సెప్టెంబరు 12 సాయంత్రం 4:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ జ్ఞాన భారతం సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. జ్ఞాన భారతం పోర్టలును కూడా ఆయన ప్రారంభిస్తారు. రాతప్రతుల డిజిటలీకరణను వేగవంతం చేయడం, అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన ప్రత్యేక డిజిటల్ వేదిక ఇది. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
సెప్టెంబరు 11 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఈ సదస్సు ఇతివృత్తం ‘రాతప్రతుల వారసత్వం... భారతీయ వైజ్ఞానిక పునరుద్ధరణ’. అసమానమైన భారత రాతప్రతి సంపదను పునరుజ్జీవింపజేసే మార్గాలను చర్చించడంతోపాటు అంతర్జాతీయ వైజ్ఞానిక చర్చల్లో వాటిని కేంద్రంగా నిలపడం లక్ష్యంగా.. ప్రముఖ పండితులు, పరిరక్షకులు, సాంకేతిక నిపుణులు, విధాన నిపుణులను ఈ సదస్సు ఒక్కచోట చేరుస్తుంది. ఇందులో భాగంగా అరుదైన రాతప్రతుల ప్రదర్శనతోపాటు వాటి సంరక్షణ, డిజిటలీకరణ సాంకేతికతలు, మౌలిక డేటా ప్రమాణాలు, చట్టపరమైన ఏర్పాట్లు, సాంస్కృతిక దౌత్యం, పురాతన లిపిని అవగతం చేసుకోవడంపై నిపుణుల ప్రదర్శనలు కూడా ఉంటాయి.


