* వికసిత భారత్‌ను నిర్మించేందుకు ఏకమైన140 కోట్ల మంది భారతీయులు: పీఎం
* మన దేశాభివృద్ధికి అవసరమైనవాటి తయారీ ఇక్కడే, భారత్‌లోనే: పీఎం
* మునుపెన్నడూ లేని విధంగా గడచిన 11 ఏళ్లలో గిరిజన సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక ప్రయత్నాలు: పీఎం
* ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు.. అది భారతీయుల విలువలు, భావోద్వేగాల ప్రతిరూపం: పీఎం

గుజరాత్‌లోని దాహోద్ లో రూ.24,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2014లో తాను మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే 26నే కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైనదని అన్నారు. దేశాన్ని నడిపించే బాధ్యతను నిర్వర్తించడంలో గుజరాత్ ప్రజలు తనకు అందించిన మద్దతును, ఆశీర్వాదాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఈ నమ్మకం, ప్రోత్సాహమే దేశానికి రేయింబవళ్లు సేవ చేయాలనే తన అంకితభావానికి ఆధారంగా నిలిచాయని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న పాత పద్దతులను వదిలించుకుని ప్రతి రంగంలోనూ దూసుకువెళ్లేలా గడచిన కొన్నేళ్లలో భారత్ అసాధారణమైన, ఊహకందని నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ఈరోజు నిరాశ, చీకటి నుంచి బయటపడి సరికొత్త విశ్వాసం, ఆశావాదం నిండిన కొత్తయుగంలోకి దేశం అడుగుపెట్టింది’’ అని చెప్పారు.

‘‘వికసిత్ భారత్‌ను నిర్మించడానికి 140 కోట్ల మంది భారతీయులు ఏకమయ్యారు’’ అని శ్రీ మోదీ అన్నారు. అవసరమైన వస్తువులను భారత్‌లోనే తయారు చేయాల్సిన ప్రాధాన్యాన్ని, ఈ సమయంలో స్వావలంబన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ స్మార్ట్ ఫోన్లు, ఆటోమొబైల్స్, బొమ్మలు, రక్షణ సామగ్రి, ఔషధాలతో సహా వివిధ రకాలు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని పేర్కొన్నారు. రైలు, మెట్రో టెక్నాలజీలను రూపొందించడం మాత్రమే కాకుండా వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోందని తెలిపారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమైన దాహోద్‌ను ఈ అభివృద్ధికి ప్రధాన ఉదాహరణగా శ్రీ మోదీ అభివర్ణించారు. దాహోద్ విద్యుత్ రైలింజన్ల కర్మాగారాన్ని ప్రధాన విజయంగా పేర్కొన్నారు. ఈ పరిశ్రమకు మూడేళ్ల క్రితం భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు ఇక్కడ మొదటి విద్యుత్ రైలింజన్ విజయవంతంగా తయారైందని హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ రైలింజన్ను ప్రారంభిస్తూ... ఇది గుజరాత్‌కు, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. వీటికి అదనంగా, రైల్వేల్లో నూరు శాతం విద్యుద్దీకరణ లక్ష్యాన్ని గుజరాత్ పూర్తి చేసిందని వెల్లడించారు. దీనిని గొప్ప మైలురాయిగా వర్ణించిన ప్రధాని, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

దాహోద్‌తో తనకు సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధాన్ని, ఈ ప్రాంతంతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దాహోద్‌ను దశాబ్దాలుగా సందర్శిస్తున్నానని, మొదట్లో సైకిల్‌పై ఈ ప్రాంతంలో తిరిగేవాడినని చెప్పారు. ఆ అనుభవాలే.. దాహోద్‌లోని సమస్యలను, ఈ ప్రాంత సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడ్డాయని వివరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనూ ఈ ప్రాంతాన్ని తరచూ సందర్శించేవాడినని, ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దాహోద్‌లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం తనకు ఎనలేని సంతృప్తి కలిగిస్తుందని, ఈ రోజు తనకు మరో అర్థవంతమైన రోజని తెలిపారు.

గడచిన 10-11 ఏళ్లుగా భారతీయ రైల్వే రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని శ్రీ మోదీ తెలిపారు. మెట్రో సేవల విస్తరణ, సెమీ-హై-స్పీడ్ రైళ్ల ప్రారంభం దేశవ్యాప్తంగా రవాణా అనుసంధానాన్ని మారుస్తున్నాయని వివరించారు. వందే భారత్ రైళ్లు ప్రస్తుతం 70 మార్గాల్లో సేవలు అందిస్తూ భారత రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. అహ్మదాబాద్ నుంచి వెరావల్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దేశ సాంకేతికత రంగంలో వస్తున్న పురోగతులే భారత్‌లో ఆధునిక రైళ్లు పెరగడానికి కారణమని శ్రీమోదీ పేర్కొన్నారు. రైలు పెట్టెలు, రైలింజన్లు ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని తెలిపారు. ‘‘రైల్వే ఎగుమతుల్లో అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించింది’’ అని శ్రీ మోదీ తెలిపారు. ఇండియాలో తయారైన మెట్రో కోచ్‌లు ఆస్ట్రేలియాకు, ట్రైన్ కోచ్‌లు ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌కు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. మెక్సికో, స్పెయిన్, జర్మనీ, ఇటలీ దేశాలకు రైల్వే సంబంధిత విడిభాగాలు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. భారత్ లో తయారైన ప్యాసింజర్ పెట్టెలు మొజాంబిక్, శ్రీలంక దేశాల్లో వినియోగిస్తున్నారని తెలిపారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ రైలింజన్లు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిరంతర విస్తరణను తెలియజేస్తుందని, జాతి గౌరవాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

 

“విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌ సౌకర్యాన్ని పెంచటమే కాకుండా వ్యవసాయం, పరిశ్రమలకు ఊతమిస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో దేశంలో అనేక ప్రాంతాలు మొదటి సారిగా రైల్వే సదుపాయాన్ని అందుకున్నాయని తెలిపారు. గతంలో గుజరాత్‌లో చాలా ప్రాంతాల్లో కేవలం చిన్న రైళ్లు, నెమ్మదిగా కదిలే రైళ్లు మాత్రమే నడిచేవని.. ఇప్పటికే పలు నారో గేజ్ మార్గాలను మార్చినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే దహోద్, వాల్సాద్ మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు సహా అనేక రైలు మార్గాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్న ప్రధాని.. దహోద్ రైల్వే కర్మాగారం 9,000 హార్స్‌పవర్ రైలిజంన్లను తయారు చేస్తుందని తెలిపారు. రైళ్ల విషయంలో దేశ శక్తి, సామర్థ్యాన్ని ఇది పెంచుతుందని పేర్కొన్న మోదీ.. దహోద్‌లో ఉత్పత్తి చేసే ప్రతి రైలింజన్ ఈ నగరం పేరును కలిగి ఉంటుందని తెలియజేశారు. ఈ పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో వేల కొద్ది రైలింజన్లను తయారు చేయటం ద్వారా భారీగా ఉపాధిని కల్పిస్తుందన్నారు. ఈ పరిశ్రమ రైల్వే ఉపకరణాలను ఉత్పత్తి చేసే చిన్న స్థాయి పరిశ్రమలను కూడా మద్దతు ఇస్తుందని, తద్వారా సమీప ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి కల్పన ప్రయోజనాలు ఈ పరిశ్రమకు మాత్రమే పరిమతి కావని.. రైతులు, పశు పోషకులు, దుకాణదారులు, కార్మికుల‌కు కూడా లాభం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. ఇది విస్తృతంగా ఆర్థిక పురోగతి జరిగేలా చూసుకుంటుందని అన్నారు. 

విద్య, ఐటీ, సెమీకండక్టర్లు, పర్యాటకం వంటి బహుళ రంగాలలో గుజరాత్ అద్భుతమైన పురోగతి సాధించిందని ప్రధాని తెలిపారు. వివిధ పరిశ్రమలలో రాష్ట్రం తనను తాను అగ్రగామిగా స్థిరపరచుకుందని ప్రధానంగా చెప్పారు. వేల కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లో ప్రధానమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటువుతోందని, ఇది ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ గుజరాత్‌లోని లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

గుజరాత్‌లో దహోద్, వడోదర, గోద్రా, కలోల్, హలోల్‌లు హైటెక్ ఇంజనీరింగ్, తయారీ కారిడార్‌గా మారాయని ప్రధానంగా వ్యాఖ్యానించిన మోదీ.. విమానాల తయారీలో వడోదర వేగంగా దూసుకెళ్తోందని, కొన్ని నెలల క్రితం ఎయిర్‌బస్ అసెంబ్లీ కేంద్రం ప్రారంభమైందని పేర్కొన్నారు. వడోదర దేశంలోనే మొట్టమొదటి గతి శక్తి విశ్వవిద్యాలయానికి కూడా నిలయంగా ఉందని అన్నారు. సావ్లిలో ఇప్పటికే ఒక ప్రధాన రైల్వే బోగీల తయారీ కర్మాగారం ఉందని, దహోద్ ఇప్పుడు 9,000-హార్స్‌పవర్ ఇంజిన్లతో కూడిన దేశంలోనే అత్యంత శక్తివంతమైన రైలింజన్లను తయారు చేసే కేంద్రాన్ని కలిగి ఉందని ప్రధానంగా పేర్కొన్నారు. ఇది దేశానికే గర్వకారణమని వ్యాఖ్యానించారు. గోద్రా, కలోల్, హలోల్‌లు తయారీ యూనిట్లు, చిన్న పరిశ్రమలు, ఎమ్‌ఎస్‌ఎమ్ఈలను కలిగి ఉన్నాయని, ఇవి గుజరాత్ పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. సైకిళ్లు, మోటార్ సైకిళ్ల నుంచి రైల్వే ఇంజిన్లు, విమానాల వరకు ప్రతిదీ తయారు చేసే ప్రాంతంగా మారేందుకు గుజరాత్‌కు మంచి భవిష్యత్ ‌ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి అధునాతన ఇంజనీరింగ్, తయారీ రంగ కారిడార్ ఉండటం ప్రపంచంలోనే చాలా అరుదు అని, ఇది పారిశ్రామిక శక్తి కేంద్రంగా రాష్ట్ర స్థానాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.

 

"అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించేందుకు గిరిజన ప్రాంతాల అభివృద్ధి చాలా అవసరం" అని మోదీ ప్రధానంగా వ్యాఖ్యానించారు. గత 11 సంవత్సరాలుగా గిరిజన సమాజాలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు చాలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చేసిన పనుల సుదీర్ఘ అనుభవం జాతీయ స్థాయిలో కార్యక్రమాలకు దోహదపడిందని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని గిరిజన పిల్లలు శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసించటంలో సవాళ్లను ఎదుర్కొన్న సమయాన్ని గుర్తు చేసిన మోదీ.. నేడు మొత్తం గిరిజన ప్రాంతాలు నాణ్యమైన విద్యను పొందుతున్నాయని.. మంచి కళాశాలలు, ఐటీఐలు, వైద్య కళాశాలలు, రెండు ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయని ప్రధానంగా చెప్పారు. గత 11 సంవత్సరాలుగా ఏకలవ్య మోడల్ పాఠశాలల నెటవర్క్ గణనీయంగా బలోపేతమైందని, ఇవి గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా అందేలా చూసుకుంటున్నాయని అన్నారు. కేవలం దహోద్‌లోనే అనేక ఏకలవ్య మోడల్ పాఠశాలలు ఉన్నాయని, ఇవి గిరిజన విద్యకు మరింత మద్దతు ఇస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గిరిజనుల అభివృద్ధికి జరుగుతోన్న పనులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. స్వతంత్ర భారత్‌ చరిత్రలో తొలిసారిగా గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 'ధర్తీ ఆబా జన్‌జాతీ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్' ఒక కీలక కార్యక్రమమని, దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 80,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఈ పథకం కింద గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా 60,000కి పైగా గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జీవన నాణ్యతను పెంచేందుకు  ఈ గ్రామాల్లో విద్యుత్ సదుపాయం కల్పిస్తూ.. నీరు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు ప్రధానంగా చెప్పారు. గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని, ఈ వర్గాలకు జీవన నాణ్యతలో మెరుగుదల వచ్చేలా చూసుకుంటాని ప్రధానంగా చెప్పారు. 

అత్యంత వెనుకబడిన గిరిజనుల అభ్యున్నతి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన మోదీ.. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతోన్న వారికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. దశాబ్దాలుగా అవసరమైన సదుపాయాలు లేకుండా ఉన్న అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం మొదటిసారిగా ప్రధానమంత్రి జన్మన్ యోజనను ప్రవేశపెట్టిందని ప్రధానంగా చెప్పారు. ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో కొత్త మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని, కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని, తద్వారా ఈ వర్గాలకు మరింత ఆర్థిక, సామాజిక సమ్మిళితత్వం అందేలా చూసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. 

రక్తహీనత నుంచి ఆదివాసీ సమాజాలను విముక్తం చేయడానికి జాతీయ మిషన్ ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, దీనికింద ఇప్పటికే లక్షలాది మంది ఆదివాసీ ప్రజలు స్క్రీనింగ్ చేయించుకున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో 100కు పైగా జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా వర్గీకరించారని, వాటిలో చాలా వరకు గిరిజన ప్రాబల్య ప్రాంతాలేనని ఆయన అన్నారు. అటువంటి జిల్లాలలో ఒకటైన దాహోద్ నేడు ఒక ఆకాంక్షాత్మక జిల్లాగా పురోగమిస్తోందని, ఆధునిక మౌలిక సదుపాయాలు,  స్మార్ట్ సౌకర్యాలతో మార్పు చెందుతోందని తెలిపారు. దక్షిణ దాహోద్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొందని, కానీ ఇప్పుడు, వందల కిలోమీటర్ల పైపులైన్లు వేశారని, నర్మదా నీరు ప్రతి ఇంటికీ చేరుతోందని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఉమర్గాం నుంచి అంబాజీ వరకు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం వల్ల గిరిజనులకు వ్యవసాయం సులువైందన్నారు.

 

వడోదరలో దేశాన్ని, దాని సాయుధ దళాలను గౌరవించడానికి వేలాది మంది మహిళలు ఒక్కచోట చేరడాన్ని ప్రస్తావిస్తూ, అలుపెరగని మద్దతు ఇస్తున్న భారత మహిళలకు తన ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేశారు. దాహోద్ త్యాగం, అంకితభావం కలిగిన భూమి అని ఆయన తెలిపారు. సృష్టిని రక్షించడానికి దధీచి మహర్షి దుధిమతి నది ఒడ్డున తన ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. సంక్షోభ సమయాల్లో ఈ ప్రాంతం స్వాతంత్ర్య సమరయోధుడు తాంతియా తోపేకు మద్దతు ఇచ్చిందని, అటు మంగర్ ధామ్ గోవింద్ గురు, వందలాది మంది గిరిజన యోధుల త్యాగాలకు చిహ్నంగా నిలుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారతదేశపు సాంస్కృతిక విలువలు అన్యాయాన్ని ఎదుర్కోవాలని కోరుకుంటాయని అంటూ, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశం మౌనంగా ఉండగలదా అని ప్రశ్నించారు. “ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. అది భారతీయుల విలువలు, భావోద్వేగాల ప్రతిబింబం” అని అన్నారు. ఉగ్రవాదులు తమ చర్యల పర్యవసానం గురించి అంచనా లేకుండా  ప్రవర్తించారని అంటూ, పిల్లల ముందు ఒక తండ్రిని కిరాతకంగా హత్య చేసిన దృశ్యాన్ని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయులను ఉగ్రవాదం సవాలు చేసిందని, అలాంటి దృశ్యాలు దేశమంతటా ఇంకా ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయని ఆయన అన్నారు. దేశ నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించానని, భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో, వారు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ప్రత్యేక ఆపరేషన్ ను నిర్వహించారని శ్రీ మోదీ తెలిపారు. సరిహద్దుకు అవతల తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, కేవలం 22 నిమిషాల్లో ధ్వంసం చేశారని పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రతిచర్యకు ప్రయత్నించినప్పటికీ, భారత దళాలు వాటిని నిర్ణయాత్మకంగా తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు.. భారత సాయుధ దళాల ధైర్యసాహసాల పట్ల తన ప్రగాఢ గౌరవాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు, పవిత్ర భూమి దాహోద్ నుంచి వారి ధైర్యానికి, అంకితభావానికి అభివందనం చేశారు.  

దేశ విభజన తర్వాత పుట్టిన దేశం భారత్ పట్ల శత్రుత్వం, హాని కలిగించడంపై దృష్టి సారించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. మరోవైపు పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధిని సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.

 

విభజన తరువాత ఏర్పడిన దేశం భారత్‌ పట్ల శత్రుత్వంతో పాటు హాని కలిగించడంపై దృష్టి పెట్టిందని అయితే  “భారత్ పేదరిక నిర్మూలన, ఆర్థిక స్థిరీకరణ, అభివృద్ధి సాధన పట్ల నిబద్ధత కలిగి ఉందని”  ఆయన పేర్కొన్నారు. సాయుధ బలగాలు, ఆర్థిక వ్యవస్థ రెండూ బలంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందిన భారత్ ను సాధించగలమని ప్రధాని ఉద్ఘాటించారు. జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి కలిసికట్టుగా సాగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

దాహోద్ అపారమైన సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమం దాని సామర్థ్యాలకు ఒక నిదర్శనం మాత్రమే అని పేర్కొన్న శ్రీ మోదీ, దాహోద్ ప్రజలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన సౌకర్యాలను వారు సద్వినియోగం చేసుకుని, దాహోద్ ను దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలలో ఒకటిగా తీర్చిదిద్దుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దాహోద్‌ ప్రజలను మరోసారి అభినందిస్తూ, వారి నిబద్ధత, పురోగతిపై తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.

 

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర రైల్వే, సమాచార,  ప్రసార, ఎలక్ట్రానిక్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌,  పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

నేపథ్యం

ప్రపంచ స్థాయి ప్రయాణ సదుపాయాలు కనెక్టివిటీని మెరుగు పరచాలన్న నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి దాహోద్‌లో భారత రైల్వేకు చెందిన లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ కర్మాగారంలో దేశీయ అవసరాలకే కాకుండా ఎగుమతుల కోసం కూడా 9000 హెచ్‌పీ సామర్థ్యం గల విద్యుత్తు ఇంజన్లను తయారు చేస్తారు. ఈ కర్మాగారంలో తయారైన తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ లోకోమోటివ్‌లు భారత రైల్వే సరకు లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. పునరుత్పాదక బ్రేకింగ్ వ్యవస్థలతో ఈ లోకోమోటివ్‌లు తయారవుతున్నాయి,  విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా వీటిని రూపొందించారు. తద్వారా ఇవి పర్యావరణ సుస్థిరతకు దోహదపడతాయి. 

 

తర్వాత, ప్రధానమంత్రి దాహోద్‌లో రూ.24,000 కోట్లకు పైగా విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో రైలు ప్రాజెక్టులు గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. వేరావల్ అహ్మదాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను, వల్సాద్ - దాహోద్ స్టేషన్ల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘A New Example...’: Indian Railways Builds Pedestrian Subway Under Ahmedabad Track In Just 8 Hours

Media Coverage

‘A New Example...’: Indian Railways Builds Pedestrian Subway Under Ahmedabad Track In Just 8 Hours
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on National Sports Day
August 29, 2026

The Prime Minister, Shri Narendra Modi has extended his greetings to all sports lovers on National Sports Day. Shri Modi said that the dedication, passion and determination of sportspersons make the entire nation proud.

The Prime Minister also paid homage to the legendary Major Dhyan Chand Ji, whose brilliance and contribution to Indian hockey continue to inspire generations.

Shri Modi posted on X:

“To every sports lover…your dedication, passion and determination make everyone proud.

We also pay homage to the legendary Major Dhyan Chand Ji, whose brilliance inspires generations.

#NationalSportsDay”