నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటో దశను ప్రారంభించనున్న ప్రధానమంత్రి.. నిర్మాణ వ్యయం సుమారు రూ.19,650 కోట్లు
ముంబయి మెట్రో లైన్-3 ఆఖరి దశను ప్రారంభించనున్న ప్రధానమంత్రి.. ముంబయి మెట్రో లైన్-3ను దేశ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధానమంత్రి.. నిర్మాణ వ్యయం రూ.37,270 కోట్ల కన్నా ఎక్కువ
ముంబయి వన్ యాప్ ను ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి
దేశంలో 11 ప్రజా రవాణా సేవా సంస్థలతో కామన్ మొబిలిటీ యాప్
నిరంతరాయ సంధానానికి పూచీ పడే ఉద్దేశంతో ముఖ్య పథకాలకు శుభారంభం
భారత్-యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢతరం చేస్తూ యూకే ప్రధానితో ముంబయిలో భేటీ కానున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో కీలకోపన్యాసమివ్వనున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ స్టార్మర్‌
జీఎఫ్ఎఫ్ 2025 ఇతివృత్తం: కృత్రిమ మేధ, ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్, నవకల్పన, సమ్మిళిత్వం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8వ, 9వ తేదీల్లో మహారాష్ట్రలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నవీ ముంబయికి చేరుకొంటారు. కొత్తగా కట్టిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన పరిశీలిస్తారు. ఆ  తరువాత, సుమారు మూడున్నర గంటల వేళకు, ప్రధానమంత్రి నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు ముంబయిలో వివిధ పథకాలను కూడా ప్రారంభించి, జాతికి అంకితమిస్తారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ఈ నెల 9న ఉదయం సుమారు 10 గంటల వేళ ప్రధానమంత్రి ముంబయిలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో భేటీ అవుతారు. మధ్యాహ్నం దాదాపుగా ఒంటి గంటా నలభై  నిమిషాలకు, రెండు దేశాల ప్రధానులూ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో సీఈఓ ఫోరానికి హాజరవుతారు. మధ్యాహ్నం సుమారు 2:45 గంటలకు, వారు ఇద్దరూ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ 6వ సంచికలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో వారు కీలకోపన్యాసాన్నిస్తారు.

నవీ ముంబయిలో ప్రధానమంత్రి
ఇండియాను ప్రపంచ విమానయాన కూడలిగా తీర్చిదిద్దాలన్న తన దృష్టికోణానికి అనుగుణంగా, ప్రధానమంత్రి నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎన్ఎంఐఏ) ఒకటో దశను ప్రారంభిస్తారు. దాదాపు రూ.19,650 కోట్లు ఖర్చు పెట్టి ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ భారతదేశంలో కొత్తగా నిర్మించిన అతి పెద్ద విమానాశ్రయం. దీనిని ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేశారు. ముంబయి మహానగర  ప్రాంతంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండే ఎన్ఎంఐఏ.. ఛత్రపతి శివాజీ  మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)తో పాటు సేవలందిస్తూ ముంబయిలో రద్దీని తగ్గించి, ఈ నగరాన్ని ప్రపంచంలో బహుళ విమానాశ్రయాలున్న నగరాల సరసన నిలబెడుతుంది. 1160 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యంత సమర్ధవంతంగా సేవలను అందించే విధంగా తీర్చిదిద్దిన ఈ విమానాశ్రయం మరికొంత కాలంలో ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలను అందించడంతో పాటు 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకులను రవాణా చేయగలుగుతుంది.

మొత్తం నాలుగు ప్రయాణికుల టర్మినళ్ల నుంచీ ప్యాసింజర్లు ఒక టర్మినల్ నుంచి మరో టర్మినల్‌లోకి వెళ్లేందుకు వీలుగా ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (ఏపీఎమ్) వ్యవస్థ, నగరం వైపు మౌలిక సదుపాయాల వ్యవస్థతో కలిపే ల్యాండ్‌సైడ్ ఏపీఎంతో లంకె పెట్టడం వంటి విశిష్ట సేవలను ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు. సస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్) కోసం ఉద్దేశించిన ఒక ప్రత్యేక నిల్వ సదుపాయం, సుమారు 47 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యం కలిగిన కేంద్రం, ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ఈవీ బస్సు సేవలు ఈ  విమానాశ్రయంలో లభిస్తాయి. దేశంలో మొదటి సారి ‘వాటర్ ట్యాక్సీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విమానాశ్రయం కూడా నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయమే కానుంది.
సుమారు రూ.12,200 కోట్ల అంచనా ఖర్చుతో ఆచార్య అత్రే చౌక్ నుంచి కఫ్ పరేడ్ వరకు విస్తరించిన ముంబయి మెట్రో లైన్-3 లోని 2బీ దశను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీంతో, ఆయన మొత్తం రూ. 37,270 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసుకున్న ముంబయి మెట్రో లైన్-3 (ఆక్వా లైను)ను దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఇది గనర పట్టణ రవాణా మార్పు దిశలో ఒక ప్రధాన ఘట్టంగా చరిత్రలో నిలవబోతోంది.

ముంబయిలో మొదటి, ఒకే ఒక పూర్తి భూగర్భ మెట్రో లైనుగా నిలిచే ఈ ప్రాజెక్టు ముంబయి మహానగర ప్రాంతం (ఎమ్ఎమ్ఆర్)లో రాకపోకలకు సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోంది. అంతేకాదు, లక్షల మంది నివాసితులకు వేగవంతమైన, మరింత సమర్థమైన, ఆధునిక రవాణా సాధనం అందుబాటులోకి వస్తుంది కూడా.

కఫ్ పరేడ్ నుంచి ఆరే జేవీఎల్ఆర్ వరకు 33.5 కిలోమీటర్ల పొడవైన, 27 స్టేషన్లతో కూడి ఉండే ముంబయి మెట్రో లైన్-3 ప్రతి రోజూ 13 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాజెక్టులో చివరిదైన 2బీ దశ దక్షిణ ముంబయిలోని వారసత్వాన్నీ, సాంస్కృతిక జిల్లాలైన ఫోర్ట్, కాలా ఘోడా, మెరైన్ డ్రైవ్ వరకు నిరంతరాయ అనుసంధానాన్ని అందిస్తుంది. దీంతో పాటు బాంబే హై కోర్టు, మంత్రాలయ, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బీఎస్ఈ), నారీమన్ పాయింట్ సహా ప్రధాన పరిపాలన, ఆర్థిక కూడళ్ల వరకు నేరుగా సేవల్ని అందిస్తుంది.

రైల్వేలు, విమానాశ్రయాలు, ఇతర మెట్రో లైన్లతో పాటు మోనోరైల్ సేవల వంటి ఇతర రవాణా సాధనాలతో సమర్థ ఏకీకరణకు అనువుగా మెట్రో లైన్-3కు రూపకల్పన చేశారు. దీంతో చివరి అంచె వరకు సంధానంలో మెరుగుదల సాధ్యపడుతుంది. మహానగర ప్రాంతంలో రద్దీ కూడా ఇప్పటి కన్నా తగ్గుతుంది.

ప్రధానమంత్రి ‘‘ముంబయి వన్’’ను కూడా ప్రారంభిస్తారు. ముంబయి వన్ 11 ప్రజారవాణా సేవల నిర్వహణ సంస్థలను దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చిన ఏకీకృత ఉమ్మడి మొబిలిటీ యాప్. ఈ 11 ప్రజారవాణా  సేవా నిర్వహణ సంస్థల్లో ముంబయి మెట్రో లైన్ 2ఏ, 7, ముంబయి మెట్రో లైన్ 3, ముంబయి మెట్రో లైన్ 1, ముంబయి మోనోరైల్, నవీ ముంబయి  మెట్రో, ముంబయి సబర్బన్ రైల్వే, బృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బీఈఎస్‌టీ), ఠాణే మ్యూనిసిపల్ ట్రాన్స్‌పోర్ట్, మీరా భయందర్ మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్, కల్యాణ్ డోంబివలీ మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్‌లతో పాటు నవీ ముంబయి మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నాయి.
ముంబయి వన్ యాప్ ప్రయాణికులకు అనేక విధాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో పలు ప్రజారవాణా సేవా నిర్వహణ సంస్థలు ఉపయోగించుకోగలిగే ఏకీకృత మొబైల్ యాప్. టికెట్ జారీ, డిజిటల్ లావాదేవీలను అమల్లోకి తేవడం ద్వారా ప్రయాణికులు టిక్కెట్ల కోసం బారులు తీరే పద్ధతికి స్వస్తి పలకడం, బహుళవిధ రవాణా సాధనాలకు ఒకే డైనమిక్ టికెట్ పద్ధతిని తెస్తున్నారు. ఇది ఆలస్యం, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమిటి, ఏ వేళకు వచ్చేదీ వాస్తవిక సమయం ఆధారంగా తాజా సమాచారాన్ని తెలియజేయడం, చుట్టుపక్కల ఉన్న స్టేషన్లు, ఆకర్షణీయ స్థలాలు, దర్శనీయ స్థలాల గురించిన మ్యాప్ ఆధారిత సమాచారం, ప్రయాణికుల భద్రతకు  పూచీపడడానికి ఒక ఎస్ఓఎస్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇవన్నీ కలిసి సౌకర్యం, దక్షత, భద్రతలను పెంచుతాయి. దీంతో పూర్తి ముంబయిలో ప్రజారవాణా అనుభూతి మారిపోవడం తథ్యం.  

ఉపాధియోగ్యతను అందించే స్వల్పకాలిక కార్యక్రమాన్ని (ఎస్‌టీఈపీ) కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ మార్గదర్శక కార్యక్రమాన్ని మహారాష్ట్రలో నైపుణ్యం, ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికత్వం, నవకల్పన విభాగం తీసుకువచ్చింది. దీనిని 400 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లోనూ (ఐటీఐలు), 150 ప్రభుత్వ సాంకేతిక ఉన్నత పాఠశాలల్లోనూ మొదలుపెడతారు. నైపుణ్యాభివృద్ధి ప్రక్రియను పరిశ్రమ అవసరాలతో ముడిపెట్టే దిశగా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా నిలవబోతోంది. ఎస్‌టీఈపీలో భాగంగా 2,500 కొత్త శిక్షణ బ్యాచులను ఏర్పాటు చేస్తారు. దీనిలో మహిళల కోసం 364 ప్రత్యేక బ్యాచులు, కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), విద్యుత్తు వాహనాలు (ఈవీ), సౌర శక్తి, యాడిటివ్ మాన్యుఫాక్చరింగ్ వంటి సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికత ప్రధాన పాఠ్యక్రమాలను నేర్చుకొనే 408 బ్యాచులు కలిసి ఉంటాయి.
 

యూకే ప్రధాని పర్యటనగ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకొని, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ నెల 8వ, 9వ తేదీల్లో భారత్‌ పర్యటనకు రాబోతున్నారు. ప్రధాని శ్రీ స్టార్మర్ ఇండియాలో అధికార పర్యటనకు రావడం ఇదే మొదటి సారి.

ఈ పర్యటన కాలంలో, ప్రధానమంత్రులు ఇద్దరూ ‘విజన్ 2035’కు అనుగుణంగా భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు విభిన్న అంశాల్లో చోటుచేసుకున్న ప్రగతిని సమీక్షిస్తారు. విజన్ 2035 వ్యాపారం, పెట్టుబడి, సాంకేతికత, నవకల్పన, రక్షణ, భద్రత, వాతావరణ మార్పు, ఇంధనం, వైద్యం, విద్య, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల వంటి ముఖ్య రంగాల్లో పది సంవత్సరాల్లో చేపట్టదగిన కార్యక్రమాలను వివరించే ఒక మార్గసూచీ.

నేతలిద్దరూ వాణిజ్య సంస్థల, పరిశ్రమ రంగ ప్రముఖులతో భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)లో పొందుపరిచిన అవకాశాలపై చర్చిస్తారు. సీఈటీఏ భారత్, యూకే ఆర్థిక భాగస్వామ్యంలో ఒక ముఖ్య కారకంగా ఉంది. నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కల అంశాలపై తమ ఆలోచనలను పంచుకొంటారు. ఇద్దరు నేతలూ పరిశ్రమ నిపుణులతో, విధాన రూపకర్తలతో, ఆవిష్కర్తలతో కూడా సమావేశమవుతారు.

ప్రధానమంత్రితో పాటు ప్రధాని శ్రీ స్టార్మర్ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ 6వ సంచికలో కూడా పాల్గొంటారు. వారు ఈ సందర్భంగా కీలకోపన్యాసాలిస్తారు.

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ 2025లో ప్రపంచం నలు మూలల నుంచీ ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, కేంద్ర బ్యాంకుల సారథులు, నియంత్రణ సంస్థల ప్రధానాధికారులు, ఇన్వెస్టర్లు, విద్య రంగ ప్రముఖులు, పరిశ్రమ రంగ ప్రముఖులు పాలుపంచుకొంటారు. ‘ఎంపవరింగ్ ఫైనాన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్’ను (ఉత్తమ ప్రపంచాన్ని ఆవిష్కరించడం కోసం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం) ఈ సమావేశపు ముఖ్యాంశంగా తీసుకున్నారు. ఏఐ, ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్, నవకల్పనలతో పాటు సమ్మిళిత్వం.. వీటి సాయంతో నైతికత ప్రధానమైన, సుస్థిర ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సాంకేతిక విజ్ఞ‌ానం, మనిషిలో లోతైన అవగాహన.. ఈ రెంటినీ కలబోయాలన్నది ఈ సమావేశపు చర్చనీయాంశం.

ఈ సంవత్సరం నిర్వహించే సంచికలో 75 కన్నా ఎక్కువ దేశాల నుంచి 1,00,000 మందికి పైగా ప్రతినిధులు పాలు పంచుకోనుండటంతో, ప్రపంచంలో అతి పెద్ద ఫిన్‌టెక్ సమ్మేళనాల్లో ఒకటిగా మారుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 7,500 వాణిజ్య సంస్థలు, 800 మంది వక్తలు, 400 మంది ప్రదర్శనకారులు, భారతీయ, అంతర్జాతీయ అధికార పరిధులకు ప్రాతినిధ్యం వహించే 70 మంది నియంత్రణ సంస్థల ప్రధాన అధికారులు పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో సింగపూర్‌కు చెందిన మానిటరీ అథారిటీ, జర్మనీకి చెందిన డాయిష్ బుండెస్‌ బ్యాంకు, ఫ్రాన్స్‌కు చెందిన బ్యాంక్ డీ ఫ్రాన్స్‌తో పాటు స్విట్జర్లాండుకు చెందిన స్విస్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్‌వైజరీ అథారిటీ (ఎఫ్ఐఎన్ఎమ్ఏ) వంటి ప్రసిద్ధ అంతర్జాతీయ నియంత్రణాధికార సంస్థలు పాల్గొంటున్నాయి. వాటి భాగస్వామ్యం ఆర్థిక విధాన చర్చ, సహకారం అంశాల్లో ప్రపంచ స్థాయి వేదికగా జీఎఫ్ఎఫ్‌కు సత్తా నానాటికీ వృద్ధి చెందుతోందని స్పష్టం చేస్తోంది.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt sets up six sector groups to fast-track ‘Make in India 2.0’ push

Media Coverage

Govt sets up six sector groups to fast-track ‘Make in India 2.0’ push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
June 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, June 28th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.