ఈ విప్లవాత్మక మౌలిక సదుపాయ ప్రాజెక్టుతో అనుసంధానానికి ఊతం... ఉత్తరప్రదేశ్‌ పురోగతికి చోదకం
వేల ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌కు, ఈ దేశానికి జీవనాడిగా నిలిచిన గంగమ్మ... ఆమె పక్కనుంచే వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఈ ఆధునిక ప్రగతి యుగంలో రాష్ట్ర అభివృద్ధికి కొత్త జీవనాడి
ఇటీవలే ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే రహదారిని జాతికి అంకితం చేశాను
ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్ రహదారులు అభివృద్ధి చెందుతున్న భారత భవితను రూపుదిద్దే జీవనాడులని, ఈ ఆధునిక మార్గాలు దేశ ఉజ్వల భవితకు నేడు నాంది పలుకుతున్నాయని నేనప్పుడే చెప్పాను
ఉత్తరప్రదేశ్ రెండు చివరలను అనుసంధానించడమే కాదు.. దేశ రాజధానిలోని అపరిమిత అవకాశాలనూ గంగా ఎక్స్‌ప్రెస్ రహదారి చేరువ చేస్తుంది: ప్రధానమంత్రి

భారత్ మాతాకీ జై.
భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, బ్రజేష్ పాఠక్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జితిన్ ప్రసాద గారు, పంకజ్ చౌదరి గారు, యూపీ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన నా ప్రియమైన సోదరసోదరీలారా!

ముందుగా నేను నరసింహ స్వామి వారి ఈ పుణ్య భూమికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. ఇక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే గంగా మాత అనుగ్రహం ప్రవహిస్తోంది. అందుకే ఈ ప్రాంతమంతా ఒక పుణ్యక్షేత్రం కంటే తక్కువేమీ కాదు. ఉత్తరప్రదేశ్‌కు దక్కిన ఈ ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ వరం కూడా ఆ గంగా మాత ఆశీర్వాదమేనని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు కేవలం కొన్ని గంటల్లోనే సంగమానికి చేరుకోవచ్చు. అలాగే కాశీలో బాబా విశ్వనాథుని దర్శించుకుని తిరిగి రావచ్చు.

 

మిత్రులారా,

వేలాది ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌కు, ఈ దేశానికి గంగా మాత ఎలాగైతే జీవనాధారంగా నిలిచిందో... అలాగే ఆధునిక ప్రగతి పథంలో, ఆమెకు సమీపంగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్‌వే కూడా యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడిగా కాబోతోంది. గత నాలుగు, అయిదు రోజులుగా నేను గంగా మాత సాన్నిధ్యంలోనే ఉండటం ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. ఏప్రిల్ 24న నేను బెంగాల్‌లో ఉన్నప్పుడు గంగా మాతను దర్శించుకున్నాను. నిన్న నేను కాశీలో ఉన్నాను. ఈ రోజు ఉదయమే మళ్ళీ నాకు బాబా విశ్వనాథుడు, అన్నపూర్ణ మాత, గంగా మాతల దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఇప్పుడు గంగా మాత పేరు మీద నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించే అవకాశం లభించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు గంగా మాత పేరు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో అభివృద్ధిపై మా దార్శనికత, మన వారసత్వానికి గౌరవం కూడా కనిపిస్తుంది. ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని కోట్లాది మంది ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

నేడు ప్రజాస్వామ్య పండుగలో ఒక ముఖ్యమైన రోజు. బెంగాల్‌లో ప్రస్తుతం రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం... బెంగాల్‌లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. మొదటి దశలో మాదిరిగానే ప్రజలు తమ ఇళ్ల నుంచి పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన లైన్లకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. గత 6,7 దశాబ్దాల్లో ఎన్నడూ జరగని రీతిలో, కనీసం ఊహించడానికి కూడా కష్టంగా అనిపించిన విధంగా ఈసారి బెంగాల్‌లో పోలింగ్ అత్యంత నిర్భయ వాతావరణంలో జరుగుతోంది. ప్రజలు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారు. ఇది దేశ రాజ్యాంగానికి, బలపడుతున్న దేశ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్రమైన సంకేతం. తమ హక్కుల పట్ల ఇంతటి చైతన్యాన్ని కలిగి, పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్న బెంగాల్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోలింగ్ ముగియడానికి ఇంకా చాలా గంటల సమయం ఉంది. బెంగాల్ ప్రజలు ఇదే ఉత్సాహంతో ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

మిత్రులారా,
కొంతకాలం కిందట బిహార్‌లో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ-ఎన్‌డీఏ భారీ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. నిన్ననే గుజరాత్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీలు, నగర పంచాయతీలు, తహసీల్ పంచాయతీల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ ప్రజలైన మీరు సంతోషించే విషయం ఏమిటంటే... అక్కడ 80 నుండి 85 శాతం మున్సిపాలిటీలు, పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ చారిత్రాత్మక హ్యాట్రిక్ విజయం సాధించబోతోందని నేను నమ్ముతున్నాను. మే 4న వెలువడే ఫలితాలు వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి. దేశ అభివృద్ధి వేగానికి సరికొత్త శక్తినిస్తాయి.

 

మిత్రులారా,

దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే మనం ఆధునిక మౌలిక సదుపాయాలను కూడా అంతే వేగంగా నిర్మించుకోవాలి. డిసెంబర్ 2021లో నేను గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేయడానికి షాజహాన్‌పూర్‌కు వచ్చాను. కనీసం 5 ఏళ్లు కూడా గడవకముందే దేశంలోని అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటిగా, రాష్ట్రంలోనే అత్యంత పొడవైన గ్రీన్ కారిడార్ ఎక్స్‌ప్రెస్‌వేగా ఇది 5 ఏళ్లలోపే పూర్తయింది. ఈ రోజు హర్దోయి నుంచి దీని ప్రారంభోత్సవం కూడా జరుగుతోంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి కావడమే కాకుండా, దాని విస్తరణ ప్రణాళిక పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే గంగా ఎక్స్‌ప్రెస్‌వే మీరట్ దాటి హరిద్వార్ వరకు చేరుకుంటుంది. దీనిని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి, ఫరూఖాబాద్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించి ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలతో అనుసంధానం చేస్తారు. ఇదే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ దార్శనికత. ఇదే బీజేపీ ప్రభుత్వ పనితీరులోని వేగం. ఇదే బీజేపీ ప్రభుత్వం పనిచేసే విధానం.

సోదరసోదరీలారా,

కేవలం కొన్ని రోజుల క్రితమే నాకు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించే అవకాశం లభించింది. అప్పుడే నేను ఒక మాట చెప్పాను. ఈ కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలు అభివృద్ధి చెందిన భారత్‌కు విజయరేఖలని, ఈ ఆధునిక రేఖలే నేడు దేశ ఉజ్వల భవిష్యత్తును చాటిచెబుతున్నాయని అన్నాను.

మిత్రులారా,

ఒక రహదారి కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన ఆ రోజులు ఇప్పుడు పోయాయి. ఒకప్పుడు ప్రకటన వెలువడితే ఫైళ్లు కదలడానికే ఏళ్లు పట్టేది. ఎన్నికల కోసం శంకుస్థాపన రాళ్లు వేసేవారు. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చేవి, పోయేవి కానీ పనుల ప్రారంభం మాత్రం ఉండేది కాదు. కొన్నిసార్లు పాత ఫైళ్లను వెతకడానికే పెద్ద పెద్ద అధికారులకు కూడా రెండేళ్ల పాటు కష్టపడాల్సి వచ్చేది. కానీ ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అలాగే నిర్ణీత సమయంలోనే ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఈ రోజు ఉత్తర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేల వేగం కంటే ఎక్కువ వేగం అయినది ఏదైనా ఉందంటే, అది యూపీ అభివృద్ధి వేగమే.

 

మిత్రులారా,

ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ఒక అధిక వేగంతో కూడిన రోడ్డు మాత్రమే కాదు. సరికొత్త అవకాశాలకు, కొత్త కలలకు, కొత్త మార్గాలకు ముఖద్వారం. గంగా ఎక్స్‌ప్రెస్‌వే సుమారు 600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పశ్చిమ యూపీలోని మీరట్, బులంద్‌షహర్, హాపూర్, అమ్రోహా, సంభాల్, బదౌన్; మధ్య యూపీలోని షాజహాన్‌పూర్, హర్దోయి, ఉన్నావ్, రాయ్‌బరేలీ; తూర్పు యూపీలోని ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రాంతాలతో పాటు ఇతర సమీప జిల్లాల్లోని కోట్ల మంది ప్రజల జీవితాలను ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే మార్చబోతుంది.

మిత్రులారా,

ఈ ప్రాంతాలు గంగా నది, దాని ఉపనదుల వల్ల సారవంతమైన నేలలతో ఆశీర్వాదం పొందాయి. కానీ గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేయడం వల్ల, ఇక్కడి రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ఇక్కడి రైతుల పంటలు పెద్ద మార్కెట్లకు చేరుకోలేకపోయేవి. శీతలీకరణ గిడ్డంగుల కొరత ఉండేది. రవాణా సదుపాయాలు లేవు. రైతులు పడే కష్టానికి సరైన ధర దక్కేది కాదు. ఇప్పుడు ఆ కష్టాలన్నింటికీ పరిష్కారాలు వేగంగా దొరుకుతాయి. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా తక్కువ సమయంలోనే పెద్ద మార్కెట్లకు చేరుకోవచ్చు. వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇక్కడ అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల మన రైతుల ఆదాయం పెరుగుతుంది.

మిత్రులారా,

గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లోని ఒక చివరను మరో చివరతో కలపడమే కాకుండా, ఎన్‌సీఆర్ ప్రాంతంలోని అపారమైన అవకాశాలను కూడా మనకు దగ్గర చేస్తుంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు పరుగులు తీయడమే కాకుండా, దానికి ఇరువైపులా కొత్త పారిశ్రామిక అవకాశాలు అభివృద్ధి చెందుతాయి. దీనికోసం హర్దోయి వంటి జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా హర్దోయి, షాజహాన్‌పూర్, ఉన్నావ్ సహా మొత్తం 12 జిల్లాల్లో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి. ఔషధం, టెక్స్‌టైల్ వంటి వివిధ రంగాలకు చెందిన క్లస్టర్లు ఇక్కడ అభివృద్ధి చెందడం ద్వారా మన యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.

 

మిత్రులారా,

ముద్రా యోజన,  ఓడీఓపీ వంటి పథకాల అండతో మన యువత సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక్కడ చిన్న పరిశ్రమలను, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నారు. మెరుగైన రవాణ సౌకర్యాలతో వారికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. మీరట్ క్రీడా పరిశ్రమ, సంభాల్ హస్తకళలు, బులంద్‌షహర్ సిరామిక్స్, హర్దోయి చేనేత, ఉన్నావ్ తోలు, ప్రతాప్‌గఢ్ ఉసిరి ఉత్పత్తులన్నీ దేశ, ప్రపంచ మార్కెట్లకు పెద్ద ఎత్తున చేరుతాయి. దీని వల్ల లక్షలాది కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో హర్దోయి, ఉన్నావ్ వంటి జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తారని ఎవరైనా ఊహించగలిగారా? మన హర్దోయి గుండా ఒక ఎక్స్‌ప్రెస్‌వే వెళ్తుందని ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా? ఈ పని బీజేపీ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం.

మిత్రులారా,

గతంలో ఉత్తరప్రదేశ్‌ను వెనుకబడిన, ‘బీమారు’ రాష్ట్రంగా పిలిచేవారు. అదే ఉత్తరప్రదేశ్ నేడు 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ముందుకు సాగుతోంది. ఇది చాలా పెద్ద లక్ష్యం, కానీ దీని వెనుక అంతే పెద్ద సన్నద్ధత ఉంది. ఎందుకంటే యూపీకి అపారమైన సామర్థ్యం ఉంది. దేశంలోనే అతిపెద్ద యువ జనాభా శక్తి యూపీ సొంతం. యూపీని తయారీ కేంద్రంగా మార్చడానికి మేం ఈ శక్తిని ఉపయోగిస్తున్నాం.  రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినప్పుడు మాత్రమే కొత్త పరిశ్రమలు, కర్మాగారాలు స్థాపితమవుతాయి. అప్పుడే ఆర్థిక పురోగతికి ద్వారాలు తెరుచుకుంటాయి, దేశ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

సోదరసోదరీలారా,

ఈ దార్శనికతను కేంద్రంగా చేసుకొని.. గత కొన్ని సంవ్సరాలుగా నిరంతరం పనులు జరుగుతున్నాయి. దీనిని మీరే స్వయంగా గమనిస్తున్నారు. గతంలో వలసలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన యూపీ... నేడు పెట్టుబడిదారుల సదస్సులు, పారిశ్రామిక కారిడార్లకు పేరుగాంచింది. యూపీ పెట్టుబడిదారుల సదస్సుకు దేశ విదేశాల నుంచి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రోజు మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉందంటే, అందులో యూపీ సహకారం ఎంతో ఉంది. దేశంలో తయారవుతున్న మొబైల్ ఫోన్లలో సగం మన యూపీలోనే తయారవుతున్నాయి. కేవలం కొన్ని వారాల క్రితమే నేను నోయిడాలో ఒక సెమీకండక్టర్ కేంద్రానికి శంకుస్థాపన చేశాను.

 

మిత్రులారా,

ఈ కృత్రిమ మేధ యుగంలో సెమీకండక్టర్లు ఎంతటి కీలక రంగంగా మారుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రంగంలో కూడా నాయకత్వం వహించడానికి యూపీ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో యూపీ ప్రజలకు అపారమైన అవకాశాలు ఉన్న ఒక అతిపెద్ద రంగం తెరుచుకోబోతోంది.

మిత్రులారా,

ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి నేడు దేశ వ్యూహాత్మక శక్తిగా మారుతోంది. దేశంలోని రెండు రక్షణ కారిడార్లలో ఒకటి నేడు యూపీలోనే ఉంది. పెద్ద పెద్ద రక్షణ రంగ కంపెనీలు ఇక్కడ తమ కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రపంచమే గుర్తించిన బ్రహ్మోస్ క్షిపణులు రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. రక్షణ పరికరాల తయారీకి అవసరమైన చిన్న చిన్న విడిభాగాలను ఇక్కడి ఎంఎస్ఎంఈలు సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి ఎంతో మేలు జరుగుతోంది. ఇప్పుడు చిన్న జిల్లాల్లో ఉండే యువత కూడా పెద్ద పెద్ద పరిశ్రమలతో మమేకం కావాలనే కలలు కనగలుగుతున్నారు.

మిత్రులారా,

పాత రాజకీయాలను వదిలేసి ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోవడం వల్లే నేడు ఉత్తరప్రదేశ్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు యూపీ అంటే గుంతల రోడ్లకు నిలయమనేవారు. నేడు అదే యూపీ దేశంలోనే అత్యధిక ఎక్స్‌ప్రెస్‌వేలు కలిగిన రాష్ట్రంగా అవతరించింది. గతంలో పొరుగు జిల్లాలకు వెళ్లడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ నేడు ఉత్తరప్రదేశ్‌లో 21 విమానాశ్రయాలు, 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇప్పుడు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కూడా జరిగింది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు.

 

సోదరసోదరీలారా

మన ఉత్తర ప్రదేశ్ శ్రీరాముడి,  శ్రీకృష్ణుల జన్మభూమి. కానీ గత ప్రభుత్వాల దర్భర పరిపాలన కారణంగా నేరాలు, అరాచక పాలనను గుర్తింపుగా యూపీ మారింది.  ఒకప్పుడు రాష్ట్ర మాఫియాలపై సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు యూపీ శాంతిభద్రతలు దేశవ్యాప్తంగా ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి.

సోదరసోదరీలారా,

అధికారాన్ని అడ్డం పెట్టుకుని వనరులను పంచుకున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులకు యూపీ సాధిస్తున్న ఈ ప్రగతి అస్సలు నచ్చడం లేదు. వారు రాష్ట్రాన్ని మళ్లీ పాత కాలంలోకి నెట్టాలని చూస్తున్నారు.  సమాజాన్ని మరోసారి విభజించి, ముక్కలు చేయాలని కోరుకుంటున్నారు.

మిత్రులారా,

సమాజ్‌వాదీ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకి మాత్రమే కాదు, మహిళా వ్యతిరేకి కూడా. ఇటీవలే దేశం మరోసారి ఎస్పీ, కాంగ్రెస్ వంటి పార్టీల అసలు స్వరూపాన్ని చూసింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో నారీ శక్తి వందన్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఈ సవరణ గనుక పాస్ అయ్యి ఉంటే 2029 ఎన్నికల నుంచే శాసనసభలు, లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్లు లభించేవి. ఏ ఇతర కేటగిరీ సీట్లను తగ్గించకుండానే మన తల్లులు, సోదరీలు పెద్ద సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఢిల్లీ, లక్నోలకు చేరుకునేవారు. కానీ సమాజ్‌వాదీ పార్టీ ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది.

మిత్రులారా,

ఈ బిల్లు ద్వారా అన్ని రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెరిగేది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే నిష్పత్తిలో సీట్లు పెరుగుతాయని మేం పార్లమెంటులో స్పష్టంగా చెప్పాం. కానీ ఉత్తరప్రదేశ్‌ను తిడుతూ రాజకీయం చేసే డీఎంకే వంటి పార్టీలు, యూపీలో సీట్లు ఎందుకు పెరగాలని అభ్యంతరం వ్యక్తం చేశాయి. సమాజ్‌వాదీ పార్టీ కూడా పార్లమెంటులో అదే పాట పాడింది. ఈ ఎస్పీ నాయకులు ఇక్కడ మీ ఓట్లు వేయించుకుంటారు, కానీ పార్లమెంటులో మాత్రం యూపీ ప్రజలను దూషించే వారి పక్కన నిలబడతారు. అందుకే సమాజ్‌వాదీ పార్టీ ఎప్పటికీ మారదని రాష్ట్ర ప్రజలు అంటుంటారు. వీరు ఎప్పుడూ మహిళా వ్యతిరేక రాజకీయాలే చేస్తారు. ఎప్పుడూ బుజ్జగింపు విధానాలకు, నేరస్థులకు అండగా నిలుస్తారు. ఎస్పీ ఎన్నటికీ కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు అతీతంగా ఎదగలేదు. వీరు ఎల్లప్పుడూ అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలే చేస్తారు. యూపీ ప్రజలు ఎస్పీ, దాని మిత్రపక్షాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.

 

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పంతో నేడు దేశం ముందుకు సాగుతోంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకం. నేడు ప్రపంచమంతా యుద్ధాలు, అశాంతి, అస్థిరతలో చిక్కుకుపోయి ఉంది. ప్రపంచంలోని పెద్ద దేశాల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కానీ భారత్ మాత్రం అదే వేగంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. బయట ఉన్న శత్రువులకు ఇది అస్సలు నచ్చడం లేదు. మన దేశంలో ఉంటూనే అధికారం కోసం ఆశపడే కొందరు వ్యక్తులు కూడా దేశాన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మనం సురక్షితంగా ఉండటమే కాకుండా, అభివృద్ధిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అత్యంత ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ దిశలో వేసిన మరో బలమైన అడుగు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే మన ముంగిటకు తెచ్చే అవకాశాలను యూపీ ప్రజలు తమ కష్టంతో, ప్రతిభతో నిజం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఈ సంకల్పంతో మీ అందరికీ మరోసారి అనేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు.

భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం

అందరికీ ధన్యవాదాలు...!

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report

Media Coverage

India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam applauding the courage and perseverance of India's Youth
July 20, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam applauding the courage and perseverance of India's Youth:

"प्राप्यापदं न व्यथते कदाचिदुद्योगमन्विच्छति चाप्रमत्तः।

दुःखं च काले सहते महात्मा धुरन्धरस्तस्य जिताः सपत्नाः॥"

Shri Modi said that our youth is achieving historic success through their courage, self-confidence, and relentless hard work, and this is the greatest strength of a rapidly developing India.

The Prime Minister posted on X:

आज हमारे युवा साथी धैर्य, आत्मविश्वास और अथक परिश्रम से ऐतिहासिक सफलता हासिल कर रहे हैं। यही विकसित हो रहे भारत की सबसे बड़ी ताकत है।

प्राप्यापदं न व्यथते कदाचिदुद्योगमन्विच्छति चाप्रमत्तः।

दुःखं च काले सहते महात्मा धुरन्धरस्तस्य जिताः सपत्नाः॥