గౌరవనీయ డాక్టర్‌ పాట్రిక్‌ హర్మినీ,

రెండు దేశాల ప్రతినిధి బృంద సభ్యులు,

ప్రచురణ, ప్రసార మాధ్యమ మిత్రులారా...

అందరికీ నమస్కారం!

   అధ్యక్షులు శ్రీ హర్మినీ మాకు సాదర స్వాగతం పలికి, ఎనలేని ఆదరాభిమానాలతో ఆతిథ్యం ఇచ్చినందుకు మున్ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.

 

మిత్రులారా!

సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవం నిర్వహించుకుంటున్న ఈ చారిత్రక తరుణంలో నేనిక్కడ పర్యటిస్తున్నాను. యాదృచ్ఛికంగా ఇది భారత్-సీషెల్స్ దౌత్య సంబంధాల స్వర్ణోత్సవం సంవత్సరం కూడా కావడం ఎంతో ముదావహం.

ఈ ఐదు దశాబ్దాల్లో మన స్నేహాన్ని విశ్వసనీయతగా.. విశ్వసనీయతను సహకారంగా.. సహకారాన్ని రెండు దేశాల ప్రజా సంక్షేమంగా మనం మలచుకున్నాం.

మిత్రులారా!

భారత్-సీషెల్స్ సంబంధాలను హిందూ మహాసముద్రం శతాబ్దాలుగా పెంచిపోషిస్తోంది. ఈ జలాలు మన ద్వైపాక్షిక వాణిజ్యం, సాంస్కృతిక ఆదానప్రదానం, ప్రజల మధ్య సంబంధాలను సదా ప్రోత్సహిస్తున్నాయి.

హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఆవాసమన్నది మా నమ్మకం. ఈ జలాల భద్రత, సుస్థిరత, శ్రేయస్సు మన సమష్టి కర్తవ్యం. ఈ స్ఫూర్తే మన ‘మహాసాగర్’ దార్శనికతకు  పునాది.

మిత్రులారా!

ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌరవనీయ అధ్యక్షుల భారత పర్యటన సందర్భంగా ప్రకటించిన ఈ ఉమ్మడి దార్శనికత మన భవిష్యత్ భాగస్వామ్యానికి ఒక ముసాయిదా ప్రణాళికను సమకూర్చింది. దీని ఆధారంగా ప్రతి రంగంలోనూ మన సహకారం మరింత బలోపేతం అవుతోంది.

ఈ రోజున మా ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టంగా, భవిష్యత్‌ సంసిద్ధంగా తీర్చిదిద్దే మార్గాలపై మేం చర్చించాం. రెండు దేశాల పరిశ్రమలకు సరికొత్త అవకాశాల  అన్వేషణను ఇకపైనా కొనసాగిస్తాం.

భారత్-సీషెల్స్ అనుసంధానాన్ని పెంపొందించే దిశగానూ మేం కృషి చేస్తాం. ఇది మా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఇనుమడింపజేయడమే కాకుండా తూర్పు ఆఫ్రికా, హిందూ మహాసముద్ర ప్రాంతంతో మా సంబంధాలను కూడా బలోపేతం చేస్తుంది.

రెండు దేశాల మధ్య దూరాన్ని తగ్గించడంలో డిజిటల్ సాంకేతికత ఒక సమర్థ వారధి కాగలదని మా విశ్వాసం. సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో భారత్‌ విజయాలను, అనుభవాలను సీషెల్స్‌తో పంచుకోవడానికి మేం సిద్ధం. ఇందులో భాగంగా  సీషెల్స్‌లో ‘యూపీఐ’ అమలు దిశగా ఇవాళ ఒక అవగాహన ఒప్పందం  కుదరడంపై నేనెంతో సంతోషిస్తున్నాను.

 

మిత్రులారా!

మన సంబంధాలకు చిరకాలం నుంచీ ప్రగతి భాగస్వామ్యం ఒక మూలస్తంభం. ఈ క్రమంలో సీషెల్స్ ప్రాథమ్యాలు, అవసరాలు, ఆకాంక్షలు కేంద్రకంగా భారత్‌ సదా ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది.

గౌరవనీయ సీషెల్స్‌ అధ్యక్షుని భారత పర్యటన సందర్భంగా మేం 175 మిలియన్ డాలర్ల విలువైన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాం. దీనికింద ఇక్కడ సామాజిక గృహనిర్మాణం, రవాణా, నైపుణ్యాభివృద్ధి, ఆహార భద్రత, విద్య, రక్షణ తదితర రంగాల్లో పలు ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయి. సీషెల్స్లో మానవ వనరుల వికాసానికి మద్దతివ్వడాన్ని భారత్‌  ఎప్పుడూ ఒక ప్రత్యేక ప్రాధాన్యంగా పరిగణిస్తుంది.

సీషెల్స్ సివిల్ సర్వెంట్ల శిక్షణ కార్యక్రమాల్లోనూ భారత్‌ తోడ్పాటునివ్వడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఈ నేపథ్యంలో నేడిక్కడ ‘ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ సెంటర్’కు ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ కేంద్రం సీషెల్స్ యువత నైపుణ్యాన్ని, ఉపాధి అవకాశాలను, ఆత్మవిశ్వాసాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చలదని మా ప్రగాఢ విశ్వాసం.

మిత్రులారా!

ఆరోగ్య సంరక్షణ రంగంలో మా భాగస్వామ్యం కాలపరీక్షకు నిలిచింది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నాడు విశ్వసనీయ మిత్రదేశంగా టీకాల సరఫరా ద్వారా మా బాధ్యతను నెరవేర్చాం.

సీషెల్స్ ప్రజలకు నాణ్యమైన, చౌక ఔషధాలను అందుబాటులోకి తేవడంలో ‘జనౌషధి’పై నేటి అవగాహన ఒప్పందం తోడ్పడుతుంది. సామర్థ్య వికాసం, శిక్షణ కార్యక్రమాల ద్వారా ఈ దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో మా వంతు సహకారం అందిస్తాం.

ఇంధనం, వాతావరణ పరిరక్షణ రంగాలలో మా సహకారం సదా పురోగమిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్‌ సహా కాలుష్య రహిత ఇంధన రంగంలోని ఆధునిక విభాగాలలో ఉభయతారక భాగస్వామ్యాన్ని మేం మరింత బలోపేతం చేస్తాం. ఇక నీలి ఆర్థిక వ్యవస్థ మా సంబంధాలకు ఒక సహజ, వ్యూహాత్మక పునాది.

సముద్ర పరిశీలన, విజ్ఞానం, తీరప్రాంత నిర్వహణలో భారత నైపుణ్యాన్ని సీషెల్స్‌తో పంచుకుంటాం. అంతరిక్ష రంగంలోనూ మేం కలిసి అడుగేస్తున్నాం. దీనిపై ఈ రోజు మా మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదరడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.

 

భద్రత-రక్షణ రంగాల్లో భారత్‌-సీషెల్స్ బంధం విడదీయరాదని మా విశ్వాసం. ఈ రంగాల్లో  మా సన్నిహిత సహకారాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తాం.

మిత్రులారా!

మా ద్వైపాక్షిక బంధానికిగల వాస్తవ బలం రెండు దేశాల మధ్యగల స్నేహసంబంధాలలోనే ఉంది. నేటి చర్చలు ఈ బంధాన్ని మరింతగా పెనవేస్తాయి. రెండు దేశాల క్రీడాకారుల మధ్య సహకార బలోపేతానికీ సంస్థాగతంగా ముందడుగు వేస్తాం.

భారతీయ యోగా, చలనచిత్ర పరిశ్రమలకు సీషెల్స్‌లో లభించే విశేషాదరణ మన ప్రజల మధ్య లోతైన సాంస్కృతిక బంధానికి ప్రతిబింబం. ఇదే స్ఫూర్తితో ప్రజల మధ్య ఆదానప్రదానాన్ని... ముఖ్యంగా రెండు దేశాల యువత మధ్య స్నేహాన్ని ప్రోత్సహించడంలో మా కృషిని కొనసాగిస్తాం.

మిత్రులారా!

సీషెల్స్‌లో నా ప్రస్తుత పర్యటన సందేశం సుస్పష్టం: సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు రెండూ జమిలిగా సాగే హిందూ మహాసముద్రమే భారత్‌ ఆకాంక్ష. మన భాగస్వామ్యాలు పరిమాణం రీత్యా కాకుండా పరస్పర గౌరవం, విశ్వాసంతో నిండినవిగా పరిఢవిల్లాలి. మేం ఒకరి సరసన మరొకరుగా కాకుండా భుజం కలిపి ముందుకు సాగాలన్నది నా దీక్ష.

ఒక్కమాటలో చెబితే- హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సాగరంగా మార్చాలన్నదే మా దృఢ సంకల్పం.

అధ్యక్ష మహాశయా!

రెండు దేశాల సంబంధాలు గడచిన యాభయ్యేళ్లలో ప్రగాఢ విశ్వాసం, ఉమ్మడి ప్రగతితో ముడిపడి సాగాయి. అదేవిధంగా మరో 50 సంవత్సరాల పాటు నవ్యావిష్కరణలు,  సుస్థిరత, సమష్టి శ్రేయస్సుకు చిహ్నంగా కొనసాగుతాయి.

భారత్‌తో మీ స్నేహానికి, ద్వైపాక్షిక సంబంధాలపై మీ అకుంఠిత నిబద్ధతకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు..

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఆగష్టు 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision