెబ్ తో ముడిపడి ఉన్న కీలక ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసింది.

మిత్రులారా...

 

 

2014లో, వ్యవస్థల మీద ప్రజలు దాదాపుగా నమ్మకాన్ని కోల్పోయిన సమయంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన దేశంలో ప్రజాస్వామ్యం, అభివృద్ధి రెండూ ఒకే ఒరలో ఒదుగుతాయా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు, భారత్‌ను చూస్తున్నవారు ఎవరైనా సరే ‘‘ప్రజాస్వామ్యం సత్ఫలితాలు సాధిస్తుంది’’ అని గర్వంగా చెప్పగలుగుతున్నారు. గడచిన దశాబ్దంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఇది ప్రజాస్వామ్యం సత్ఫలితాలు సాధించగలదనే నమ్మకాన్నిచ్చింది. ముద్రా రుణాలు తీసుకున్న లక్షలాది సూక్ష్మ తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రజాస్వామ్యం ఫలితాలను పొందారు. వెనకబడినవిగా ముద్ర వేసి వదిలేసిన డజన్ల కొద్దీ జిల్లాలు ఇప్పుడు ఆకాంక్షాత్మక జిల్లాలుగా రూపాంతరం చెంది, అభివృద్ధి సూచికలు అన్నింటిలోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యం సత్ఫలితాలు సాధిస్తుందనడానికి స్పష్టమైన రుజువు. మన దేశంలో అభివృద్ధి ప్రయోజనాలు పొందని, అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలు ఉన్నాయని కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం పీఎం జన్మన్ పథకం ద్వారా ఈ సమూహాలన్నీ ఎట్టకేలకు ప్రభుత్వ సేవలు పొందుతున్నాయి. వారికి కూడా ప్రజాస్వామ్యం ఫలితం ఇస్తుందనే నమ్మకం కలిగింది. నిజమైన ప్రజాస్వామ్యం అంటే చివరి వ్యక్తి వరకు ఎలాంటి వివక్ష లేకుండా దేశాభివృద్ధి, వనరులు చేరాలి. మా ప్రభుత్వం చేస్తున్నది ఇదే.                                                                    

 

మిత్రులారా...

 

ఈ రోజు మనం కొత్త భారత్‌ను నిర్మిస్తున్నాం – ఇక్కడ అభివృద్ధి వేగంగా ఉంటుంది. మన వృద్ధి కేవలం ఆలోచనలు, సంకల్పానికే పరిమితమవకుండా, దయతో సుసంపన్నం అవుతుంది. మానవ కేంద్రీకృత ప్రపంచీకరణను మనం ఎంచుకున్నాం. ఇక్కడ అభివృద్ధిని మార్కెట్లు నిర్దేశించవు. ప్రజలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించడం, వారి కలలను సాకారం చేసుకొనేలా సహకరించడమే నిజమైన అభివృద్ధికి కొలమానాలుగా మేం భావిస్తున్నాం. జీడీపీ- కేంద్రీకృత విధానం నుంచి జీఈపీ- కేంద్రీకృత అభివృద్ధి దిశగా మనం కదులుతున్నాం. జీఈపీ అంటే – ప్రజల స్థూల సాధికారత. అంటే అందరికీ సాధికారత అని అర్థం. పేదవాడికి శాశ్వత నివాసం దొరికినప్పుడు వారికి సాధికారత లభిస్తుంది. వారి ఆత్మగౌరవం పెరుగుతుంది. పేదవారి ఇంట్లో టాయిలెట్ నిర్మిస్తే.. బహిరంగ మలవిసర్జన వల్ల ఎదురయ్యే అవమానాల నుంచి వారికి విముక్తి లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా వారికి రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్యం లభిస్తే, అది వారి జీవితాల్లోంచి పెద్ద సమస్యను తొలగిస్తుంది. ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇవన్నీ మానవత్వంతో నిండిన అభివృద్ధి మార్గాన్ని బలోపేతం చేస్తాయి. ఈ దేశ ప్రజలకు నిజమైన సాధికారతను అందిస్తాయి.

 

మిత్రులారా...

 

కొన్ని రోజుల క్రితం, సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్భంగా నేను ‘‘నాగరిక్ దేవోభవ’’ – పౌరుడు దైవంతో సమానం అనే మంత్రం గురించి మాట్లాడాను. ఇది మా ప్రభుత్వం అనుసరిస్తున్న ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి. మేం జనత (ప్రజలు)ను జనార్థనుడు (దైవం)గా చూస్తున్నాం. గతంలో ‘‘మే-బాప్’’ (పాలకుడు – పాలన) అనే సంస్కృతి ప్రభుత్వ కార్యకలాపాలపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో పనిచేస్తోంది. ఇక్కడ చాలా మంది యువతీయువకులు ఉన్నారు. ఈ రోజుల్లో మీరు ఎన్నో ఫారాలను ఆన్లైన్లో నింపుతున్నారు. కానీ ఒకప్పుడు మీ పత్రాలను ధ్రువీకరించడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పనిని స్వీయ ధ్రువీకరణ ద్వారా కూడా చేసుకోవచ్చు.

 

మిత్రులారా...

 

సీనియర్ సిటిజన్లకు సైతం ఒకప్పుడు ఇలాంటి కాలం చెల్లిన వ్యవస్థలే ఉండేవి. వృద్ధులు ప్రతి ఏడాది తాము పనిచేసిన కార్యాలయాలకు వెళ్లి తాము బతికే ఉన్నామని నిరూపించుకోవాల్సి వచ్చేది. లేదా బ్యాంకుకి వెళ్లి ‘‘నేను ఇంకా బతికే ఉన్నాను. నాకు పెన్షన్ రావాలి’’ అని చెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ సమస్యలకు మేం పరిష్కారం కనుగొన్నాం. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు తమ జీవన ప్రమాణ పత్రాలను ఎక్కడి నుంచైనా సరే డిజిటల్‌ రూపంలో సమర్పించవచ్చు. విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవడం, నీటి కుళాయి బిగించడం, బిల్లులు చెల్లించడం, గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, గ్యాస్ సిలిండర్ తీసుకోవడం లేదా సరఫరా చేయడం లాంటి వాటి కోసం గతంలో ప్రజలు కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. దాని కోసం సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది.

 

ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా మారిపోయింది. ఇలాంటి ఎన్నో పనులు ఇప్పుడు ఆన్‌లైన్లోనే పూర్తవుతున్నాయి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడమైనా, పన్ను మినహాయింపులకు అభ్యర్థించడమైనా లేదా మరింకేదైనా సరే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉండే ప్రతి వ్యవస్థను సులభంగా, వేగంగా, సమర్థంగా మార్చేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ‘‘నాగరిక్ దేవోభవ’’ అన్నదానికి ఇదే నిజమైన అర్థం. ఈ స్ఫూర్తితోనే మేం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

 

మిత్రులారా...

 

ప్రస్తుతం భారత్ తన సంప్రదాయాలను అనుసరిస్తూనే పురోగతి సాధిస్తోంది. ‘వికాస్’ (అభివృద్ధి), ‘విరాసత్’ (వారసత్వం) ఇదే మా మంత్రం. సాంకేతికత, సంప్రదాయం కలసి ఎలా వృద్ధి చెందుతాయో మనం ఇప్పుడు చూస్తున్నాం. డిజిటల్ లావాదేవీల అంశంలో ప్రపంచంలోని అగ్రదేశాల్లో మనమూ ఒకరిగా ఉన్నాం. అదే సమయంలో యోగా, ఆయుర్వేదం లాంటి మన వారసత్వ సంపదను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళుతున్నాం. ప్రస్తుతం, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం ఎదురుచూస్తోంది. గడచిన దశాబ్దంలో రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)లు మన దేశానికి వచ్చాయి. వీటితో పాటుగా చోరీకి గురైన కళాకృతులు, ఇతర సాంస్కృతిక చిహ్నాలు పెద్ద సంఖ్యలో భారత్‌కు తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఉంది. అదే సమయంలో తృణధాన్యాల ఉత్పత్తిలో కూడా మనం ముందున్నాం. సూర్యమందిరానికి నిలయమైన భారత్‌ ఇప్పుడు 100 గిగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది.

మిత్రులారా...

 

2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధించే దిశగా మనం వేస్తున్న ప్రతి అడుగుకి తనదైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రభావం ఎంత విస్తృతంగా ఉంటుందనే అంశాన్ని ప్రజలు అన్నిసార్లు పట్టించుకోరు. మీడియా, కంటెంట్ రంగం గురించి మీకో ఉదాహరణ చెప్తాను. పదేళ్ల క్రితం నేను డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతుంటే ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ ఇండియా మన జీవితంలో ఓ కీలక భాగమైంది. చౌకగా లభిస్తున్న డేటా, సరసమైన మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్లు కొత్త విప్లవానికి నాంది పలికాయి. డిజిటల్ ఇండియా జీవితాలను ఎలా సులభతరం చేసిందో మనందరం చూస్తున్నాం. అయినప్పటికీ, కంటెంట్, సృజనాత్మకతకు సంబంధించిన కొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టించిందో చాలా తక్కువగా చర్చల్లోకి వచ్చింది.  

 

బాగా వంట చేయగలిగిన గ్రామీణ మహిళ ఇప్పుడు మిలియన్-సబ్‌స్క్రైబర్ క్లబ్‌లో సభ్యురాలిగా ఉంది. గిరిజన ప్రాంతానికి చెందిన యువకుడు తన సంప్రదాయ కళతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అవుతున్నాడు. ఓ పాఠశాల విద్యార్థి సాంకేతికతకు సంబంధించిన అంశాలను అద్భుతంగా ప్రదర్శిస్తున్నాడు. ఈ మధ్యే, మొదటి వేవ్స్ సదస్సు ముంబయిలో జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మీడియా, వినోదం, సృజనాత్మక రంగాలకు చెందినవారిని ఈ కార్యక్రమం ఒక్కచోట చేర్చింది. దీనిలో పాల్గొనే అవకాశం నాక్కూడా లభించింది. భారతీయ కంటెంట్ క్రియేటర్లకు గడచిన మూడేళ్లలో కేవలం యూట్యూబ్ నుంచే 21,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఒకరు నాకు చెప్పారు. – అక్షరాలా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు! అంటే దీని అర్థం ప్రస్తుతం మన ఫోన్లు సమాచార ప్రసారం కోసం మాత్రమే కాకుండా, సృజనాత్మకత ప్రదర్శించడానికి, ఆదాయార్జనకు సహకరించే శక్తిమంతమైన సాధనాలుగా ఉపయోగిస్తున్నాం.

 

మిత్రులారా...

 

 

2047నాటికి ‘వికసిత్ భారత్’ సాధనతో పాటు ఆత్మనిర్భర భారత్ (స్వావలంబన సాధించిన భారత్) సాధించాలని మనం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. స్వావలంబన మన ఆర్థిక డీఎన్ఏలో ఒక భాగంగా ఉంది. అయినప్పటికీ భారత్ ఉత్పత్తిదారు కాదు వినియోగదారు మాత్రమే అని తరచూ మనకు చెబుతూ ఉండేవారు. ఇప్పడు ఆ ట్యాగ్ కూడా తొలగిపోతుంది. రక్షణ రంగంలో ప్రధాన తయారీదారు, ఎగుమతిదారుగా భారత్ ఎదుగుతోంది. ఇప్పడు మన రక్షణ ఉత్పత్తులు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ వాహక నౌకలను పూర్తిగా స్వదేశీ సామర్థ్యంతో భారత్ నిర్మించింది. అసలు మన బలాలుగా పరిగణించని ఎన్నో రంగాల్లో భారత్ ఇప్పుడు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ రంగం తీసుకుందాం. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ ప్రధాన ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా మారింది. స్థానికంగా తయారు చేసిన మన ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ చేరుతున్నాయి. ఇటీవలే ఎగుమతులకు సంబంధించిన డేటా విడుదలైంది. గతేడాది భారత్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 825 బిలియన్ డాలర్ల వరకు చేరుకున్నాయి. ఒక్క దశాబ్దంలోనే భారత్ ఎగుమతులు రెట్టింపయ్యాయని ఇది తెలియజేస్తోంది. దీన్ని మరింత వేగవంతం చేసి, కొత్త శిఖరాలకు చేర్చేందుకు మేం ఈ ఏడాది బడ్జెట్లో మిషన్ మ్యానుఫాక్చరింగ్‌ను ప్రకటించాం. ఈ తయారీ సామర్థ్యం భారతీయుల గుర్తింపును క్రియేటర్లుగా, ఆవిష్కర్తలుగా, సంచలనం సృష్టించేవారిగా మారుస్తోంది.

 

మిత్రులారా...

 

రాబోయే శతాబ్దాల్లో భారత్ భవిష్యత్తును ఈ దశాబ్దమే నిర్ణయించబోతోంది. మన దేశానికి కొత్త దిశను అందించాల్సిన సమయం ఇదే. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి సంస్థ, ప్రతి రంగంలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది. ఈ సదస్సులో జరిగిన చర్చల్లో సైతం ఆ ఉత్సాహం, ఆశావహ దృక్పథం కనిపించాయి. మరోసారి ఈ సదస్సును ఏర్పాటు చేసిన ఏబీపీ నెట్వర్క్‌ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ రాత్రివేళలో.. ఆలస్యమవతున్నప్పటికీ ఈ సమావేశంలో మీరు ఉన్నారు. ఇది ఉజ్వలమైన భవిష్యత్తుకు సూచన. మీరు ఎంచుకున్న ఈ ప్రత్యేకమైన విధానాన్ని అభినందిస్తున్నాను. నేను మీ అతిథుల జాబితాను చూశాను. అందులో యువత- ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు సైతం ఉన్నారు. వారికి కొత్త ఆలోచనలు, ధైర్యం ఉంటాయి. వారు చెప్పినవి శ్రద్ధగా వింటే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ శక్తి మన దేశంలో ఉంది. మీరు చాలా మంచి పని చేశారు. దానికి మీకు అభినందనలు. ధన్యవాదాలు.

 

నమస్కారం!

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India's energy sector records rapid growth in last 10 years, total installed capacity jumps 56%

Media Coverage

India's energy sector records rapid growth in last 10 years, total installed capacity jumps 56%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to Dr. Syama Prasad Mukherjee on his Balidan divas
June 23, 2025

The Prime Minister Shri Narendra Modi today paid tributes to Dr. Syama Prasad Mukherjee on his Balidan Divas.

In a post on X, he wrote:

“डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर कोटि-कोटि नमन। उन्होंने देश की अखंडता को अक्षुण्ण रखने के लिए अतुलनीय साहस और पुरुषार्थ का परिचय दिया। राष्ट्र निर्माण में उनका अमूल्य योगदान हमेशा श्रद्धापूर्वक याद किया जाएगा।”