Operation Sindoor is not just a military mission; it is a picture of our resolve, courage and a transforming India and this picture has infused the whole country: PM Modi
The rise in the population of the Asiatic Lion shows that when the sense of ownership strengthens in the society, amazing results happen: PM Modi
Today there are many women who are working in the fields as well as touching the heights of the sky. They are flying drones as Drone Didis and ushering in a new revolution in agriculture: PM Modi
‘Sugar boards’ are being installed in some schools. The aim of this unique initiative of CBSE is to make children aware of their sugar intake: PM Modi
‘World Bee Day’ is a day which reminds us that honey is not just sweetness; it is also an example of health, self-employment and self-reliance: PM Modi
The protection of honeybees is not just a protection of the environment, but also that of our agriculture and future generations: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే.  మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.

మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' కేవలం ఒక సైనిక మిషన్ కాదు. ఇది మన సంకల్పం, ధైర్యం. మారుతున్న భారతదేశ ముఖచిత్రం. ఈ ముఖచిత్రం దేశమంతటా దేశభక్తి భావాలను నింపింది. దేశం త్రివర్ణ పతాక రంగులతో నిండిపోయింది. మీరు చూసే ఉంటారు- దేశంలోని అనేక నగరాల్లో, గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో త్రివర్ణపతాక యాత్రలు జరిగాయి.  వేలాది మంది ప్రజలు చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని దేశ సైన్యానికి వందనాలు, అభినందనలు తెలియజేయడానికి బయలుదేరారు. ఎన్నో నగరాల్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా చేరడానికి పెద్ద సంఖ్యలో యువకులు సంఘటితమయ్యారు. చండీగఢ్ వీడియోలు వైరల్ కావడాన్ని మనం చూశాం. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు  ఎన్నో కవితలు రాశారు. సంకల్ప గీతాలు పాడారు. పెద్ద సందేశాలు అంతర్గతంగా ఉన్న పెయింటింగ్‌లను చిన్న చిన్న పిల్లలు వేశారు. నేను మూడు రోజుల కిందట బికనీర్ వెళ్ళాను. అక్కడి పిల్లలు నాకు అలాంటి ఒక పెయింటింగ్‌ను బహుకరించారు. 'ఆపరేషన్ సిందూర్' దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. అనేక కుటుంబాలు దీన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నాయి. బీహార్ కతిహార్‌లో, యూపీ కుశీనగర్‌లో, ఇంకా అనేక నగరాల్లో ఆ సమయంలో జన్మించిన పిల్లలకు 'సిందూర్' అని పేరు పెట్టారు.

మిత్రులారా! మన జవాన్లు ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశారు. ఇది వారి అద్భుతమైన ధైర్యాన్ని నిరూపించింది. అందులో భారతదేశంలో తయారైన ఆయుధాలు, పరికరాలు, సాంకేతికతల బలం కూడా ఉంది. అందులో 'ఆత్మనిర్భర్ భారత్' సంకల్పం కూడా ఉంది. మన ఇంజనీర్లు, మన టెక్నీషియన్లు ప్రతి ఒక్కరి శ్రమ ఈ విజయంలో భాగం. ఈ ఆపరేషన్ తరువాత దేశమంతటా 'వోకల్ ఫర్ లోకల్' పట్ల కొత్త శక్తి కనిపిస్తోంది. అనేక విషయాలు మనసును హత్తుకుంటున్నాయి. "ఇప్పుడు మేం మా పిల్లల కోసం భారతదేశంలో తయారైన బొమ్మలు మాత్రమే కొంటాం. దేశభక్తి బాల్యం నుంచే మొదలవుతుంది" అని ఒక బాలుడి తల్లిదండ్రులు అన్నారు. "మేం మా తర్వాతి సెలవులను దేశంలోని ఏదైనా అందమైన ప్రదేశంలోనే గడుపుతాం" అని కొన్ని కుటుంబాలు ప్రతిజ్ఞ చేశాయి. చాలా మంది యువకులు 'వెడ్ ఇన్ ఇండియా' సంకల్పాన్ని తీసుకున్నారు. వారు దేశంలోనే పెళ్లి చేసుకుంటారు. "ఇప్పుడు ఏదైనా బహుమతి ఇస్తే అది ఏదైనా భారతీయ శిల్పి చేతులతో తయారైనది అయి ఉండాలి." అని కూడా ఒకరన్నారు.

మిత్రులారా! ఇదే కదా భారతదేశ అసలు బలం. 'ప్రజలను- మనసులను జోడించడం, జన భాగస్వామ్యం'. నేను మీ అందరినీ కోరుతున్నాను. రండి- ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన జీవితంలో సాధ్యమైన సందర్భాల్లో దేశంలో తయారైన వస్తువులకు ప్రాధాన్యత ఇద్దాం. ఇది కేవలం ఆర్థిక స్వావలంబన గురించి మాత్రమే కాదు- దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అనే భావం. మనం వేసే  ఒక అడుగు భారతదేశ అభివృద్ధిలో చాలా పెద్ద సహకారం అవుతుంది.

మిత్రులారా! బస్సులో ప్రయాణించడం ఎంత సాధారణ విషయం! కానీ నేను మీకు ఒక గ్రామం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడికి  మొదటిసారిగా ఒక బస్సు చేరుకుంది. ఈ రోజు కోసం ఇక్కడి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఊళ్ళోకి మొదటిసారి బస్సు చేరుకున్నప్పుడు ప్రజలు డప్పులతో స్వాగతం పలికారు. బస్సును చూసిన ప్రజల ఆనందానికి అవధులు లేవు. గ్రామంలో పక్కా రోడ్డు ఉంది. ప్రజలకు అవసరం ఉంది. కానీ ఇంతకు ముందు ఇక్కడ బస్సు ఎప్పుడూ నడవలేదు. ఎందుకంటే ఈ గ్రామం మావోయిస్టు హింసతో ప్రభావితమైంది. ఈ ప్రదేశం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉంది. ఆ గ్రామం పేరు కాటేఝరి. కాటేఝరిలో వచ్చిన ఈ మార్పు చుట్టుపక్కల ప్రాంతమంతటా తెలుస్తోంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మావోయిజానికి వ్యతిరేకంగా సామూహిక పోరాటం ద్వారా ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలకు కూడా ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. బస్సు రాకతో తమ జీవితం చాలా సులభతరం అవుతుందని గ్రామస్థులు చెప్తున్నారు.

మిత్రులారా! ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బస్తర్ ఒలింపిక్స్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని సైన్స్ ల్యాబ్‌ల గురించి 'మన్ కీ బాత్'లో మనం చర్చించాం. ఇక్కడి పిల్లల్లో సైన్స్ పట్ల అభిరుచి ఉంది. వారు క్రీడల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎంత ధైర్యవంతులో చూపిస్తాయి. ఈ ప్రజలు అనేక సవాళ్ల మధ్య తమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. దంతెవాడ జిల్లాలో 10వ,12వ తరగతుల పరీక్షల ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలుసుకుని నాకు చాలా సంతోషం కలిగింది. దాదాపు 95% ఫలితంతో ఈ జిల్లా 10వ తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలో ఈ జిల్లా ఛత్తీస్‌గఢ్‌లో ఆరవ స్థానాన్ని సాధించింది. ఆలోచించండి! ఒకప్పుడు మావోయిజం తీవ్రస్థాయిలో ఉన్న దంతెవాడలో నేడు విద్యా పతాకం ఎగురుతోంది. ఇలాంటి మార్పులు మనందరినీ గర్వంతో నింపుతాయి.

నా ప్రియమైన దేశప్రజలారా! ఇప్పుడు నేను సింహాలకు సంబంధించిన ఒక మంచి వార్త మీకు చెప్పాలనుకుంటున్నాను. కేవలం గత ఐదు సంవత్సరాలలో గుజరాత్ లోని గిర్‌లో సింహాల సంఖ్య 674 నుండి 891కి పెరిగింది. 674 నుండి 891! లయన్ సెన్సస్ తర్వాత వెలువడిన ఈ సింహాల సంఖ్య చాలా ఉత్సాహాన్నిస్తోంది. మిత్రులారా! మీలో చాలా మంది ఈ జంతువుల జనాభా లెక్క ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా! ఈ ప్రక్రియ చాలా సవాళ్లతో కూడుకొని ఉంది. గిర్‌లో సింహాల జనాభా లెక్క 11 జిల్లాల్లో 35 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిగిందని తెలుసుకుంటే మీరు  ఆశ్చర్యపోతారు. జనాభా లెక్కల కోసం బృందాలు ఇరవై నాలుగు గంటలూ ఈ ప్రాంతాలను పర్యవేక్షించాయి. ఈ మొత్తం ఆపరేషన్‌లో ధృవీకరణ, క్రాస్ వెరిఫికేషన్ రెండూ జరిగాయి. దీని ద్వారా సింహాల లెక్కింపు పని పూర్తయింది.

మిత్రులారా! సమాజంలో యాజమాన్య భావన బలపడితే, ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఆసియా సింహాల సంఖ్యలో పెరుగుదల నిరూపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం గిర్‌లో పరిస్థితులు చాలా సవాళ్ళతో ఉండేవి.  కానీ అక్కడి ప్రజలు సామూహికంగా మార్పును తీసుకురావడానికి కృషి చేశారు. అక్కడ నూతన సాంకేతికత, ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆచరణలు  రెండూ అమలయ్యాయి.  ఈ సమయంలోనే గుజరాత్ పెద్ద ఎత్తున అటవీ అధికారుల ఖాళీల్లో మహిళలను నియమించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఫలితాల్లో వీరందరి సహకారం ఉంది. వన్యప్రాణి సంరక్షణ కోసం మనం ఇలాగే ఎల్లప్పుడూ జాగృతంగా,  అప్రమత్తంగా ఉండాలి.

నా ప్రియమైన దేశప్రజలారా! రెండు మూడు రోజుల క్రితమే నేను మొదటి రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్‌కు వెళ్ళాను. అంతకు ముందు మనం ఈశాన్య రాష్ట్రాల సామర్థ్యానికి నిదర్శనమైన 'అష్టలక్ష్మి మహోత్సవం' కూడా జరుపుకున్నాం. ఈశాన్య రాష్ట్రాల విషయంలో ప్రత్యేకత ఉంది. అక్కడి సామర్థ్యం, అక్కడి ప్రతిభ నిజంగా అద్భుతం. క్రాఫ్టెడ్ ఫైబర్స్ గురించి నాకు ఒక ఆసక్తికరమైన గాథ తెలిసింది. క్రాఫ్టెడ్ ఫైబర్స్ కేవలం ఒక బ్రాండ్ కాదు, అది సిక్కిం సంప్రదాయం, నేత కళ, నేటి ఫ్యాషన్ ఆలోచన - మూడింటి కలయిక. దీన్ని డాక్టర్ చెవాంగ్ నోర్బు భూటియా ప్రారంభించారు. వృత్తిరీత్యా ఆయన పశువైద్యులు.  సిక్కిం సంస్కృతికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్. ఆయన నేతకు ఒక కొత్త కోణాన్ని ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు! ఈ ఆలోచనతోనే క్రాఫ్టెడ్ ఫైబర్స్ రూపకల్పన జరిగింది. ఆయన సంప్రదాయ నేతను ఆధునిక ఫ్యాషన్‌తో కలిపి దీనిని ఒక సామాజిక సంస్థగా మార్చారు. ఇప్పుడు వారు కేవలం బట్టలను మాత్రమే కాదు, జీవితాలను కూడా అల్లుతున్నారు. వారు స్థానిక ప్రజలకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. వారు స్వయం సమృద్ధి పొందేలా చేస్తారు. గ్రామాలలోని నేత కార్మికులు, పశువుల కాపరులు, స్వయం సహాయక బృందాల వారు -  వీరందరినీ సంఘటితం చేసి, డాక్టర్ భూటియా ఉద్యోగాలకు కొత్త మార్గాలను సృష్టించారు. నేడు అక్కడి మహిళలు, కళాకారులు తమ నైపుణ్యాలతో మంచి ఆదాయం పొందుతున్నారు. క్రాఫ్టెడ్ ఫైబర్స్ తో చేసే శాలువలు, స్కార్ఫ్, చేతి తొడుగులు, సాక్సులు- అన్నీ స్థానిక హస్తకళతో తయారవుతాయి. ఇందులో ఉపయోగించే ఉన్ని సిక్కింలోని కుందేళ్ళు, గొర్రెల నుండి వస్తుంది. రంగులు కూడా పూర్తిగా సహజమైనవి. రసాయనాలను ఉపయోగించరు. కేవలం ప్రకృతిసిద్ధమైన  రంగును మాత్రమే వాడతారు. డాక్టర్ భూటియా సిక్కిం సంప్రదాయ నేతకు, సంస్కృతికి ఒక కొత్త గుర్తింపును ఇచ్చారు. సంప్రదాయాన్ని అభిరుచితో అనుసంధానం చేసినప్పుడు అది ప్రపంచాన్ని ఎంతగా ఆకర్షించగలదో డాక్టర్ భూటియా కృషి మనకు బోధిస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈరోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఒక కళాకారుడు. సజీవ ప్రేరణ కూడా. ఆయన పేరు జీవన్ జోషి. వయసు 65 సంవత్సరాలు. ఇప్పుడు ఆలోచించండి-  పేరులో జీవనం ఉన్న ఆయన ఎంత జీవకళతో నిండి ఉంటారో! జీవన్ గారు  ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో నివసిస్తున్నారు. బాల్యంలో పోలియో ఆయన కాళ్ళ బలాన్ని లాక్కుంది. కానీ పోలియో ఆయన ధైర్యాన్ని లాక్కోలేకపోయింది. ఆయన నడక వేగం కాస్త మందగించినప్పటికీ ఆయన మనసు ఊహల్లో అన్ని శిఖరాలనూ అధిరోహిస్తూ ఉంది. ఈ ప్రయాణంలో జీవన్ గారు ఒక ప్రత్యేకమైన కళకు జన్మనిచ్చారు. దానికి 'బగెట్' అని పేరు పెట్టారు. ఇందులో ఆయన దేవదారు చెట్ల నుండి రాలిన ఎండిన బెరడుతో అందమైన కళాఖండాలను సృష్టిస్తారు. ఆ బెరడును ప్రజలు సాధారణంగా పనికిరానిదిగా భావిస్తారు. ఆ వృధా బెరడు జీవన్ గారి చేతుల్లోకి రాగానే వారసత్వ సంపదగా మారుతుంది. ఆయన ప్రతి సృష్టిలో ఉత్తరాఖండ్ మట్టి సువాసన ఉంటుంది. కొన్నిసార్లు పర్వతాల జానపద వాయిద్యాలు, కొన్నిసార్లు పర్వతాల ఆత్మ ఆ బెరడులో లీనమైనట్లు అనిపిస్తుంది. జీవన్ గారి పని కేవలం కళ కాదు, ఒక సాధన. ఆయన ఈ కళకు తన జీవితాన్ని అంకితం చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సంకల్పం దృఢంగా ఉంటే అసాధ్యమేమీ లేదని జీవన్ జోషి వంటి కళాకారులు మనకు గుర్తుచేస్తారు. ఆయన పేరు జీవన్. ఆయన నిజంగా జీవనం అంటే ఏమిటో చూపించారు.

నా ప్రియమైన దేశవాసులారా! పొలాలతో పాటు ఆకాశపు ఎత్తులలో కూడా పని చేస్తున్న అనేక మంది మహిళలు ఈరోజుల్లో ఉన్నారు. అవును! మీరు సరిగ్గానే విన్నారు... ఇప్పుడు గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి డ్రోన్ ఎగురవేస్తున్నారు. వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తున్నారు.

మిత్రులారా! తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి వరకు ఇతరులపై ఆధారపడ్డ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ ద్వారా 50 ఎకరాల భూమిలో మందుల పిచికారీ పనిని పూర్తి చేస్తున్నారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు పని చేస్తున్నారు. అంతే..పని పూర్తయి పోతుంది. ఎండ వేడి లేదు, విషపూరిత రసాయనాల ప్రమాదం లేదు. మిత్రులారా! గ్రామస్తులు కూడా ఈ మార్పును మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇప్పుడు ఈ మహిళలు 'డ్రోన్ ఆపరేటర్లు'గా కాదు, 'స్కై వారియర్స్'గా గుర్తింపు పొందారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు వస్తుందని ఈ మహిళలు నిరూపిస్తున్నారు.

నా ప్రియమైన దేశప్రజలారా! అంతర్జాతీయ యోగా దినోత్సవానికి  ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. మీరు ఇప్పటికీ యోగాకు దూరంగా ఉంటే ఇప్పుడు యోగాతో అనుసంధానం కావాలని ఈ సందర్భం గుర్తుచేస్తుంది. యోగా మీ జీవన విధానాన్ని మారుస్తుంది. మిత్రులారా! 2015 జూన్ 21వ తేదీన 'యోగా దినోత్సవం' ప్రారంభమైనప్పటి నుండి దాని ఆకర్షణ నిరంతరం పెరుగుతోంది. ఈసారి కూడా 'యోగా దినోత్సవం' పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభిరుచి,  ఉత్సాహం కనిపిస్తున్నాయి. వివిధ సంస్థలు తమ సన్నాహాలను పంచుకుంటున్నాయి. గత సంవత్సరాల చిత్రాలు చాలా స్ఫూర్తినిచ్చాయి. వివిధ దేశాల్లో ఒక సంవత్సరం ప్రజలు యోగా చైన్, యోగా రింగ్ తయారు చేయడాన్ని మనం చూశాం. ఒకేసారి నాలుగు తరాల వారు కలిసి యోగా చేస్తున్న చిత్రాలు చాలా ఉన్నాయి. చాలా మంది తమ నగరంలోని సుప్రసిద్ధ ప్రదేశాలను యోగా కోసం ఎంచుకున్నారు. మీరు కూడా ఈసారి ఏదైనా ఆసక్తికరమైన పద్ధతిలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం గురించి ఆలోచించవచ్చు.

మిత్రులారా! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే  కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ఉద్దేశ్యం రాష్ట్రమంతటా యోగా సంస్కృతిని అభివృద్ధి చేయడం. ఈ కార్యక్రమం కింద యోగా చేసే 10 లక్షల మంది వ్యక్తుల సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం విశాఖపట్నంలో 'యోగా దినోత్సవ' కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభిస్తుంది. ఈసారి కూడా దేశ వారసత్వంతో సంబంధం ఉన్న సుప్రసిద్ధ ప్రదేశాల్లో మన యువ మిత్రులు యోగా చేస్తున్నారని తెలుసుకుని నాకు చాలా సంతోషం కలిగింది. చాలా మంది యువకులు కొత్త రికార్డులు సృష్టించడానికి, యోగా చైన్‌లో భాగస్వాములు అయ్యేందుకు సంకల్పం తీసుకున్నారు. మన కార్పొరేట్లు కూడా ఇందులో వెనుకబడి లేరు. కొన్ని సంస్థలు కార్యాలయంలోనే యోగా సాధన కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశాయి. కొన్ని స్టార్టప్‌లు తమ వద్ద 'ఆఫీస్ యోగా అవర్స్' నిర్ణయించాయి. గ్రామాల్లోకి వెళ్లి యోగా నేర్పించడానికి సిద్ధమవుతున్న వారు కూడా ఉన్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల ప్రజల్లో ఏర్పడ్డ ఈ అవగాహన నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.

మిత్రులారా! 'యోగా దినోత్సవం'తో పాటు ఆయుర్వేద రంగంలో కూడా జరిగిన ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. నిన్ననే అంటే మే 24వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు. హెచ్. ఓ. డైరెక్టర్ జనరల్, నా మిత్రుడు తులసి భాయ్ సమక్షంలో ఒక ఒప్పందపత్రంపై  సంతకాలు అయ్యాయి. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ ఆరోగ్య వర్గీకరణ కింద ఒక ప్రత్యేక సంప్రదాయ వైద్య మాడ్యూల్‌పై పని ప్రారంభమైంది. ఈ చొరవతో ఆయుష్‌ను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పద్ధతిలో ఎక్కువ మందికి చేర్చడానికి సహకారం లభిస్తుంది.

మిత్రులారా! మీరు పాఠశాలల్లో బ్లాక్‌బోర్డులు చూసే ఉంటారు. కానీ, ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో 'చక్కెర బోర్డులు' కూడా ఏర్పాటు చేస్తున్నారు.  బ్లాక్‌బోర్డు కాదు చక్కెర బోర్డు! సీబీఎస్ ఇ నిర్వహిస్తోన్న ఈ ప్రత్యేకమైన చొరవ ఉద్దేశ్యం పిల్లలకు వారి చక్కెర వినియోగం పట్ల అవగాహన కల్పించడం. ఎంత చక్కెర తీసుకోవాలి, ఎంత చక్కెర తింటున్నారు అనే విషయాలు తెలుసుకుని పిల్లలు స్వయంగా ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. దీని ప్రభావం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. బాల్యం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అలవర్చుకోవడంలో ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ఈ చొరవను ప్రశంసించారు. ఇలాంటి చొరవ కార్యాలయాలు, క్యాంటీన్లు, సంస్థలలో కూడా ఉండాలని నా అభిప్రాయం. ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉంటాయి. ఫిట్ ఇండియానే స్ట్రాంగ్ ఇండియాకు పునాది.

నా ప్రియమైన దేశవాసులారా! స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడితే 'మన్ కీ బాత్' శ్రోతలు వెనుకబడి ఉండడం ఎలా సాధ్యం? మీరందరూ మీ వంతు కృషి చేస్తూ ఈ కార్యక్రమానికి బలం చేకూరుస్తున్నారని నాకు పూర్తి నమ్మకం ఉంది. పరిశుభ్రత సంకల్పం పర్వతాల వంటి సవాళ్లను కూడా అధిగమించిన ఒక ఉదాహరణ గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.  మంచుతో నిండిన పర్వతాలను ఎక్కుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. అక్కడ శ్వాస తీసుకోవడం కష్టం. ప్రతి అడుగు ప్రాణాంతకమే. అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడ శుభ్రత పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇలాంటి పనే మన ఐటీబీపీ  బృందాల సభ్యులు చేశారు. ఈ బృందం ఒకటి మౌంట్ మకాలు వంటి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్ళింది. కానీ మిత్రులారా! వారు కేవలం పర్వతారోహణ మాత్రమే కాదు, తమ లక్ష్యంలో మరో మిషన్‌ను కూడా జోడించారు. అదే 'స్వచ్ఛత'. శిఖరం దగ్గర పడి ఉన్న చెత్తను తొలగించే బాధ్యతను వారు స్వీకరించారు. మీరు ఊహించండి! 150 కిలోల కంటే ఎక్కువ నాన్-బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఈ బృంద సభ్యులు తమతో పాటు కిందికి తెచ్చారు. ఇంత ఎత్తులో శుభ్రం చేయడం అంత సులభం కాదు. కానీ, సంకల్పం ఉంటే మార్గాలు వాటంతట అవే ఏర్పడతాయని ఇది చూపిస్తుంది.

మిత్రులారా! దీనికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశం- పేపర్‌వేస్ట్, రీసైక్లింగ్. మన ఇళ్ళలో, కార్యాలయాల్లో ప్రతిరోజూ చాలా పేపర్‌వేస్ట్ బయటకు వస్తుంది. మనం దీన్ని సాధారణ విషయంగా భావిస్తాం. కానీ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు- దేశంలో భూమిపై ఉన్న వ్యర్థాలలో దాదాపు పావు వంతు కాగితానికి సంబంధించినవే. నేడు ప్రతి వ్యక్తి ఈ దిశగా ఆలోచించడం అవసరం. భారతదేశంలోని అనేక స్టార్టప్‌లు ఈ రంగంలో అద్భుతమైన పని చేస్తున్నాయని తెలుసుకుని నాకు చాలా సంతోషం కలిగింది. విశాఖపట్నం, గురుగ్రామ్ వంటి అనేక నగరాల్లో స్టార్టప్‌లు పేపర్ రీసైక్లింగ్ లో వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నాయి. కొందరు రీసైకిల్ పేపర్‌తో ప్యాకేజింగ్ బోర్డులు తయారు చేస్తున్నారు. కొందరు డిజిటల్ పద్ధతులతో వార్తాపత్రికల రీసైక్లింగ్‌ను సులభతరం చేస్తున్నారు. జాల్నా వంటి నగరాల్లో కొన్ని స్టార్టప్‌లు 100 శాతం రీసైకిల్ చేసిన పదార్థాలతో ప్యాకేజింగ్ రోల్స్, పేపర్ కోర్లను తయారు చేస్తున్నాయి. ఒక టన్ను కాగితాన్ని రీసైకిల్ చేయడం ద్వారా 17 చెట్లు నరికివేతకు గురికాకుండా నిరోధించవచ్చని, వేల లీటర్ల నీరు ఆదా అవుతుందని మీరు తెలుసుకుంటే ప్రేరణ పొందుతారు. ఇప్పుడు ఆలోచించండి- పర్వతారోహకులు ఇంత కఠిన పరిస్థితుల్లో చెత్తను తిరిగి తీసుకురాగలిగితే మనం కూడా మన ఇంట్లో లేదా కార్యాలయంలో కాగితాన్ని వేరు చేసి రీసైక్లింగ్‌లో మన సహకారాన్ని తప్పకుండా అందించాలి. దేశంలోని ప్రతి పౌరుడు దేశం కోసం నేనేం చేయగలనని ఆలోచించినప్పుడే మనం సంఘటితంగా భారీ మార్పును తీసుకురాగలం.

