ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.
ముఖ్య అతిథి, ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగాలూ దృశ్య మాధ్యమం ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తూ, అందులో పలికిన ఆప్యాయమైన పలుకులకు ప్రధాని ధన్యవాదాలను తెలిపారు. ఆమె భారత్ ప్రగతిని గురించి మాట్లాడారనీ, ఆమె చెప్పిన మాటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరిపైనా ప్రభావాన్ని కలగజేశాయనీ ఆయన అన్నారు. భారత్‌లో ఇది హుషారైన పండుగలు, జనసందోహాల కాలమని శ్రీ మోదీ చెబుతూ, మరికొన్ని రోజుల్లో మహా కుంభ్ ప్రయాగ్‌రాజ్‌లో మొదలవనుందనీ, మకర సంక్రాంతి, లోహ్‌డీ, పొంగల్, మాఘ్ బిహూ పండుగలు కూడా త్వరలో రాబోతున్నాయన్నారు. ఎక్కడ చూసినా ఉల్లాసభరిత వాతావరణం కనిపిస్తోందని ఆయన అన్నారు. చాలా కాలంపాటు విదేశాల్లో ఉన్న మహాత్మా గాంధీ 1915లో ఈ రోజే భారతదేశానికి తిరిగివచ్చారని శ్రీ మోదీ గుర్తుచేస్తూ, ఇంతటి అపురూప కాలంలో ప్రవాసులు మన దేశానికి తరలిరావడం పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచేసిందని వ్యాఖ్యానించారు. ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) తాజా సంచిక మరో కారణంగా కూడా ప్రత్యేకమైందని చెప్పాలని ఆయన అంటూ, ఈ కార్యక్రమాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయీ జీ జయంతిని పాటించిన కొద్ది రోజులకే నిర్వహించుకొంటున్నామన్నారు. పీబీడీని జరుపుకొంటూ ఉండడంలో వాజ్‌పేయీ గారి దార్శనికత పాత్ర కూడా ఉందని శ్రీ మోదీ అన్నారు. ‘‘భారత్‌కూ, దాని ప్రవాసులకూ మధ్య గల బంధాన్ని బలపరిచే ఒక వ్యవస్థగా ప్రవాసీ భారతీయ దివస్ మారింది’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మనం మన మూలాలతో పెనవేసుకోవడంతోపాటే భారత్‌నూ, భారతీయతనూ, మన సంస్కృతినీ, ప్రగతినీ పండుగలా జరుపుకొంటున్నామని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు.
‘‘ఘనమైన ఒడిశా గడ్డమీద మనం సమావేశమయ్యాం, మన దేశ సుసంపన్న వారసత్వానికి ప్రతిబింబం ఈ గడ్డ’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. ఒడిశాలో అడుగడుగునా మనం మన వారసత్వాన్ని చూడొచ్చని కూడా ఆయన అన్నారు. ఉదయగిరిలో గాని, లేదా ఖండగిరి లో గాని చరిత్రాత్మక గుహలనో, మహత్తర కోణార్క్ సూర్య దేవాలయాన్నో, తామ్రలిప్తి, మాణిక్‌పట్న, పాలూర్ పురాతన ఓడరేవులనో చూసిన ఎవరైనా ఎంతో గర్వపడతారని ప్రధాని వ్యాఖ్యానించారు. వందల ఏళ్ల కిందట, ఒడిశాకు చెందిన వ్యాపారస్తులు బాలీ, సుమత్రా, జావా వంటి ప్రాంతాలకు సముద్ర యాత్రలు చేశారని ప్రధాని చెబుతూ, బాలీ యాత్ర ఘట్టాన్ని స్మరించుకొంటూ ఒడిశాలో ఈనాటికీ ఓ ఉత్సవంలా జరుపుకొంటారన్నారు. ఒడిశాలో ఓ ముఖ్య చరిత్రాత్మక ప్రదేశమైన ధౌలీ శాంతికి సంకేతంగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఖడ్గ శక్తితో ప్రపంచం నలుమూలలలా సామ్రాజ్యాలను అదేపనిగా విస్తరించుకుంటూ పోతుంటే, సామ్రాట్ అశోకుడు మాత్రం శాంతి మార్గాన్ని ఎంచుకొన్నది ఇక్కడే అని శ్రీ మోదీ అన్నారు. భవిత యుద్ధంలో లేదు, ఈ సంగతి బౌద్ధంలోనే ఉందని ప్రపంచానికి చాటడానికి భారత్‌కు ప్రేరణనిస్తోంది ఈ వారసత్వమే అని ఆయన అన్నారు. ఈ కారణంగా, ప్రతి ఒక్కరికీ ఒడిశా గడ్డ మీదకు ఆహ్వానించడమంటే అది తనకు చాలా విశిష్టమైందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ప్రవాసీ భారతీయులను తాను ఎల్లప్పుడూ భారత్‌కు రాయబారులుగానే తలచానని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి భారతీయులను కలుసుకోవడంలోనూ, వారితో మాటామంతీ జరపడంలోనూ తనకు ఉల్లాసం లభిస్తుందని ఆయన చెప్పారు. వారి వద్ద నుంచి తాను పొందే ప్రేమా, ఆశీస్సులూ మరపురానివనీ, అవి ఎల్లప్పుడూ తన వెంటే ఉంటాయనీ ఆయన అన్నారు.
ప్రపంచ రంగస్థలంపైన తన శిరస్సును గర్వంగా పైకెత్తుకొని నిలబడే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రవాసీ భారతీయులకు తాను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని శ్రీ మోదీ అన్నారు. గత పదేళ్లలో, అనేక మంది ప్రపంచ నేతలతో తాను సమావేశమయ్యానని ప్రధాని చెబుతూ, ఆ నేతలంతా ప్రవాస భారతీయులను వారు పాటిస్తున్న సామాజిక విలువలతోపాటు వారు ఉంటున్న సమాజాలకు అందిస్తున్న సేవలకు కూడా ప్రశంసలు కురిపించారని తెలియజేశారు.
‘‘భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం భారతీయ జీవనంలో ఓ ముఖ్య భాగంగా కూడా ఉంద’’ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. భారతీయులు సహజంగానే వైవిధ్యాన్ని అక్కున చేర్చుకొంటారు. వారు వెళ్లి చేరే సమాజాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముఖ్య భాగంగా కలిసిపోతారు. అక్కడి నియమాలనూ, సంప్రదాయాలనూ గౌరవిస్తారని ఆయన అన్నారు. భారతీయులు వారు ఆశ్రయం పొందిన దేశాలకు నిజాయతీతో సేవ చేస్తారు. ఆయా దేశాల వద్ధికీ, సమృద్ధికీ తోడ్పాటును అందిస్తారు. అదే సమయంలో భారత్‌ను వారి మనసుల్లో పదిలంగా అట్టిపెట్టుకొంటారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వారు భారత్ సాధించే ప్రతి ఒక్క విజయాన్నీ, భారత్ ఖాతాలో పడే ప్రతి ఒక్క ఆనందాన్నీ చాలా ఉత్సుకతతో పండుగ చేసుకొంటారని కూడా ఆయన అన్నారు.
ఇరవై ఒకటో శతాబ్దపు భారత్‌లో అభివృద్ధి నమ్మశక్యం కానంత వేగంగానూ, విస్తృత పరిమాణంలోనూ చోటు చేసుకొంటున్న విషయాన్ని ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. కేవలం 10 సంవత్సరాల్లో భారత్ 250 మిలియన్ (25 కోట్ల) మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చిందనీ, ప్రపంచంలో 10వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగిందనీ ఆయన అన్నారు. భారత్ త్వరలోనే 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చంద్రయాన్ ప్రత్యేక యాత్ర ‘శివ-శక్తి స్థానాని’కి చేరుకోవడం వంటి భారత్ ఘనతలనూ, డిజిటల్ ఇండియా సామర్థ్యానికి ప్రపంచంలో లభించిన గుర్తింపునూ శ్రీ మోదీ వివరిస్తూ, భారత్‌లో ప్రతి రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందన్నారు. పునరుత్పాదక ఇంధనం, విమానయానం, విద్యుత్తు వాహనాలు, మెట్రో నెట్‌వర్కులు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల వంటి రంగాల్లో ఇదివరకు ఎరుగని విజయాలను నమోదు చేస్తోందని ఆయన చెప్పారు. భారత్ ప్రస్తుతం ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ రకం పోరాట జెట్‌లనూ, రవాణా విమానాన్నీ తయారు చేస్తోందని ఆయన ప్రధానంగా చెప్పారు. రాబోయే కాలంలో ప్రజలు ప్రవాసీ భారతీయ దివస్‌లో పాలుపంచుకోవడానికి ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ విమానాల్లో ప్రయాణించి భారత్‌కు రాగలరన్న ఆశను ఆయన వ్యక్తం చేశారు.
భారత్ సాధిస్తున్న విజయాలు, భారత్ ముందున్న అవకాశాల కారణంగా ప్రపంచంలో భారత్ పోషిస్తున్న పాత్ర అంతకంతకూ పెరుగుతోందని ప్రధాని స్పష్టంచేశారు. ‘‘నేటి భారత్ తన దృష్టికోణాన్ని దృఢంగా వినిపించడం ఒక్కటే కాకుండా గ్లోబల్ సౌత్ వాణిని కూడా బిగ్గరగా వినిపిస్తోంద’’ని ఆయన అన్నారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జి-20లో ఒక శాశ్వత సభ్యదేశంగా చేయాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు లభించింది అని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘మానవత్వానికి పెద్దపీట’’ అనే సూత్రానికి భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
భారతీయ ప్రతిభావంతులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. భారత్‌కు చెందిన వృత్తినిపుణులు ప్రధాన కంపెనీలకు సేవలను అందిస్తూ, ప్రపంచ వృద్ధికి తోడ్పాటునిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ చేతులమీదుగా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకోనున్న వారికి ఆయన శుభాకాంక్షలను వ్యక్తంచేస్తూ మన దేశం దశాబ్దాల పాటు ప్రపంచంలోకెల్లా యువజనులు అత్యధికంగా ఉండే, మిక్కిలి నైపుణ్యవంతులైన వారు అధిక సంఖ్యలో ఉండే దేశంగా మనుగడ సాగిస్తూ ప్రపంచానికి కావలసిన నైపుణ్యాలను అందిస్తూ కీర్తిని పొందుతుందని ఆయన అన్నారు. నైపుణ్యం దండిగా సంపాదించిన భారతీయ యువజనులను అనేక దేశాలు ప్రస్తుతం సంతోషంగా ఆహ్వానిస్తున్నాయని ఆయన అన్నారు. విదేశాలకు వెళ్లే భారతీయులు అదేపనిగా నైపుణ్యాలను సాధించుకుంటూ ఉండడం (కంటిన్యువస్ స్కిల్లింగ్), ఇప్పటికే సాధించిన నైపుణ్యాలకు మరింతగా మెరుగులు పెట్టుకోవడం (రి-స్కిల్లింగ్), కొత్త కెరీర్‌లోకి మారడానికి వీలుగా సరికొత్త నైపుణ్యాలను సంపాదించుకొనే (అప్-స్కిల్లింగ్) దిశలో సఫలం అయ్యేటట్టు భారత ప్రభుత్వం జాగ్రత్తచర్యలను చేపడుతోందని ఆయన చెప్పారు.

భారతీయ ప్రవాసులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని ప్రధాని చెబుతూ, వారి భద్రత, వారి సంక్షేమం తమ అగ్ర ప్రాథమ్యాలని స్పష్టంచేశారు. ‘‘సంకట స్థితులు ఎదురైనప్పుడు ప్రవాసులకు సాయపడడం భారత్ బాధ్యత, భారతదేశ విదేశీ విధానంలో దీనిని కీలక సూత్రంగా చూస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో ప్రపంచం నలుమూలలా భారతీయ రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలు (కాన్సులేట్స్) చాలా స్పందనశీలత్వంతో, ఏదైనా ఘటన జరిగిందని తెలుసుకొన్న వెనువెంటనే సముచిత చర్యల్ని చేపట్టే వైఖరిని అవలంబించాయని కూడా ఆయన గుర్తుచేశారు.
విదేశాల్లో నివసిస్తున్న పౌరులకు రాయబార కార్యాలయం అందజేయాల్సిన సేవల కోసం దూర ప్రాంతాలకు ప్రయానించాల్సిన, రోజుల తరబడి వేచి ఉండాల్సిన స్థితి ఇంతకు ముందు ఎదురయ్యేదని శ్రీ మోదీ గుర్తుచేస్తూ, ఈ అంశాలను ప్రస్తుతం ఒకదాని తరువాత ఒకటిగా పరిష్కరిస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాల్లో 14 కొత్త రాయబార కార్యాయాలను, కాన్సులేట్ కార్యాయాలను తెరిచినట్లు తెలియజేశారు. మారిషన్ లో ఏడో తరానికి చెందిన వారికి, సూరినామ్, మార్టినిక్, గ్వాడెలోప్ లలో ఆరో తరానికి చెందిన వారికి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఓఐలు)గా గుర్తింపునివ్వడానికి ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) కార్డుల పరిధిని విస్తరిస్తున్నామని కూడా ఆయన వివరించారు.
ప్రపంచం అంతటా విస్తరించిన భారతీయ ప్రవాసుల ఘన చరిత్రను ప్రధానమంత్రి ప్రధానంగా చెబుతూ, వివిధ దేశాల్లో వారు సాధించిన విజయాలది భారత వారసత్వంలో ఒక ముఖ్య పాత్ర అని అభివర్ణించారు. ఈ ఆసక్తిదాయక, ప్రేరణాత్మక గాధలను పదుగురికీ తెలియజెప్పాలనీ, సగర్వంగా చాటుకోవాలనీ, మన ఉమ్మడి వారసత్వం, సంప్రదాయాల్లో ఓ భాగంగా కాపాడుకోవాలనీఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమంలో ఒక ప్రయత్నాన్ని గురించి తాను చర్చించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, గుజరాత్‌కు చెందిన అనేక కుటుంబాల వారు వందల ఏళ్ల కిందటే ఓమాన్‌లో స్థిరపడిపోయారన్నారు. వారి 250 ఏళ్ల ప్రస్థానం స్ఫూర్తిప్రదమైందంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సముదాయానికి చెందిన వేలకొద్దీ పత్రాలను డిజిటల్ మాధ్యమం సాయంతో భద్రపరచడానికి సంబంధించిన ఒక ప్రదర్శనను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దీనికి అదనంగా, ఈ సముదాయంలో వయోవృద్ధ సభ్యులు వారి అనుభవాలను, వారి అనుభూతులను పంచుకొనే ఒక ‘‘మౌఖిక చరిత్ర ప్రాజెక్టు’’ను కూడా ఏర్పాటు చేశారని ప్రధాని అన్నారు. ఆయా కుటుంబాలకు చెందిన వారు అనేక మంది ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలుసుకొని తాను సంతోషిస్తున్నానని ప్రధాని అన్నారు.

వివిధ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలే చేపట్టాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆయన ‘‘గిర్మితియా’’ సోదరులు, సోదరీమణులను ఓ ఉదాహరణగా చెప్పారు. వారు భారత్‌లోని ఏయే ప్రాంతాలకు చెందిన వారు?, వారు వలసపోయి స్థిరపడ్డ గ్రామాలు, నగరాలు ఏమేమిటి?, వంటి వివరాలను గుర్తించడానికి ఒక సమాచారనిధి (డేటాబేస్)ను రూపొందించాలి అని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. వారి జీవన సరళులను గ్రంథస్తం చేయాలనీ, వారు సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోగలిగారు? వంటి వాటిని చలనచిత్రాలు, వార్తాచిత్రాలు (డాక్యుమెంటరీస్) తీయడం ద్వారా ప్రజలకు వివరించవచ్చనీ ఆయన అన్నారు. గిర్మితియా వారసత్వాన్ని గురించి అధ్యయనాలను, పరిశోధనను చేపట్టవచ్చు అది అంత ప్రాముఖ్యం కలిగిన విషయం అని ప్రధాని చెప్పారు. దీనికోసం ఏదైనా విశ్వవిద్యాలయంలో ఓ పీఠాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అంతేకాకుండా క్రమం తప్పక గిర్మితియా ప్రపంచ మహాసభలను నిర్వహించాలనీ, దీనికి గల అవకాశాలను కనుగొని, సంబంధిత కార్యక్రమాలను ముందుకు తీసుకుపవడానికి కృషిచేయాలని ఆయన తన బృందానికి ఆదేశాలిచ్చారు.
‘‘అభివృద్ధి, వారసత్వం.. ఈ మంత్రమే చోదకశక్తిగా ఆధునిక భారతదేశం ముందుకు దూసుకుపోతోంది’’ అని ప్రధాని అన్నారు. జి-20 సమావేశాలను నిర్వహించిన కాలంలో, భారతదేశ భిన్నత్వాన్ని ప్రపంచ దేశాలకు కళ్లకు కట్టడానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కాశీ-తమిళ్ సంగమం, కాశీ తెలుగు సంగమం, సౌరాష్ట్ర తమిళ్ సంగమం వంటి కార్యక్రమాలను గురించి ఆయన సగర్వంగా ప్రస్తావించారు. త్వరలో సంత్ తిరువళ్లువర్ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని ప్రధానమంత్రి చెబుతూ, ఆ మహనీయుని బోధనలను ప్రచారం చేయడానికి తిరువళ్లువర్ సంస్కృతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి కేంద్రం సింగపూర్‌లో ఆరంభమైంది, అమెరికాలో హ్యూస్టన్ యూనివర్సిటీలో తిరువళ్లువర్ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని, భారతదేశ వారసత్వాన్ని ప్రపంచంలో మూల మూలలకూ తీసుకుపోవాలన్నదే ఈ ప్రయత్నాల ధ్యేయమని ఆయన వ్యాఖ్యానించారు.

భారతదేశంలో వారసత్వ స్థలాలను సంధానించేందుకు తీసుకున్న చర్యలను ప్రధాని ప్రధానంగా చెబుతూ, రామాయణ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రత్యేక రైళ్లు భగవాన్ రాముడు, సీతా మాతలతో అనుబంధం ఉన్న ప్రాంతాలకు ప్రజలను చేరవేస్తున్నాయన్నారు. భారత్ గౌరవ్ రైళ్లు కూడా దేశవ్యాప్తంగా ముఖ్య వారసత్వ స్థలాలను కలుపుతున్నాయన్నారు. సెమీ-హై-స్పీడ్ కలిగి ఉండే వందే భారత్ రైళ్లు దేశంలోని ముఖ్య వారసత్వ కేంద్రాలను కలుపుతూ ప్రయాణిస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక ప్రత్యేక ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాం, ఈ రైలు దాదాపు 150 మందిని పర్యటన క్షేత్రాలు, ధార్మిక స్థలాలైన 17 ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని అందిస్తుందని ప్రధాని వెల్లడించారు. ఒడిశాలో దర్శనీయ స్థలాలు అనేకం ఉన్నాయి, ప్రతిఒక్కరూ వాటిని చూడండి అంటూ ఆయన సభికులను ఉత్సాహపరిచారు. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ త్వరలో మొదలవనుందనీ, ఈ అరుదైన అవకాశాన్ని విడచిపెట్టకండనీ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
భారతదేశం 1947లో స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో ప్రవాస భారతీయులు ప్రముఖ పాత్రను పోషించారని ప్రధానమంత్రి ఒప్పుకొన్నారు. భారత్ వృద్ధికి ప్రవాసులు వారి వంతు తోడ్పాటునందించి, విదేశాల నుంచి డబ్బును స్వదేశానికి పంపించే విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్‌ను నిలిపారన్నారు. భారత్‌ను 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యాన్ని ఆయన మరోసారి స్పష్టంచేశారు. ప్రవాసుల ఆర్థికసేవలు, పెట్టుబడి అవసరాలను తీర్చడంలో జిఐఎఫ్‌టీ సిటీ (‘గిఫ్ట్ సిటీ’)కున్న ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. అభివృద్ధి దిశలో భారత్ ప్రయాణాన్ని సుదృఢం చేయడంలో దీని ప్రయోజనాలను వినియోగించుకోవలంటూ వారికి ఆయన సూచన చేశారు. ‘‘ప్రవాసులు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం భారత్ సాధించే ప్రగతిలో తోడ్పడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
వారసత్వ పర్యటనకు ఉన్న అవకాశాలను గురించి ప్రధాని చాటిచెబుతూ, భారత్ తన ప్రధాన మహానగరాల (మెట్రో సిటీల)కే పరిమితం కాదు, రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాలు, గ్రామాలు కూడా కలిసి ఉన్నాయనీ, ఇవి భారత వారసత్వాన్ని చాటిచెబుతున్నాయనీ ఆయన స్పష్టంచేశారు. ప్రవాసులు చిన్న పట్టణాలను, పల్లెటూళ్లను చూస్తూ వారి అనుభూతులను పంచుకొంటూ ఈ వారసత్వంతో అనుబంధాన్ని పెంచుకోవాలని ప్రధాని కోరారు. ఈ సారి మీరు భారత్‌కు వచ్చేటప్పుడు భారతీయ మూలాలకు చెందని స్నేహితులను గాని, స్నేహితురాళ్లను గాని కనీసం అయిదుగురిని వెంటబెట్టుకు వచ్చి, ఈ దేశంలో చూడదగ్గ ప్రదేశాలను వారు చూసి మెచ్చుకొనేటట్లుగా వారిలో ప్రేరణను నింపాల్సిందిగా ఆయన ప్రవాసులను ప్రోత్సహించారు.

భారత్‌ను గురించి మేలైన అవగాహనను ఏర్పరుచుకోవడానికి ‘‘భారత్ కో జానియే’’ (ఈ హిందీ మాటలకు భారత్‌ను గురించి తెలుసుకోండి అని అర్థం) ప్రశ్నోత్తరాల కార్యక్రమం (క్విజ్)లో పాలుపంచుకోవాలని ప్రవాసీ భారతీయ సముదాయంలోని యువతీయువకులకు శ్రీ మోదీ సూచించారు.
‘‘స్టడీ ఇన్ ఇండియా’’ కార్యక్రమంతోపాటు ఐసీసీఆర్ స్కాలర్‌షిప్ స్కీముల లాభాన్ని అందుకోండంటూ వారిని ఆయన ప్రోత్సహించారు.
ప్రవాసులు నివసిస్తున్న దేశాల్లో భారతదేశ వాస్తవ చరిత్రను ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఆయా దేశాల్లోని ప్రస్తుత తరం వారికి భారతదేశ సమృద్ధిని గురించి గానీ, చాలా కాలంపాటు బానిసత్వంలో మగ్గిన సంగతి గానీ, పోరాటాల గురించి గానీ తెలిసి ఉండకపోవచ్చని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలతో భారత యథార్థ చరిత్ర విశేషాల్ని పంచుకోవాలని ప్రవాసీ భారతీయులను ఆయన కోరారు.

‘‘భారత్‌ను ఇప్పుడు విశ్వ బంధుగా గుర్తించారు’’ అని ప్రధానమంత్రి సహర్షంగా చెప్పారు. ప్రవాసులు ఈ ప్రపంచ బంధాన్ని వారి ప్రయత్నాలతో మరింతగా బలపరచాలని ఆయన కోరారు. వారు వారి వారి దేశాల్లో పురస్కార ప్రదానోత్సవాలను ప్రత్యేకించి స్థానికులను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచన చేశారు. ఆ పురస్కారాలను సాహిత్యం, కళలు, హస్తకళలు, చలనచిత్రాలు, రంగస్థలం వంటి వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులకు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. కార్యసాధకులను ధ్రువపత్రాలతో సన్మానించండి, ఈ విషయంలో భారతీయ రాయబార కార్యాలయాల, దౌత్య కార్యాలయాల మద్దతును తీసుకోండి అంటూ ఆయన వారిని ఉత్సాహపరిచారు. ఈ యత్నం స్థానికులతో వ్యక్తిగతంగా, భావోద్వేగాల పరంగా బంధాన్ని పెంచుతుందని ఆయన అన్నారు.
భారత్‌లో తయారు చేసిన ఉత్పాదనలను ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసేటట్టుగా చూడడంలో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్రను పోషించాల్సి ఉంటుందని శ్రీ మోదీ స్పష్టంచేశారు. ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ ఆహారం ప్యాకెట్లను, వస్త్రాలను, ఇతర వస్తువులను అయితే స్థానిక బజారులలో గానీ, లేదా ఆన్‌లైన్‌లో గానీ ప్రవాసులు కొనుగోలు చేసి, వాటిని వారి వంటిళ్లలోనో, కుటుంబ సభ్యులు, అతిథులు విశ్రాంతి తీసుకోవడానికీ, వివిధ కార్యకలాపాలలో పాల్గొనడానికీ ఉపయోగించే ఇంటిలోని సౌకర్యవంతమైన గదిలోనో ఉంచడమో లేదా కానుకలుగా ఇవ్వడమో చేయాలనీ ఆయన కోరారు. ఇలా చేస్తే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశలో ఇది చెప్పుకోదగ్గ తోడ్పాటు కాగలదని ఆయన అన్నారు.
మాతృమూర్తికీ, ధరణి మాతకూ సంబంధించిన మరో విన్నపాన్ని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇటీవల తాను గయానాలో పర్యటించినప్పడు, గయానా అధ్యక్షునితో కలిసి ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటే కార్యక్రమం)లో పాల్గొన్నానన్నారు. భారత్‌లో లక్షల సంఖ్యలో ప్రజలు ఇప్పటికే ఈ పనిని చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రవాసులు వారు ఎక్కడ నివసిస్తున్నా వారి అమ్మగారి పేరిట ఒక మొక్కను నాటాలంటూ ఆయన వారిని ప్రోత్సహించారు. వారు భారత్‌కు తిరిగివచ్చినప్పుడు, వారు అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని కూడా వారి వెంట తీసుకువస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ 2025వ సంవత్సరం సమృద్ధినీ, మంచి ఆరోగ్యాన్నీ, సంపదనూ ప్రసాదించాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తూ, వారికి మరోసారి భారత్‌కు స్వాగతం పలుకుతూ ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రులు శ్రీ ఎస్. జైశంకర్, శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ ప్రహ్లాద్ జోషీ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ జుయెల్ ఓరమ్, కేంద్ర సహాయ మంత్రులు శోభ కరంద్లాజె, శ్రీ కీర్తి వర్ధన్ సింగ్, శ్రీ పబిత్ర మార్గెరిటా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేపథ్యం
ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. ఇది ప్రవాసీ భారతీయులతో అనుబంధాన్ని పెంచుకొని, పరస్పరం మాట్లాడుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించే ముఖ్య వేదిక. 18వ ప్రవాసీ భారతీయ దినోత్సవ సమ్మేళనాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 2025 జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్నారు.
ఈ పీబీడీ సమ్మేళనానికి ‘‘వికసిత్ భారత్‌కు ప్రవాసుల తోడ్పాటు’’ను ఇతివృత్తంగా తీసుకున్నారు. పీబీడీ సమ్మేళనంలో పాలుపంచుకోవడానికి యాభైకి పైగా వివిధ దేశాలకు చెందిన భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో వారి పేర్లను నమోదు చేసుకొన్నారు.
భారతీయ ప్రవాసులకు ఉద్దేశించిన ప్రత్యేక యాత్రికుల రైలు ‘ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్’ మొదటి ప్రయాణాన్ని ప్రధాని రిమోట్ ద్వారా పచ్చజెండాను చూపెట్టి ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మూడు వారాల పాటు మన దేశంలోని అనేక యాత్రాస్థలాలు, ప్రసిద్ధ ధార్మికక్షేత్రాల గుండా పయనిస్తుంది. ప్రవాసీ తీర్థ దర్శన్ యోజనలో భాగంగా ఈ ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును నిర్వహిస్తారు.
Click here to read full text speech
Pravasi Bharatiya Divas has become an institution to strengthen the bond between India and its diaspora. pic.twitter.com/PgX3OtiZO0
— PMO India (@PMOIndia) January 9, 2025
भविष्य युद्ध में नहीं है, बुद्ध में है। pic.twitter.com/7dBzcnVKnS
— PMO India (@PMOIndia) January 9, 2025
We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives. pic.twitter.com/oyZjOUpUhm
— PMO India (@PMOIndia) January 9, 2025
21st century India is progressing at an incredible speed and scale. pic.twitter.com/6SJGXpY7pA
— PMO India (@PMOIndia) January 9, 2025
Today's India not only firmly asserts its own point but also strongly amplifies the voice of the Global South. pic.twitter.com/bdQJZn77Gb
— PMO India (@PMOIndia) January 9, 2025
India has the potential to fulfill the world's demand for skilled talent. pic.twitter.com/llhwA1dTA8
— PMO India (@PMOIndia) January 9, 2025
We consider it our responsibility to help our diaspora during crisis situations, no matter where they are. pic.twitter.com/QS37yd8zYD
— PMO India (@PMOIndia) January 9, 2025
PM @narendramodi's requests to Indian diaspora... pic.twitter.com/XcUT7GatZ0
— PMO India (@PMOIndia) January 9, 2025