నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.
మిత్రులారా! భారతదేశంలో మనకున్న ఆక్రోశం ప్రపంచమంతటా ఉంది. ఈ ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు. లేఖలు రాశారు. సందేశాలు పంపారు. ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచం మొత్తం 140 కోట్ల మంది భారతీయులకు అండగా నిలుస్తోంది. న్యాయం చేస్తామని, తప్పకుండా న్యాయం కొనసాగేలా చేస్తామని బాధిత కుటుంబాలకు మరోసారి హామీ ఇస్తున్నాను. ఈ దాడికి కారకులైన వారికి, కుట్రదారులకు కఠినంగా సమాధానం చెప్తాం.
మిత్రులారా! రెండు రోజుల క్రితం మనం దేశంలోని గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ కె. కస్తూరిరంగన్ గారిని కోల్పోయాం. నేను కస్తూరిరంగన్ గారిని కలిసినప్పుడల్లా భారతదేశ యువత ప్రతిభ, ఆధునిక విద్య, అంతరిక్ష శాస్త్రం వంటి అంశాలపై చాలా చర్చించుకునేవాళ్లం. సైన్స్, విద్యారంగం, భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన నాయకత్వంలో ఇస్రోకు కొత్త గుర్తింపు వచ్చింది. ఆయన మార్గదర్శకత్వంలో సాగిన అంతరిక్ష కార్యక్రమాలు భారతదేశ ప్రయత్నాలకు ప్రపంచ గుర్తింపు తెచ్చాయి. భారతదేశం ఈరోజుల్లో ఉపయోగిస్తున్న అనేక ఉపగ్రహాలు డాక్టర్ కస్తూరిరంగన్ పర్యవేక్షణలో ప్రయోగించాం. ఆయన వ్యక్తిత్వం గురించి మరొక ప్రత్యేక విషయం ఉంది. దీని నుండి యువతరం నేర్చుకోవచ్చు. ఆయన ఎల్లప్పుడూ ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇచ్చారు. కొత్తది నేర్చుకోవడం, తెలుసుకోవడం, చేయడం అనే ఆయన దృక్పథం చాలా స్ఫూర్తిదాయకం. దేశ నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో డాక్టర్ కె. కస్తూరిరంగన్ గారు కూడా పెద్ద పాత్ర పోషించారు. డాక్టర్ కస్తూరిరంగన్ 21వ శతాబ్దపు ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యను పురోగమన మార్గంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. దేశానికి ఆయన చేసిన నిస్వార్థ సేవ, దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను డాక్టర్ కె. కస్తూరిరంగన్ గారికి నా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ ఏప్రిల్ నెలతో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ రోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, 50 ఏళ్ల ఈ ప్రయాణం గుర్తుకు తెచ్చుకుంటే, మనం ఎంత దూరం ప్రయాణించామో మనకు అర్థమవుతుంది. అంతరిక్ష రంగంలో భారతదేశం కలలు కంటున్న ఈ ప్రయాణం ఒకప్పుడు కేవలం ధైర్యంతో మొదలైంది. దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న కొంతమంది యువ శాస్త్రవేత్తల కృషి వల్ల సాధ్యమైంది. వారికి నేటిలా ఆధునిక వనరులు లేవు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. వారిలో ఉన్నవి ప్రతిభ, అంకితభావం, కృషి, దేశం కోసం ఏదైనా చేయాలనే అభిరుచి. మన శాస్త్రవేత్తలు ఎడ్ల బండ్లు, సైకిళ్లపై పరికరాలను మోస్తున్న చిత్రాలను కూడా మీరు తప్పక చూసి ఉంటారు. వారి ఆ అంకితభావం, సేవా స్ఫూర్తి కారణంగానే ఈ రోజు చాలా మార్పు వచ్చింది. నేడు భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్‌గా మారింది. ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించాం. చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా ఘనత సాధించాం. భారతదేశం మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ప్రారంభించింది , ఆదిత్య-ఎల్1 మిషన్ ద్వారా మనం సూర్యుడికి చాలా దగ్గరికి చేరుకున్నాం. నేడు భారతదేశం మొత్తం ప్రపంచంలో అత్యంత తక్కువ ఖర్చుతో విజయవంతమైన అంతరిక్ష కార్యక్రమంలో ముందుంది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ ఉపగ్రహాలు, అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో నుండి సహాయం తీసుకుంటాయి.
మిత్రులారా! ఇస్రో ఏదైనా ఉపగ్రహాన్ని ప్రయోగించడం చూస్తుంటే గర్వంగా భావిస్తాం. 2014లో PSLV-C-23 ప్రయోగాన్ని చూసినప్పుడు నాకు అలాంటి అనుభూతి కలిగింది. 2019లో చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో కూడా నేను బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఉన్నాను. ఆ సమయంలో చంద్రయాన్ ఆశించిన విజయం సాధించలేదు. శాస్త్రవేత్తలకు అది చాలా క్లిష్టమైన సమయం. శాస్త్రవేత్తల సహనాన్ని, ఏదైనా సాధించాలనే తపనను కూడా నా కళ్లతో చూశాను. మరి కొన్నేళ్ల తర్వాత ఆ శాస్త్రవేత్తలే చంద్రయాన్-3ని ఎలా విజయవంతం చేశారో ప్రపంచం మొత్తం చూసింది.
మిత్రులారా! ఇప్పుడు భారతదేశం అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి కూడా అవకాశాలు కల్పిస్తోంది. నేడు చాలా మంది యువకులు స్పేస్ స్టార్టప్‌లో కొత్త జెండాలను రెపరెపలాడిస్తున్నారు. 10 సంవత్సరాల కిందట ఈ రంగంలో ఒకే ఒక కంపెనీ ఉండేది. కానీ నేడు దేశంలో 375 కంటే ఎక్కువ స్పేస్ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. రాబోయే కాలం అంతరిక్ష రంగం అనేక కొత్త అవకాశాలను తెస్తోంది. భారత్ కొత్త శిఖరాలను తాకుతుంది. గగన్‌యాన్, SpaDeX , చంద్రయాన్-4 వంటి అనేక ముఖ్యమైన మిషన్‌ల కోసం దేశం సిద్ధమవుతోంది. మనం వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్ మిషన్ లపై కూడా పని చేస్తున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలతో దేశవాసులను కొత్త గర్వంతో నింపుతారు.
మిత్రులారా! గత నెలలో మయన్మార్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించిన భయంకరమైన చిత్రాలను మీరు తప్పక చూసి ఉంటారు. భూకంపం అక్కడ భారీ వినాశనాన్ని కలిగించింది. శిథిలాలలో చిక్కుకున్న ప్రజలకు ప్రతి శ్వాస, ప్రతి క్షణం విలువైనది. అందుకే భారత్ వెంటనే మయన్మార్‌లోని మన సోదర సోదరీమణుల కోసం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్ నుండి నేవీ షిప్‌ల వరకు ప్రతి ఒక్కటీ మయన్మార్‌కు సహాయం చేయడానికి పంపించాం. అక్కడ భారత బృందం క్షేత్ర స్థాయి ఆసుపత్రిని సిద్ధం చేసింది. ఇంజనీర్ల బృందం ముఖ్యమైన భవనాలు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సహాయం చేసింది. భారత బృందం అక్కడ దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, మందులు, ఆహార పదార్థాలు, అనేక ఇతర వస్తువులను సరఫరా చేసింది. ఈ సమయంలో భారత జట్టుకు అక్కడి ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందాయి.
మిత్రులారా! ఈ సంక్షోభంలో సాహసం, ధైర్యం, వివేకాలకు సంబంధించిన అనేక హృదయాలను హత్తుకునే ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి. 18 గంటల పాటు శిథిలాల కింద కూరుకుపోయిన 70 ఏళ్లు పైబడిన వృద్ధురాలిని భారత బృందం రక్షించింది. ప్రస్తుతం టీవీలో 'మన్ కీ బాత్' చూస్తున్న వారు ఆ వృద్ధురాలి ముఖాన్ని కూడా చూస్తారు. భారతదేశం నుండి వచ్చిన బృందం ఆ వృద్ధురాలి ఆక్సిజన్ స్థాయిని స్థిరీకరించడం నుండి ఫ్రాక్చర్ చికిత్స వరకు సాధ్యమైన ప్రతి చికిత్సను అందించింది. ఆ వృద్ధురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పుడు ఆమె మన బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. భారత రక్షణ బృందం వల్లే తనకు కొత్త జీవితం వచ్చిందని చెప్పింది. మన బృందాల వల్లే తమ స్నేహితులు, బంధువులు దొరికారని చాలా మంది చెప్పారు.
మిత్రులారా! భూకంపం తరువాత మయన్మార్‌లోని మాండలేలోని ఒక మఠంలో చాలా మంది చిక్కుకుపోయే అవకాశం ఉందని మన బృందం భావించింది. మన బృంద సభ్యులు అక్కడ కూడా సహాయ, రక్షక కార్యకలాపాలు నిర్వహించారు. దీని కారణంగా వారు బౌద్ధ సన్యాసుల నుండి ఆశీర్వాదాలు పొందారు. ఆపరేషన్ బ్రహ్మలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పట్ల గర్వంగా ఉంది. మనకు మన సంప్రదాయం ఉంది. మన విలువలు ఉన్నాయి. మనకు వసుధైవ కుటుంబ భావన ఉంది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం. సంక్షోభ సమయాల్లో ప్రపంచ స్నేహితుడిగా భారతదేశ సంసిద్ధత, మానవత్వం పట్ల భారతదేశ నిబద్ధత మనకు గుర్తింపుగా మారుతున్నాయి.
మిత్రులారా! ఆఫ్రికాలోని ఇథియోపియాలో ప్రవాస భారతీయులు చేస్తున్న వినూత్న ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలను చికిత్స కోసం భారతదేశానికి పంపడానికి ఇథియోపియాలో నివసిస్తున్న భారతీయులు చొరవ తీసుకున్నారు. అలాంటి చాలా మంది పిల్లలకు భారతీయ కుటుంబాలు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. డబ్బు లేకపోవడంతో చిన్నపిల్లల కుటుంబం భారతదేశానికి రాలేక పోతుంటే అందుకుతగిన ఏర్పాట్లు కూడా మన భారతీయ సోదర సోదరీమణులు చేస్తున్నారు. ఇథియోపియాలో తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ప్రతి పేద బిడ్డకు మెరుగైన చికిత్స అందేలా చూడడమే ఈ ప్రయత్నం. భారతీయ ప్రవాసుల ఈ ఉదాత్తమైన పని ఇథియోపియాలో చాలా ప్రశంసలు అందుకుంటుంది. భారతదేశంలో వైద్య సదుపాయాలు నిరంతరం మెరుగుపడుతున్నాయని మీకు తెలుసు. ఇతర దేశాల ప్రజలు కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
మిత్రులారా! కొద్ది రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారతదేశం పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ను పంపింది. రేబిస్, టెటనస్, హెపటైటిస్ బి, ఇన్‌ఫ్లుయెంజా వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించడానికి ఈ టీకా ఉపయోగపడుతుంది. ఈ వారం నేపాల్ అభ్యర్థన మేరకు భారతదేశం నేపాల్‌కు పెద్ద మొత్తంలో మందులు, వ్యాక్సిన్‌లను పంపింది. ఇది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్సను అందిస్తుంది. మానవాళికి సేవ చేయడం విషయానికి వస్తే భారతదేశం ఎల్లప్పుడూ ముందుంటుంది. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతి అవసరంలో ముందుంటుంది.
మిత్రులారా! మనం విపత్తు నిర్వహణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడంలో మీ అప్రమత్తత, మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు మీ మొబైల్‌లోని ప్రత్యేక యాప్ నుండి ఈ అప్రమత్తతలో సహాయం పొందవచ్చు. ఈ యాప్ ఏదైనా ప్రకృతి విపత్తులో చిక్కుకోకుండా మిమ్మల్ని కాపాడుతుంది. దీని పేరు సచేత్. ‘సచేత్ యాప్’ని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ- నేషనల్ డైజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారు చేసింది. వరదలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడటం, సునామీ, అడవి మంటలు, హిమపాతం, తుఫాను లేదా మెరుపు వంటి విపత్తు ఏదైనా కావచ్చు. సచేత్ యాప్ మీకు సమాచారం అందించడానికి, అన్ని విధాలుగా రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు వాతావరణ శాఖకు సంబంధించిన అప్‌డేట్‌లను పొందవచ్చు. విశేషమేమిటంటే ‘సచేత్ యాప్' ప్రాంతీయ భాషల్లో కూడా చాలా సమాచారాన్ని అందిస్తుంది. మీరు కూడా ఈ యాప్‌ని సద్వినియోగం చేసుకోవాలి. మీ అనుభవాలను మాతో పంచుకోండి.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజు మనం భారతదేశ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించడం చూస్తున్నాం. భారతదేశ యువత భారతదేశం పట్ల ప్రపంచ దృష్టికోణాన్ని మార్చింది. ఏ దేశంలో అయినా యువత ఆసక్తి దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. నేడు భారతదేశ యువత సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ల వైపు పయనిస్తోంది. వెనుకబాటుతనానికి మారుపేరుగా నిలిచిన ప్రాంతాలలో కూడా యువత మనకు కొత్త విశ్వాసాన్ని కలిగించే ఇటువంటి ఉదాహరణలను అందించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సైన్స్ సెంటర్ ఈ రోజుల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొంతకాలం క్రితం వరకు దంతెవాడ హింస, అశాంతికి మాత్రమే ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు, అక్కడ ఉన్న సైన్స్ కేంద్రం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కొత్త ఆశాకిరణంగా మారింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడం పిల్లలకు చాలా ఆనందంగా ఉంది. వారు ఇప్పుడు సాంకేతికతను ఉపయోగించి కొత్త యంత్రాలను, కొత్త ఉత్పత్తులను తయారు చేయడం నేర్చుకుంటున్నారు. త్రీడీ ప్రింటర్లు, రోబోటిక్ కార్లతోపాటు ఇతర వినూత్న విషయాలను తెలుసుకునే అవకాశం వారికి లభించింది. కొంతకాలం కిందట నేను గుజరాత్ సైన్స్ సిటీలో సైన్స్ గ్యాలరీలను కూడా ప్రారంభించాను. ఆధునిక విజ్ఞాన సామర్థ్యాల గురించి, సైన్స్ మనకు చేసే మేలు గురించి ఈ గ్యాలరీలు మనకు తెలియజేస్తాయి. ఈ గ్యాలరీల పట్ల అక్కడి పిల్లల్లో చాలా ఉత్సాహం ఉందని నాకు సమాచారం అందింది. సైన్స్, ఇన్నోవేషన్ పట్ల పెరుగుతున్న ఈ ఆకర్షణ ఖచ్చితంగా భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మన దేశానికి అతిపెద్ద బలం మన 140 కోట్ల మంది ప్రజలు, వారి సామర్థ్యం, వారి సంకల్ప శక్తి. కోట్లాది మంది ప్రజలు కలిసి ఒక ప్రచారంలో చేరితే దాని ప్రభావం భారీగా ఉంటుంది. దీనికి ఉదాహరణ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారం. ఈ ప్రచారం మనకు జన్మనిచ్చిన తల్లి కోసం. మనల్ని తన ఒడిలో ఉంచుకున్నభూమాత కోసం కూడా. మిత్రులారా! జూన్ 5వ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ నాటికి ఈ ప్రచారానికి ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఈ ఒక్క ఏడాదిలో ఈ ప్రచారం కింద దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలను అమ్మ పేరిట నాటారు. భారతదేశం ప్రారంభించిన ఈ చొరవను చూసి, దేశం వెలుపల ఉన్న ప్రజలు కూడా తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. మీరు కూడా ఈ ప్రచారంలో భాగం అవ్వండి. తద్వారా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మీ భాగస్వామ్యం విషయంలో మీరు గర్వపడవచ్చు.
మిత్రులారా! చెట్లు చల్లదనాన్ని అందిస్తాయనీ వేడి నుంచి చెట్ల నీడ ఉపశమనం కలిగిస్తుందనీ మనందరికీ తెలుసు. అయితే తాజాగా దీనికి సంబంధించిన మరో వార్త నా దృష్టిని ఆకర్షించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా 70 లక్షలకు పైగా చెట్లను నాటారు. ఈ చెట్లు అహ్మదాబాద్‌లో పచ్చదనాన్ని బాగా పెంచాయి. దీనితో పాటు సబర్మతి నదిపై రివర్ ఫ్రంట్ నిర్మాణం, కాంకరియా వంటి కొన్ని సరస్సుల పునర్నిర్మాణం కారణంగా ఇక్కడ నీటి వనరుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలలో గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ ఒకటిగా మారిందని ఇప్పుడు వార్తా నివేదికలు చెప్తున్నాయి. అక్కడి ప్రజలు కూడా ఈ మార్పును, వాతావరణంలో చల్లదనాన్ని అనుభవిస్తున్నారు. అహ్మదాబాద్‌లో నాటిన చెట్లు అక్కడ కొత్త శ్రేయస్సును తీసుకురావడానికి కారణం అవుతున్నాయి. భూ వాతావరణాన్ని పదిలంగా ఉంచుకోవడానికి, వాతావరణ మార్పుల సవాళ్లను అధిగమించడానికి, మీ పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి ఒక చెట్టును మీ అమ్మ పేరుతో నాటాలని నేను మీ అందరినీ మరోసారి కోరుతున్నాను.
మిత్రులారా! మనసుంటే మార్గం ఉంటుందని ఒక పాత సామెత మనకు తెలుసు. మనం ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటాం. మీరు పర్వతాలలో పెరిగే యాపిల్స్ చాలా తింటూ ఉండవచ్చు. కానీ, మీరు కర్ణాటక యాపిల్స్ రుచి చూశారా? అని నేను అడిగితే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా పర్వతాలపై మాత్రమే యాపిల్ పండిస్తారని మనకు తెలుసు. అయితే కర్నాటకలోని బాగల్‌కోట్‌లో నివసించే శ్రీశైల తెలీ గారు మైదాన ప్రాంతంలో యాపిళ్లను పండించారు. వారు నివసించే కులాలి గ్రామంలో యాపిల్ చెట్లు 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. శ్రీశైల తెలీ గారికి వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే యాపిల్ సాగులో కూడా ప్రయత్నించి విజయం సాధించారు. వారు నాటిన యాపిల్ చెట్లకు నేడు పెద్ద సంఖ్యలో యాపిల్స్ పండడంతో పాటు వాటిని విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
మిత్రులారా! యాపిల్స్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు మీరు కిన్నౌరి యాపిల్ పేరు విని ఉంటారు. యాపిల్‌కు ప్రసిద్ధి చెందిన కిన్నౌర్‌లో కుంకుమపువ్వు ఉత్పత్తి ప్రారంభమైంది. సాధారణంగా హిమాచల్‌లో కుంకుమపువ్వు సాగు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కిన్నౌర్‌లోని అందమైన సాంగ్లా లోయలో కూడా కుంకుమపువ్వు సాగు ప్రారంభమైంది. అలాంటి మరో ఉదాహరణ కేరళలోని వాయనాడ్. ఇక్కడ కూడా కుంకుమపువ్వు పండించడంలో విజయం సాధించారు. వాయనాడ్‌లో ఈ కుంకుమపువ్వును ఏ పొలంలోనో మట్టిలోనో మామూలుగా పండించడం కాదు- ఏరోపోనిక్స్ టెక్నిక్ ఉపయోగించి పండిస్తున్నారు. లిచ్చి ఉత్పత్తి విషయంలోనూ ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయమే జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లేదా జార్ఖండ్‌లో లిచ్చి పెరుగుతుందని మనం వింటున్నాం. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనూ రాజస్థాన్‌లోనూ కూడా లిచ్చీ ఉత్పత్తి జరుగుతోంది. తమిళనాడుకు చెందిన తిరు వీర అరసు గారు కాఫీ పండించేవారు. ఆయన కొడైకెనాల్‌లో లిచ్చీ చెట్లను నాటారు. ఏడేళ్ల కృషి తరువాత ఆ చెట్లు ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. లిచ్చీ సాగులో ఆయన సాధించిన విజయం చుట్టుపక్కల ఉన్న ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిచ్చింది. రాజస్థాన్‌లో లిచ్చీని పెంచడంలో జితేంద్ర సింగ్ రనావత్ విజయం సాధించారు. ఈ ఉదాహరణలన్నీ చాలా స్ఫూర్తిదాయకమైనవి. మనం ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుని, కష్టాలు ఎదురైనా పట్టుదలతో ఉంటే, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈరోజు ఏప్రిల్ నెలలో చివరి ఆదివారం. మరికొద్ది రోజుల్లో మే నెల ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుండి మిమ్మల్ని 108 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను. 1917 సంవత్సరం ఏప్రిల్, మే ఈ రెండు నెలల్లో దేశంలో స్వాతంత్ర్యం కోసం ఒక ప్రత్యేకమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పేదలు, అణగారిన వర్గాల వారు, రైతులపై దోపిడీ అమానవీయ స్థాయిలను అధిగమించింది. బీహార్ లోని సారవంతమైన భూముల్లో నీలిమందు సాగు చేయవలసిందిగా రైతులను బ్రిటిష్ వారు బలవంతం చేశారు. నీలిమందు సాగు వల్ల రైతుల పొలాలు బీడుగా మారాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితిలో గాంధీజీ 1917లో బీహార్‌లోని చంపారన్‌కు చేరుకున్నారు. “మా భూములు బీడుగా మారిపోతున్నాయి. మాకు తినడానికి తిండి లేదు” అని రైతులు గాంధీజీతో చెప్పారు. లక్షలాది మంది రైతుల బాధలు గాంధీజీ మనసులో ఒక తీర్మానానికి దారితీశాయి. అక్కడి నుంచి చంపారన్ చరిత్రాత్మక సత్యాగ్రహం ప్రారంభమైంది. భారతదేశంలో బాపూ చేసిన మొదటి అతిపెద్ద ప్రయోగం ‘చంపారన్ సత్యాగ్రహం’. బాపూ సత్యాగ్రహంతో బ్రిటీష్ యంత్రాంగం మొత్తం కదిలింది. రైతులను నీలిమందు పండించవలసిందిగా బలవంతం చేసే చట్టాన్ని బ్రిటిష్ వారు నిలిపివేయవలసి వచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో కొత్త విశ్వాసాన్ని నింపిన విజయం ఇది. స్వాతంత్య్రానంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన బీహార్ వీరుడు ఈ సత్యాగ్రహంలో పెద్ద ఎత్తున భాగస్వామి అయ్యారన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఆయనే గొప్ప వ్యక్తిత్వం ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ‘సత్యాగ్రహ ఇన్ చంపారన్’ అనే పేరుతో చంపారన్ సత్యాగ్రహంపై ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాశారు. యువకులందరూ ఈ పుస్తకాన్ని చదవాలి. సోదరసోదరీమణులారా! స్వాతంత్ర్య పోరాటంలో మరెన్నో చెరగని అధ్యాయాలు ఏప్రిల్ నెలతోనే ముడిపడి ఉన్నాయి. గాంధీజీ 'దండి మార్చ్' ఏప్రిల్ 6వ తేదీన పూర్తయింది. మార్చి 12వ తేదీన ప్రారంభమై 24 రోజుల పాటు సాగిన ఈ మార్చ్ బ్రిటీష్‌వారిని కదిలించింది. ఏప్రిల్ నెలలోనే జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. ఈ రక్తపాత చరిత్ర గుర్తులు పంజాబ్ గడ్డపై ఇప్పటికీ ఉన్నాయి.
మిత్రులారా! మరికొద్ది రోజుల్లో మే 10వ తేదీన ప్రథమ స్వాతంత్ర్య పోరాట వార్షికోత్సవం కూడా వస్తోంది. తొలి స్వాతంత్య్ర సమరంలో రగిలించిన నిప్పురవ్వ ఆ తర్వాత లక్షలాది మంది యోధులకు జ్యోతిగా మారింది. 1857 సమరంలో పాల్గొన్న గొప్ప వీరుడు బాబూ వీర్ కున్వర్ సింగ్ వర్ధంతిని ఏప్రిల్ 26వ తేదీన జరుపుకున్నాం. బీహార్ కు చెందిన ఆ గొప్ప సేనాని నుండి దేశం మొత్తం ప్రేరణ పొందింది. అలాంటి లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల అమర స్ఫూర్తిని మనం సజీవంగా ఉంచుకోవాలి. వారి నుండి మనకు లభించే శక్తి అమృతకాలంలో మన సంకల్పాలకు కొత్త బలాన్ని ఇస్తుంది.
మిత్రులారా! 'మన్ కీ బాత్' కార్యక్రమ ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఈ కార్యక్రమంతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారు. దేశప్రజలు ఇతరులతో పంచుకోవాలనుకునే విజయాలను 'మన్ కీ బాత్' ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. దేశ వైవిధ్యం, అద్భుతమైన సంప్రదాయాలు, కొత్త విజయాల గురించి మాట్లాడటానికి వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అంకితభావం, సేవాతత్పరతతో సమాజంలో మార్పు తీసుకొస్తున్నవారి గురించి మనం తెలుసుకుందాం. ఎప్పటిలాగే మీ ఆలోచనలు, సూచనలను మాకు పంపుతూ ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం.
The perpetrators and conspirators of this attack will be served with the harshest response: PM @narendramodi during #MannKiBaat pic.twitter.com/mjF5ezrtes
— PMO India (@PMOIndia) April 27, 2025
In the war against terrorism, the unity of the country, the solidarity of 140 crore Indians, is our biggest strength: PM @narendramodi during #MannKiBaat pic.twitter.com/WI5BlQFDQG
— PMO India (@PMOIndia) April 27, 2025
There is a deep anguish in my heart. The terrorist attack that took place in Pahalgam on the 22nd of April has hurt every citizen of the country: PM @narendramodi in #MannKiBaat pic.twitter.com/oAmct2pZOF
— PMO India (@PMOIndia) April 27, 2025
Dr. K. Kasturirangan Ji's selfless service to the country and contribution to nation building will always be remembered: PM @narendramodi during #MannKiBaat pic.twitter.com/h2FzD5xaxf
— PMO India (@PMOIndia) April 27, 2025
Today, India has become a Global Space Power. #MannKiBaat pic.twitter.com/0oJliacysa
— PMO India (@PMOIndia) April 27, 2025
We are very proud of all those who participated in Operation Brahma: PM @narendramodi in #MannKiBaat pic.twitter.com/lXuubTALo0
— PMO India (@PMOIndia) April 27, 2025
Whenever it comes to serving humanity, India has always been and will always be at the forefront. #MannKiBaat pic.twitter.com/whLG6VWWO7
— PMO India (@PMOIndia) April 27, 2025
SACHET App for disaster preparedness. #MannKiBaat pic.twitter.com/ntWYM8N44R
— PMO India (@PMOIndia) April 27, 2025
Growing curiosity for science and innovation amongst youth will take India to new heights. #MannKiBaat pic.twitter.com/sWAHzpZfcV
— PMO India (@PMOIndia) April 27, 2025
#EkPedMaaKeNaam initiative shows the power of collective action. #MannKiBaat pic.twitter.com/cK9gTpktFU
— PMO India (@PMOIndia) April 27, 2025
A noteworthy effort in Karnataka to grow apples. #MannKiBaat pic.twitter.com/TDiuBUEbcg
— PMO India (@PMOIndia) April 27, 2025
Champaran Satyagraha infused new confidence in the freedom movement. #MannKiBaat pic.twitter.com/5kbGkzrM8G
— PMO India (@PMOIndia) April 27, 2025







