· “మన దేశంలో ఆయుర్వేదం ఏ ఒక్క కాలం లేదా ప్రాంతానికో పరిమితం కాదు... జీవితంపై అవగాహన.. సమతౌల్య సాధన.. ప్రకృతితో సమరస జీవనం దిశగా యుగయుగాల నుంచి మనకు మార్గనిర్దేశం చేస్తోంది”
· “నివారక వైద్యంపై నిశితంగా దృష్టి సారిస్తూ ‘జాతీయ ఆయుష్ మిషన్‌’ను మేం ప్రారంభించాం”
· “కాలానుగుణ మార్పులను అనుసరిస్తూ ఆయుర్వేదంలో ఆధునిక సాంకేతికతలు సహా కృత్రిమ మేధ వినియోగం పెంచాలి”



నమస్కారం!

కేరళ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ రాజేంద్ర అర్లేకర్‌, ఆర్య వైద్యశాలతో ముడిపడిన ప్రముఖులు, సోదరీసోదరులారా…

ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.

మిత్రులారా!

మానవాళికి శతాబ్దాలుగా సేవలందిస్తున్న భారతీయ వైద్య సంప్రదాయానికి కేరళలోని ఆర్య వైద్యశాల సజీవ తార్కాణం. మన దేశంలో ఆయుర్వేదం ఏదో ఒక కాలానికి లేదా ప్రాంతానికి పరిమితమైది కాదు. జీవితంపై అవగాహన, సమతౌల్య సాధన, ప్రకృతితో సమరస జీవనం దిశగా యుగయుగాల నుంచి ఈ విధానం మనకు మార్గనిర్దేశం చేస్తోంది. ఆర్య వైద్యశాల నేడు 600కుపైగా ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తోంది. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల ఈ ఆస్పత్రి శాఖలు ఆయుర్వేద విధానాల్లో చికిత్స అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చికిత్స కోసం ఈ వైద్యశాలలకు వస్తున్నారు. ఆర్య వైద్యశాల తన అవిరళ కృషితో ఈ నమ్మకాన్ని సముపార్జించుకుంది. అలాగే, రాష్ట్రంలో ఆపన్నులైన ప్రజలకు అనేక సందర్భాల్లో ఈ సంస్థ ఆశాకిరణంగా మారింది.

మిత్రులారా!

ఆర్య వైద్యశాల సేవాధర్మం ఒక ఆలోచనకు పరిమితం కాదు. అది వారి చర్యలు, విధానాలు, వ్యవస్థలలో ప్రతిబింబించే ఒక పవిత్ర భావన. ఈ సంస్థ నిర్వహిస్తున్న ధార్మిక ఆస్పత్రి 100 సంవత్సరాలుగా ప్రజలకు నిరంతర సేవలందిస్తోంది. వంద సంవత్సరాలంటే స్వల్ప కాలమేమీ కాదు… ఇంత సుదీర్ఘ కాలంలో ఈ ఆస్పత్రితో ముడిపడిన ప్రతి ఒక్కరి పాత్ర ప్రశంసనీయం. ఇందుకుగాను ఇక్కడ పనిచేస్తున్న వైద్య నిపుణులు, ఇతర డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రితో సంబంధంగల ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఈ ధార్మిక ఆస్పత్రిని స్థాపించిన సంస్థ 125 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం కూడా అత్యంత అభినందనీయం. కేరళ ప్రజలు ఆయుర్వేద సంప్రదాయాలను శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. మీరందరూ ఈ విధానాన్ని పరిరక్షించడమే కాకుండా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.

మిత్రులారా!

దేశంలోని ప్రాచీన వైద్య విధానాలు చాలా కాలం నుంచి వేటికవిగా ఉండిపోయాయి. అయితే, గత 10-11 సంవత్సరాలుగా పరిస్థితులలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజున ప్రజలు ఆరోగ్య సంరక్షణ సేవలను సమగ్ర దృక్పథంతో చూస్తున్నారు. అందుకే, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, యోగా విధానాలను ఒకే గొడుగు కిందకు తెచ్చాం. ఇదే దృక్పథంతో మా ప్రభుత్వం కేంద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అలాగే, నివారక వైద్యంపై నిశితంగా దృష్టి సారిస్తూ ‘జాతీయ ఆయుష్ మిషన్’ను కూడా ప్రారంభించాం. అనంతరం యోగా, నివారక ఆరోగ్య సంరక్షణ, సామాజిక ఆరోగ్య సేవలందించే 12 వేలకుపైగా ఆయుష్ శ్రేయో కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగాగల ఇతర ఆస్పత్రులను కూడా ఆయుష్ సేవలతో అనుసంధానించి, ఔషధ సరఫరాపైనా దృష్టి సారించాం. భారత సంప్రదాయ వైద్య పరిజ్ఞాన ప్రయోజనాలు దేశం నలు చెరగులా గల ప్రజలకు చేరేలా చూడాలన్నదే మా ధ్యేయం.

మిత్రులారా!

ఆయుష్ రంగంపై ప్రభుత్వ విధానాల ప్రభావం నేడు ప్రస్ఫుటమవుతోంది. ఆయుష్ ఉత్పాదక రంగం కూడా శరవేగంగా పురోగమిస్తోంది. మరోవైపు భారత సంప్రదాయ సంపూర్ణ ఆరోగ్య విధానాలను ప్రపంచవ్యాప్తం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఆయుష్ ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేసింది. ప్రపంచ మార్కెట్లలో ఆయుష్ ఉత్పత్తులు, సేవలను ఇది ప్రోత్సహిస్తుండగా, ఈ చర్యలన్నీ ఇప్పటికే సత్ఫలితాలిస్తున్నాయి. దేశంలో 2014 నాటికి సుమారు ₹3,000 కోట్ల విలువైన ఆయుష్, మూలికా ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ఇప్పుడది ₹6,500 కోట్లకు పెరిగింది. దీనివల్ల దేశంలోని రైతులకూ ఎంతో ప్రయోజనం కలుగుతోంది.

మిత్రులారా!

ఆయుష్ ఆధారిత వైద్య పర్యాటకానికి విశ్వసనీయ గమ్యంగానూ భారత్ ఆవిర్భవిస్తోంది. దీనికి మరింత ప్రోత్సాహమిస్తూ ఆయుష్ వీసాను ప్రవేశపెట్టాం. దీనివల్ల విదేశీ సందర్శకులు ఆయుర్వేద-సంప్రదాయ వైద్యంలో మెరుగైన సౌకర్యాలు పొందే వీలు కలుగుతోంది.

మిత్రులారా!

ఎంతో ప్రాచీనమైన ఆయుర్వేద విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం దాన్ని ప్రతి ప్రధాన అంతర్జాతీయ వేదికపై సగర్వంగా ప్రదర్శిస్తోంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశమైనా, జి20 శిఖరాగ్ర సదస్సు వంటి వేదికలైనా ఆయుర్వేదాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్య మాధ్యమంగా నేను స్వయంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాను. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఇక ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద’ ఇప్పటికే తన పని ప్రారంభించింది. ఆయుర్వేద ఔషధాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం కోసం గంగానది ఒడ్డున ఔషధ మొక్కల సాగును ప్రోత్సహిస్తున్నాం.

మిత్రులారా!

ఈ సందర్భంగా మరో విజయాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. ఐరోపా సమాఖ్యతో భారత్‌ చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై ప్రకటన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఒప్పందంతో భారత సంప్రదాయ వైద్య సేవలకు, వైద్యులకు ఎనలేని ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే, భారత్‌లో పొందిన వృత్తిపరమైన అర్హత ఆధారంగా మన ఆయుర్వేద వైద్యులు నియంత్రణ రహిత ఐరోపా సమాఖ్య సభ్య దేశాలలోనూ సేవలందించే వీలుంటుంది. తద్వారా ఆయుర్వేదం, యోగాతో ముడిపడిన యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఐరోపాలో ఆయుష్ శ్రేయో కేంద్రాల ఏర్పాటుకూ ఇది దోహదం చేస్తుంది. ఈ ఒప్పందం నేపథ్యంలో ఆయుర్వేదం, ఆయుష్‌తో ముడిపడిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.

మిత్రులారా!

భారత్‌లో ప్రజానీకానికి శతాబ్దాలుగా ఆయుర్వేదం వైద్య విధానం సేవలందిస్తోంది. అయిప్పటికీ, జాతీయంగా... ప్రత్యేకించి అంతర్జాతీయంగా ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని వివరించడానికి కృషి చేయాల్సి రావడం దురదృష్టకరం. ఆయుర్వేద రంగంలో నిదర్శనాధారిత పరిశోధనలు-పత్రాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆయుర్వేద పద్ధతులను విజ్ఞాన శాస్త్ర సూత్రాల ప్రాతిపదికన పరీక్షిస్తే ప్రజల విశ్వాసం బలోపేతం కాగలదు. ఈ దిశగా ‘సీఎస్ఐఆర్, ఐఐటీ’ వంటి సంస్థలతో సంయుక్తంగా ఆయుర్వేదాన్ని నిరంతరం విజ్ఞాన శాస్త్ర-పరిశోధన అనే గీటురాయిపై పరీక్షించడంలో ఆర్య వైద్యశాల కృషి ప్రశంసనీయం. ఔషధ, క్లినికల్ పరిశోధనలతోపాటు కేన్సర్ చికిత్సపైనా ఈ సంస్థ దృష్టి సారించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో పరిశోధనల నిర్వహణ దిశగా ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయడం అభినందనీయం.

మిత్రులారా!

కాలానుగుణ మార్పులను అనుసరిస్తూ, ఆయుర్వేదంలో ఆధునిక సాంకేతికతలు సహా కృత్రిమ మేధ వినియోగం పెంచాల్సిన అవసరం ఎంతయినా ఉంది. వ్యాధి సంక్రమణ అంచనాలతోపాటు భిన్న పద్ధతులలో చికిత్స చేసే వినూత్న విధానాలను ఇది సుసాధ్యం చేస్తుంది.

మిత్రులారా!

సంప్రదాయం-ఆధునికతల సమ్మేళనం ఆరోగ్య సంరక్షణపై జన జీవనంలో విశ్వాసానికి పునాది కాగలదని ఆర్య వైద్యశాల నిరూపించింది. ఈ సంస్థ ఆయుర్వేదంపై ప్రాచీన అవగాహనను పరిరక్షిస్తూ, ఆధునిక అవసరాల మేరకు చికిత్సను క్రమబద్ధీకరించి రోగులకు సేవలందిస్తోంది. ఈ స్ఫూర్తిదాయక కృషికిగాను ఆర్య వైద్యశాలకు మరోసారి అభినందనలు. ఈ సంస్థ భవిష్యత్తులోనూ ఇదే అంకితభావం, సేవా స్ఫూర్తితో ప్రజల జీవితాలను మెరుగుపరచాలని ఆకాంక్షిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు…

నమస్కారం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%

Media Coverage

India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మార్చి 2026
March 14, 2026

Heartening Resolve Meets Bold Action: PM Modi's Transformative Push for a Developed Assam.