నేటి నుంచి కొత్త పుంతలు తొక్కనున్న భారతదేశ విమానయాన రంగం : ప్రధాని
దేశాన్ని ప్రపంచ ఎంఆర్ఓ కేంద్రంగా మార్చేందుకు సహాయపడనున్న శాఫ్రాన్ కొత్త కేంద్రం : ప్రధాని
ఇటీవలి సంవత్సరాలలో అపూర్వమైన వేగంతో పురోగమించిన భారత విమానయాన రంగం : ప్రధాని
నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్లలో ఒకటిగా నిలిచిన భారత్ : ప్రధాని

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. శాఫ్రాన్‌ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ఎంఆర్ఓ కేంద్రం అత్యాధునిక సాంకేతిక గల విమానాయన రంగంలో యువతకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. నవంబర్ 24న శాఫ్రాన్ బోర్డు, అధికారుల బృందాన్ని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికంటే ముందు కూడా వారితో జరిగిన ప్రతి చర్చలో భారత్‌ పట్ల వారికి ఉన్న  విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో శాఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శాఫ్రాన్   బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. 

ఇటీవలి సంవత్సరాలలో భారతదేశ విమానయాన రంగం అపూర్వమైన వేగంతో పురోగమించిందన్న ప్రధానమంత్రి.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్‌లలో భారత్ ఒకటిగా ఉందని వ్యాఖ్యానించారు. దేశీయ విమానయాన మార్కెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయన్న ఆయన.. వీటి ఫలితంగా దేశంలో విమాన ప్రయాణానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోందన్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి విమానయాన సంస్థలు పనిచేసే విమానాల సంఖ్యను నిలకడగా పెంచుతున్నాయని తెలిపారు. భారతీయ విమానయాన కంపెనీలు 1500 కంటే ఎక్కువ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

భారతదేశ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్నందున ఎంఆర్ఓ కేంద్రాల అవసరం కూడా పెరిగిందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ ఎంఆర్ఓ పనిలో దాదాపు 85 శాతం దేశం వెలుపల జరుగుతూ ఉందని తెలిపారు. దీనివల్ల ఖర్చులు పెరగడం, మళ్లీ విమానం నడిచేందుకు పట్టే సమయం పెరగటం, విమానాలు సుదీర్ఘ కాలం పాటు నిలిచిపోవడం జరుగుతోంది. భారత్ లాంటి విస్తారమైన విమానయాన మార్కెట్‌కు ఇటువంటి పరిస్థితి సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు. దీని కారణంగానే ప్రపంచంలోని ప్రధాన ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకటిగా దేశాన్ని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మొదటిసారిగా ఒక అంతర్జాతీయ ఓఈఎం దేశంలో డీప్ లెవెల్ సర్వీసింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన తెలియజేశారు. 

 

శాఫ్రాన్ అందించే అంతర్జాతీయ స్థాయి శిక్షణ, విజ్ఞాన బదిలీ, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం రాబోయే సంవత్సరాలలో మొత్తం ఎంఆర్ఓ వ్యవస్థకు కొత్త ఊపు, దిశను ఇచ్చే శ్రామిక శక్తిని తయారుచేసేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ కేంద్రం దక్షిణ భారతదేశ యువతకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ కేవలం విమానయాన ఎంఆర్ఓకు మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం లేదని.. నౌకా రవాణాకు సంబంధించిన ఎంఆర్ఓ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోందని తెలిపారు. 

ప్రతి రంగంలోనూ ‘డిజైన్ ఇన్ ఇండియా’ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. భారత్‌లో విమాన ఇంజిన్, విడిభాగాల రూపకల్పన విషయంలో సాధ్యాసాధ్యాలను అన్వేషించాలని ఆయన శాఫ్రాన్ బృందాన్ని కోరారు. ఈ ప్రయత్నంలో దేశంలోని విస్తారమైన ఎంఎస్ఎంఈ నెట్‌వర్క్, ప్రతిభావంతులైన యువత నుంచి ప్రధానంగా మద్దతు అందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏరోస్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో శాఫ్రాన్ కంపెనీ విస్తృతంగా పనిచేస్తుందన్న ప్రధాని.. ప్రొపల్షన్ రూపకల్పన, తయారీ కోసం కూడా కంపెనీ భారత నైపుణ్యాలు, అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 

నేటి భారతదేశం కేవలం పెద్ద కలలు కనడమే కాకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ మరింత గొప్ప విజయాలను సాధిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. “మేం పెద్ద కలలు కంటున్నాం. అంతకంటే పెద్ద పనులు చేస్తున్నాం. ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు. సులభతర వ్యాపారానికి భారత్ గట్టి ప్రాధాన్యతను ఇస్తోందని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. 

 

ప్రపంచవ్యాప్త పెట్టుబడులు, అంతర్జాతీయ పరిశ్రమలను ఆకర్షించేందుకు స్వతంత్ర భారత్‌ అతిపెద్ద సంస్కరణలను కొన్నింటిని చేపట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. మొదట ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరవటం, రెండోది దేశ ఆర్థిక మూల స్థంభాలను మరింత బలోపేతం చేయటం, మూడోది సులభతర వాణిజ్యాన్ని పెంచటం ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు. 

ఈ రోజు చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. గతంలో ప్రైవేట్ రంగానికి అవకాశం లేకుండా ఉన్న రక్షణ వంటి రంగాల్లో కూడా ఇప్పుడు ఆటోమేటిక్ మార్గాల ద్వారా 74 శాతం ఎఫ్‌డీఐకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో కూడా ఒక ముఖ్యమైన విధానం అవలంబించినట్లు ఆయన ప్రముఖంగా చెప్పారు. ఈ చర్యలు ప్రపంచానికి “భారత్‌ పెట్టుబడులను స్వాగతిస్తుంది.. భారత్ ఆవిష్కరణలను స్వాగతిస్తుంది” అనే ఒక స్పష్టమైన సందేశాన్ని పంపాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక (పీఎల్ఐ) పథకాలు అంతర్జాతీయ తయారీదారులను భారత్‌లో తయారీ వైపు ఆకర్షించాయని ఆయన పేర్కొన్నారు. 

గత 11 సంవత్సరాల్లో కంపెనీలకు సంబంధించిన 40,000 కంటే ఎక్కువ నిబంధనల భారాన్ని తగ్గించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వందలాది వ్యాపార సంబంధిత నిబంధనలను భారత్ నేర రహితం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఏక గవాక్ష వ్యవస్థ అనేక అనుమతులను ఒకే ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలు, ఫేస్‌లెస్ ట్యాక్స్ అసెస్‌మెంట్, కొత్త కార్మిక కోడ్‌లు, దివాలా కోడ్ వంటివి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలను గతంలో కంటే సరళంగా, మరింత పారదర్శకంగా చేశాయని అన్నారు. ఈ చర్యల ఫలితంగా భారత్ ఇప్పుడు విశ్వసనీయ భాగస్వామిగా, ఒక ప్రధాన మార్కెట్‌గా, వేగంగా దూసుకుపోతున్న తయారీ కేంద్రంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

నేటి భారత్‌లో వేగవంతమైన వృద్ధి, స్థిరమైన ప్రభుత్వం, సంస్కరణకు అనుకూలమైన మనస్తత్వం, విస్తారమైన యువ ప్రతిభ, పెద్ద దేశీయ మార్కెట్ ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారిని కేవలం పెట్టుబడిదారులుగా మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్‌ దిశగా చేస్తోన్న ప్రయాణంలో సహ-సృష్టికర్తలుగా, భాగస్వాములుగా ఈ దేశం పరిగణిస్తుందని అన్నారు. "భారత్‌లో పెట్టుబడులు పెట్టటం అనేది ఈ దశాబ్దంలో అత్యంత తెలివైన వ్యాపార నిర్ణయం అని దేశం రుజువు చేస్తోంది” అని వ్యాఖ్యానిస్తూ ప్రసంగాన్ని ముగించారు. ఈ ఆధునిక ఎంఆర్ఓ కేంద్రం విషయంలో ఆయన మరోసారి అందరికీ అభినందనలు తెలియజేశారు. 

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి శ్రీ కే. రామ్మోహన్ నాయుడు‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం: 

శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) అనేది లీప్ (లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్) ఇంజిన్లకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు (ఎంఆర్ఓ) కేంద్రం. ఈ ఇంజిన్లు ఎయిర్‌బస్ ఏ320నియో, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ఉంటాయి. ఈ కేంద్రం ఏర్పాటు అనేది ఒక ముఖ్యమైన ప్రస్థానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకటి కావడం మాత్రమే కాకుండా ప్రపంచస్థాయి- ఇంజిన్ ఓఈఎం మొదటిసారిగా భారత్‌లో ఎంఆర్ఓ కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. 

జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో 45,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అత్యాధునిక కేంద్రాన్ని సుమారు రూ. 1300 కోట్లతో ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 300 లీప్ ఇంజిన్‌లను నిర్వహించే ఈ ఎస్ఏఈఎస్ఐ కేంద్రం.. 2035 నాటికి పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత 1,000 మందికి పైగా ఉన్నత నైపుణ్యం గల భారతీయ సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్రపంచ స్థాయి ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు సేవలను అందించేందుకు ఈ కేంద్రంలో అధునాతన పరికరాలు ఉన్నాయి. 

విమానయాన రంగంలో ఆత్మనిర్భరత లక్ష్యం దిశగా భారత్ సాధించే భారీ పురోగతిగా ఈ కేంద్రం ఉంటుంది. ఎంఆర్ఓ విభాగంలో స్వదేశీ సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లడం తగ్గటంతో పాటు ఉన్నత విలువ గల ఉద్యోగాల సృష్టి, సరఫరా వ్యవస్థ ధృడత్వం పెరుగుతుంది. దీనితో పాటు ప్రపంచ విమానాయాన కేంద్రంగా భారత్ ఎదుగుతుంది. ఈ విభాగం వేగవంతమైన వృద్ధికి మద్దతునిచ్చేందుకు దృఢమైన ఎంఆర్ఓ వ్యవస్థను తయారుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్రీయాశీలకంగా పనిచేస్తోంది. జీఎస్టీ సంస్కరణలు - 2024, ఎంఆర్ఓ మార్గదర్శకాలు-2021, జాతీయ పౌర విమానయాన విధానం- 2016 వంటి కీలక ప్రభుత్వ సంస్కరణలు.. పన్నులను హేతుబద్ధీకరించడం, రాయల్టీ భారాన్ని తగ్గించడం ద్వారా ఎంఆర్ఓ సంస్థల కార్యకలాపాలను సులభతరం చేశాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's electronics exports cross $47 billion in 2025 on iPhone push

Media Coverage

India's electronics exports cross $47 billion in 2025 on iPhone push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays homage to Parbati Giri Ji on her birth centenary
January 19, 2026

Prime Minister Shri Narendra Modi paid homage to Parbati Giri Ji on her birth centenary today. Shri Modi commended her role in the movement to end colonial rule, her passion for community service and work in sectors like healthcare, women empowerment and culture.

In separate posts on X, the PM said:

“Paying homage to Parbati Giri Ji on her birth centenary. She played a commendable role in the movement to end colonial rule. Her passion for community service and work in sectors like healthcare, women empowerment and culture are noteworthy. Here is what I had said in last month’s #MannKiBaat.”

 Paying homage to Parbati Giri Ji on her birth centenary. She played a commendable role in the movement to end colonial rule. Her passion for community service and work in sectors like healthcare, women empowerment and culture is noteworthy. Here is what I had said in last month’s… https://t.co/KrFSFELNNA

“ପାର୍ବତୀ ଗିରି ଜୀଙ୍କୁ ତାଙ୍କର ଜନ୍ମ ଶତବାର୍ଷିକୀ ଅବସରରେ ଶ୍ରଦ୍ଧାଞ୍ଜଳି ଅର୍ପଣ କରୁଛି। ଔପନିବେଶିକ ଶାସନର ଅନ୍ତ ଘଟାଇବା ଲାଗି ଆନ୍ଦୋଳନରେ ସେ ପ୍ରଶଂସନୀୟ ଭୂମିକା ଗ୍ରହଣ କରିଥିଲେ । ଜନ ସେବା ପ୍ରତି ତାଙ୍କର ଆଗ୍ରହ ଏବଂ ସ୍ୱାସ୍ଥ୍ୟସେବା, ମହିଳା ସଶକ୍ତିକରଣ ଓ ସଂସ୍କୃତି କ୍ଷେତ୍ରରେ ତାଙ୍କର କାର୍ଯ୍ୟ ଉଲ୍ଲେଖନୀୟ ଥିଲା। ଗତ ମାସର #MannKiBaat କାର୍ଯ୍ୟକ୍ରମରେ ମଧ୍ୟ ମୁଁ ଏହା କହିଥିଲି ।”