గౌరవనీయ సభ్యులారా,
సాంకేతికత వేగంగా పురోగమిస్తున్న కొద్దీ వనరులు, అవకాశాలు కొద్దిమంది వద్దనే మరింతగా కేంద్రీకృతమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమైన సాంకేతికతల విషయంలో పోటీ కూడా తీవ్రమవుతోంది. ఇది మానవ సమాజానికి ఆందోళనకరమే కాకుండా కొత్త ఆవిష్కరణలకు అడ్డంకి కూడా. దీన్ని నిరోధించాలంటే మన ఆలోచనా విధానంలో మౌలికమైన మార్పు అవసరం.
మనం ప్రోత్సహించే సాంకేతికత, 'ఆర్థిక కేంద్రకం' గా కాకుండా ' మానవ కేంద్రకం' గా ఉండాలి. దేశాలకే పరిమితమై పోకుండా ప్రపంచమంతా ఉపయోగించుకునేలా ఉండాలి. పరిమిత ప్రత్యేక వనరుల విధానాల స్థానంలో అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్-సోర్స్ విధానాలను ప్రోత్సహించాలి. భారత్ ఈ భావనతోనే తన సాంకేతిక ప్రాజెక్టులను రూపొందిస్తోంది.

ఈ కారణం చేతనే ప్రపంచంలోనే ఎక్కువ డిజిటల్ చెల్లింపులు భారత్‌లో జరుగుతున్నాయి. అంతరిక్ష సాంకేతికత నుంచి కృత్రిమ మేధస్సు వరకు, ప్రతి రంగంలో పురోగతి, విస్తృత అభివృద్ధి కనిపిస్తోంది.
మిత్రులారా,
కృత్రిమ మేధస్సు విషయంలో భారతదేశ విధానం మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా నిర్మితమైంది. అందరికీ సమాన లభ్యత, జనాభా స్థాయిననుసరించి ప్రజలకు శిక్షణ, బాధ్యతాయుత వినియోగం. ఇండియా ఏఐ మిషన్ ద్వారా ప్రతి జిల్లా, ప్రతి భాష వరకు ఏఐ ప్రయోజనాలు చేరేలా శక్తిమంతమైన కంప్యూటింగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీని వలన మానవ అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి తోడ్పాటు లభిస్తుంది.
అదే సమయంలో, ఏఐని విశ్వ శ్రేయస్సు కోసం బాధ్యతగా వినియోగించడం, దుర్వినియోగం జరగకుండా చూడడం ముఖ్యం. ఇందుకు ప్రాథమిక సూత్రాల ఆధారంగా కుదుర్చుకున్న ప్రపంచ స్థాయి ఏఐ ఒప్పందం అవసరం. ఇందులో ప్రభావవంతమైన మానవ పర్యవేక్షణ, నిర్మాణపరమైన భద్రత, పారదర్శకతలతో పాటు డీప్‌ఫేక్‌లు, నేరాలు, ఉగ్రవాదం కోసం ఏఐ వినియోగాన్ని నిషేధించడం వంటి అంశాలు ఉండాలి.
మానవ జీవితం, భద్రత, ప్రజల విశ్వాసంపై ప్రభావం చూపే ఏఐ వ్యవస్థలు తప్పనిసరిగా జవాబుదారీతనంగా, పరీక్షించదగ్గవిగా ఉండాలి. ఏఐ మనుషుల సామర్థ్యాలను పెంచే అవకాశం ఉన్నప్పటికీ, నిర్ణయం తీసుకునే విషయంలో కడసరి బాధ్యత మనుషులవద్ద ఉండడం చాలా ముఖ్యమైనది.
2026 ఫిబ్రవరిలో “సర్వజన హితాయ, సర్వజన సుఖాయ”(అందరికీ సంక్షేమం - అందరికీ సంతోషం) అనే థీమ్‌తో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను భారత్ నిర్వహించనుంది. ఈ సదస్సులో అన్ని జీ20 దేశాలు పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం.

మిత్రులారా,
ఈ ఏఐ యుగంలో, మన దృష్టిని “ప్రస్తుత ఉద్యోగాల” నుంచి “భవిష్యత్ సామర్థ్యాల” వైపు మార్చాలి. వేగవంతమైన కొత్త ఆవిష్కరణలకు ప్రతిభ విస్తరణ (టాలెంట్ మొబిలిటీ) చాలా అవసరం. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో దీనిపై పురోగతి సాధించాం. రాబోయే కాలంలో జీ20... ప్రతిభ విస్తరణ కోసం ప్రపంచస్థాయి విధానాలను రూపొందిస్తుందని ఆశిస్తున్నాం.
మిత్రులారా,
ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నదీ కోవిడ్ మనకు తెలియజెప్పింది. ఆ కష్టకాలంలో కూడా భారత్ 150 కంటే ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్లు, మందులు అందించింది. దేశాలను కేవలం మార్కెట్లుగా చూడకూడదు. వాటి పట్ల ఒక సున్నితమైన, దీర్ఘకాలిక దృష్టికోణాన్ని అలవర్చుకోవాలి.
భారతదేశం చెప్పే స్పష్టమైన సందేశం ఏమిటంటే:
· అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి
· వాణిజ్యం విశ్వసనీయంగా ఉండాలి
· ఆర్థిక వ్యవస్థ న్యాయంగా ఉండాలి
· ప్రగతి అందరికీ ఉపయోగపడాలి
అప్పుడే మనం అందరికీ న్యాయంగా, సమానంగా ఉండే భవిష్యత్తును నిర్మించగలం.
ధన్యవాదాలు


