యువర్ ఎక్స్‌లెన్సీ, డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ,
ఇరు దేశాల ప్రముఖ ప్రతినిధులు,
ప్రసార మాధ్యమాల మిత్రులారా,
నమస్కారం.
అధ్యక్షుడు శ్రీ హెర్మినీకీ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.
సీషెల్స్ అధ్యక్షునిగా ఎన్నికవడం పట్ల, 140 కోట్ల మంది భారతీయుల పక్షాన నేను ఆయనకు మనసారా అభినందనలనీ, శుభాకాంక్షలనీ తెలియజేస్తున్నాను.
అధ్యక్షుడు భారత్‌కు రావడం ఇదే మొదటి సారి. సీషెల్స్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆయన భారత్ పర్యటన చోటుచేసుకొంటోంది.  ఈ కీలక ఘట్టాలు కలిసికట్టుగా కొత్త శిఖరాలకు చేరుకోవడానికి మనకు స్ఫూర్తిని అందిస్తుంటాయని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
భారత్, సీషెల్స్ సంబంధాలు దౌత్య సంబంధాల కన్నా విస్తృతమైనవి. హిందూ మహాసముద్రం అలలు మన ప్రజల్ని కొన్ని వందల ఏళ్లుగా సంధానిస్తున్నాయి. ఈ సముద్ర తీరం వెంబడి, మన దేశాల మధ్య వాణిజ్యం విస్తరించింది, సంస్కృతులు పెనవేసుకొనిపోయాయి, విశ్వాసం అంతకంతకూ బలోపేతమవుతూనే ఉంది.
భారత్, సీషెల్స్ ఒక్క భౌగోళికంగానే కాకుండా చరిత్ర, నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృష్టికోణం ద్వారా కూడా అనుబంధితమై ఉన్నాయి.
మన బంధం గతకాలం, వర్తమానంతో పాటు భవిష్యత్కాలానికీ వర్తించేదే. నౌకావాణిజ్య పొరుగుదేశంగా, విశ్వసనీయ భాగస్వామ్య దేశంగా భారత్ అనుసరిస్తున్న ‘మహాసాగర్’ దార్శనికతలో సీషెల్స్ ఒక అంతర్భాగంగా ఉంది. నౌకా వాణిజ్యంతో పాటు భూ, వాయు రంగాలకు కూడా విస్తరించింది మన సహకారం.
ఈ భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకొనే మార్గాన్ని ఇవాళ్టి చర్చల్లో మనం కనుగొన్నాం. మన ఆర్థిక సహకారాన్ని పటిష్ఠపరుచుకోవడానికి కొత్త కొత్త అవకాశాల్ని అన్వేషించాలని ఓ అంగీకారానికి వచ్చాం.

 

స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని పెంపొందించుకొంటూనే, మనం మన సహకారాన్ని ఫిన్‌టెక్, డిజిటల్ సేవల రంగాలకీ విస్తరించుకొందాం.
అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యం భారత్-సీషెల్స్ సంబంధాలకు ఒక బలమైన ఆధారంగా ఉంది. సీషెల్స్ ప్రాధాన్యాలూ, అవసరాలే మా ప్రయత్నాలన్నిటికీ మార్గదర్శకత్వం వహిస్తున్నాయి.
ఈ మార్గంలో ముందుకు సాగుతూ, ఈ రోజు 175 మిలియన్ డాలర్ల విలువైన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మేం ప్రకటిస్తున్నాం. ఈ ప్యాకేజీ సామాజిక గృహ నిర్మాణం, ఈ-మొబిలిటీ, వృత్తివిద్య సంబంధిత శిక్షణ, ఆరోగ్యం, రక్షణ, నౌకావాణిజ్య భద్రత వంటి రంగాల్లో నిర్దిష్ట ప్రాజెక్టులకు దన్నుగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు సీషెల్స్ ప్రజలకు, ప్రత్యేకించి యువతకు కొత్త ఉపాధి అవకాశాల్నీ, నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశాల్నీ అందిస్తాయి.
భారత ఐటీఈసీ కార్యక్రమం సీషెల్స్‌లో సామర్థ్యాల్ని పెంచడంలో ముఖ్య పాత్రను పోషించింది. సీషెల్స్‌కు చెందిన ప్రభుత్వోద్యోగులకు భారత్‌లో శిక్షణ ఇవ్వడానికి ఒక అవగాహన ఒప్పందంపైన ఈ రోజు సంతకాలవుతున్నాయని తెలియజేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.
సాంకేతిక రంగంలో సన్నిహిత సహకారాన్ని అందించుకోవడం ద్వారా, మన భాగస్వామ్యానికి ఒక దూరదర్శి దిశను మనం నిర్దేశిస్తున్నాం. డిజిటల్ పరివర్తనపైన ఓ అవగాహన ఒప్పందాన్ని కూడా ఈ రోజు కుదుర్చుకుంటున్నాం. దీనిలో భాగంగా భారత్‌లో విజయవంతమైన ఫలితాల్ని సీషెల్స్‌తో మేం పంచుకుంటాం.
ఆరోగ్య రంగంలో, సీషెల్స్‌కు భారత్ ఒక స్థిరమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంది. చౌకైన, నాణ్యమైన మందుల సరఫరా, వైద్య పర్యాటకం, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన.. వీటిలో సీషెల్స్‌తో కలిసి పనిచేయడాన్ని మేం ఇక మీదటా కొనసాగిస్తాం.
ఇంధనం, వాతావరణం రంగాల్లో, మన సహకారానికి స్థిరాభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధతే దారిదీపంగా ఉంది. పునరుత్పాదక ఇంధనం, ఆటుపోట్లను ఎదుర్కొని నిలదొక్కుకోవడం, వాతావరణానికి తగిన పరిష్కారాల్ని కనుగొనే విషయాల్లో మన సహకారాన్ని మనం మరింతగా పెంపొందించుకుందాం.
మిత్రులారా,
నౌకావాణిజ్య ఇరుగు పొరుగు దేశాలం అయిన మనకు సముద్ర ఉత్పాదనల ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ సహజంగానే పరస్పరం సహకరించుకోదగిన రంగాల్లో ఒకటి. నౌకావాణిజ్య సంబంధిత పరిశోధన, సామర్థ్యాల పెంపుదల, సమాచారాన్ని పంచుకోవడం వంటి రంగాల్లో భారత్ అనుభవాన్ని మేం సీషెల్స్‌తో పంచుకుంటాం.
రక్షణ రంగ సహకారం, నౌకావాణిజ్య భద్రత మన భాగస్వామ్యంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో పూర్తి స్థాయి సభ్య దేశంగా సీషెల్స్‌ను మేం ఆహ్వానిస్తున్నాం. ఇది మన పరస్పర సమన్వయాన్ని పటిష్ఠపరిచి, హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరతల పరిరక్షణ కృషిని బలోపేతం చేస్తుంది.
కలిసికట్టుగా, మనం ఒక్క ద్వైపాక్షిక సహకారాన్నే తీర్చిదిద్దుకోవడం కాకుండా, హిందూ మహాసముద్రం విషయంలోనూ ఉమ్మడి భవిష్యత్తును కూడా సాకారం చేద్దాం.
మిత్రులారా,
భారత్-సీషెల్స్‌ సంబంధాల్లోని మహత్తర శక్తి మన రెండు దేశాల ప్రజల పరస్పర సంబంధాల్లో ఇమిడి ఉంది. సీషెల్స్‌లో స్థిరపడిన భారతీయులు దేశ సామాజిక, ఆర్థిక స్థితులకు అసాధారణమైన సేవల్ని అందించారు. అదే కాలంలో, వారు మన మైత్రిని తరాల తరబడి బలపరిచారు.
ఇవాళ, మనం పర్యటన, విద్య, సంస్కృతి, క్రీడల రంగాల సాయంతో ఈ సంబంధాల్ని దృఢతరం చేసుకొనే  అవకాశాల్ని చర్చించాం. ఇరు దేశాల యువత మధ్య రాకపోకల్ని పెంపొందించే అంశంలో మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొందాం.
మిత్రులారా,
భారత్-సీషెల్స్‌ భాగస్వామ్యం ఒక కొత్త దశకు చేరుకొంటోందని ఈ రోజు సమావేశం స్పష్టం చేస్తోంది. అన్ని రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకు పోవడానికి, భారత్-సీషెల్స్‌ జాయింట్ విజన్‌ను మనం ప్రకటిస్తున్నాం. ఈ విజన్ రాబోయే కాలంలో మన సహకారానికొక మార్గసూచీగా ఉపయోగపడుతుంది.
ఎక్స్‌లెన్సీ,
భారతదేశంలో మీరు పర్యటిస్తున్నందుకూ, భారత్ పట్ల మీ చెక్కుచెదరని మైత్రికీ, నిబద్దతకీ నేను మరో సారి నా మనసారా కృతజ్ఞ‌తల్ని తెలియజేస్తున్నాను.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules

Media Coverage

Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu and his family in Hyderabad
May 10, 2026

The Prime Minister, Shri Narendra Modi met the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, and his family at his residence in Hyderabad today.

The Prime Minister said that it is always a delight to meet Shri Chandrababu Naidu and his family and exchange views on a wide range of subjects and diverse topics.

The Prime Minister wrote on X;

“In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.

@ncbn”