పవిత్ర రోమన్ క్యాథలిక్ చర్చి కార్డినల్‌గా జార్జి కూవకడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ నియమించడం మనందరికీ గర్వకారణం: పీఎం
నేటి భారత్ తన పౌరులు ఎక్కడ ఉన్నా, ఎలాంటి సంక్షోభంలో ఇరుక్కున్నా అందరినీ క్షేమంగా ఇంటికి తీసుకువస్తుంది: పీఎం
విదేశాంగ విధానంలో జాతీయ ప్రాధాన్యాలతో పాటు మానవ ఆసక్తులకు కూడా భారత్ ప్రాధాన్యమిస్తుంది: పీఎం
వికసిత్ భారత్ కచ్చితంగా నెరవేరుతుందనే విశ్వాసాన్ని మన యువత ఇచ్చారు: పీఎం
దేశభవిష్యత్తులో అందరి పాత్ర కీలకమే: పీఎం

గౌరవనీయ ప్రముఖులారా…!

మీకు, నా దేశ వాసులందరికీ.. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికీ క్రిస్మస్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మెర్రీ క్రిస్మస్!

మూడు నాలుగు రోజుల కిందటే కేంద్ర మంత్రి అయిన నా సహచరుడు జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. ఈవేళ  మీ అందరి మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నాను. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీబీసీఐ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా క్రిస్మస్ వేడుకలో మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఇది మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా నిలవబోతోంది. సీబీసీఐ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా సీబీసీఐకి, దానితో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

మిత్రులారా,

గతేడాది మీ అందరితో కలిసి ప్రధాని నివాసంలో క్రిస్మస్ చేసుకునే అవకాశం నాకు లభించింది. ఈవేళ  సీబీసీఐ ప్రాంగణంలో ఇక్కడ కలుసుకున్నాం. ఇటీవల ఈస్టర్ సందర్భంగా పవిత్రమైన హార్ట్ కేథడ్రల్ చర్చిని కూడా నేను సందర్శించాను. మీ అందరి నుంచి ఇంత ఆత్మీయత, ఆప్యాయత లభించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ నుంచీ అదే ఆప్యాయతను పొందడం నా అదృష్టం. ఈ ఏడాది ఆరంభంలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ను కలిసే అవకాశం కలిగింది. గత మూడేళ్లలో మా మధ్య ఇది రెండో సమావేశం. భారతదేశాన్ని సందర్శించాలని ఆయనకు ఆహ్వానం కూడా పంపాను. అదేవిధంగా, సెప్టెంబరులో న్యూయార్కు పర్యటన సందర్భంగా కార్డినల్ పియెట్రో పరోలిన్ తో సమావేశమయ్యాను. ఈ ఆధ్యాత్మిక పరిచయాలు, ఈ ఆధ్యాత్మిక చర్చలు.. సేవ చేయాలన్న మన సంకల్పాన్ని మరింత దృఢతరం చేసే శక్తినిస్తాయి.

మిత్రులారా,

ఇటీవల కార్డినల్ జార్జ్ కూవాకడ్ ను కలిసి సన్మానించే అవకాశం లభించింది. కొన్ని వారాల క్రితమే.. పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ గౌరవనీయ కార్డినల్ జార్జ్ కూవాకాడ్ కు కార్డినల్ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం అధికారికంగా దేశానికి ప్రాతినిధ్యం వహించేలా కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని పంపించింది. ఓ భారతీయుడు అంతటి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే, సహజంగానే దేశం యావత్తూ గర్విస్తుంది. మరోసారి కార్డినల్ జార్జ్ కూవాకాడ్ కు నా అభినందనలు, శుభాకాంక్షలు.

 

మిత్రులారా,

ఈరోజు మీ మధ్య నిలుచుని ఉండడంతో ఎన్నో జ్ఞాపకాలు నా కళ్లెదుట మెదులుతున్నాయి. దశాబ్దం క్రితం.. యుద్ధంతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్ ను సురక్షితంగా తీసుకువచ్చిన క్షణాలు గుర్తొస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఆయన అక్కడ తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకుని, ఎనిమిది నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి ఆయనను కాపాడేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఆ పరిస్థితుల్లో ఇది ఎంత సవాలుతో కూడుకున్నదో మీరు ఊహించవచ్చు. అయినా, మేం దాన్ని సాధించాం. ఆ సమయంలో ఆయనతోనూ, ఆయన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన విషయం నాకిప్పటికీ గుర్తుంది - వారి మాటలు, వారి ఆనందం నేను ఎప్పటికీ మరచిపోలేని క్షణాలు. అదేవిధంగా, ఫాదర్ టామ్ యెమెన్ లో చిక్కుకున్న సమయంలో.. ఆయనను క్షేమంగా తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మా ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసింది. తిరిగి వచ్చిన తర్వాత ఆయనను నేను నా నివాసానికి కూడా ఆహ్వానించాను. మన నర్సు సోదరీమణులు గల్ఫ్ దేశాల్లో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న సమయంలో వారి భద్రత గురించి యావత్ దేశమూ తీవ్రంగా ఆందోళన చెందింది. వారినీ స్వదేశానికి తీసుకురావడానికి మేము చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ఫలించాయి. ఈ అంశాలను దౌత్యపరమైన కార్యక్రమాలుగా మాత్రమే కాకుండా.. భావోద్వేగాలతో కూడిన అంశాలుగా మేం భావించాం. ఇవి మన కుటుంబ సభ్యులను రక్షించే కార్యక్రమాలు. భారతీయుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రతి సంక్షోభం నుంచి వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడాన్ని నేడు భారత్ తన కర్తవ్యంగా భావిస్తోంది.

మిత్రులారా,

భారత్ తన విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే కాకుండా, మానవీయ ప్రయోజనాలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. భారత్ అవలంబించే ఈ ధోరణి కోవిడ్-19 విపత్తు సమయంలో ప్రపంచానికంతటికీ తెలియవచ్చింది. అంతటి భారీ విపత్తు చుట్టుముట్టిన సందర్భంలో.. ఎప్పుడూ మానవ హక్కులు, మానవత్వం గురించి మాట్లాడే; ఒక్కోసారి వాటిని దౌత్య సాధనాలుగానూ ఉపయోగించుకునే చాలా దేశాలు పేద, చిన్న దేశాలకు సాయపడడానికి వెనుకడుగు వేశాయి. ఆ క్లిష్ట సమయాల్లో స్వప్రయోజనాలపైనే వారు దృష్టిసారించారు. మరోవైపు భారత్ తన శక్తికి మించి అనేక దేశాలకు సహాయాన్ని అందించి కారుణ్యాన్ని చాటుకుంది. 150కి పైగా దేశాలకు ఔషధాలను, అనేక దేశాలకు వ్యాక్సిన్లను అందించాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపింది. ఇటీవల గయానా, ఆ తర్వాత కువైట్ పర్యటన సందర్భంగా.. భారత్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత్ అందించిన సహాయం పట్ల, ముఖ్యంగా వ్యాక్సిన్ల ద్వారా అందించిన చేయూత పట్ల అక్కడి ప్రజలు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి భావోద్వేగాలు కేవలం గయానాకే పరిమితం కాలేదు.. అనేక ద్వీప దేశాలు, పసిఫిక్ దేశాలు, కరీబియన్ దేశాలు భారత్ ను బాహాటంగానే ప్రశంసిస్తున్నాయి. ఈ మానవతా స్ఫూర్తి, అందరి సంక్షేమం పైనా మన అంకితభావం, మానవుడే కేంద్రంగా సాగే మన విధానం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మిత్రులారా,

క్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం, సోదరభావాన్ని చాటుతాయి. ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసే దిశగా మనమందరం కృషి చేయాల్సి ఉంది. అయితే, హింసను వ్యాప్తి చేయడానికీ, సమాజంలో అలజడులు సృష్టించడానికీ జరిగే ప్రయత్నాలు నా హృదయాన్ని బాధిస్తాయి. కొన్ని రోజుల క్రితమే జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ లో ఏం జరిగిందో చూశాం. 2019లో ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలోని చర్చిలపై దాడులు జరిగాయి. బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించడానికి నేను కొలంబో వెళ్లాను. ఇలాంటి సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం.
 

మిత్రులారా,

జూబ్లీ సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ క్రిస్మస్ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. దాని విశిష్టత మీ అందరికీ తెలుసు. ఈ జూబ్లీ సంవత్సరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ జూబ్లీ సంవత్సరంలో ఆశ/ విశ్వాసమే కేంద్రమన్న ప్రాతిపదికను మీరు స్వీకరించారు. శక్తికీ, శాంతికీ అదే ఆధారంగా పవిత్ర బైబిల్ భావిస్తుంది. ‘‘నీకు తప్పక ఆశాజనకమైన భవిష్యత్తు ఉంది, నీ విశ్వాసాన్ని చెరగనీయకు’’ అని ఆ గ్రంథం బోధిస్తుంది. విశ్వాసం, సానుకూలత మనకు మార్గనిర్దేశం కూడా చేస్తాయి. మానవీయతనూ, మంచి ప్రపంచాన్నీ, శాంతినీ, పురోగతినీ, శ్రేయస్సునూ కాంక్షిద్దాం.

మిత్రులారా,

గత పదేళ్లలో మన దేశంలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు. పేదలు ఓ ఆశాభావాన్ని పెంపొందించుకోవడం వల్లే ఇది సాధ్యపడింది- అవును, పేదరికంపై యుద్ధంలో గెలవగలమన్న వారి ఆశ వల్లే ఇది సాధ్యమైంది. ఇదే కాలంలో భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. స్వీయ విశ్వాసం వల్లే ఇది సాధ్యమైంది. మనం ఆశను కోల్పోకుండా, దృఢ సంకల్పంతో ఈ లక్ష్యాన్ని సాధించాం. భారతదేశ పదేళ్ల అభివృద్ధి ప్రస్థానం భవిష్యత్తుపై కొత్త ఆశలను, ఆకాంక్షలను కలిగించింది. ఈ దశాబ్ద కాలంలో మన యువతకు అనేక అవకాశాలు లభించాయి. అవి విజయం దిశగా కొత్త దారులు వేశాయి. అంకుర సంస్థలు, శాస్త్రీయ రంగం, క్రీడలు, లేదా వ్యవస్థాపకత ఏదైనా కావచ్చు.. ఆత్మవిశ్వాసం కలిగిన మన యువత దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తున్నారు. ‘వికసిత భారత్’ కల నిస్సందేహంగా సాకారమవుతుందనే ఆత్మవిశ్వాసాన్నీ, ఆశనూ మన యువత మనలో నింపింది. గత దశాబ్ద కాలంలో మన దేశ మహిళలు సాధికారతలో కొత్త అధ్యాయాలను లిఖించారు. వ్యవస్థాపకత నుంచి డ్రోన్ల వరకూ, విమానాలను నడపడం నుంచి సాయుధ బలగాల్లో బాధ్యతలు స్వీకరించడం వరకూ.. మహిళలు తమదైన ముద్ర వేయని రంగమంటూ ఏదీ లేదు. మహిళల అభ్యున్నతి లేకుండా ప్రపంచంలోని ఏ దేశమూ ముందుకు సాగదు. మన శ్రామిక శక్తి, వృత్తిపరమైన రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడాన్ని నేడు మనం గమనిస్తున్నాం. ఇది మన ఆకాంక్షలను మరింత బలోపేతం చేయడంతోపాటు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త ఆశయాలను నిర్దేశిస్తుంది.

