ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ప్రముఖ అతిథులందరినీ ఆయన స్వాగతించారు. ఈ ఫోరం జరుగుతున్న సమయం "అత్యంత తగిన సమయం"గా పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. తగిన సమయంలో ఈ సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గత వారం తాను ఎర్రకోట వేదికగా తదుపరి తరం సంస్కరణల గురించి మాట్లాడినట్లు గుర్తుచేసిన ప్రధానమంత్రి.. ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఈ సదస్సు మరింత శక్తిమంతం చేస్తోందన్నారు.
ప్రపంచ పరిస్థితులు.. భౌగోళిక-ఆర్థిక అంశాలపై ఈ వేదికలో విస్తృత చర్చలు జరిగాయన్న ప్రధానమంత్రి.. ప్రపంచస్థాయి కోణంలో చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందనీ.. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వృద్ధికి భారత్ అందిస్తున్న సహకారం సమీప భవిష్యత్తులో దాదాపు 20 శాతానికి చేరుకుంటుందన్న నిపుణుల అంచనాలను శ్రీ నరేంద్ర మోదీ ఈ సంద్భంగా ఉటంకించారు. గత దశాబ్దంలో సాధించిన స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత వృద్ధి.. ఆర్థిక సుస్థిరతే కారణమని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి వంటి తీవ్రమైన సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక లోటులో 4.4 శాతం తగ్గుదలను అంచనా వేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు. భారతీయ కంపెనీలు మూలధన మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో నిధులను సేకరిస్తున్నాయనీ.. భారతీయ బ్యాంకులు గతంలో కంటే బలంగా ఉన్నాయని.. అలాగే ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉందని.. వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. భారత కరెంట్ ఖాతా లోటు నియంత్రణలో ఉందని, ఫారెక్స్ నిల్వలూ బలంగా ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి నెలా లక్షలాది దేశీయ పెట్టుబడిదారులు క్రమానుగత పెట్టుబడి ప్రణాళికల (ఎస్ఐపీల) ద్వారా మార్కెట్‌లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నప్పుడే దాని ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తాను దీని గురించి వివరంగా చర్చించానన్న ప్రధానమంత్రి.. ఆ అంశాలను పునరావృతం చేయకపోయినా, స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత జరిగిన పరిణామాలు భారత వృద్ధి తీరును వివరిస్తున్నాయని పేర్కొన్నారు. తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఒక జూన్ నెలలోనే ఈపీఎఫ్ఓ డేటాబేస్‌లో అత్యధికంగా 22 లక్షల ఉద్యోగాలు అధికారికంగా నమోదయ్యాయని తెలిపారు. 2017 తర్వాత భారత రిటైల్ ద్రవ్యోల్బణం అత్యల్ప స్థాయిలో ఉందని.. భారత విదేశీ మారక నిల్వలు ఎప్పుడూలేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. 2014లో భారతదేశ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యం సుమారు 2.5 గిగావాట్లుగా ఉండగా.. తాజా గణాంకాల ప్రకారం ఈ సామర్థ్యం ఇప్పుడు 100 గిగావాట్లకు చేరిందన్నారు. ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచ విమానాశ్రయాల ఎలైట్ హండ్రెడ్-మిలియన్-ప్లస్ క్లబ్‌లో చేరడంతో పాటు దాని వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం ఇప్పుడు 100 మిలియన్లను దాటిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక సమూహంలో ఉన్న ఆరు విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయం ఒకటని ప్రధానమంత్రి వివరించారు.
ఇటీవల ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ భారత క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇది సాధ్యమైందన్నారు. “భారత్ తన అద్భుత సామర్థ్యం.. బలం ద్వారా ప్రపంచ విశ్వాసానికి మూలంగా కొనసాగుతోంది” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
అవకాశాలను అందిపుచ్చుకోనప్పుడు అవి ఎలా చేదాటిపోతాయో వివరించే "బస్సు అందుకోలేని" ఉదాహరణను ప్రస్తావిస్తూ.. దేశంలోని మునుపటి ప్రభుత్వాలు సాంకేతికత, పారిశ్రామిక రంగాల్లో అనేక అవకాశాలను చేజేతులా వదులుకున్నాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదనీ.. ప్రజాస్వామ్యంలో తులనాత్మక విశ్లేషణ తరచుగా పరిస్థితిని మరింత సమర్థంగా స్పష్టం చేయడానికి సహాయపడుతుందన్నారు.
గత ప్రభుత్వాలు దేశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో అస్తవ్యస్తంగా మార్చాయని.. ఎన్నికలకు మించి ఆలోచించే దృక్పథం వారికి లేదని ప్రధానమంత్రి విమర్శించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యమని వారు భావించారనీ.. అవసరమైనప్పుడు దానిని దిగుమతి చేసుకోవచ్చనే నమ్మకంతో ఆ ప్రభుత్వాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ మనస్తత్వం కారణంగానే భారత్ అనేక దేశాల కంటే సంవత్సరాలుగా వెనుకబడిందన్నారు. పదే పదే కీలకమైన అవకాశాలను కోల్పోయిన క్రమంలో అభివృద్ధి బస్సును వారు అందుకోలేకపోయారన్న శ్రీ నరేంద్ర మోదీ... కమ్యూనికేషన్ రంగాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యుగం ప్రారంభమైన సమయంలో నాటి ప్రభుత్వం అనిశ్చితంగా ఉందన్నారు. 2జీ యుగంలో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవేనని, భారత్ ఆ బస్సును కూడా నాడు అందుకోలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. 2జీ, 3జీ, 4జీ సాంకేతికతల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఎంతకాలం కొనసాగగలదని ప్రధానమంత్రి ప్రశ్నించారు. 2014 తర్వాత భారత్ తన విధానాన్ని పూర్తిగా మార్చుకుని బస్సును అందుకోవడం కాకుండా.. ఏకంగా బస్సును నడిపే స్థానం తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ తన మొత్తం 5జీ స్టాక్‌ను దేశీయంగానే అభివృద్ధి చేసిందని ప్రకటించిన శ్రీ నరేంద్ర మోదీ.. మేడ్-ఇన్-ఇండియా 5జీని రూపొందించడమే కాకుండా దానిని దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా అమలు చేసిందని తెలిపారు. “భారత్ ఇప్పుడు మేడ్-ఇన్-ఇండియా 6జీ సాంకేతికత దిశగా కృషి చేస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

50-60 సంవత్సరాల కిందటే సెమీ కండక్టర్ల తయారీని భారత్ ప్రారంభించాల్సి ఉండగా.. ఆ బస్సును కూడా అప్పుడు అందుకోలేకపోయారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చాలా సంవత్సరాలు అదే పరిస్థితి కొనసాగిందని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇప్పుడు మారిందనీ, దేశంలో సెమీ కండక్టర్ల సంబంధిత కర్మాగారాలు రావడం ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భారత అంతరిక్ష రంగంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. 2014కి ముందు భారత అంతరిక్ష మిషన్ల సంఖ్య, పరిధి పరిమితంగా ఉండేవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో పెద్ద దేశాలు అంతరిక్ష అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తరుణంలో భారత్ వెనుకబడి ఉండలేకపోయిందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టడం.. ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి అనుమతించడం వంటి చర్యలు చేపట్టినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.1979 నుంచి 2014 వరకు భారత్ 35 సంవత్సరాల్లో కేవలం 42 అంతరిక్ష మిషన్లు మాత్రమే నిర్వహించిందని ఆయన వివరించారు. గత పదకొండు సంవత్సరాల్లో భారత్ 60కి పైగా మిషన్లను పూర్తి చేసిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. రాబోయే కాలంలో చేపట్టనున్న అనేక మిషన్లు వరుసలో ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సంవత్సరం భారత్ స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని సాధించిందనీ, భవిష్యత్ మిషన్ల కోసం ఇది కీలకం కానుందని ఆయన ప్రకటించారు. గగన్‌యాన్ మిషన్ కింద భారత్ తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతోందని, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అనుభవం ఈ ప్రయత్నంలో గొప్ప సహాయకారిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
"అంతరిక్ష రంగానికి కొత్త శక్తిని అందించడం కోసం దానిని అన్ని అడ్డంకుల నుంచి విముక్తి చేయడం చాలా అవసరం" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం కోసం మొదటిసారిగా స్పష్టమైన నియమాలు రూపొందించామన్నారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను మొదటిసారిగా సరళీకరించడంతో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపును తొలిసారిగా పారదర్శకంగా పూర్తి చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో అంతరిక్ష రంగ అంకుర సంస్థల కోసం ప్రత్యేకంగా రూ 1,000 కోట్ల వెంచర్ మూలధనాన్ని అందించినట్లు ఆయన ప్రకటించారు.
"చేపట్టిన సంస్కరణల విజయాన్ని భారత అంతరిక్ష రంగం ఇప్పుడు చూస్తోంది. 2014లో దేశంలో ఒకే ఒక అంతరిక్ష రంగ అంకురసంస్థ ఉండగా.. నేడు వాటి సంఖ్య 300కి పైగా ఉంది" అని ప్రధానమంత్రి వివరించారు. కక్ష్యలో భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
"ఒక్కో అడుగేస్తూ నిదానంగా సాధించే మార్పు భారత లక్ష్యం కాదు.. అత్యంత వేగంగా దూసుకెళ్తూ మార్పును సాధించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోంది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశంలో సంస్కరణలు తప్పనిసరి పరిస్థితులు.. సంక్షోభాల నివారణ కోసం చేపడుతున్నవి కాదని ఆయన పేర్కొన్నారు. భారత్ నిబద్ధత, దృఢ నిశ్చయానికి మన సంస్కరణలు ప్రతిబింబించాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ రంగం గురించి విడిగా లోతైన సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబిస్తుందన్న శ్రీ నరేంద్ర మోదీ.. ఆయా రంగాల్లో సంస్కరణలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సంస్కరణల కొనసాగింపును ప్రతిబింబిస్తున్నాయన్న ప్రధానమంత్రి.. ప్రతిపక్షాలు అనేక ఆటంకాలు కలిగించినప్పటికీ ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జన్ విశ్వాస్ 2.0 చొరవను విశ్వాసం ఆధారితమైన, ప్రజానుకూలమైన పరిపాలనకు సంబంధించిన ఒక ప్రధాన సంస్కరణగా ఆయన అభివర్ణించారు. జన్ విశ్వాస్ మొదటి ఎడిషన్ కింద దాదాపు 200 చిన్నపాటి నేరాలను నేరాల జాబితా నుంచి తొలగించామని గుర్తుచేశారు. రెండో ఎడిషన్‌లోనూ 300కి పైగా చిన్నపాటి నేరాలనూ తాజాగా నేరాల జాబితా నుంచి తొలగించామని ఆయన ప్రకటించారు. 60 సంవత్సరాలుగా మారకుండా ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఈ సమావేశాల సందర్భంగా సంస్కరించామని, ఈ చట్టం ఇప్పుడు ఎంతో సరళీకృతం అయిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గతంలో చట్టంలోని భాష న్యాయవాదులు.. చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలిగేలా ఉండేదన్న ప్రధానమంత్రి.. “ఇప్పుడు, ఆదాయపు పన్ను బిల్లు సాధారణ పన్ను చెల్లింపుదారులకు కూడా సులభంగా అర్థమయ్యే భాషలో రూపొందించాం. ఇది పౌరుల ప్రయోజనాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని వ్యాఖ్యానించారు.
గనుల చట్టాల వంటి అనేక చట్టాలకు గణనీయ సవరణలు చేసిన ఇటీవలి వర్షాకాల సమావేశాల గురించి మాట్లాడుతూ.. వలసరాజ్యాల కాలం నాటి నౌకాయానం, ఓడరేవుల నియంత్రణ చట్టాలను కూడా ఈ సమావేశాల్లో సవరించామని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సంస్కరణలు భారత జల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని.. నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రీడా రంగంలో కూడా నూతన సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నిర్వహణకు భారత్ సిద్ధమవుతోందనీ.. సమగ్ర క్రీడా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ దార్శనికతకు మద్దతుగా ప్రభుత్వం ఖేలో భారత్ నీతి పేరుతో నూతన జాతీయ క్రీడా విధానాన్ని ప్రారంభించినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
"ఇప్పటికే సాధించిన లక్ష్యాలతో సంతృప్తి చెందడం నా స్వభావం కాదు. సంస్కరణలకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. మా ప్రభుత్వం ఈ మార్గంలో మరింత ముందుకు సాగాలని నిశ్చయించుకుంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సంస్కరణల ఆయుధాలను సమగ్రంగా సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి బహుళ రంగాల్లో కృషి జరుగుతోందన్నారు. అనవసరమైన చట్టాలను రద్దు చేయడం, నిబంధనలు.. విధానాలను సరళీకరించడం వంటి కీలక చర్యలను ప్రధానమంత్రి వివరించారు. విధానాలు, ఆమోదాలను డిజిటలైజ్ చేస్తున్నామనీ, అనేక నిబంధనలను నేరరహితం చేస్తున్నామని ఆయన వివరించారు. "జీఎస్టీ విధానంలో ఒక పెద్ద సంస్కరణ చేపట్టనున్నాం.. ఈ ప్రక్రియ దీపావళి నాటికి పూర్తవుతుంది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. దీని ద్వారా జీఎస్టీ వ్యవస్థ మరింత సరళతరం అవుతుందనీ, ధరలు కూడా తగ్గుతాయని ప్రకటించారు.

ఈ తదుపరి తరం సంస్కరణలు అనే ఆయుధాలు దేశం అంతటా తయారీలో పెరుగుదలకు దారితీస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మార్కెట్ డిమాండు పెరుగుతోందనీ.. పరిశ్రమలు కొత్త శక్తిని పొందుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణల ఫలితంగా జీవన సౌలభ్యం.. వ్యాపార సౌలభ్యం రెండూ మెరుగుపడతాయని ధ్రువీకరిస్తూ, కొత్త ఉపాధి అవకాశాలూ అందుబాటులోకి వస్తాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. స్వయంసమృద్ధ భారత్.. అభివృద్ధి చెందిన భారత్ కోసం పునాది అవుతుందని వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్ భారత్‌ను వేగం, స్థాయి, పరిధి అనే మూడు కీలక పారమితుల ఆధారంగా అంచనా వేయాలన్నారు. మహమ్మారి సమయంలో భారత్ ఈ వేగం, స్థాయి, పరిధి అనే మూడింటినీ ప్రదర్శించిందని గుర్తుచేసుకుంటూ.. అవసరమైన వస్తువులకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిన తీరును, ప్రపంచ సరఫరా వ్యవస్థ నిలిచిపోయిన విధానాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అవసరమైన వస్తువులను దేశీయంగా తయారు చేయడానికి భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా పెద్ద మొత్తంలో పరీక్షా కిట్లు, వెంటిలేటర్లను ఉత్పత్తి చేసిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇది భారత్ వేగాన్ని సూచిస్తోందన్నారు. దేశంలోని ప్రతి మూలలో పౌరులకు భారత్‌లో తయారైన 220 కోట్లకు పైగా టీకాలను ఉచితంగా అందించడం భారత స్థాయిని తెలియజెప్పిందని పేర్కొన్నారు. లక్షలాది మందికి వేగంగా టీకాలు అందించడం కోసం భారత్ కోవిన్ వేదికను అభివృద్ధి చేసిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఇది భారత పరిధిని ప్రతిబింబించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక వ్యవస్థ అయిన కో-విన్ కారణంగానే భారత్ తన టీకా డ్రైవ్‌ను రికార్డు సమయంలో పూర్తి చేయగలిగిందని ఆయన ధ్రువీకరించారు.
ఇంధన రంగంలోనూ భారత్ వేగం, స్థాయి, పరిధిని ప్రపంచమంతా చూస్తోందనీ, 2030 నాటికి తన మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేయడమే భారత్ లక్ష్యమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. 2025లోనే అంటే షెడ్యూల్ కంటే అయిదు సంవత్సరాల ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించామని ఆయన ప్రకటించారు.

గతంలోని విధానాలు దిగుమతులపైనే ఎక్కువగా దృష్టి సారించాయని, స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణమని ప్రధానమంత్రి విమర్శించారు. నేడు స్వావలంబన సాధించిన భారత్ ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరంలో భారత్ రూ. 4 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసిందని ఆయన తెలిపారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన 800 కోట్ల టీకా డోసుల్లో 400 కోట్లు భారత్‌లోనే తయారయ్యాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాతి ఆరున్నర దశాబ్దాల్లో భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దాదాపు రూ. 35,000 కోట్లకు చేరుకున్నాయని, అయితే నేడు ఎగుమతుల విలువ సుమారు రూ. 3.25 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
2014 వరకు భారత ఆటోమొబైల్ ఎగుమతులు సంవత్సరానికి సుమారు రూ. 50,000 కోట్లుగా ఉన్నాయన్న శ్రీ నరేంద్ర మోదీ.. నేడు ఒకే సంవత్సరంలో రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఆటోమొబైల్స్‌ను భారత్ ఎగుమతి చేస్తోందని స్పష్టం చేశారు. మెట్రో కోచ్‌లు, రైలు కోచ్‌లు, రైలింజన్లను కూడా భారత్ ఎగుమతి చేయడం ప్రారంభించిందని ఆయన వ్యాఖ్యానించారు. 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడం ద్వారా భారత్ మరో విజయాన్ని సాధించబోతోందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ విజయానికి సంబంధించిన ఒక ప్రధాన కార్యక్రమం ఈనెల 26న జరుగుతుందని ఆయన ప్రకటించారు.
దేశ పురోగతికి పరిశోధన మూలస్తంభమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి.. దిగుమతి చేసుకున్న పరిశోధనలు మనుగడకు సరిపోవచ్చు, కానీ అవి భారత ఆకాంక్షలను నెరవేర్చలేవని వ్యాఖ్యానించారు. పరిశోధన రంగంలో అత్యవసరత, కేంద్రీకృత దృక్పథం అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పరిశోధనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వేగంగా కృషి చేస్తూ.. అవసరమైన విధానాలు, వేదికలను నిరంతరం అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు. 2014తో పోలిస్తే పరిశోధనాభివృద్ధిపై ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని, దాఖలు చేసిన పేటెంట్ల సంఖ్య 2014 నుంచి 17 రెట్లు పెరిగిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. సుమారు 6,000 ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనాభివృద్ధి విభాగాలను స్థాపించామని ప్రధానమంత్రి ప్రకటించారు. 'ఒకే దేశం-ఒకే సబ్‌స్క్రిప్షన్' కార్యక్రమం ద్వారా ప్రపంచ పరిశోధన పత్రికలు మన విద్యార్థులకు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రూ. 50,000 కోట్ల బడ్జెట్‌తో జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రూ.1 లక్ష కోట్ల విలువైన పరిశోధన..అభివృద్ధి..ఆవిష్కరణ పథకాన్ని కూడా ఆమోదించామని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, వ్యూహాత్మక రంగాల్లో కొత్త పరిశోధనలకు మద్దతు ఇవ్వడం తమ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
ఈ సదస్సుకు హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పారిశ్రామిక, ప్రైవేట్ రంగాల నుంచి చురుకైన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, క్వాంటం టెక్నాలజీ, బ్యాటరీ స్టోరేజ్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలు, పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. "ఇటువంటి ప్రయత్నాలు అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతకు కొత్త శక్తిని అందిస్తాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
"సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం మార్గనిర్దేశంలో భారత్ ఇప్పుడు ప్రపంచ వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడే స్థితిలో ఉంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ నిలకడగా ఉన్న నీళ్లలో రాళ్ళు విసిరేందుకు ఇష్టపడదని, వేగంగా ప్రవహించే ప్రవాహాలను మళ్లించే శక్తిని కలిగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి.. భారత్ ఇప్పుడు కాల గమనాన్ని కూడా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పునరుద్ఘాటిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
India is the world's fastest-growing major economy and is soon set to become the third-largest globally. pic.twitter.com/vKcu48Xd1e
— PMO India (@PMOIndia) August 23, 2025
India, with its resilience and strength, stands as a beacon of hope for the world. pic.twitter.com/FOWLs7ODkk
— PMO India (@PMOIndia) August 23, 2025
Infusing new energy into India's space sector. pic.twitter.com/PgWNxbnoxi
— PMO India (@PMOIndia) August 23, 2025
We are moving ahead with the goal of a quantum jump, not just incremental change. pic.twitter.com/8qjKz5KKnD
— PMO India (@PMOIndia) August 23, 2025
For us, reforms are neither a compulsion nor crisis-driven, but a matter of commitment and conviction. pic.twitter.com/J7BOsB1UUs
— PMO India (@PMOIndia) August 23, 2025
It is not in my nature to be satisfied with what has already been achieved. The same approach guides our reforms: PM @narendramodi pic.twitter.com/ve26wDwXHr
— PMO India (@PMOIndia) August 23, 2025
A major reform is underway in GST, set to be completed by this Diwali, making GST simpler and bringing down prices. pic.twitter.com/kg1hEhtXyL
— PMO India (@PMOIndia) August 23, 2025
A Viksit Bharat rests on the foundation of an Aatmanirbhar Bharat. pic.twitter.com/nquCp1GU2U
— PMO India (@PMOIndia) August 23, 2025
'One Nation, One Subscription' has simplified access to world-class research journals for students. pic.twitter.com/wSCrguVhOI
— PMO India (@PMOIndia) August 23, 2025