మిత్రులారా! ఇటీవల ఖేలో ఇండియా గేమ్స్ చాలా సందడి చేశాయి. ఖేలో ఇండియా సమయంలో బీహార్‌లోని ఐదు నగరాలు ఆతిథ్యం ఇచ్చాయి. అక్కడ వివిధ కేటగిరీల మ్యాచ్‌లు జరిగాయి. భారతదేశం నలుమూలల నుండి అక్కడికి రుకున్న అథ్లెట్ల సంఖ్య ఐదు వేల కంటే ఎక్కువ. ఈ అథ్లెట్లు బీహార్ క్రీడా స్ఫూర్తిని, బీహార్ ప్రజల నుండి లభించిన ఆత్మీయతను చాలా ప్రశంసించారు.

మిత్రులారా! బీహార్ భూమి చాలా ప్రత్యేకమైనది. ఈ కార్యక్రమంలో అక్కడ అనేక ప్రత్యేకమైన విషయాలు జరిగాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొదటి కార్యక్రమం ఇది. ఇది ఒలింపిక్ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేరింది. ప్రపంచం నలుమూలల ప్రజలు మన యువ క్రీడాకారుల ప్రతిభను చూసి ప్రశంసించారు. నేను విజేతలందరికీ- ముఖ్యంగా అగ్రస్థానంలో నిలిచిన ముగ్గురు విజేతలు- మహారాష్ట్ర, హర్యానా,రాజస్థాన్‌లకు అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా! ఈసారి ఖేలో ఇండియాలో పాల్గొన్న క్రీడాకారులు మొత్తం 26 రికార్డులు నెలకొల్పారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మహారాష్ట్రకు చెందిన అస్మితా ధోనే, ఒడిషా నివాసి హర్షవర్ధన్ సాహు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన తుషార్ చౌదరి చేసిన అద్భుతమైన ప్రదర్శనలు అందరి మనసులను గెలుచుకున్నాయి.  అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన సాయిరాజ్ పర్దేశి మూడు రికార్డులు సృష్టించారు. అథ్లెటిక్స్‌లో ఉత్తర ప్రదేశ్ నివాసులు కాదిర్ ఖాన్, షేక్ జీషన్,  రాజస్థాన్ కు చెందిన హన్స్‌రాజ్ అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. ఈసారి బీహార్ కూడా 36 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. మిత్రులారా! ఆడేవారే వికసిస్తారు. యువ క్రీడా ప్రతిభకు టోర్నమెంట్లు చాలా ముఖ్యమైనవి. ఇలాంటి కార్యక్రమాలు భారతీయ క్రీడల భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తాయి.

నా ప్రియమైన దేశప్రజలారా! మే 20వ తేదీన 'ప్రపంచ తేనెటీగల దినోత్సవం' జరుపుకున్నారు. తేనె అంటే కేవలం తీపి మాత్రమే కాదని; ఆరోగ్యం, స్వయం ఉపాధి, స్వావలంబనకు కూడా ఉదాహరణ అని మనకు గుర్తుచేసే రోజిది. గత 11 సంవత్సరాలలో తేనెటీగల పెంపకంలో భారతదేశంలో ఒక తీపి విప్లవం జరిగింది. నేటి నుండి 10-11 సంవత్సరాల కిందట భారతదేశంలో తేనె ఉత్పత్తి సంవత్సరానికి దాదాపు 70-75 వేల మెట్రిక్ టన్నులు ఉండేది. నేడు ఇది దాదాపు లక్షంబావు మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే తేనె ఉత్పత్తిలో దాదాపు 60% పెరుగుదల ఉంది. తేనె ఉత్పత్తి, ఎగుమతిలో మనం ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో ఒకటిగా నిలిచాం. మిత్రులారా! ఈ సానుకూల ప్రభావంలో 'జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్' పెద్ద పాత్ర పోషించింది. దీని కింద తేనెటీగల పెంపకంతో సంబంధం ఉన్న వేలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. పరికరాలు అందజేశారు. మార్కెట్ వరకు వారికి నేరుగా ప్రవేశం కల్పించారు.

