నమస్కారం..
ఈ రోజు మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు జపాన్ శక్తికీ, వైవిధ్యానికి రూపం.

ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.

గౌరవనీయులారా,
భారత్-జపాన్ మధ్య సుదీర్ఘ సంబంధాలు వేల సంవత్సరాల నాటివి. మనం బుద్ధుని కరుణతో అనుసంధానమయ్యాం. బెంగాల్‌కు చెందిన రాధావినోద్ పాల్ 'టోక్యో ట్రయల్స్'లో 'వ్యూహం' కంటే 'న్యాయం' గొప్పదని చాటిచెప్పారు. ఆయన అజేయమైన ధైర్యంతో మనం అనుసంధానమయ్యాం.

నా స్వస్థలమైన గుజరాత్ నుంచి వజ్రాల వ్యాపారులు గత శతాబ్దం ప్రారంభంలో కోబె ప్రాంతానికి వచ్చారు. హమా-మట్సు కంపెనీ భారత ఆటోమొబైల్ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇరు దేశాల ఈ వ్యాపార స్ఫూర్తి మనల్ని కలిపి ఉంచుతోంది.

ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. భారత్-జపాన్‌లను దగ్గరగా అనుసంధానించే అనేక బంధాలు ఉన్నాయి. నేడు వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం, భద్రత, నైపుణ్యం, సాంస్కృతిక రంగాల్లో ఈ సంబంధాలు నూతన అధ్యాయాలు లిఖిస్తున్నాయి. ఈ సంబంధం టోక్యో-ఢిల్లీ ప్రాంతాలకే పరిమితం కాదు. ఈ సంబంధం భారత్-జపాన్ ప్రజల ఆలోచనల్లో నిండి ఉంది.

గౌరవనీయులారా,
ప్రధానమంత్రి కావడానికి ముందు.. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా దాదాపు దశాబ్దంన్నర పాటు పనిచేశాను. ఆ సమయంలోనే జపాన్‌ను సందర్శించే భాగ్యం కూడా నాకు లభించింది. మన ఇరు దేశాల్లోని రాష్ట్రాల సామర్థ్యాలు, అవకాశాలను నేను దగ్గరగా చూశాను.

ముఖ్యమంత్రిగా నా దృష్టి విధాన ఆధారిత పాలనను, పరిశ్రమలను ప్రోత్సహించడం, బలమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపైనే ఉండేది. నేడు దీనిని 'గుజరాత్ మోడల్' అంటున్నారు.

2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆలోచనను జాతీయ విధానంలోనూ భాగంగా చేసుకున్నాం. మా రాష్ట్రాల మధ్య పోటీతత్వ స్ఫూర్తిని తిరిగి పునరుజ్జీవింపజేశాం. జాతీయ వృద్ధికి వాటిని ఒక వేదికగా మార్చాం. జపాన్ రాష్ట్రాల మాదిరిగానే భారత్‌లో ప్రతి రాష్ట్రానికి దాని సొంత గుర్తింపు, ప్రత్యేకత ఉన్నాయి.

వాటి ప్రాంతాలు భిన్నంగా ఉంటాయి. కొన్ని తీరప్రాంతంలో ఉంటే, మరికొన్ని పర్వతాల ఒడిలో ఉన్నాయి.

మా వైవిధ్యాన్ని లాభదాయకంగా మార్చడానికి మేం కృషి చేస్తున్నాం. ప్రతి జిల్లా ఆర్థిక వ్యవస్థను, గుర్తింపును మెరుగుపర్చేందుకు "ఒక జిల్లా - ఒక ఉత్పత్తి" ప్రచారాన్ని మేం ప్రారంభించాం. అభివృద్ధిలో వెనకబడిన జిల్లాలు, మండలాల కోసం మేం ఆకాంక్షాత్మక జిల్లా, మండలం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. మారుమూల సరిహద్దు గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించడం కోసం మేం వైబ్రంట్ విలేజెస్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు ఈ జిల్లాలు, గ్రామాలు జాతీయ వృద్ధికి కొత్త కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.
గౌరవనీయులారా,
మీ రాష్ట్రాలు సాంకేతికత, తయారీ, ఆవిష్కరణలకు నిజమైన శక్తి కేంద్రాలు. వాటిలో కొన్ని మొత్తం దేశాల కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి. దీని అర్థం మీరు కూడా అంతే గొప్ప బాధ్యతను నిర్వరిస్తున్నారు.
అంతర్జాతీయ సహకార భవిష్యత్తు... మీ ప్రయత్నాల ద్వారానే రూపుదిద్దుకుంటోంది. అనేక భారతీయ రాష్ట్రాలు, జపాన్ రాష్ట్రాలు ఇప్పటికే భాగస్వామ్యాలను కలిగి ఉన్నాయి. అవి:

గుజరాత్ - షిజోకా రాష్ట్రం

ఉత్తర ప్రదేశ్ - యమనాషి రాష్ట్రం

మహారాష్ట్ర – వాకాయమా రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్ - టోయామా రాష్ట్రం

ఈ భాగస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా.. కాగితం నుంచి ప్రజల శ్రేయస్సు దాకా ముందుకుసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

భారత రాష్ట్రాలు అంతర్జాతీయ సహకార కేంద్రాలుగా మారాలని మేం కోరుకుంటున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి శ్రీ ఇషిబాతో కలిసి నేను ఇరుదేశాల రాష్ట్రాల భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి సంవత్సరం కనీసం మూడు భారతీయ రాష్ట్రాలు, మూడు జపాన్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఒకరి దేశాన్ని మరొకరు సందర్శించాలనేది దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగం కావాలనీ, భారతదేశాన్ని సందర్శించాలనీ నేను మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

భారత-జపాన్ రాష్ట్రాలు మన ఉమ్మడి పురోగతికి సహకరించేలా కృషి చేద్దాం.

మీ దేశంలో పెద్ద కంపెనీలకు మాత్రమే కాకుండా ఎస్ఎమ్ఈలు, అంకురసంస్థలకు కూడా ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. అదేవిధంగా భారత్‌లోనూ చిన్న పట్టణాల నుంచి వచ్చిన అంకురసంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలు కూడా దేశ వృద్ధిని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

జపాన్-భారతదేశాల ఈ శక్తిమంతమైన వ్యవస్థలు కలిసి పనిచేస్తే -

సరికొత్త ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి.

ఆవిష్కరణలు ఊపందుకుంటాయి.

విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయి!

ఈ ఆలోచనతోనే కాన్సాయ్‌లో బిజినెస్ ఎక్స్‌ఛేంజ్ ఫోరం ప్రారంభం కావడం నాకు సంతోషంగా ఉంది. ఇది కంపెనీల మధ్య ప్రత్యక్ష సమాచార వినిమియాన్ని పెంపొందిస్తుంది. కొత్త పెట్టుబడులను తీసుకువస్తుంది. అంకురసంస్థల భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుంది. నైపుణ్యం గల నిపుణులకు మరిన్ని అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది.

గౌరవనీయులారా,
యువ మేథావులు కలిసి పనిచేసినప్పుడు, గొప్ప దేశాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందుతాయి.

జపాన్ విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఇక్కడ చదువుకోవడానికీ, నేర్చుకోవడానికీ, తమ సహకారం అందించడానికి ప్రోత్సహించడం కోసం నిన్న ప్రధానమంత్రి శ్రీ ఇషిబాతో కలిసి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించాం. ఈ ప్రణాళిక ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో 5 లక్షల మంది వివిధ రంగాల్లో ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి అదనంగా, 50,000 మంది నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులు జపాన్‌కు రానున్నారు. ఈ విషయంలో జపాన్ రాష్ట్రాల పాత్ర కీలకం కానుంది. ఈ ప్రయత్నంలో మీ మద్దతు మాకు ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.

గౌరవనీయులారా,
మన దేశాలు కలిసి ముందుకు సాగుతున్న క్రమంలో.. ఇరు దేశాల్లోని ప్రతి రాష్ట్రం కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ ప్రజలకు కొత్త అవకాశాలను అందుబాటులోకి తేవాలని నేను కోరుకుంటున్నాను.

టోక్యో-ఢిల్లీ ముందంజ వేయగలవు.

కానీ,
కనగవా-కర్నాటక రాష్ట్రాలు కలిసి వాటి గళం వినిపించేలా చేద్దాం.

అయిచి - అస్సాం రాష్ట్రాలు కలిసి కలలు కనేలా చేద్దాం.

ఒకాయమా-ఒడిశా కలిసి భవిష్యత్తును నిర్మించుకునేలా చేద్దాం.

ధన్యవాదాలు.

అడిగాహ్ తో.. గొజైమాసు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions