ఈ విప్లవాత్మక మౌలిక సదుపాయ ప్రాజెక్టుతో అనుసంధానానికి ఊతం... ఉత్తరప్రదేశ్‌ పురోగతికి చోదకం
వేల ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌కు, ఈ దేశానికి జీవనాడిగా నిలిచిన గంగమ్మ... ఆమె పక్కనుంచే వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఈ ఆధునిక ప్రగతి యుగంలో రాష్ట్ర అభివృద్ధికి కొత్త జీవనాడి
ఇటీవలే ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే రహదారిని జాతికి అంకితం చేశాను
ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్ రహదారులు అభివృద్ధి చెందుతున్న భారత భవితను రూపుదిద్దే జీవనాడులని, ఈ ఆధునిక మార్గాలు దేశ ఉజ్వల భవితకు నేడు నాంది పలుకుతున్నాయని నేనప్పుడే చెప్పాను
ఉత్తరప్రదేశ్ రెండు చివరలను అనుసంధానించడమే కాదు.. దేశ రాజధానిలోని అపరిమిత అవకాశాలనూ గంగా ఎక్స్‌ప్రెస్ రహదారి చేరువ చేస్తుంది: ప్రధానమంత్రి

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో కొత్తగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. నరసింహ పుణ్యక్షేత్రానికి, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ప్రవహిస్తున్న గంగామాత దివ్య సన్నిధికి నమస్కరిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతమంతా గంగామాత ఆధ్యాత్మిక శోభతో, మాతృత్వాన్ని పంచే జీవధారతో పునీతమైన పుణ్యక్షేత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఉత్తరప్రదేశ్‌కు లభించిన వరం. సాక్షాత్తు గంగామాత ఆశీర్వాదమే ఇది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ద్వారా పవిత్ర పుణ్యక్షేత్రాలకు చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చని వివరించారు.

గంగామాత శాశ్వత వైశిష్ట్యాన్ని, ఆధునిక మౌలిక సదుపాయాలను పోలుస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి విప్లవాత్మకమైన మార్పును తెస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ రహదారులు అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి జీవనాడులని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ ఆధునిక జీవనాడులు దేశ ఉజ్వల భవితను చాటుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఇటీవలి తన ఆధ్యాత్మిక పర్యటనలను గుర్తుచేసుకుంటూ, కొన్ని రోజులుగా తాను గంగామాత సాన్నిధ్యంలోనే ఉన్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ 24న బెంగాల్ నుంచి మొదలుకొని- నిన్న కాశీలో, మళ్ళీ ఈ ఉదయం ఇక్కడ వరకు... భక్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి అద్భుత సమ్మేళనంగా తన పర్యటనలు నిలిచాయన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారికి గంగామాత పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది మా అభివృద్ధి దార్శనికతకు ఇది నిదర్శనం. మన వారసత్వ వైభవాన్ని కూడా ప్రపంచానికి చాటుతోంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రభుత్వం వేగం పెంచడాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ గంగా ఎక్స్‌ప్రెస్ రహదారి దేశంలో కొత్తగా నిర్మించిన వాటిలో అత్యంత పొడవైనదని, అయిదేళ్లలోపే నిర్మాణాన్ని పూర్తి చేశామని ఆయన తెలిపారు. వేగవంతమైన ఆధునికీకరణ దిశగా తమ నిబద్ధతను చాటుతూ.. ‘‘ప్రస్తుత ప్రభుత్వ పనితీరులో ఉత్తేజమిది! నేటి ప్రభుత్వం పనిచేసే విధానమిది’’ అని శ్రీ మోదీ ప్రకటించారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని వాణిజ్య కేంద్రాలను, మధ్య ఉత్తరప్రదేశ్‌లోని వ్యవసాయ క్షేత్రాలను, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని సాంస్కృతిక కేంద్రాలను అనుసంధానించే ఈ 600 కిలోమీటర్ల సుదీర్ఘమైన గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి వివరించారు. పన్నెండు జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజల జీవితాలపై ఇది నేరుగా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు. ‘‘గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారి వేగవంతమైన రహదారి మాత్రమే కాదు. ఇది సరికొత్త అవకాశాలకు, సరికొత్త కలలకు, నూతన ఆశయాలకు స్వాగత ద్వారం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

 

రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లను ప్రస్తావించారు. సరైన రవాణా సౌకర్యాలు, శీతల గిడ్డంగుల సదుపాయాలు లేక ప్రధాన మార్కెట్లను చేరుకోవడానికి ఈ సారవంతమైన ప్రాంతాల్లోని రైతులు ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రధానమంత్రి అన్నారు. మెరుగైన అనుసంధానం వల్ల కచ్చితమైన మార్పులు వస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ‘‘ఇది మన రైతుల ఆదాయాన్ని పెంచుతుంది’’ అన్నారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి వల్ల అనుసంధాన ప్రయోజనాలను వివరిస్తూ... ‘‘ఇది ఉత్తరప్రదేశ్‌లోని రెండు చివరలనూ కలపడమే కాకుండా... జాతీయ రాజధాని ప్రాంతంలోని అపారమైన అవకాశాలను మరింత చేరువ చేస్తుంది. ఈ రహదారిపై వాహనాలు పరుగులు తీస్తున్న కొద్దీ, రోడ్డుకు ఇరువైపులా కొత్త పారిశ్రామిక అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి వెంబడి ఉద్భవిస్తున్న పారిశ్రామిక అవకాశాలను ప్రస్తావిస్తూ... ఔషధ రంగం, జౌళీ, చేనేత, తోలు వస్తువులు, హస్తకళల తయారీ కేంద్రాలను ఆకర్షించేలా హర్దోయి వంటి జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్లను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ముద్ర యోజన, ఓడీఓపీ (ఒక జిల్లా - ఒక ఉత్పత్తి) వంటి పథకాల ద్వారా సశక్తులైన రాష్ట్ర యువతలోని పారిశ్రామిక స్ఫూర్తిని ఆయన అభినందించారు. చిన్న పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు ఊతం లభిస్తుందని, అనుసంధాన మార్గాలు మెరుగుపడితే వాటికి సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయని ప్రధానమంత్రి వివరించారు. ‘‘వీటన్నింటికీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ స్థాయిలో చోటు లభిస్తుంది. ఇది లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని పెంచుతుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య మార్పులను ప్రధానమంత్రి వివరించారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా, బిమారు రాష్ట్రంగా ముద్రపడిన ఆ రాష్ట్రం... నేడు ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని గుర్తుచేశారు. రాష్ట్రానికున్న అపారమైన సామర్థ్యం, దేశ యువశక్తి మద్దతుతో... ఈ భారీ లక్ష్యం కోసం అదే స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ జనాభా సానుకూలతను సద్వినియోగం చేసుకునే వ్యూహాన్ని వివరిస్తూ... యూపీని తయారీ కేంద్రంగా నిలపడం కోసం ఈ శక్తిని ఉపయోగిస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు, కర్మాగారాలను నెలకొల్పడమే కాకుండా... భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని, ఆర్థిక పురోగతి వేగవంతమై యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి వివరించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ నిలవడంలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అందులో సగం ఉత్పత్తి యూపీలోనే జరుగుతోందని గుర్తు చేశారు. ‘‘ఈ విజయాన్ని సాధించడంలో ఉత్తరప్రదేశ్ గణనీయమైన సహకారాన్ని అందించింది’’ అని ఆయన వివరించారు.

అత్యాధునిక సాంకేతికత రంగాల్లో రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. నోయిడాలో ఇటీవల జరిగిన భూమి పూజ అనంతరం, సెమీకండక్టర్ తయారీలో ఉత్తరప్రదేశ్ గణనీయమైన పురోగతిని సాధిస్తోందని వివరించారు. ‘‘భవిష్యత్తులో అపారమైన అవకాశాలున్న విస్తృతమైన రంగాలు ఉత్తరప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఇది రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతోందన్నారు.

ఉత్తరప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిని దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ఆస్తిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. భారత్‌లోని రెండు రక్షణ కారిడార్లలో ఒకటి ఈ రాష్ట్రంలోనే ఉందని, ప్రముఖ రక్షణ రంగ తయారీ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రహ్మోస్ క్షిపణుల వంటి వ్యవస్థలు నేడు యూపీలోనే తయారవుతున్నాయని గుర్తుచేస్తూ... ‘‘ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి భారత వ్యూహాత్మక బలంగా మారుతోంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఉత్తరప్రదేశ్‌లో రవాణా మౌలిక సదుపాయాల సమగ్ర ఆధునికీకరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న విమానాశ్రయ సదుపాయాలు నేడు 21కి చేరాయని, అందులో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయని ఆయన వివరించారు. కొత్తగా ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారి మార్గానికి కొన్ని గంటల ప్రయాణ దూరంలోనే ఉందని శ్రీ మోదీ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ గతంలో ఎదుర్కొన్న చీకటి రోజులను, నేటి ఉజ్వల ప్రస్థానాన్ని పోలుస్తూ... ఒకప్పుడు నేరాలు, అరాచకాలకు నిలయంగా ఉన్న ఈ రాష్ట్రం, నేడు శాంతిభద్రతలకు మారుపేరుగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘‘నేడు ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

నాగరికతాపరంగా, ఆర్థికంగా మన దేశ ఆశయాల్లో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి అంతర్భాగమని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రంలో వస్తున్న ఈ మార్పు దేశ దృఢ సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘నేడు దేశమంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.. అదే వికసిత భారత్! ఈ లక్ష్య సాధనలో ఉత్తరప్రదేశ్ ప్రధాన భూమికను పోషించాల్సి ఉంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరతను, భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే బయటి శక్తుల ప్రయత్నాలను ప్రస్తావిస్తూ... ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ‘‘మనం సురక్షితంగా ఉండటమే కాకుండా, అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాం. అత్యంత ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ విస్తృత అభివృద్ధి నమూనాకు గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రతీకగా పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సరికొత్త అవకాశాలను నిజమైన సంపదగా మార్చుకోగలరంటూ రాష్ట్ర ప్రజలపై తన నమ్మకాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ‘‘గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారి మన ముంగిటకు తెచ్చే అవకాశాలను యూపీ ప్రజలు తమ కృషి, ప్రతిభతో సాకారం చేసుకుంటారన్న దృఢమైన విశ్వాసం నాకుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year

Media Coverage

One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 జూలై 2026
July 17, 2026

Green Trains, Private Rockets & Global Partnerships — PM Modi’s New India is Playing to Win