మిత్రులారా! ఈ మార్పు కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది గ్రామీణ ప్రాంతంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా దీనికి ఒక ఉదాహరణ. ఇక్కడ గిరిజన రైతులు 'సోన్ హనీ' అనే స్వచ్ఛమైన సేంద్రీయ తేనె బ్రాండ్‌ను సృష్టించారు. నేడు ఆ తేనె ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ -జెమ్ తో సహా అనేక ఆన్‌లైన్ పోర్టళ్లలో అమ్ముడవుతోంది. అంటే గ్రామీణ శ్రమ ఇప్పుడు గ్లోబల్ అవుతోంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్‌లలో వేలాది మంది మహిళలు, యువకులు ఇప్పుడు తేనె వ్యాపారులుగా మారారు. మిత్రులారా! ఇప్పుడు తేనె పరిమాణం మాత్రమే కాదు- దాని స్వచ్ఛతపై కూడా కృషి జరుగుతోంది. కొన్ని స్టార్టప్‌లు ఇప్పుడు కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీలతో తేనె నాణ్యతను ధృవీకరిస్తున్నాయి. మీరు ఈసారి తేనె కొనేటప్పుడు ఈ తేనె వ్యాపారులు తయారు చేసిన తేనెను తప్పకుండా ప్రయత్నించండి. ఏదైనా స్థానిక రైతు నుండి- లేదా ఏదైనా మహిళా వ్యాపారి నుండి కూడా తేనె కొనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ ప్రతి చుక్కలో రుచి మాత్రమే కాదు- భారతదేశ శ్రమ, నమ్మకాలు కలిసి ఉంటాయి. తేనె నుండి వచ్చే ఈ తీపి ఆత్మనిర్భర్ భారత్ రుచి.

మిత్రులారా! మనం తేనెకు సంబంధించిన దేశీయ ప్రయత్నాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మీకు మరొక చొరవ గురించి చెప్పాలనుకుంటున్నాను. తేనెటీగల రక్షణ కేవలం పర్యావరణానికి సంబంధించి మాత్రమే కాకుండా మన వ్యవసాయానికి, భవిష్యత్ తరాల కోసం కూడా బాధ్యత అని గుర్తుచేస్తుంది. పూణే నగరానికి సంబంధించిన ఉదాహరణ ఇది. అక్కడ ఒక హౌసింగ్ సొసైటీలో తేనెటీగల తుట్టె ఒకదాన్ని తొలగించారు. బహుశా భద్రతా కారణాల వల్ల లేదా భయం వల్ల అలా చేశారు. కానీ ఈ సంఘటన ఒకరిని ఆలోచించేలా చేసింది. అమిత్ అనే ఆ యువకుడు తేనెటీగలను తొలగించకూడదని, వాటిని రక్షించాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా తెలుసుకున్నారు. తేనెటీగలపై పరిశోధన చేశారు. ఇతరులను కూడా తనతో కలుపుకోవడం ప్రారంభించారు. నెమ్మదిగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.  దానికి ఆయన బీ ఫ్రెండ్స్ అంటే 'బీ-మిత్రులు' అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ బీ ఫ్రెండ్స్ తేనెటీగల తుట్టెలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సురక్షితంగా మారుస్తున్నారు. తద్వారా ప్రజలకు ప్రమాదం ఉండదు. తేనెటీగలు కూడా సజీవంగా ఉంటాయి. అమిత్ గారు చేసున్న ఈ ప్రయత్నం  ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంది. తేనెటీగలకు రక్షణ లభిస్తోంది. తేనె ఉత్పత్తి పెరుగుతోంది.  అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలలో అవగాహన కూడా పెరుగుతోంది. మనం ప్రకృతితో సామరస్యంగా పని చేసినప్పుడు దాని ప్రయోజనం అందరికీ లభిస్తుందని ఈ చొరవ మనకు బోధిస్తుంది.

నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో ఇంతే. మీరు ఈ విధంగా దేశ ప్రజల విజయాలను, సమాజం కోసం వారి ప్రయత్నాలను నాకు పంపుతూ ఉండండి. 'మన్ కీ బాత్' తర్వాతి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం.  అనేక కొత్త విషయాలు, దేశప్రజల కొత్త విజయాల గురించి చర్చిద్దాం. మీ సందేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar

Media Coverage

India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology