· సిక్కింలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని
· సిక్కిం దేశానికి గర్వకారణం
· గత దశాబ్ద కాలంలో మా ప్రభుత్వం భారత అభివృద్ధి ప్రస్థానంలో ఈశాన్య రాష్ట్రాలను కేంద్ర స్థానంలో నిలిపింది
· ‘యాక్ట్ ఫాస్ట్’ స్ఫూర్తితో ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం
· భారత పురోగతిలో సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు సువర్ణాధ్యాయంగా నిలుస్తున్నాయి
· సిక్కింను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి
· మున్ముందు అంతర్జాతీయ క్రీడా నిలయంగా ఆవిర్భవించనున్న భారత్.. ఈ స్వప్నాన్ని సాకారం చేయడంలో ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం యువశక్తిది కీలక పాత్ర
· భారత్‌కే కాదు, యావత్‌ప్రపంచానికీ పర్యావరణ హిత నమూనా రాష్ట్రంగా సిక్కిం నిలవాలన్నది మా స్వప్నం: ప్రధాని

గ్యాంగ్‌టక్‌లో నేడు జరిగిన ‘సిక్కిం@50’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘లక్ష్యానికి తగిన పురోగతి, వృద్ధిని పెంపొందించే ప్రకృతి’ అన్న ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేకమైన రోజున  ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందోత్సాహాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. త్వరలోనే సిక్కింలో పర్యటించి వారి విజయాలు, వేడుకల్లో భాగమవుతానని మాటిచ్చారు. గడిచిన 50 ఏళ్లలో వారు సాధించిన విజయాలను చాటే రోజుగా దీనిని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేయడంలో సిక్కిం ముఖ్యమంత్రి, ఆయన బృందం ఉత్సాహంతో వ్యవహరించారంటూ ప్రశంసించారు. సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

“50 ఏళ్ల కిందట సిక్కిం తనకంటూ ఓ ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్దేశించుకుంది. సిక్కిం ప్రజలు భౌగోళికంగా మాత్రమే కాదు, భారతీయ ఆత్మతో అనుసంధానమయ్యారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ తమ గళాన్ని వినిపించే అవకాశం ఉండి, హక్కులను కాపాడితేనే అభివృద్ధి దిశగా సమానావకాశాలు లభిస్తాయని నాడు అందరూ విశ్వసించారన్నారు. నేడు సిక్కింలోని ప్రతి కుటుంబంలో ఆ నమ్మకం మరింత బలోపేతమైందన్నారు. ప్రజల విశ్వాసం ఫలితంగా సిక్కిం సాధించిన విశేష పురోగతిని దేశమంతా చూసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా ఆ రాష్ట్రం పురోగతితోపాటు ప్రకృతి విషయంలోనూ ఆదర్శవంతంగా మారిందని చెప్తూ.. ‘‘సిక్కిం దేశానికి గర్వకారణం’’ అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం విస్తృతమైన జీవవైవిధ్యానికి నెలవుగా మారిందని, 100 శాతం సేంద్రీయ రాష్ట్ర హోదాను సాధించిందని, సాంస్కృతిక- వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిందని చెప్పారు. నేడు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో సిక్కిం కూడా ఒకటని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ విజయాలు సిక్కిం ప్రజల సామర్థ్యాలకు నిదర్శనమని ఆయన పునరుద్ఘాటించారు. గత అయిదు దశాబ్దాలుగా భారత నేలను దేదీప్యం చేసేలా అనేక తారలు ఇక్కడ వెలుగొందాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. సుసంపన్నమైన సంస్కృతి, సమృద్ధి దిశగా సిక్కింలోని ప్రతి సమూహమూ కృషి చేస్తోందని కొనియాడారు.
 

2014 నుంచి అందరూ అభివృద్ధి చెందే విధంగా అందరి సహకారంతో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే సూత్రాన్ని తమ ప్రభుత్వం అనుసరిస్తోందని గుర్తు చేశారు. ఓ ప్రాంతం పురోగతి సాధిస్తూ, మరొకటి వెనుకబడిపోకుండా సమతౌల్యంతో కూడిన అభివృద్ధి ద్వారానే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగగలదని ప్రధానమంత్రి వివరించారు. “దేశంలోని ప్రతి రాష్ట్రానికి, ప్రాంతానికి తనదైన సొంత బలాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా నిలిపింది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘యాక్ట్ ఫాస్ట్’ స్ఫూర్తితో ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఈశాన్య పెట్టుబడుల సదస్సును గుర్తు చేసిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలూ ప్రధాన పెట్టుబడిదారులూ పాల్గొన్నారని, సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాల్లో వారు గణనీయమైన పెట్టుబడులను ప్రకటించారని గుర్తు చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇది సిక్కింతోపాటు ఈశాన్య ప్రాంత యువతకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

“సిక్కిం భవిష్యత్ ప్రస్థానం దిశగా ఓ సంగ్రహావలోకనంగా నేటి కార్యక్రమం నిలుస్తోంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సిక్కిం అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులను ప్రారంభించామని, పలు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఆరోగ్య రక్షణ, పర్యాటకం, సాంస్కృతిక, క్రీడా సదుపాయాలను మెరుగుపరుస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులను విజయవంతంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

“భారత అభివృద్ధి గాథలో ఈశాన్య రాష్ట్రాలన్నింటితోపాటు సిక్కిం ఓ సువర్ణాధ్యాయంగా నిలుస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఢిల్లీకి దూరంగా ఉండడం పురోగతికి అడ్డంకిగా ఉన్న ఈ ప్రాంతం.. ఇప్పుడు అవకాశాలకు కొత్త అవకాశాలను సుగమం చేస్తోందన్నారు. అనుసంధానాన్ని మెరుగుపరచడమే ఈ సమూల మార్పునకు ప్రధాన కారణమని, సిక్కిం ప్రజలు దీనికి ప్రత్యక్ష సాక్షులని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రయాణం చేయడం ఒకప్పుడు పెద్ద సవాలుగా ఉండేదని ప్రధానమంత్రి గుర్తు చేశారు. అయితే, గత దశాబ్ద కాలంలో పరిస్థితిలో గణనీయమైన మార్పులొచ్చాయన్నారు. ఈ కాలంలో సిక్కింలో దాదాపు 400 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను నిర్మించారని గుర్తు చేశారు. గ్రామాల్లో వందల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించారు. అటల్ సేతు నిర్మాణం వల్ల డార్జిలింగ్‌తో సిక్కిం అనుసంధానం మెరుగుపడిందని, సిక్కింను కాలింపాంగ్‌తో కలిపే రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీ మోదీ తెలిపారు. బాగ్డోగ్రా-గ్యాంగ్‌టక్ ఎక్స్‌ప్రెస్ రహదారి సిక్కింకు రాకపోకలను మరింత సులభతరం చేస్తుందని ఆయన అన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారిని గోరఖ్‌పూర్ - సిలిగురి ఎక్స్‌ప్రెస్ రహదారితో అనుసంధానం చేసి ఇక్కడి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే ప్రణాళికలను ఆయన ప్రకటించారు.
 

అన్ని ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలను రైల్వే వ్యవస్థతో అనుసంధానించే చర్యలు శరవేగంగా జరుగుతున్నాయని, సెవోక్-రంగ్‌పో రైలు మార్గం సిక్కింను జాతీయ రైలు వ్యవస్థతో అనుసంధానిస్తుందని శ్రీ మోదీ చెప్పారు. రోడ్లు వేయలేని చోట ప్రత్యామ్నాయంగా రోప్ వేలు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. సిక్కిం ప్రజల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేలా నేడు అనేక రోప్ వే ప్రాజెక్టులను ప్రారంభించినట్టు శ్రీ మోదీ పేర్కొన్నారు. గత దశాబ్దకాలంలో నవ సంకల్పాలతో భారత్ పురోగమించిందని, ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం ప్రాధాన్యాంశంగా నిలిచిందని అన్నారు. గత 10-11 ఏళ్లలో ప్రతి రాష్ట్రంలోనూ పెద్ద పెద్ద ఆస్పత్రులను ఏర్పాటు చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఎయిమ్స్, మెడికల్ కాలేజీలను గణనీయంగా విస్తరిస్తున్న విషయాన్ని కూడా శ్రీ మోదీ వివరించారు. అత్యంత నిరుపేద కుటుంబాలకు కూడా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడం లక్ష్యంగా సిక్కిం ప్రజల కోసం 500 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఆసుపత్రుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందనీ.. అందుబాటు ధరల్లో, నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సిక్కింలో 25 వేల మందికి పైగా ఉచిత వైద్యం పొందారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వ్యక్తులందరూ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందడానికి అర్హులని ఆయన ప్రకటించారు. సిక్కిం ప్రజలు ఇకపై తమ పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి చికిత్సను ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

“పేదలు, రైతులు, మహిళలు, యువత — అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపడంలో ఈ నాలుగు వర్గాలూ మూలాధారమని, వారి సాధికారత అత్యంత కీలకమైనదని శ్రీ మోదీ పేర్కొన్నారు. వీరి బలోపేతం కోసం దేశం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. భారత వ్యవసాయ పురోగతి కోసం సిక్కిం రైతులు గణనీయమైన కృషి చేశారని ఆయన ప్రశంసించారు. సిక్కిం నుంచి సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయని చెబుతూ “వ్యవసాయాభివృద్ధి కొత్త ఒరవడిలో సిక్కిం ముందంజలో ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఇటీవల సిక్కిం నుంచి ప్రసిద్ధి చెందిన దల్లె ఖుర్సానీ మిరపను తొలిసారి ఎగుమతి చేశామని, ఈ ఏడాది మార్చిలో మొదటి సరుకు (కన్‌సైన్‌మెంట్)ను విదేశాలకు పంపామని తెలిపారు. మున్ముందు మరిన్ని ఉత్పత్తులు సిక్కిం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో భుజం భుజం కలిపి పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.
 

సిక్కిం సేంద్రియ మార్కెటును మరింత సుసంపన్నం చేసేలా కేంద్రం మరో ముందడుగు వేసిందన్న ప్రధానమంత్రి.. దేశంలో మొదటి సేంద్రీయ మత్స్య క్లస్టర్‌ను సోరెంగ్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమం సిక్కింకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపునిస్తుందని ఆయన పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంతోపాటు సేంద్రియ మత్స్య పరిశ్రమకూ సిక్కిం పేరు పొందిందన్న ప్రధానమంత్రి.. సేంద్రీయంగా పెరిగిన చేపలు, సంబంధిత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన డిమాండ్ ఉందన్నారు. ఈ పరిణామం సిక్కిం యువతకు మత్స్య రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకునే పర్యాటక ప్రదేశాలను ప్రతి రాష్ట్రమూ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో చర్చించిన అంశాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. సిక్కిం ఓ కొండ ప్రాంతంగానే కాదు, అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ‘‘సాటిలేని సామర్ధ్యం సిక్కిం సొంతం. పర్యాటకానికి సంపూర్ణమైన అవకాశాలున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. సహజ సౌందర్యం, ఆధ్యాత్మికతతోపాటు సరస్సులు, జలపాతాలు, పర్వతాలు, ప్రశాంతమైన బౌద్ధ మఠాలకు సిక్కిం నెలవుగా ఉందన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కాంచనజంగ జాతీయోద్యానవనం భారత్ మాత్రమే కాకుండా యావత్‌ప్రపంచమూ గర్వించదగ్గ వారసత్వ సంపద అని శ్రీ మోదీ పేర్కొన్నారు. నేడు కొత్త స్కైవాక్ నిర్మాణం జరుగుతోందని, గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని, అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని – ఈ ప్రాజెక్టులన్నీ సిక్కిం పురోగతిలో ఉన్నత శిఖరాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

“సాహస, క్రీడా పర్యాటకానికి సిక్కింలో అపారమైన అవకాశాలున్నాయి” అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పర్వతారోహణ, మౌంటెన్ బైకింగ్, ఎత్తైన ప్రదేశాలలో శిక్షణ వంటి కార్యకలాపాలు ఈ ప్రాంతంలో పెరుగుతాయన్నారు. కాన్ఫరెన్స్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం, కాన్సర్ట్ టూరిజాలకు నిలయంగా సిక్కింను నిలపడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ భవిష్యత్ సన్నాహకాల్లో గోల్డెన్ జూబ్లీ కన్వెన్షన్ సెంటర్ కీలకమైన అంశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గ్యాంగ్‌టక్‌లోని రమణీయమైన ప్రకృతి వేదికలపై ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు ప్రదర్శనలివ్వాలని ఆకాంక్షించారు. ప్రకృతీ సంస్కృతీ సామరస్యాన్ని సిక్కిం సంపూర్ణంగా ప్రతిబింబిస్తుందనే అభిప్రాయంతో ఏకీభవించారు. 

 

జి-20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించే సమావేశాలను ఈశాన్య ప్రాంతంలో జరపడం ఈ ప్రాంతానికున్న సత్తాను ప్రపంచానికి తెలియజెప్పే దిశగా వేసిన ఒక అడుగు అని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. సిక్కిం ప్రభుత్వం ఈ దార్శనికతకు ఎలా శీఘ్రంగా కార్యరూపాన్ని ఇస్తోందీ ఆయన ప్రస్తావిస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన శక్తిగా ఉంది, అంతేకాదు క్రీడలలో ఒక మహాశక్తి (సూపర్‌పవర్)గా మారే దశలో కూడా ఉంది అని ఆయన తెలిపారు. ఈ కలను నెరవేర్చడంలో ఈశాన్య ప్రాంత యువత, ప్రత్యేకించి సిక్కిం యువజనులు ఒక ముఖ్య పాత్రను పోషించనున్నారని ఆయన స్పష్టం చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం శ్రీ భాయిచుంగ్ భుటియా, ఒలింపిక్ క్రీడాకారుడు శ్రీ తరుణ్‌దీప్ రాయ్, క్రీడాకారుడు శ్రీ జస్‌లాల్ ప్రధాన్ వంటి వారి పేర్లను ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, సిక్కిం క్రీడా వారసత్వం ఘనమైందంటూ తన అంగీకారాన్ని వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో సిక్కింలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణం ఒక కొత్త విజేతను అందిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన చాటారు. ‘‘క్రీడలంటే వాటిలో పాల్గొనడంతోనే సరిపోదు, దృఢనిశ్చయులై గెలవాలి కూడా’’ అని శ్రీ మోదీ చెప్పారు. గాంగ్‌టక్‌లో ఏర్పాటైన కొత్త క్రీడా భవన సముదాయం భావి చాంపియన్లకు శిక్షణనిలయంగా మారనుందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా, సిక్కింపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారని స్పష్టం చేశారు. ప్రతిభను గుర్తించడం, శిక్షణనివ్వడం, సాంకేతికతను సమకూర్చడం, ఆటల పోటీలను నిర్వహించడం.. ఈ కార్యకలాపాలకు ప్రతి ఒక్క స్థాయిలో మద్దతిస్తున్నారని ఆయన ప్రధానంగా చెప్పారు. సిక్కిం యువజనుల్లోని శక్తి, ఉద్వేగం భారత్‌ను ఒలింపిక్ కీర్తిని సొంతం చేసుకొనే దిశగా నడిపించగలవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

‘‘పర్యాటక రంగానికి ఉన్న శక్తి ఏమిటో సిక్కిం ప్రజలకు తెలుసని, పర్యటన అంటే అది ఒక్క వినోదానికే కాక వైవిధ్యాన్ని పండుగ చేసుకోవడం లాంటిది కూడా’’ అని ప్రధాని అభివర్ణించారు. పహల్‌గామ్‌లో జరిగిన దాడి భారతీయులొక్కరి మీదే జరిగిన దాడి కాదు, అది మానవజాతితో పాటు సోదరత్వ స్ఫూర్తి మీద జరిగిన దాడి అని ఆయన అన్నారు. ఉగ్రవాదులు అనేక కుటుంబాల సంతోషాన్ని లాక్కోవడమే కాకుండా మన దేశ ప్రజల్లో విభజన తేవాలని చూశారని ప్రధాని అన్నారు. ‘‘ఇవాళ, భారత్ అపూర్వ ఐకమత్యాన్ని ప్రపంచం గమనిస్తోంది అని ఆయన అన్నారు. ఉగ్రవాదులకూ, వారికి కొమ్ముకాసేవారికీ స్పష్టమైన సందేశాన్నివ్వడానికి దేశం ఏకతాటి మీద నిలిచింది అని శ్రీ మోదీ ప్రకటించారు. వారు భారతీయ పుత్రికల నొసటి సిందూరాన్ని తుడిచేసి వేదనను రగిలించారు, అయితే  ఆ ముష్కరులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి భారత్ తగిన విధంగా బదులిచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు.  ఉగ్రవాదుల స్థావరాల్ని నిర్మూలించడంతో పాకిస్తాన్ భారతీయ పౌరులను, జవానులను లక్ష్యాలుగా చేసుకోజూసింది, అయితే ఈ క్రమంలో పాక్ గుట్టు కాస్తా రట్టయింది అని ఆయన అన్నారు. పాకిస్తాన్ విమాన స్థావరాల్ని నేలమట్టం చేసి భారత్ దీటుగా ప్రతిస్పందించింది, దేశ వ్యూహాత్మక సత్తాను చాటిచెప్పింది అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
 

‘‘ప్రగతిపథంలో 50 సంవత్సరాల  ప్రస్థానాన్ని చేరుకున్న రాష్ట్రంగా సిక్కిం మనందరికీ ఒక ప్రేరణనిస్తోంది. ఈ అభివృద్ధి యాత్ర ఇక మరింత వేగవంతం కానుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. స్వతంత్ర దేశంగా భారత్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి అయ్యే ఘట్టానికి 2047వ సంవత్సరం సూచిక కాబోతోంది, 2047కే సిక్కిం ఏర్పడి 75 సంవత్సరాలు కూడా అవుతుంది అని ఆయన తెలిపారు. మరి ఈ మహత్తర సందర్భం వచ్చేసరికి సిక్కిం ఎలాంటి రూపును సంతరించుకోవాలి అనే విషయంలో లక్ష్యాల్ని నిర్దేశించుకోవాల్సి ఉంది అని ప్రధాని స్పష్టం చేశారు. ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల్లో సమష్టి ప్రయత్నాలు అవసరమని, సిక్కిం భవితకు ఒక మార్గసూచీని పెట్టుకొని దానిని నిర్ణీత కాలాల్లో సమీక్షిస్తుండాలని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. సిక్కిం ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నివ్వడానికి ప్రాధాన్యాన్ని కట్టబెట్టడంతో పాటు ఈ రాష్ట్రాన్ని ‘వెల్‌నెస్ స్టేట్’గా తీర్చిదిద్దాలి అని ఆయన వక్కాణించారు.  యువజనులకు మరిన్ని అవకాశాలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అంటూ ఆయన సూచించారు. ‘‘సిక్కిం యువత స్థానిక అవసరాలను తీర్చడానికి సన్నద్ధులు అయినంత మాత్రాననే సరిపోదు, ప్రపంచ అవసరాలను కూడా తీర్చడానికి వారు ముందుకు ఉరికి తీరాలి’’ అని శ్రీ మోదీ కోరారు. ప్రపంచమంతటా యువతకు అధిక గిరాకీ ఉన్న రంగాల్లో నైపుణ్యాలకు సాన పెట్టే అవకాశాలను కొత్తగా కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది అని ఆయన చెప్పారు.
 

సిక్కింను అభివృద్ధి, వారసత్వం, ప్రపంచ గుర్తింపుల పరంగా రాబోయే 25 సంవత్సరాల్లో అత్యున్నత స్థాయికి చేర్చుతామని అంతా ఉమ్మడిగా ప్రతిన పూనాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘సిక్కిం ఒక్క భారతదేశానికే కాక, పూర్తి ప్రపంచానికే హరిత ప్రధాన ఆదర్శ రాష్ట్రంగా మారాలి అన్నదే మన స్వప్నం’’ అని ప్రధానమంత్రి అన్నారు. సిక్కింలో ప్రతి ఒక్కరికీ ఓ సురక్షితమైన ఇంటిని సమకూర్చాలి అన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఇంటికీ సౌర ఆధారిత విద్యుత్తును అందించాలన్న దార్శనికతను గురించి ఆయన ప్రధానంగా చెప్పారు. ‘‘వ్యవసాయ రంగ అంకుర సంస్థల్లో, పర్యాటక  రంగ అంకుర సంస్థల్లో సిక్కిం నాయకత్వ స్థానంలో నిలవాలి, సేంద్రియ ఆహార ఎగుమతుల్లో ఈ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలి’’ అని శ్రీ మోదీ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా డిజిటల్ లావాదేవీలు జరపగలగాలి, మరి ఈ రాష్ట్రంలో వ్యర్థం నుంచి సంపదను ఆర్జించే కార్యక్రమాలు నూతన శిఖరాలకు చేరుకోవాలని కూడా ఆయన అన్నారు. ‘‘రాబోయే 25 సంవత్సరాల కాలాన్ని ఈ మహత్త్వాకాంక్షలతో కూడిన లక్ష్యాలను సాధించి, సిక్కిం ఉనికిని ప్రపంచ రంగస్థలంలో ప్రముఖంగా చాటడానికి అంకితం చేస్తున్నాం’’ అంటూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.  ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి, వారి ఘన వారసత్వానికి మెరుగులు దిద్దాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.  
 

ఈ కార్యక్రమంలో సిక్కిం గవర్నరు శ్రీ ఓమ్ ప్రకాశ్ మాథుర్, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

నేపథ్యం


సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 కీర్తివంతమైన సంవత్సరాలు పూర్తి అయిన సందర్భానికి గుర్తుగా ‘‘సిక్కింకు 50 సంవత్సరాలు: ఎక్కడైతే ప్రగతి, ప్రయోజనం కలిసి నడుస్తున్నాయో...వృద్ధిని ప్రకృతి పెంచి పోషిస్తోందో’’ (‘సిక్కిం@50: వేర్ ప్రోగ్రెస్ మీట్స్ పర్పస్ అండ్ నేచర్ నర్చర్స్ గ్రోత్’) శీర్షికన నిర్వహించిన  కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.  ‘‘సునావులో, సమృద్ధ- సమర్థ్ సిక్కిం’’ ఇతివృత్తంతో అనేక కార్యక్రమాలను ఒక సంవత్సరం పొడవునా నిర్వహించాలని సిక్కిం ప్రభుత్వం నడుం కట్టి, అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. సిక్కిం సాంస్కృతిక సమృద్ధి- సంప్రదాయాలను, ప్రాకృతిక వైభవంతో పాటు సిక్కిం రాష్ట్ర చరిత్ర సారాన్ని కళ్లకు కట్టే ఉత్సవ తరహా హంగు-ఆర్భాటాలతో ఈ కార్యక్రమాలను జరపనున్నారు.
సిక్కింలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటు కొన్నింటిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల్లో- నామ్చీ జిల్లాలో రూ.750 కోట్లకు పైగా ఖర్చయ్యే 500 పడకలు కలిగి ఉండే ఒక నూతన జిల్లా ఆసుపత్రి, గ్యాల్‌షింగ్ జిల్లాలోని పేలింగ్‌లో గల సాంగాచోలింగ్లో ప్రయాణికుల రోప్‌వే ప్రాజెక్టు, గాంగ్‌టక్ జిల్లాలోని సాంగ్‌ఖోలాలో గల అమృత్ ఉద్యాన్‌లో భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జీ విగ్రహం సహా ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక నాణేన్ని, సావనీర్ కాయిన్‌‌ను, తపాలా బిళ్లను కూడా ప్రధాని ఆవిష్కరించారు.‌

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Explains How India Overcame the West Asia Energy Crisis, Slams Opposition for Fear-Mongering

Media Coverage

PM Modi Explains How India Overcame the West Asia Energy Crisis, Slams Opposition for Fear-Mongering
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets President of the United States on the 250th anniversary of the United States' independence
July 04, 2026

The Prime Minister, Shri Narendra Modi, extended greetings to the President of the United States, Mr. Donald J. Trump, and the people of the United States on the historic occasion of the 250th anniversary of the country's independence. Shri Modi underscored the enduring strength of the India–United States partnership. He noted that the relationship between the two democracies extends beyond a strategic partnership and is anchored in shared values of democracy, the rule of law and faith in the limitless potential of their people.

The Prime Minister posted on X:

On behalf of 1.4 billion Indians, I extend my warmest congratulations to President Trump and the people of the United States on the historic 250th anniversary of your Independence.

India and the United States share more than a strategic partnership. Our shared belief in democracy, rule of law and the limitless potential of our people make our friendship a force for global good.

May the next 250 years bring even greater prosperity, peace and progress for America and take the India-US partnership to new heights.

@POTUS
@realDonaldTrump