యువతకు నైపుణ్యాలను అందించే చరిత్రాత్మక కార్యక్రమం..
దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐల ఉన్నతీకరణకు రూ.60,000 కోట్ల పెట్టుబడితో ‘పీఎం-సేతు’కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీకారం
బిహార్‌లో యువజనులకు విద్యతో పాటు నైపుణ్యాలను అందించడం ప్రధానోద్దేశం
బిహార్‌లో ‘ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజన’కు మెరుగులు.. 5 లక్షల మంది పట్టభద్రులకు నెల నెలా రూ.1,000 భత్యం.. రెండేళ్ల పాటు ఈ పథకం అమలు
బిహార్‌లో జన్ నాయక్ కర్పూరీ ఠాకుర్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి..
వృత్తి సంబంధిత విద్యతో పాటు పరిశ్రమల అవసరాలను తీర్చే కోర్సులకు ఊతం
బిహార్‌లో నాలుగు విశ్వవిద్యాలయాల్లో సరికొత్త విద్యా, పరిశోధక కేంద్రాలకు శంకుస్థాపన చేసి, ఎన్ఐటీ పట్నా నూతన ప్రాంగణాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

యువజనాభివృద్ధికి అండగా నిలిచే ఒక  మహత్తర కార్యక్రమానికి నాందీప్రస్తావన జరగబోతోంది.. యువత పురోగతిపై దృష్టి సారించి రూ.62,000 కోట్ల కన్నా ఎక్కువ నిధులను ఖర్చు పెట్టే వివిధ కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమాలు దేశం నలుమూలలా విద్య బోధన,  నైపుణ్య సాధనకు దోహదపడడంతో పాటు, వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయాలన్న తపనకు కూడా అండగా నిలుస్తాయి. ఇదే కార్యక్రమంలో, నేషనల్ స్కిల్ కాన్వొకేషన్‌ నాలుగో సంచిక ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’ను కూడా నిర్వహిస్తున్నారు. దీనిని ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించారు. దీనిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ శాఖ ఆధీనంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో అఖిల భారత్ స్థాయి అగ్రగాములుగా నిలిచిన 46 మందిని సత్కరిస్తారు.
   
‘పీఎం-సేతు’ (ప్రధాన్ మంత్రీ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబులిటీ ట్రాన్స్‌ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్)ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. దీనికి రూ.60,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. దేశంలో 1,000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల స్థాయిని పెంచడం ఈ పథకం ఉద్దేశం. ఈ వేయి ఐటీఐలలో 200 ఐటీఐలను కూడలి ఐటీఐలు గానూ, 800 ఐటీఐలను అనుబంధ ఐటీఐలు గానూ (హబ్, స్పోక్ నమూనాలో) రూపొందిస్తారు. ప్రతి ఒక్క కూడలి ఐటీఐ సగటున నాలుగు అనుబంధ ఐటీఐలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మొత్తంమీద ఆధునిక మౌలిక సదుపాయాలు, ట్రేడ్‌లు, డిజిటల్ విద్యా వ్యవస్థలు, ఇన్‌క్యూబేషన్ సౌకర్యాలు కలిగి ఉండే క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. ఈ క్లస్టర్లను యాంకర్ ఇండస్ట్రీ పార్ట్‌నర్లు నిర్వహిస్తాయి. దీంతో, పరిశ్రమల అవసరాలకు తులతూగే నైపుణ్యాలు విద్యార్థులకు అందివస్తాయి. వారు వాణిజ్య సంస్థల అవసరాల మేరకు పనిచేయగలిగే స్థితికి చేరుకొంటారు. కూడలి ఐటీఐలలో నవకల్పన కేంద్రాలు, శిక్షణనిచ్చే వారిని తీర్చిదిద్దే కేంద్రాలు, ఉత్పత్తి విభాగాలు, నియామక సేవల విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఇక అనుబంధ ఐటీఐలు సేవలను విస్తరించడంపై శ్రద్ధ తీసుకుంటాయి. వెరసి, పీఎం-సేతు భారత్‌లో ఐటీఐ అనుబంధ విస్తారిత వ్యవస్థకు సరికొత్త నిర్వచనాన్నిస్తుంది. ఈ వ్యవస్థ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ నిర్వహణ బాధ్యతను పారిశ్రామిక రంగం తీసుకొనేదిగా రూపుదిద్దుతారు. ఈ వ్యవస్థకు ప్రపంచ  బ్యాంకు నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. పీఎం-సేతును అమలు చేసే తొలి దశలో పట్నా, దర్భంగా ఐటీఐలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.  

దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 1,200 వొకేషనల్ స్కిల్ ల్యాబులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రయోగశాలలు మారుమూల ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చదువుకుంటున్న వారితో సహా ఇతర విద్యార్థులకు వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటోమోటివ్, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ, పర్యటన తదితర 12 ప్రధాన రంగాల్లో ఆచరణాత్మక శిక్షణను అందిస్తాయి. సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక, జాతీయ విద్య విధానం-2020ల లక్ష్యాలకు తులతూగేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. విద్యార్థులను పారిశ్రామిక అవసరాలను తీర్చేవారు గాను, ఉద్యోగ యోగ్యతను సంతరించుకొనే వారు గాను తీర్చిదిద్దేందుకు 1,200 మంది వొకేషనల్ టీచర్లకు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా తగిన శిక్షణను ఇస్తారు.    

బిహార్‌కు ఉన్న వైభవోపేత వారసత్వాన్నీ, ఆ రాష్ట్రంలో యువ జనాభా ఎక్కువ సంఖ్యలో ఉండడాన్నీ లెక్కలోకి తీసుకొని రాష్ట్రంలో పెను మార్పును తీసుకురాగలిగిన ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మార్పుచేర్పులు చేసిన ‘ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయతా భత్తా యోజన’ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా సుమారు 5 లక్షల మంది గ్రాడ్యుయేట్ యువజనులకు ప్రతి నెల రూ.1,000 చొప్పున భత్యాన్ని రెండు సంవత్సరాల పాటు అందిస్తారు. దీనికి తోడు ఆ యువజనులకు పైసా ఖర్చు చేయనక్కరలేకుండా వివిధ నైపుణ్యాల్లోనూ శిక్షణనిస్తారు. మెరుగులు దిద్దిన ‘బిహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీము’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ  పథకంలో భాగంగా, విద్యార్థులకు రూ.4 లక్షల వరకు విద్య రుణాలను అందజేస్తారు. ఇవి వడ్డీ కట్టనక్కర్లేని రుణాలు కావడంతో, ఉన్నత విద్య చదువుకోవడం ఆర్థికంగా ఎలాంటి భారం కాబోదు. ఈ పథకంలో ఇప్పటికే 3.92 లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థులు రూ.7,880 కోట్ల కన్నా ఎక్కువ రుణాలను అందుకున్నారు. రాష్ట్రంలో యువతను సాధికారులను చేసే ప్రక్రియను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో, రాష్ట్రంలోని 18-45 వయోవర్గానికి చెందిన యువత శక్తి యుక్తులను మంచి మార్గాల్లోకి మళ్లించి సద్వినియోగపరచడానికి ‘బీహార్ యువ ఆయోగ్’ పేరుతో ఒక చట్టబద్ధ కమిషనుకు రూపకల్పన చేశారు. ‘బీహార్ యువ ఆయోగ్’ను ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు.      

బిహార్‌లో జన్ నాయక్ కర్పూరీ ఠాకుర్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ విశ్వవిద్యాలయాన్ని వృత్తి సంబంధిత విద్యతో పాటు పరిశ్రమల అవసరాలను తీర్చడం ప్రధానంగా రూపొందించిన కోర్సులను బోధించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.

ఉన్నత విద్యావకాశాలను మెరుగుపరిచే దృష్టికోణంతో రూపొందించిన ‘జాతీయ విద్య విధానం-2020’ని ముందుకు తీసుకుపోతూ ‘పీఎం-ఉషా’ (ప్రధాన్ మంత్రీ ఉచ్చ్‌తర్ శిక్షా అభియాన్)లో భాగంగా, బిహార్‌లో 4 విశ్వవిద్యాలయాల్లో కొత్తగా విద్య, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆ నాలుగు యూనివర్సిటీలూ.. పట్నా యూనివర్సిటీ, మధేపురాలోని భూపేంద్ర నారాయణ్ మండల్ యూనివర్సిటీ, ఛప్రాలోని జై ప్రకాశ్ విశ్వవిద్యాలయతో పాటు పట్నాలోని నలందా సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఈ విద్య, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి రూ.160 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత, వీటి ప్రయోజనాలను 27,000 మంది విద్యార్థులు అందుకుంటారు. ఈ కేంద్రాల్లో ఆధునిక విద్య బోధన కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఉన్నత సౌకర్యాలతో  కూడిన ప్రయోగశాలలు, వసతిగృహాలు, వివిధ కోర్సులు అందుబాటులోకి  వస్తాయి.

ఎన్ఐటీ పట్నాలో బిహ్టా కేంపసును దేశ ప్రజలకు ప్రధానమంత్రి అంకితం చేస్తారు. మొత్తం 6,500 మంది విద్యార్థులకు నిలయంగా నిలిచే ఈ కేంపసులో 5జీ వినియోగ సామర్థ్యం కలిగిన ల్యాబునూ, ఇస్రో సహకారంతో ఒక ప్రాంతీయ అంతరిక్ష విద్య కేంద్రాన్నీ, ఇప్పటికే 9 అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించిన ఒక ఇన్నొవేషన్, ఇన్‌క్యూబేషన్ సెంటరునూ ఏర్పాటు చేశారు.      

బిహార్ ప్రభుత్వంలో కొత్తగా నియామక ప్రక్రియ పూర్తి చేసిన 4,000 కన్నా ఎక్కువ మంది అభ్యర్థులకు నియామక పత్రాలను కూడా ప్రధానమంత్రి అందజేస్తారు. అలాగే ‘ముఖ్యమంత్రి బాలక్, బాలిక స్కాలర్‌షిప్ స్కీము’లో భాగంగా 25 లక్షల మంది తొమ్మిదో తరగతి, పదో తరగతి విద్యార్థులకు రూ.450 కోట్ల విలువైన ఉపకార వేతనాలను ప్రయోజనాల నేరు బదలీ (డీబీటీ) పద్ధతిలో ప్రధానమంత్రి విడుదల చేస్తారు.  

ప్రారంభించబోయే కార్యక్రమాలు దేశంలో యువజనులకు చెప్పుకోదగిన అవకాశాలను అందిస్తాయని ఆశిస్తున్నారు. విద్య బోధన, నైపుణ్య సాధన, వాణిజ్య  సంస్థలను ఏర్పాటు చేయాలనే తపన, మెరుగైన మౌలిక సదుపాయాలు.. వీటన్నింటినీ ఏకతాటి మీదకు తీసుకు వచ్చి దేశ పురోగతికి దృఢ పునాదిని వేయడంలో తోడ్పడాలనేదే ఈ కార్యక్రమాల ఉద్దేశం. బిహార్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో, ఆ  రాష్ట్రం చేయి తిరిగిన కార్మికశక్తికి ఒక కేంద్రంగా ఎదుగుతూ ప్రాంతీయ అభివృద్ధికీ, జాతీయ అభివృద్ధికీ దోహదపడే అవకాశాలు పెరుగుతాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
MSMEs’ contribution to GDP rises, exports triple, and NPA levels drop

Media Coverage

MSMEs’ contribution to GDP rises, exports triple, and NPA levels drop
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of grasping the essence of knowledge
January 20, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared a profound Sanskrit Subhashitam that underscores the timeless wisdom of focusing on the essence amid vast knowledge and limited time.

The sanskrit verse-
अनन्तशास्त्रं बहुलाश्च विद्याः अल्पश्च कालो बहुविघ्नता च।
यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥

conveys that while there are innumerable scriptures and diverse branches of knowledge for attaining wisdom, human life is constrained by limited time and numerous obstacles. Therefore, one should emulate the swan, which is believed to separate milk from water, by discerning and grasping only the essence- the ultimate truth.

Shri Modi posted on X;

“अनन्तशास्त्रं बहुलाश्च विद्याः अल्पश्च कालो बहुविघ्नता च।

यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥”