ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లెయెన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
భారత్‌లో 2026 జనవరిలో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన 16వ భారత్-ఈయూ సదస్సును గుర్తుచేసుకున్న నాయకులు.. అప్పటి నుంచి భారత్-ఈయూ ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన అద్భుతమైన పురోగతిని స్వాగతించారు. ఇటీవల భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగియడాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత అస్థిర భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఈ ఒప్పందంపై త్వరితగతిన సంతకం చేసి అమలు చేయడం ద్వారా వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో భారీ అవకాశాలు లభిస్తాయని.. సరఫరా గొలుసుల వైవిధ్యీకరణకు ఇది దోహదపడుతుందని వారు స్పష్టం చేశారు.

బహిరంగ మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు, బహుళత్వ సమాజాలు కలిగిన ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య పక్షాలుగా భారత్, ఈయూ.. పరస్పర నమ్మకం, భాగస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథం ఆధారంగా బలమైన బంధాన్ని పంచుకుంటున్నాయి. 2026 జనవరిలో ఆమోదించిన 'భారత్-ఈయూ ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ' పురోగతిపై నాయకులు చర్చించారు. ఈ కార్యాచరణ భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా పరస్పర ప్రయోజనకరమైన, పరివర్తనాత్మక ఫలితాలను అందిస్తుందనే భావనను వారు వ్యక్తం చేశారు.

పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న నాయకులు.. పశ్చిమ ఆసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలను స్వాగతించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు, సుస్థిర అభివృద్ధికి దోహదపడే విధంగా ఒక బలమైన బహుళ-ధ్రువ ప్రపంచ వ్యవస్థను నిర్మించడానికి ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
It was wonderful meeting European Council President António Costa and European Commission President Ursula von der Leyen in Evian earlier today. At the start of this year, India was proud to host them for our Republic Day celebrations. This has been a great time for India-EU ties… pic.twitter.com/jwVVUHhYK4
— Narendra Modi (@narendramodi) June 17, 2026


