పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరం: పీఎం
గత రెండు-మూడు వారాలుగా ఈ అంశంపై అవసరమైన సమాచారాన్ని జై శంకర్, హర్దీప్ పూరీ సభకు అందిస్తున్నారు: పీఎం
మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది, ఈ సంక్షోభాన్ని త్వరితగతిన పరిష్కరించాలని అన్ని పక్షాలను ఈ ప్రపంచమంతా కోరుతోంది: పీఎం
గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న, నివసిస్తున్న భారతీయుల సంఖ్య సుమారుగా కోటి.. అందువల్ల ఈ ప్రాంతం మనకు ముఖ్యమైనది: పీఎం
ఈ సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో పనిచేసే భారతీయ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువే: పీఎం
ఇలాంటి అనేక కారణాల వల్ల భారత్ ఆందోళలను సహజంగానే ఎక్కువగా ఉంటాయి, ఈ సంక్షోభంపై భారత
పార్లమెంటు నుంచి ముక్తకంఠంతో ఏకగ్రీవంగా వ్యక్తమయ్యే అభిప్రాయం ప్రపంచానికి చేరడం అవసరం: పీఎం
యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు, యుద్ధం వల్ల ప్రభావితమైన దేశాలతో భారత్‌కు విస్తృతమైన వాణిజ్య
సంబంధాలున్నాయి, ఇతర దేశాలతో మన వాణిజ్యానికి యుద్ధం జరుగుతున్న ఈ ప్రాంతం చాలా కీలకమైన మార్గం: పీఎం
దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి చమురు, సహజవాయువు, ఎరువుల్లో సింహ భాగం హర్మూజ్ జలసంధి గుండా
వస్తుంది, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకల ప్రయాణం సవాలుగా మారింది: పీఎం
అయినప్పటికీ, దేశంలో పెట్రోలు, డీజిలు సరఫరాపై పెద్ద ప్రభావం పడకుండా, సాధారణ కుటుంబాలకు ఎదురయ్యే అసౌకర్యాన్ని తక్కువ స్థాయికే పరిమితం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: పీఎం

గౌరవ అధ్యక్షా, 

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, వాటి వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడటానికి నేను ఈ గౌరవనీయ సభ ముందుకు వచ్చాను. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. గత రెండు మూడు వారాలుగా శ్రీ జైశంకర్ గారు, శ్రీ హర్దీప్ పూరీ గారు ఈ విషయంపై అవసరమైన తాజా సమాచారాన్ని ఈ సభకు అందించారు. ఇప్పుడు ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై దీని ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం అన్వేషించాలని ప్రపంచమంతా అన్ని పక్షాలను కోరుతోంది.

గౌరవ అధ్యక్షా, 

ఈ యుద్ధం భారతదేశానికి ఆర్థిక- జాతీయ భద్రత, మానవతా పరంగా ఊహించని సవాళ్లను సృష్టించింది. యుద్ధం జరుగుతున్న దేశాలతోనూ, దాని ప్రభావానికి గురవుతున్న ఇతర దేశాలతోనూ భారత్‌కు విస్తృతమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ ఘర్షణలు జరుగుతున్న ప్రాంతం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో మన వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం. అన్నిటికంటే ముఖ్యంగా మనకు అవసరమైన ముడి చమురు, గ్యాస్ అవసరాలలో అధిక భాగాన్ని ఈ ప్రాంతమే తీరుస్తోంది. మరొక కారణం చేత కూడా ఈ ప్రాంతం మనకు చాలా కీలకం.. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ పని చేస్తున్నారు. ఈ సముద్ర జలాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారు. ఈ కారణాలన్నింటి వల్ల భారత్ ‌ఆందోళన చెందడం సహజం. అందువల్ల ఈ సంక్షోభంపై భారత పార్లమెంటు నుంచి ప్రపంచానికి ఐక్యతతో కూడిన ఏకగ్రీవ స్వరం వినిపించటం అత్యవసరం.

గౌరవ అధ్యక్షా, 

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభావిత దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడికి అవసరమైన సహాయం అందిస్తున్నాం. నేనే స్వయంగా పశ్చిమాసియాలోని మెజారిటీ దేశాల అధ్యక్షులతో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడాను. వారందరూ భారతీయుల పూర్తి భద్రతకు హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోయారు.. మరికొందరు గాయపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం.. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చూసుకుంటున్నాం. 

గౌరవ అధ్యక్షా, 

ప్రభావిత దేశాల్లోని మన రాయబార కార్యాలయాలన్నీ భారతీయులకు సహాయం చేయడంలో నిరంతరం నిమగ్నమై ఉన్నాయి. అక్కడ పనిచేసే కార్మికులు కావొచ్చు పర్యాటకులు కావొచ్చు.. ప్రతి ఒక్కరికీ సాధ్యమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. మన రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తున్నాయి. ఇక్కడ భారతదేశంలోనూ, ఇతర ప్రభావిత దేశాలలోనూ 24 గంటల కంట్రోల్‌ రూంలు, అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ప్రభావితమైన వారందరికీ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతోంది. 

గౌరవ అధ్యక్షా,

సంక్షోభ సమయాల్లో స్వదేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3,75,000 మందికి పైగా భారతీయులు క్షేమంగా భారత్‌కు తిరిగి వచ్చారు. ఒక్క ఇరాన్ నుంచే దాదాపు 1,000 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి రాగా.. అందులో వైద్య విద్యను అభ్యసిస్తున్న 700 మందికి పైగా యువ విద్యార్థులు ఉన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అటువంటి అన్ని పాఠశాలల్లో జరగాల్సిన సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ పిల్లల విద్యకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు సీబీఎస్ఈ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఎంతో సున్నితంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తోందని.. సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఇది నిరూపిస్తోంది.

గౌరవ అధ్యక్షా, 

హోర్ముజ్ జలసంధి ద్వారా భారతదేశం భారీ పరిమాణంలో ముడి చమురు, గ్యాస్, ఎరువులను దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు అత్యంత సమస్యాత్మకంగా మారాయి. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలగకుండా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. సామాన్య కుటుంబాలకు ఇబ్బందులు తగ్గించడమే మా ప్రధాన లక్ష్యం. భారతదేశం ఎల్‌పీజీ అవసరాలలో 60 శాతాన్ని దిగుమతుల ద్వారానే పొందుతుందని మనందరికీ తెలుసు. సరఫరాలో అనిశ్చితి నెలకొన్నందున ప్రభుత్వం గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీకి ప్రాధాన్యత ఇస్తోంది.. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని కూడా పెంచుతోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగేలా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గౌరవ అధ్యక్షా, 

నేటి పరిస్థితుల్లో ఇంధన భద్రత కోసం గత దశాబ్ద కాలంగా మేం తీసుకున్న చర్యలు మరింత సందర్భోచితంగా మారాయి. గత 11 ఏళ్లలో భారతదేశ ఇంధన దిగుమతుల వనరులు వికేంద్రీకృతం అయ్యాయి. గతంలో ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీలను కేవలం 27 దేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ నేడు 41 దేశాల నుంచి ఇంధనం భారత్‌కు దిగుమతి అవుతోంది.

గౌరవ అధ్యక్షా, 

గత దశాబ్ద కాలంలో సంక్షోభ సమయాల కోసం ముడి చమురు నిల్వ చేయడానికి భారత్‌ ప్రాధాన్యతనిచ్చింది. నేడు భారతదేశంలో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. వీటిని 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువకి విస్తరించే పనులు కూడా జరుగుతున్నాయి. మన చమురు కంపెనీలు నిర్వహించే నిల్వలు వీటికి అదనం. గత 11 ఏళ్లలో మన చమురు శుద్ధి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. 

గౌరవ అధ్యక్షా, 

ప్రభుత్వం వివిధ దేశాల సరఫరాదారులతో నిరంతరం సంప్రదింపులు చేపడుతోంది. ఎక్కడి నుంచి వీలైతే అక్కడ నుంచి చమురు, గ్యాస్ సరఫరా అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్ఫ్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని నౌకాయాన మార్గాలపై భారత ప్రభుత్వం నిశితంగా నిఘా ఉంచుతోంది. చమురు, గ్యాస్, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువులతో వస్తున్న నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా చూడటమే మా లక్ష్యం. మన సముద్రయాన మార్గాలను సురక్షితంగా ఉంచడానికి మేం మన ప్రపంచ భాగస్వాములందరితో నిరంతరం చర్చిస్తున్నాం. ఈ ప్రయత్నాల ఫలితంగానే హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన మన నౌకలు అనేకం ఇటీవల సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నాయి.

గౌరవ అధ్యక్షా, 

మరో విషయంలో దేశం సంసిద్ధంగా ఉండటం కూడా ఈ సంక్షోభ సమయంలో ఎంతో ఉపయోగపడుతోంది. గత 10-11 ఏళ్లలో ఇథనాల్ ఉత్పత్తి, బ్లెడింగ్ విషయంలో అపూర్వమైన కృషి జరిగింది. దశాబ్దం క్రితం భారతదేశంలో ఇథనాల్ బ్లెడింగ్ సామర్థ్యం కేవలం 1.5 శాతం మాత్రమే ఉండేది. నేడు మనం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించే స్థాయికి చేరుకున్నాం. దీనివల్ల ఏటా సుమారు 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు దిగుమతులు తగ్గాయి. అదేవిధంగా రైల్వే విద్యుదీకరణ వల్ల భారీ ప్రయోజనాలు కలిగాయి. ఈ విద్యుదీకరణ లేకపోయి ఉంటే ప్రతి ఏటా అదనంగా సుమారు 180 కోట్ల లీటర్ల డీజిల్ అవసరమయ్యేది. మేం మెట్రో నెట్‌వర్క్‌ను కూడా విస్తరించాం. 2014లో భారతదేశ మెట్రో నెట్‌వర్క్ 250 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండగా.. నేడు అది దాదాపు 1,100 కిలోమీటర్లకు పెరిగింది. మేం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని బలంగా ప్రోత్సహించాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 15,000 ఎలక్ట్రిక్ బస్సులను అందించింది. ప్రత్యామ్నాయ ఇంధనాలపై నేడు జరుగుతున్న ఈ స్థాయి కృషి వల్ల భారతదేశ భవిష్యత్తు మరింత సురక్షితంగా ఉంటుంది.

గౌరవ అధ్యక్షా, 

ఆర్ధిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక అని మనకు తెలుసు. ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో పశ్చిమాసియా ఒక ప్రధాన ఆధారం. సహజంగానే ప్రస్తుత సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోంది. అయితే భారతదేశంపై దీని ప్రతికూల ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో పనిచేస్తోంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. ఇది దేశానికి ఎంతో మేలు చేసింది. మేం ప్రతి రంగంలోని భాగస్వాములతో చర్చిస్తున్నాం. అవసరమైన చోట మద్దతు అందిస్తున్నాం. భారత ప్రభుత్వం ఒక ఇంటర్‌ మినిస్ట్రీయల్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది దిగుమతులు, ఎగుమతుల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి ప్రతిరోజూ సమావేశమవుతోంది.. అవసరమైన పరిష్కారాల కోసం నిరంతరం పనిచేస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమల ఉమ్మడి కృషితో ఈ పరిస్థితులను మనం మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలమని నేను నమ్ముతున్నాను.

గౌరవ అధ్యక్షా, 

యుద్ధం వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఒక ప్రధాన ప్రశ్న. మన రైతులు మన ఆహార ధాన్యాల నిల్వలను నింపారు. దేశంలో తగినన్ని ఆహార నిల్వలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌కు సరైన పద్ధతిలో రైతులు విత్తనాలు వేసేలా మేం ప్రయత్నిస్తున్నాం. ఇటీవలి సంవత్సరాల్లో, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎరువుల కోసం తగిన ఏర్పాట్లు చేసింది. గతంలోనూ, ప్రపంచ సంక్షోభాలు రైతులపై భారం మోపకుండా మన ప్రభుత్వం చూసుకుంది. కోవిడ్ కాలంలో, అప్పటి యుద్ధాల సమయంలోనూ ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగింది. ప్రపంచ మార్కెట్లలో ఒక బస్తా యూరియా ధర రూ.3000కి చేరినా, భారతీయ రైతులకు అదే బస్తాను కేవలం రూ.300 కంటే తక్కువ ధరకే అందించాం.

గౌరవ అధ్యక్షా, 

ఇలాంటి సంక్షోభాల నుంచి రైతులను కాపాడటానికి ఇటీవలి సంవత్సరాల్లో అనేక చర్యలు తీసుకున్నాం. గత దశాబ్ద కాలంలో దేశంలో ఆరు యూరియా ప్లాంట్లను ప్రారంభించడం ద్వారా, వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 76 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరిగింది. ఇదే సమయంలో డీఏపీ, ఎన్‌పీకేఎస్ వంటి ఎరువుల దేశీయ ఉత్పత్తి దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల మేర పెరిగింది. చమురు, గ్యాస్‌ మాదిరిగానే ఎరువుల దిగుమతుల కోసం ఒకే వనరుపై ఆధారపడటానికి బదులుగా పలు వనరుల నుంచి పొందుతున్నాం. డీఏపీ, ఎన్‌పీకేఎస్ దిగుమతుల కోసం మనం ప్రత్యామ్నాయాలను విస్తరించుకున్నాం.

గౌరవ అధ్యక్షా, 

ప్రభుత్వం రైతులకు మేడ్-ఇన్-ఇండియా నానో యూరియా ఎంపికనూ ఇచ్చింది. రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్నాం. పీఎం-కుసుమ్ పథకం కింద రైతులకు 22 లక్షలకు పైగా సోలార్ పంపులను అందించడం ద్వారా డీజిల్‌పై వారు ఆధారపడటాన్ని తగ్గించాం. దేశంలోని రైతులకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటుందని ఈ సభ ద్వారా నేను హామీ ఇస్తున్నాను.

గౌరవ అధ్యక్షా, 

యుద్ధం వల్ల ఎదురయ్యే మరో ప్రధాన సవాలు ఏమిటంటే... దేశంలో వేసవి ప్రారంభమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాబోయే నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. భారత్ వరుసగా రెండో సంవత్సరం 1 బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. విద్యుత్ ఉత్పత్తి నుంచి విద్యుత్ సరఫరా దాకా, మన వ్యవస్థలన్నింటినీ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పునరుత్పాదక ఇంధనం మన సంసిద్ధతకు తోడ్పడింది. గత దశాబ్దంలో, భారత్ పునరుత్పాదక ఇంధనం దిశగా కీలక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం మన మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది. మన మొత్తం పునరుత్పాదక సామర్థ్యం 250 గిగావాట్ల చరిత్రాత్మక స్థాయిని దాటింది. గత 11 సంవత్సరాల్లో, సౌర విద్యుత్ సామర్థ్యం సుమారు 3 గిగావాట్ల నుంచి 140 గిగావాట్లకు పెరిగింది. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 4 మిలియన్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. దీనికి పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం గణనీయ తోడ్పాటును అందించింది. గోబర్ధన్ పథకం కింద, దేశంలో ఇప్పటికే 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఈ రోజు చాలా ఉపయోగకరమైనవిగా నిరూపితమయ్యాయి. ప్రభుత్వం అమృత్ కాల్ ఎనర్జీ ట్రాన్సిషన్ కార్యక్రమాల ద్వారా అణు ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించింది. కొద్ది రోజుల కిందట స్మాల్ హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కూ ఆమోదం లభించింది. దీని ద్వారా రాబోయే కొన్నేళ్లలో 1500 మెగావాట్ల కొత్త జలవిద్యుత్ సామర్థ్యం మనకు అందుబాటులోకి వస్తుంది.

గౌరవ అధ్యక్షా, 

దౌత్యం విషయంలోనూ భారత్ పాత్ర స్పష్టంగా ఉంది. ఈ ఘర్షణల పట్ల మొదటి నుంచీ మనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాం. నేను స్వయంగా పశ్చిమాసియాలోని సంబంధిత నాయకులందరితోనూ మాట్లాడాను. ఉద్రిక్తతలను తగ్గించి, ఘర్షణలను త్వరగా ముగించాలని నేను వారిని కోరాను. పౌరులు, ఇంధనం, రవాణా సంబంధిత మౌలిక సదుపాయాలపై దాడులనూ భారత్ వ్యతిరేకించింది. వాణిజ్య నౌకలపై దాడులు, హార్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ జలమార్గాల్లో ఆటంకాలు కలిగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ యుద్ధ వాతావరణంలోనూ భారతీయ నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించడానికి భారత్ దౌత్య మార్గంలో నిరంతరం కృషి చేస్తోంది.

గౌరవ అధ్యక్షా, 

భారత్ ఎల్లప్పుడూ మానవత్వం, శాంతి కోసం గళం వినిపించింది. ఈ సంక్షోభానికి చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కారాలని నేను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఉద్రిక్తతలను తగ్గించి, ఈ ఘర్షణలను అంతం చేయడం కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ఈ యుద్ధంలో మానవ ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా అది మానవాళి ప్రయోజనాలకు విరుద్ధం. వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కోసం అన్ని పక్షాలను ప్రోత్సహించేందుకు భారత్ ప్రయత్నిస్తూనే ఉంది.

గౌరవ అధ్యక్షా, 

ఇలాంటి సంక్షోభ సమయాల్లోనూ కొన్ని శక్తులు పరిస్థితిని దుర్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. అందుకే చట్టాలను అమలు చేసే సంస్థలన్నింటినీ అప్రమత్తం చేశాం. తీరప్రాంత భద్రత, సరిహద్దు భద్రత, సైబర్ భద్రత, వ్యూహాత్మక కేంద్రాల రక్షణనూ బలోపేతం చేస్తున్నాం.

గౌరవ అధ్యక్షా, 

దీర్ఘకాలం పాటు కొనసాగే క్లిష్టమైన ప్రపంచ పరిస్థితులను ఈ యుద్ధం సృష్టించింది. అందుకే మనం సంసిద్ధంగా, ఐక్యంగా ఉండాలి. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ మనం ఇలాంటి సవాళ్లనే ఐకమత్యంతో ఎదుర్కొన్నాం. ఇప్పుడూ మనం అదే విధంగా సంసిద్ధం కావాలి. ఓర్పు, సంయమనం, ప్రశాంతతతో మనం ప్రతి సవాలునూ ఎదుర్కోవాలి. అదే మన గుర్తింపు, అదే మన బలం. మనం అప్రమత్తంగా, జాగ్రత్తగానూ ఉండాలి. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసేవారు తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తారు. మనం వారిని సఫలం కానివ్వకూడదు. ఇలాంటి సమయాల్లో నల్లబజారు వ్యాపారులు, అక్రమ నిల్వదారులు చురుగ్గా ఉంటారు. అందుకే ఈ సభ ద్వారా నేను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వారిని అడ్డుకోవడానికి కఠినమైన పర్యవేక్షణ అవసరం. అలాంటి ఫిర్యాదులు వచ్చిన చోట తక్షణ చర్యలు తీసుకోవాలి. దేశంలోని ప్రతి ప్రభుత్వం, ప్రతి పౌరుడు కలిసి పనిచేసినప్పుడే మనం ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలం. ఈ విజ్ఞప్తితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'There could be no Netflix globally without India': Ted Sarandos on growth, cricket and AI

Media Coverage

'There could be no Netflix globally without India': Ted Sarandos on growth, cricket and AI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares Sanskrit Subhashitam recognizing Earth as the nurturing mother of all life
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared Sanskrit Subhashitam emphasising that humanity may live in harmony with the Earth, as earth is the nurturing mother of all life and the moral order that sustains her should be respected.

The Prime Minister shared a Sanskrit verse-

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥

The Prime Minister posted on X:

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