గౌరవ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ గారు,

ఇరు దేశాల ప్రతినిధులు,

నెదర్లాండ్స్ వ్యాపార ప్రముఖులూ,

నమస్కారం!

ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు నిలయాలైన కొన్ని కంపెనీల అధినేతల నడుమ ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 300కు పైగా డచ్ కంపెనీలు భారత్ ప్రస్థానంలో భాగమయ్యాయి. భారత్ పట్ల మీకున్న సానుకూల దృక్పథం, విశ్వాసం వల్లే.. ఐరోపా నుంచి భారత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా, రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ నిలిచింది.

మిత్రులారా,

భారత్‌లోని మీ కంపెనీలు ప్రముఖ బ్రాండ్లు మాత్రమే కాదు.. భారత్ - నెదర్లాండ్స్ మైత్రికి ప్రతినిధులు కూడా. ఎన్ఎక్స్‌పీ, ఫిలిప్స్, ప్రోసస్ సంస్థలు భారత్‌లోని ప్రతిభను వినియోగించుకుంటూ వివిధ సాధన మార్గాలను రూపుదిద్దడంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం సంతోషాన్నిస్తోంది.

ఏపీఎం, డామెన్, రాయల్ వోపాక్ వంటి కంపెనీలు భారత ఓడరేవులు, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తున్నాయి. ప్రపంచానికి మెరుగైన భవితను అందించడం లక్ష్యంగా మరెన్నో సంస్థలు వ్యవసాయం, సుస్థిరత రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయి.

ఏఎస్ఎంఎల్, టాటా మధ్య ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇకపై ఏఎస్ఎంఎల్ పరికరాలతో భారత్‌లో సెమీకండక్టర్ చిప్‌లు తయారవుతాయి. ఈ రోజు మీ మాటల్లో భారత్ పట్ల ఆశావాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆశావాదం స్పష్టమైన ఫలితంగా రూపుదాల్చడంలో మాదీ భరోసా.

మిత్రులారా,

విస్తృతీ, సామర్థ్యమూ నేడు భారత్ సొంతం. విస్తృతి పరంగా చూస్తే.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్. అత్యధిక సంఖ్యలో ప్రతిభావంతులు కూడా ఇక్కడున్నారు. మౌలిక సదుపాయాలు, శుద్ధ ఇంధనం, లేదా అనుసంధానం... వీటన్నింటిలో భారత్ వేగానికి ప్రపంచంలో ఏ దేశమూ సాటి రాదు. అందుకే నేడు ప్రపంచ వృద్ధిలో పదిహేడు శాతం వాటాను భారత్ అందిస్తోంది.

ఇక స్థిరత్వం విషయానికొస్తే.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించే భాగ్యం నాకు దక్కి నేటితో పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ పన్నెండేళ్లలో నిరంతర సంస్కరణల ద్వారా భారత్ ఆర్థిక రూపురేఖలను మార్చేశాం. మా నిర్దేశం సుస్పష్టం – ప్రైవేటు రంగానికి విధానాల విషయంలో స్పష్టతను ఇవ్వడం, వారికి అవకాశాలను అందించడం.

అంతరిక్షం, గనుల తవ్వకం, అణుశక్తి... ఇలా ప్రతి రంగాన్నీ ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తెచ్చాం. నిబంధనలను నిరంతరం తగ్గిస్తూ, వాణిజ్య సౌలభ్యాన్ని పెంచుతున్నాం. ఇటీవల పన్నుల విధానం, కార్మిక చట్టాలు, పరిపాలనలో తదుపరి తరం సంస్కరణలను మేం చేపట్టాం. భారత్‌లో నేడు తయారీ రంగం అత్యంత తక్కువ వ్యయంతో లాభదాయకంగా ఉంది.

గతంలో భారత్‌లో ప్రధాన దిగుమతి వస్తువులుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ నేడు భారత ఎగుమతి జాబితాలో అగ్రగామిగా నిలిచింది. తయారీ రంగంలో ఈ వృద్ధిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం అనేక కీలక రంగాల్లో మేం ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా.. యావత్ప్రపంచ అవసరాలను తీర్చేలా కూడా మీరు భారత్‌లోనే ఉత్పత్తి చేయవచ్చు.

అదేవిధంగా సేవల రంగంలోనూ ప్రతిభను సమర్థంగా వినియోగించుకుంటూ సామర్థ్యానికీ, ఆవిష్కరణలకూ భారత్ చోదకంగా నిలిచింది. ప్రపంచంలోని అన్ని టెక్నాలజీ కంపెనీలు భారత్‌లో అంతర్జాతీయ సామర్థ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించాయి.

భారత్‌లోనే రూపుదిద్ది, ఇక్కడే ఆవిష్కరణలు చేయాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజే దానికి సుదినం. నేటి కన్నా మంచి రోజు మరేముంది?

మిత్రులారా,

2026 నుంచి భారత్ - ఐరోపా సంబంధాల్లో కొత్త స్వర్ణయుగం మొదలైంది. చరిత్రాత్మక భారత్ - ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మనం ఈ ఏడాది కుదుర్చుకున్నాం. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య, బాధ్యతాయుతమైన శక్తుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఉమ్మడి శ్రేయస్సుకు బలమైన పునాదిగా నిలుస్తుంది.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో కలిగే పూర్తి ప్రయోజనాలను వినియోగించుకునే దిశగా నెదర్లాండ్స్ ప్రధానమంత్రి జెట్టెన్, నేను ఈ రోజు అనేక ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నాం. విశ్వసనీయమైన భారత్ - నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఒక ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ప్రారంభిస్తున్నాం. సాంకేతిక రంగంలో మా సంబంధాలను భవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దుతున్నాం.

మన రెండు దేశాల మధ్య ప్రతిభావంతుల రాకపోకలను, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యాలను, ఉమ్మడి పరిశోధన - అభివృద్ధిని కూడా బలోపేతం చేసుకుంటున్నాం. మరో మాటలో చెప్పాలంటే, భారత్ - నెదర్లాండ్స్ భాగస్వామ్య భవిష్యత్తు మునుపెన్నడూ లేనంత ఉత్తేజకరంగా ఉండబోతోంది.

మిత్రులారా,

భారత్, ఐరోపా మధ్య బలపడుతున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మన వ్యాపార సంబంధాలకు కొత్త స్ఫూర్తినిస్తోంది. ఈ దిశగా వేగంగా ముందుకు సాగడం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. భారత్‌లో మీ పరిధిని, పెట్టుబడిని, ఆశయాలను విస్తరిస్తారన్న నమ్మకం నాకుంది. మీతోపాటు ఐరోపాలోని సమస్త ఆవిష్కరణ వ్యవస్థ కూడా భారత్‌కు వస్తుంది.

మిత్రులారా,

నెదర్లాండ్స్‌లో ఒక సామెత ఉంది:

“ఓడలు రేవులో సురక్షితంగా ఉంటాయి. కానీ రేవులోనే ఉండిపోవడానికి కాదు వాటిని తయారు చేసింది.”

డచ్ వ్యాపార వర్గం కన్నా బాగా దీన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? మీ దేశం శతాబ్దాలుగా నూతన అవకాశాల అన్వేషణలో పురోగమిస్తూ వస్తోంది. నాదీ భరోసా – భారత్‌లో మీ అన్వేషణ విజయవంతంగా, అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మరింత ధైర్యంగా భారత్‌లోకి అడుగుపెట్టాలి.

బెడాంక్ట్.

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report

Media Coverage

India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 జూలై 2026
July 10, 2026

Building Viksit Bharat: PM Modi Accelerating India's Growth at Home and Across the World