గతంలో పరిశోధనలు జరగని, లేదా తక్కువగా పరిశోధనలు జరిగిన రంగాల్లో గత పదేళ్లలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. మొబైల్ తయారీ అయినా, సెమీకండక్టర్ తయారీ అయినా.. తయారీ రంగంలో అంతర్జాతీయంగా భారత్ శరవేగంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. సాంకేతికత నుంచి ఆర్థిక సాంకేతికత వరకూ.. ఈ పురోగతి ద్వారా భారత్ పేదలకు సాధికారత కల్పించడమే కాకుండా, అంతర్జాతీయ సాంకేతిక నిలయంగా నిలదొక్కుకుంటోంది. మౌలిక వసతుల కల్పనలో కూడా అపూర్వమైన వేగాన్ని భారత్ ప్రదర్శిస్తోంది. వేల కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ రహదారులను నిర్మించడం మాత్రమే కాకుండా.. గ్రామీణ రహదారులతో మన గ్రామాలను అనుసంధానం చేస్తున్నాం. రవాణా రంగాన్ని మెరుగుపరచడం కోసం వందల కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మిస్తున్నాం. భారత్ తన లక్ష్యాలను నమ్మశక్యం కాని వేగంతో సాధించగలదన్న అపారమైన విశ్వాసాన్ని ఈ విజయాలు మనలో నింపుతున్నాయి. ఇవి పరిమితమైనవయితే కాదు.. ప్రపంచం మొత్తం అంతే ఆశతో భారత్ వైపు చూస్తోంది.
 

మిత్రులారా,

‘‘ఒకరి భారాలు ఒకరు మోయండి’’ అని బైబిల్ చెప్తుంది. అంటే మనం ఒకరి పట్ల ఒకరం శ్రద్ధ వహించి, సంక్షేమ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. ఈ ఆలోచనతోనే మన వ్యవస్థలు, సంస్థలు సామాజిక సేవలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విద్యా రంగంలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయడమైనా, విద్య ద్వారా సమాజంలోని అన్ని వర్గాల - అన్ని విభాగాల అభ్యున్నతి కోసం కృషి చేయడమైనా, లేదా ఆరోగ్య సంరక్షణ రంగంలో సామాన్యులకు అంకితభావంతో సేవ చేయడమైనా.. ఈ రకమైన చర్యలను మనం ఉమ్మడి బాధ్యతగా భావిస్తాం.

మిత్రులారా,

యేసుక్రీస్తు ప్రపంచానికి కరుణా మార్గాన్ని, నిస్వార్థ సేవా పథాన్ని చూపాడు. క్రిస్మస్ ను జరుపుకొని, ఏసు క్రీస్తును స్మరించుకుంటున్న మనం.. తద్వారా మన జీవితంలో ఆ విలువలను భాగం చేసుకోవాలి. మన విధులను ఎప్పుడూ విస్మరించకూడదు. ఇది మన వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదని.. సామాజిక బాధ్యత అని, దేశంగా మన కర్తవ్యం కూడా అని నేను విశ్వసిస్తున్నాను. ఆ స్ఫూర్తితో భారత్ నేడు పురోగమిస్తోంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ తీర్మానంలో అది మూర్తీభవించింది. మానవీయ దృక్పథంలో కీలకమైనవే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ పట్టించుకోని అంశాలు అనేకం ఉన్నాయి. వాటిని మేం మా ప్రాధాన్య అంశాలుగా మలిచాం. కఠినమైన నియమాలు, లాంచనాల నుంచి పరిపాలన వ్యవస్థను విముక్తం చేసి సునిశితత్వం/ సూక్ష్మగ్రాహ్యతను దానికి ప్రమాణంగా మార్చాం. ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు ఉండేలా చూడడమైనా, ప్రతి గ్రామానికీ విద్యుత్తును అందించి అంధకారాన్ని పారద్రోలడమైనా, ఇంటింటికీ శుద్ధమైన మంచినీటిని అందించడమైనా, లేదా డబ్బు లేకపోవడం కారణంగా ఎవరూ చికిత్సకు దూరం కాకుండా చూడడమైనా.. అటువంటి సునిశిత సేవలకు భరోసానిచ్చే వ్యవస్థను మేం ఏర్పాటు చేశాం.

ఆ భరోసా ఓ పేద కుటుంబం నుంచి ఎంతటి భారాన్ని దూరం చేయగలదో మీరు ఊహించవచ్చు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఓ ఇంటిని కుటుంబంలోని మహిళ పేరు మీద నిర్మించడం మహిళలను విశేషంగా సాధికారులను చేస్తుంది. నారీ శక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కూడా మేం చర్యలు తీసుకున్నాం. మహిళా సాధికారతను బలోపేతం చేయడం దిశగా ఇదొక ముందడుగు. అదేవిధంగా, గతంలో దివ్యాంగులు ఎంతటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారో మీరు చూసుండొచ్చు. మానవీయం కాని, గౌరవానికి విఘాతం కలిగించే పదాలతో వారిని పిలిచేవారు. ఒక సమాజంగా ఇది మనకు బాధాకరమైన అంశం. మా ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దింది. వారికి గౌరవాన్నీ, ఆదరణనూ ఇచ్చేలా ‘దివ్యాంగులు’గా మేం గుర్తించాం. ప్రజా మౌలిక సదుపాయాల నుంచి ఉపాధి వరకు ప్రతి రంగంలో నేడు దేశం దివ్యాంగులకు ప్రాధాన్యమిస్తోంది.
 

మిత్రులారా,

ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ సూక్ష్మగ్రాహ్యత కూడా చాలా కీలకమైనది. ఉదాహరణకు- మన దేశంలో దాదాపు మూడు కోట్ల మంది మత్స్యకారులు, చేపలను పెంచేవారు ఉన్నారు. అయినప్పటికీ ఈ లక్షలాది మంది ప్రజలను గతంలో ఎన్నడూ పట్టించుకోలేదు. మత్స్య రంగం కోసం మేం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. కిసాన్ క్రెడిట్ కార్డుల వంటి ప్రయోజనాలను మత్స్యకారులకు అందించడం మొదలుపెట్టాం. మత్స్య సంపద యోజన, ఇతర కార్యక్రమాలను మేం ప్రారంభించి.. సముద్రంలో మత్స్యకారులకు భద్రత కల్పించడం కోసం వీటిని అమలు చేశాం. ఈ చర్యలు లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేశాయి.

మిత్రులారా,

ఎర్రకోటపై నుంచి సబ్ కా ప్రయాస్ (సమష్టి కృషి) గురించి నేను మాట్లాడాను. దేశ భవిష్యత్తులో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రజలంతా కలిస్తే అద్భుతాలు చేయగలం. సామాజిక స్పృహ కలిగిన భారతీయులు నేడు అనేక ప్రజా ఉద్యమాలకు బలంగా నిలుస్తున్నారు. పరిశుభ్రమైన భారత్ ను నిర్మించడం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమం దోహదపడింది. మహిళలు, పిల్లల ఆరోగ్యాలను కూడా ఇది ప్రభావితం చేసింది. మన రైతులు పండించే చిరుధాన్యాలు లేదా శ్రీ అన్నను మన దేశంతో పాటు ప్రపంచమంతా స్వాగతిస్తోంది. చేతివృత్తులు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ.. ప్రజలు స్థానికతకు మద్దతిస్తున్నారు. ఏక్ పేడ్ మా కే నామ్.. అంటే ‘తల్లి కోసం ఓ చెట్టు’ కార్యక్రమం కూడా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ఇది ప్రకృతీ, మన మాతృమూర్తుల ఘనతనూ చాటుతుంది. అనేకమంది క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. క్రైస్తవులు సహా ఇలాంటి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్న యువతను నేను అభినందిస్తున్నాను. అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఇలాంటి సమష్టి కృషి అత్యావశ్యకం.

మిత్రులారా,

మన సమిష్టి కృషి మన దేశాన్ని ముందుకు నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ‘వికసిత భారత్’ మనందరి లక్ష్యం. మనం సమష్టిగా దానిని సాధించి తీరాలి. భవిష్యత్ తరాల కోసం ఉజ్వలమైన భారత్‌ను అందించడం మన కర్తవ్యం. మరోసారి మీ అందరికీ క్రిస్మస్, జూబ్లీ సంవత్సర శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
FY25 India pharma exports cross $30 billion, surge 31% in March

Media Coverage

FY25 India pharma exports cross $30 billion, surge 31% in March
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in a building collapse in Dayalpur area of North East Delhi
April 19, 2025
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in a building collapse in Dayalpur area of North East Delhi. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Saddened by the loss of lives due to a building collapse in Dayalpur area of North East Delhi. Condolences to those who have lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”