ఇజ్రాయెల్ గౌరవ ప్రధానమంత్రి, నా మిత్రుడు  నెతన్యాహు,

శ్రీమతి నెతన్యాహు,

ఇరు దేశాల ప్రముఖ ప్రతినిధులు, 

మీడియా మిత్రులారా,

నమస్కారం!

"షలోమ్!" 

నాకు,  భారత ప్రతినిధి బృందానికి అందించిన సాదర స్వాగతానికి మరోసారి ప్రధానమంత్రి నెతన్యాహుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  

తొమ్మిదేళ్ల క్రితం, ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా నిలిచే గౌరవం నాకు దక్కింది. ఈ చారిత్రక ఇజ్రాయెల్ గడ్డపై మరోసారి అడుగు పెట్టడం నాకు గర్వకారణం.  ఇంకా అత్యంత భావోద్వేగపూరితమైన క్షణంగా అనిపిస్తోంది.

 

నిన్న, నాకు ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించే గొప్ప అవకాశం కూడా లభించింది. ఆ సందర్భంలో, నన్ను 'మెడల్ ఆఫ్ ద నెసెట్' తో గౌరవించారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందించినందుకు నెసెట్‌కు, గౌరవ స్పీకర్‌కు, నా మిత్రుడు ప్రధానమంత్రి నెతన్యాహుకు, ఇజ్రాయెల్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  ఈ గుర్తింపును నేను 140 కోట్ల మంది భారత ప్రజలకు,  భారత్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న చెక్కుచెదరని స్నేహానికి అంకితం చేస్తున్నాను.

మిత్రులారా,

నేటి సమావేశంలో, రెండు దేశాల సహకారానికి కొత్త దిశను,  మరింత వేగాన్ని అందించడంపై మేం చర్చించాం. మన ఆర్థిక భాగస్వామ్యం వృద్ధికి, ఆవిష్కరణలకు,  ఉమ్మడి శ్రేయస్సుకు ఒక చోదక శక్తిలా  నిరంతరం ఉపయోగపడుతోంది.

పరస్పర పెట్టుబడులను మరింత ప్రోత్సహించడానికి  మనం గత ఏడాది ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. అలాగే, త్వరలోనే ఇరు దేశాలకు ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా ఖరారు చేస్తాం.

సాంకేతికతే మన భవిష్యత్తు భాగస్వామ్యానికి ప్రధాన కేంద్రం. కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీస్ , కీలక ఖనిజాల వంటి రంగాలలో సహకారానికి సరికొత్త వేగాన్ని అందించేందుకు ఈరోజు మేం  ఒక 'క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్టనర్‌షిప్' ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

ఇజ్రాయెల్‌లో యూపీఐ వినియోగాన్ని అనుమతించే ఒప్పందం కుదిరినందుకు నాకు సంతోషంగా ఉంది. డిజిటల్ ఆరోగ్య రంగంలో కూడా మన అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా మన రెండు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మేం కట్టుబడి ఉన్నాం.

 

రక్షణ రంగంలో దశాబ్దాలుగా మన మధ్య నమ్మకమైన సహకారం కొనసాగుతోంది. గత ఏడాది కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఈ భాగస్వామ్యానికి సరికొత్త కోణాలను జోడించింది. ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ దిశగా మనం కలిసి ముందడుగు వేయాలి. 

అదే సమయంలో పౌర అణుశక్తి,  అంతరిక్షం వంటి రంగాలలో కూడా మన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి.

మిత్రులారా,

రెండు దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సహకారానికి సుదీర్ఘమైన, విజయవంతమైన చరిత్ర ఉంది.  ఈ భాగస్వామ్యం భవిష్యత్తుకు అనుగుణమైన దిశను అందించాలని నేడు మేం  నిర్ణయించుకున్నాం. 

ఇజ్రాయెల్ సహకారంతో భారత్ లో ఏర్పాటయిన ప్రతిభా కేంద్రాలు (సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్)  నేడు మన స్నేహానికి అత్యుత్తమ ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటి విజయం అందించిన ఉత్సాహంతో, ఈ కేంద్రాల సంఖ్యను 100కి విస్తరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 

ఈ సహకారాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ, ప్రతిభా గ్రామాల (విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్)  రూపకల్పన దిశగా మేం కృషి చేస్తున్నాం. ఈ చొరవ ద్వారా ఇజ్రాయెల్ సాంకేతికతను భారతదేశంలోని గ్రామాలకు చేరవేసి, లక్షలాది మంది రైతుల ఆదాయాన్ని,  ఉత్పాదకతను గణనీయంగా పెంపొందిస్తాం. 

భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన సాగు పరిష్కారాలను  కూడా మేం ఉమ్మడిగా అభివృద్ధి చేస్తాం. భారత్ లో "ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్"  స్థాపన ఈ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక బలమైన పునాదిని అందిస్తుంది.

మిత్రులారా,

మన ప్రజల మధ్య ఉన్న సంబంధాలు మన బంధానికి ఒక ముఖ్యమైన స్తంభం వంటివి. 2023లో కుదుర్చుకున్న 'మ్యాన్‌పవర్ మొబిలిటీ అగ్రిమెంట్' ద్వారా, ఇజ్రాయెల్‌లోని నిర్మాణ, సంరక్షణ (కేర్‌గివింగ్)  రంగాలకు భారత్ గణనీయమైన సహకారాన్ని అందించింది. భారతీయ కార్మికులు తమ కష్టపడే తత్వం, నిబద్ధత,  నైపుణ్యం ద్వారా ఇక్కడ నమ్మకాన్ని గెలుచుకున్నారు.

 

ఈ సహకారాన్ని వాణిజ్యం, సేవల వంటి ఇతర రంగాలకు కూడా విస్తరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మన రెండు దేశాల యువతను, పరిశోధకులను,  ఆవిష్కర్తలను అనుసంధానించడం మా ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి. ఈ దిశగా,  నేడు 'ఇండియా-ఇజ్రాయెల్ అకడమిక్ ఫోరమ్' ను ఏర్పాటు చేస్తున్నాం. 

మిత్రులారా,

ప్రాంతీయ,  ప్రపంచవ్యాప్త అంశాలపై కూడా మేం విస్తృతమైన చర్చలు జరిపాం. ప్రాంతీయ అనుసంధానతను  ప్రోత్సహించే క్రమంలో ఇండియా- మధ్య ప్రాచ్య -యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ),   ఇండియా-ఇజ్రాయెల్-యూఏఈ-యూఎస్ఏ (ఐ2యూ2) ప్రాజెక్టులపై సరికొత్త ఉత్సాహంతో మేం ముందుకు వెడతాం. 

ఉగ్రవాదాన్ని, దానికి మద్దతు ఇచ్చే వారిని వ్యతిరేకించడంలో మేం భుజం భుజం కలిపి నిలబడ్డాం. భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతాం. 

పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత నేరుగా భారత భద్రతా ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల, మొదటి నుంచీ మేము చర్చలకు,  సమస్యల శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తున్నాం. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) , మొత్తం మానవాళి ఆకాంక్ష.

భారత  వైఖరి స్పష్టంగా ఉంది. 

మానవాళి ఎన్నటికీ సంఘర్షణలకు బాధితులు కాకూడదు. 'గాజా శాంతి ప్రణాళిక' శాంతి దిశగా ఒక మార్గాన్ని తెరిచింది. ఈ ప్రయత్నాలకు భారత్ తన పూర్తి మద్దతును ప్రకటించింది. భవిష్యత్తులో కూడా మేం అన్ని దేశాలతో చర్చలను,  సహకారాన్ని కొనసాగిస్తాం.

నా ప్రియ మిత్రమా,

మీ ఆదరాభిమానాలు,  సాదర ఆతిథ్యం నా పర్యటనను నిజంగా చిరస్మరణీయం చేశాయి. మీ నుంచి,  ఇజ్రాయెల్ ప్రజల నుంచి నాకు లభించిన ఈ అనురాగానికి, సద్భావనకు, గౌరవానికి  మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  

చాలా ధన్యవాదాలు (తోడా రబ్బా). 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India enters second half of 2026 with several encouraging economic signals: Report

Media Coverage

India enters second half of 2026 with several encouraging economic signals: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 ఆగష్టు 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi