· “అంతరిక్షం కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహ‌సం-స‌మ‌ష్టి ప్ర‌గతిని ప్ర‌స్ఫుటం చేసే సంక‌ల్పం”
· “భారతీయ రాకెట్లు శక్తికి మంచి పనిచేయగలవు... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష‌ల‌ను మోస్తూ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తాయి”
· “దేశీయ అంతరిక్ష సాంకేతికపై పెరుగుతున్న ఆకాంక్ష‌ల‌కు భారత తొలి మానవ అంతరిక్షయాన కార్య‌క్ర‌మం... గగన్‌యాన్ ఒక ప్రతీక‌”
· “భారత అంతరిక్ష కార్యకలాపాల్లో అధిక‌ శాతానికి మహిళా శాస్త్రవేత్తలే సార‌థులు”
· “అంత‌రిక్షంపై భార‌త్ దృక్కోణం ‘వ‌సుధైవ కుటుంబ‌కం’ అనే ఉదాత్త ప్రాచీన విశ్వాసానుగుణం”

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంత‌రిక్ష శోధ‌న‌పై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు-2025 (జిఎల్ఇఎక్స్‌)ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత ప్రపంచవ్యాప్తంగాగల విశిష్ట ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములను ఆయన స్వాగతించారు. అంతరిక్ష రంగంలో భారత్‌ అద్భుత పయనం గురించి జిఎల్ఇఎక్స్‌- 2025లో పాల్గొంటున్నవారికి ప్రముఖంగా వివరించారు. ““అంతరిక్షమంటే కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహ‌సం-స‌మ‌ష్టి ప్ర‌గతిని ప్ర‌స్ఫుటం చేసే సంక‌ల్పం” అని ఆయన అభివర్ణించారు. భారత్‌ 1963లో ఓ చిన్న రాకెట్‌ను ప్రయోగించిన నాటినుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిన తొలి దేశం స్థాయి ఎదగడం వరకూ సాధించిన విజయాలు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “భారతీయ రాకెట్లు త‌మ‌ కార్య‌భారాన్ని మించి... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష‌ల‌ను మోస్తూ తమ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు శాస్త్రవిజ్ఞానంలో కీలక ఘట్టాలని, సమస్యలను అధిగమించడంలో మానవాళి స్ఫూర్తికినిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌ 2014నాటి తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకోవడం ద్వారా చారిత్రక విజయం సాధించిందని గుర్తుచేశారు. జాబిలిపై జలం జాడను పసిగట్టడంలో చంద్రయాన్-1 ప్రయోగం తోడ్పడిందని పేర్కొన్నారు. తదుపరి చంద్రయాన్-2 ప్రయోగం చంద్ర  ఉపరితల సుస్పష్ట (అత్యధిక రిజల్యూషన్) చిత్రాలను అందించిందని, ఇక తాజా చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువంపై మానవాళి అవగాహనను మరింత పెంచిందని విశదీకరించారు. “భారత్‌ రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజిన్లను రూపొందించింది. ఒకే రాకెట్‌ ద్వారా 100 ఉపగ్రహాలను ప్రయోగించింది.. భారత ప్రయోగ వాహనాల ద్వారా 34కుపైగా దేశాలకు చెందిన 400కు మించి ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిలిపింది” అని వివిధ విజయాలను ప్రధాని ఏకరవు పెట్టారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానం ద్వారా భారత్‌ సాధించిన తాజా విజయాన్ని ప్రస్తావిస్తూ- అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలక ముందడుగని పేర్కొన్నారు.

 

భారత అంతరిక్ష శోధనయాన లక్ష్యం ఇతర దేశాలతో పోటీ పడటం కాదని, సమష్టిగా సమున్నత శిఖరాల చేరడమేనని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఇది మానవాళి శ్రేయస్సు ఆకాంక్షిత సామూహిక అంతరిక్ష అన్వేషణ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాసియా దేశాల కోసం ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడాన్ని గుర్తుచేస్తూ- ప్రాంతీయ సహకారంపై భారత్‌ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. భారత్‌కు జి-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో శ్రీకారం చుట్టిన జి-20 ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం వర్ధమాన దేశాలకు గణనీయ ప్రయోజనకరమని ఆయన ప్రకటించారు. శాస్త్ర పరిశోధనల హద్దులను అధిగమిస్తూ భారత్‌ నిత్యనూతన ఆత్మవిశ్వాసంతో సదా ముందడుగు వేస్తుందని వ్యాఖ్యానించారు. “అంతరిక్ష సాంకేతికతపై ఇనుమ‌డిస్తున్న జాతి ఆకాంక్ష‌ల‌కు భారత తొలి మానవ అంతరిక్షయాన కార్య‌క్ర‌మం- గగన్‌యాన్ ఒక ప్రతీక‌” అని ప్రధాని అభివర్ణించారు. ఇక ఇస్రో-నాసా సంయుక్త కార్యక్రమంలో భాగంగా అనతి కాలంలోనే భారత వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారని శ్రీ మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం వినూత్న పరిశోధనలకు, అంతర్జాతీయ భాగస్వామ్యానికి సౌలభ్యం కల్పిస్తుందంటూ భారత దీర్ఘకాలిక దృక్కోణాన్ని ఆయన విశదీకరించారు. మరోవైపు 2040 నాటికి భారత వ్యోమగామి అడుగుజాడలు చంద్రునిపై కనిపిస్తాయని చెప్పారు. అంతేకాకుండా భారత భవిష్యత్ అంతరిక్ష లక్ష్యాలలో అంగారక, శుక్ర గ్రహాలపై ప్రయోగాలు కీలకం కాగలవని వెల్లడించారు.

భారత్‌ విషయంలో అంతరిక్షం కేవలం అన్వేషణకు పరిమితం కాదని, అది సాధికారతకూ చిహ్నమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనను, ప్రజల జీవనోపాధిని అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరుస్తుందని, భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. ప్రతి భారతీయుడి సంక్షేమానికీ భరోసా ఇవ్వడంలో ఉపగ్రహాలు పోషించే కీలక పాత్రను ఆయన ప్రస్తావించారు. మత్స్యకారులకు హెచ్చరికలు, గతిశక్తి వేదిక, రైల్వే భద్రత, వాతావరణ అంచనాల్లో వాటి తోడ్పాటును ఈ సందర్భంగా ఉటంకించారు. ఆవిష్కరణలకు  ప్రోత్సాహించేలా- అంకుర సంస్థలు, ఔత్సాహికులు, యువ మేధావులకు దేశీయ అంతరిక్ష రంగం తలుపులు తెరవడంలో భారత్‌ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. అందుకే, దేశంలో నేడు 250కిపైగా అంతరిక్ష అంకుర సంస్థలున్నాయని తెలిపారు. ఉపగ్రహ సాంకేతికత, ప్రొపల్షన్ వ్యవస్థలు, ఇమేజింగ్, వంటి ప్రయోగాత్మక రంగాల్లో ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా- “భారత అంతరిక్ష కార్యకలాపాల్లో అధిక‌శాతానికి మహిళా శాస్త్రవేత్తలే సార‌థులు” అని ప్రధాని సగర్వంగా ప్రకటించారు.

 

“అంత‌రిక్షంపై భార‌త్ దృక్కోణం ‘వ‌సుధైవ కుటుంబ‌కం’ అనే ఉదాత్త ప్రాచీన విశ్వాసానికి అనుగుణం” అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. భారత్‌ తన అంతరిక్ష శోధనయానంలో స్వీయ పురోగమనానికి పరిమితం కాబోదన్నారు. అంతర్జాతీయ ప్రపంచ విజ్ఞానాన్ని సుసంపన్నం చేయడం, ఉమ్మడి సవాళ్ల పరిష్కారం, భవిష్యత్తరాలకు స్ఫూర్తినివ్వడం వగైరాలు కూడా తమ లక్ష్యాల్లో భాగమని స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో సహకారంపై భారత్‌ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ- సమష్టి స్వప్నాలు, సామూహిక ఎదుగుదల, ఉమ్మడిగా నక్షత్ర శోధనకు ఎనలేని ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రీయ దృక్కోణంతో మెరుగైన భవిష్యత్తుపై సమష్టి ఆకాంక్షల దిశగా అంతరిక్ష పరిశోధనల రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Watershed Moment': PM Modi Praises BJP Workers After Thiruvananthapuram Civic Poll Victory

Media Coverage

'Watershed Moment': PM Modi Praises BJP Workers After Thiruvananthapuram Civic Poll Victory
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security