ప్రపంచ ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో ఉక్కుదే ప్రధాన పాత్ర, ఎన్నో విజయగాథలకు మూలం ఉక్కే: ప్రధాని
నేడుప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ అవతరించడం గర్వకారణం: ప్రధాని
జాతీయ ఉక్కు విధానం కింద 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: ప్రధాని
అనేక ఇతర భారతీయ పరిశ్రమలను అంతర్జాతీయంగా పోటీపడే స్థాయిలో నిలపడంలో ఉక్కు పరిశ్రమపై ప్రభుత్వ విధానాలు కీలకం: ప్రధాని
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటి లక్ష్యమూ ‘దిగుమతి రహితం’, ‘నికర ఎగుమతిదారు’గా ఉండాలి: ప్రధాని
కొత్త ప్రక్రియలు, కొత్త గ్రేడ్‌లు, కొత్త స్థాయిలను చేరడానికి మన ఉక్కు రంగం సిద్ధంగా ఉండాలి: ప్రధాని
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం విస్తరించాలి, స్థాయిని పెంచుకోవాలి, ఇప్పటి నుంచే మనం భవిష్యత్ సన్నద్ధులుగా ఉండాలి: ప్రధాని
గత పదేళ్లులో అనేక మైనింగ్ సంస్కరణలను అమలు చేశాం, ఇనుప ఖనిజం లభ్యత సులభతరమైంది: ప్రధాని
కేటాయించిన గనులను, దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. కొత్త ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయాల్సి ఉంది: ప్రధాని
ఈ కార్యక్రమం ఉక్కు రంగంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

ముంబయిలో నిర్వహిస్తున్న ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తులో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్న ఉక్కు రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ వచ్చే రెండు రోజులపాటు చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రంగం భారత పురోగతికి పునాది వేస్తుందని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేలా భారత మూలాలను బలోపేతం చేస్తుందని, విప్లవాత్మకమైన మార్పుల దిశగా దేశంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా స్టీల్- 2025 కార్యక్రమానికి ప్రతి ఒక్కరికీ ఆయన ఆహ్వానం పలికారు. కొత్త ఆలోచనలను పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రయోగ వేదికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఉక్కు రంగంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఆకాశ హర్మ్యాలు, నౌకా నిర్మాణం, హైవేలు, వేగంగా దూసుకుపోయే రైళ్లు, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్లు... ఏవైనా, ఈ విజయగాథలన్నింటి వెనుకా ఉక్కే ప్రధాన శక్తిగా నిలిచిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు రూపుదిద్దడంలో ఉక్కు కీలక పాత్ర పోషించిందన్నారు. “5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ కృషి చేస్తోంది, ఈ లక్ష్యంలో ఉక్కు రంగానిది కీలక పాత్ర’’ అన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా నిలవడం భారత్‌కు గర్వకారణమన్నారు. జాతీయ ఉక్కు విధానం కింద 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో తలసరి ఉక్కు వినియోగం సుమారు 98 కేజీలుగా ఉందని, 2030 నాటికి అది 160 కేజీలకు పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉక్కు వినియోగంలో ఈ రకమైన పెరుగుదల దేశంలో మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థల పురోగతికి అత్యున్నత ప్రమాణంగా నిలుస్తుందని శ్రీ మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి ప్రస్థానానికీ, అలాగే ప్రభుత్వ ప్రతిభకూ ప్రభావవంతమైన పనితీరుకూ ఇది నిదర్శనమన్నారు.
 

ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్‌ప్రణాళిక రూపకల్పన తర్వాత భవిష్యత్తుపై పూర్తి నమ్మకంతో ఉక్కు పరిశ్రమ ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ఈ ప్రణాళిక వివిధ పౌర వినియోగ సేవలనూ రవాణా సదుపాయాలనూ సమన్వయం చేస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గనులున్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా ఆయా ప్రాంతాలను, ఉక్కు కర్మాగారాలున్న ప్రాంతాలను బహుముఖీనంగా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఉక్కు రంగం ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న తూర్పు భారతంలో కొత్త ప్రాజెక్టుల ద్వారా కీలకమైన మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. 1.3 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళికలు అమలవుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే, పెద్ద ఎత్తున నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని, మునుపెన్నడూ లేనంత వేగంతో రహదారులు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పైప్ లైన్లను నిర్మిస్తున్నామని.. ఇవన్నీ ఉక్కు రంగానికి కొత్త అవకాశాలను అందిస్తాయని తెలిపారు. పీఎం ఆవాస యోజన ద్వారా కోట్లాదిగా ఇళ్లను నిర్మిస్తున్నామని, జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను విశేషంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉక్కు రంగానికి జవసత్వాలను అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ‘మేడిన్ ఇండియా’ ఉక్కునే వినియోగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉటంకిస్తూ.. దీనివల్ల ప్రభుత్వం చేపట్టే మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో పెద్దఎత్తున ఉక్కు వినియోగానికి మార్గం ఏర్పడిందని వివరించారు.

అనేక రంగాల్లో అభివృద్ధికి ఉక్కు ప్రధాన చోదక శక్తిగా ఉందన్నారు. ఉక్కు పరిశ్రమపై ప్రభుత్వ విధానాల వల్ల ఇతర భారతీయ పరిశ్రమలు అంతర్జాతీయంగా పోటీపడే స్థాయిలో నిలుస్తున్నాయన్నారు. తయారీ, నిర్మాణం, యంత్రాలు, ఆటోమోటివ్ వంటి వివిధ రంగాలను భారత ఉక్కు పరిశ్రమ బలోపేతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా’ను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో జాతీయ తయారీ మిషన్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు ఈ మిషన్ తోడ్పడుతుందని, ఉక్కు రంగానికి కొత్త అవకాశాలను అందిస్తుందని చెప్పారు.

రక్షణ, వ్యూహాత్మక రంగాలకు కీలకమైన హై గ్రేడ్ ఉక్కు కోసం భారత్ చాలా కాలంగా దిగుమతులపైనే ఆధారపడి ఉందన్న ప్రధానమంత్రి.. భారత్ తొలిసారి దేశీయంగా రూపొందించిన విమానవాహక నౌకలో వినియోగించిన ఉక్కు దేశీయంగానే ఉత్పత్తి అవడం గర్వకారణమన్నారు. చరిత్రాత్మక చంద్రయాన్ మిషన్ విజయవంతం కావడానికి భారత ఉక్కు దోహదపడిందని, దేశ సామర్థ్యం, ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. పీఎల్ఐ వంటి పథకాలు, కార్యక్రమాల ద్వారానే ఈ విప్లవాత్మకమైన మార్పు సాధ్యమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. హైగ్రేడ్ ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఈ పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ఆరంభం మాత్రమేనని, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న మెగా ప్రాజెక్టుల వల్ల హైగ్రేడ్ ఉక్కుకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నౌకా నిర్మాణాన్ని మౌలిక సదుపాయాల విభాగంలో చేర్చామన్న ఆయన.. ఆధునిక, భారీ నౌకలను దేశీయంగానే తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశంలో పైప్ లైన్ గ్రేడ్ ఉక్కు, తుప్పును తట్టుకునే మిశ్ర లోహాలకు డిమాండ్ పెరుగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలు మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. దిగుమతి రహితంగా, నికర ఎగుమతుల దిశగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం 25 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేయాలనే లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని, 2047 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉక్కు రంగం కొత్త ప్రక్రియలు, గ్రేడ్లు, స్థాయిలను అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ.. భవిష్యత్ సన్నద్ధంగా పరిశ్రమను విస్తరించి, నవీకరించాలని కోరారు. ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందితే అపారమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కొత్తగా ఆలోచించాలని, వాటిని అందరితో పంచుకోవాలని ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు పిలుపునిచ్చారు. తయారీ, పరిశోధన- అభివృద్ధి, సాంకేతిక ఉన్నతీకరణల్లో సహకారం ద్వారా దేశ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు.
 

ఉక్కు పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, భవిష్యత్ అభివృద్ధి కోసం వాటిని పరిష్కరించాల్సిన అవసరముందని శ్రీ మోదీ అన్నారు. ముడి పదార్థాల లభ్యత ప్రధాన సమస్యగా ఉందనీ.. నికెల్, కోకింగ్ బొగ్గు, మాంగనీస్ కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సురక్షితమైన సరఫరా వ్యవస్థలను నెలకొల్పడం, సాంకేతిక ఉన్నతీకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తక్కువ ఇంధనంతో ఎక్కువ ఉత్పాదకతనిచ్చే, తక్కువ ఉద్గారాలను వెలువరించే, అధునాతన డిజిటల్ సాంకేతికతలను అందిపుచ్చుకునే దిశగా వేగంగా పురోగమించడం అత్యావశ్యకమన్నారు. “కృత్రిమ మేధ, ఆటొమేషన్, పునర్వినియోగం, అనుబంధ ఉత్పత్తుల వినియోగాలే ఉక్కు పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయిస్తాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆవిష్కరణల ద్వారా ఈ రంగాల్లో మరింతగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతర్జాతీయ భాగస్వాములూ భారతీయ కంపెనీల మధ్య సహకారం ఈ సమస్యలను మరింత సమర్థంగా, వేగంగా పరిష్కరించడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బొగ్గు దిగుమతులు, ముఖ్యంగా కోకింగ్ బొగ్గు దిగుమతులు వ్యయాన్నీ పొదుపునూ ప్రభావితం చేస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దిగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుబాటులో ఉన్న డీఆర్ఐ రూట్ వంటి సాంకేతికతలను ప్రస్తావిస్తూ, వాటిని మరింత ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామన్నారు. బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చే ప్రక్రియ (కోల్ గ్యాసిఫికేషన్)ను ప్రభావవంతంగా వినియోగించుకోవడం ద్వారా.. దేశంలోని బొగ్గు వనరులను మరింత సద్వినియోగం చేసుకోవచ్చని, దిగుమతులపై ఆధారపడడాన్ని అది తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ దిశగా క్రియాశీలకంగా కృషి చేయాలని, ఈ దిశగా సరైన చర్యలు తీసుకోవాలని ఉక్కు పరిశ్రమలను ఆయన కోరారు.
 

ఇప్పటివరకు వినియోగంలో లేని గని ప్రాంతాల్లో కొత్తగా మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి మాట్లాడుతూ – గత దశాబ్ద కాలంగా విశేషంగా మైనింగ్ సంస్కరణలను ప్రవేశపెట్టామని, ఇనుప ఖనిజం లభ్యతను అది మరింత సులభతరం చేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘కేటాయించిన గనులను ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన సమయమిది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో జాప్యం చేస్తే పరిశ్రమను అది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తూ.. కొత్త ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడం ద్వారా ఈ సవాలును అధిగమించాలని శ్రీ మోదీ కోరారు.

ఇకనుంచి భారత్ దేశీయ వృద్ధిపై దృష్టి పెట్టడమే కాకుండా, అంతర్జాతీయంగా నేతృత్వం వహించేలా సన్నద్ధమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉక్కును అందించే విశ్వసనీయ సరఫరాదారుగా ప్రపంచం నేడు భారత్‌ను చూస్తోందని వ్యాఖ్యానించారు. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను కొనసాగించడం, సామర్థ్యాలను నిరంతరం పెంచుకోవడం అత్యంత ముఖ్యమైన అంశమని పునరుద్ఘాటించారు. రవాణాను మెరుగుపరచడం, వివిధ రకాల రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం... ఉక్కుకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను నిలపడంలో దోహదం చేస్తాయన్నారు. సామర్థ్యాలను పెంపొందించుకోవడం, కార్యాచరణ ద్వారా ఆలోచనలను సాకారం చేసుకోవడానికి ‘ఇండియా స్టీల్’ వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పునరుత్థాన, విప్లవాత్మక, ఉక్కులా దృఢమైన భారత్‌ను సాధించే దిశగా సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian scientists break a century-old limit on turning heat into electricity

Media Coverage

Indian scientists break a century-old limit on turning heat into electricity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Italian PM Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history
September 04, 2026

Prime Minister Shri Narendra Modi today congratulated Italian Prime Minister Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history.

The Prime Minister stated that this milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership. He further noted that her friendship has been instrumental in strengthening the India-Italy Special Strategic Partnership, adding that he looks forward to continuing their close cooperation to build a prosperous future for the people of both countries. He extended his best wishes for her continued success in the years ahead.

In a post on X, the Prime Minister shared:

"Congratulations to my friend Prime Minister Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history. This milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership.

Her friendship has also been instrumental in strengthening the India-Italy Special Strategic
Partnership and I look forward to continuing our close cooperation to build a prosperous future for the people of our countries.

My best wishes for her continued success in the years ahead.

@GiorgiaMeloni"