· ఆలోచనలను వెల్లడిస్తూ, ఈ రంగంలో తమ కృషిని వివరించిన 16 ఏఐ, డీప్ టెక్ అంకుర సంస్థల సీఈవోలు, వ్యవస్థాపకులు
· దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా... వైద్యం, వ్యవసాయం, సైబర్ భద్రత, సామాజిక సాధికారతలో కృషి చేస్తున్న సంస్థలు
· ప్రభావవంతమైన సాధనాలను రూపొందిస్తున్న ఆవిష్కర్తలను ప్రశంసించిన ప్రధాని... దేశ అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను రూపొందించాలని సూచన
· వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, మాతృభాషలో ఉన్నత విద్యకు ప్రోత్సాహం వంటి వివిధ రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకునే అవకాశాలపై చర్చించిన ప్రధాని
· ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ నిర్వహణపై భారత్‌ను అభినందించిన అంకుర సంస్థలు... ఏఐపై అంతర్జాతీయ చర్చలను రూపుదిద్దడంలో పెరుగుతున్న భారత్ పాత్రకు ఇది నిదర్శనమంటూ వ్యాఖ్య

ఏఐ, డీప్‌టెక్ అంకుర సంస్థల అధినేతలతో ‘సేవా తీర్థ’లో ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అంకుర సంస్థలు దేశంలో అనేక మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే పనిలో ఉన్నాయి. వైద్య రంగంలో.. రోగాలను ముందుగానే గుర్తించే అధునాతన నిర్ధారణ పరీక్షలు, జన్యు చికిత్స, వ్యాధిగ్రస్తుల రికార్డులను సమర్థంగా నిర్వహించడం కోసం ఈ సంస్థలు ఏఐని వినియోగిస్తున్నాయి. తద్వారా క్షేత్రస్థాయిలో నాణ్యమైన వైద్యసేవలు అందించడం వీటి లక్ష్యం. వ్యవసాయంలో.. ఉత్పాదకతను పెంచడంతోపాటు వాతావరణ మార్పుల వల్ల ముప్పును ఎదుర్కొనేందుకు భౌగోళిక, జలాంతర్గత పర్యవేక్షణ (జియో స్పేషియల్, అండర్ వాటర్ ఇంటెలిజెన్స్) వ్యవస్థలను ఈ సంస్థలు ఉపయోగిస్తున్నాయి. సైబర్ భద్రత, నైతిక కృత్రిమ మేధ, అంతరిక్ష రంగాలపై దృష్టి సారించిన సంస్థలూ.. అలాగే స్థానిక భాషల్లో విద్యను, న్యాయ సేవలను అందిస్తూ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్న సంస్థలూ ఈ బృందంలో ఉన్నాయి. పాత తరం సాంకేతిక వ్యవస్థలను ఆధునికీకరిస్తూ పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం కూడా వీటి ముఖ్య లక్ష్యం. వెరసి, మన దేశీయ అవసరాలను తీరుస్తూనే.. కృత్రిమ మేధ ఆధారిత ఆవిష్కరణల్లో అంతర్జాతీయ అగ్రగామిగా భారత్‌ను నిలపగల శక్తిమంతమైన వ్యవస్థకు ఇది అద్దం పడుతోంది.

కృత్రిమ మేధ కోసం ఓ బలమైన సానుకూల వ్యవస్థ నిర్మాణం దిశగా భారత్ నిరంతర కృషిని ఏఐ అంకుర సంస్థలు ప్రశంసించాయి. ఈ రంగం వేగంగా విస్తరిస్తోందని, మరెంతో విస్తృతికి సమర్థమైన అవకాశాలు ఇందులో ఉన్నాయని ప్రతినిధులు స్పష్టం చేశారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు, వాటి అమలుకు సంబంధించి.. ప్రపంచం ఇప్పుడు వేగంగా భారత్ వైపు పయనిస్తోందని వ్యాఖ్యానించారు. ఏఐ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరమైన, క్రియాశీలకమైన వాతావరణాన్ని ప్రస్తుతం భారత్ అందిస్తోందని వారు పేర్కొన్నారు. ప్రపంచ ఏఐ యవనికపై భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను కూడా వారు కొనియాడారు. కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో భారత్ ప్రాధాన్యం పెరుగుతోందనేందుకు ఈ సదస్సు నిదర్శనమన్నారు.

 

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభావవంతమైన పరిష్కార మార్గాలకు బాటలు వేస్తున్న ఆవిష్కర్తలను ప్రధానమంత్రి అభినందించారు. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన చర్చించారు. ముఖ్యంగా భూ సారాన్ని కాపాడుకునేందుకు పంటల దిగుబడిని, ఎరువుల వినియోగాన్ని ఏఐ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. భారతీయ భాషలు, సంస్కృతిని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యాన్ని చెబుతూ... ఉన్నత విద్యను మాతృభాషలో అందించేలా మన ఏఐ సాధనాలను విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమాచార నిర్వహణ పటిష్టంగా ఉండడం ఆవశ్యకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, దేశ అవసరాలకు తగ్గట్టుగా సాధనాలను రూపొందించాలని కోరారు. సులభమైన, విస్తృతమైన డిజిటల్ ఆవిష్కరణకు యూపీఐని నమూనాగా ఉదాహరించారు. భారతీయ కంపెనీలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తులపై నమ్మకముంచాలని కోరారు. అలాగే అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతోందని చెబుతూ.. భారతీయ అంకుర సంస్థలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

 

అబ్రిడ్జ్, అదాలత్ ఏఐ, బ్రెయిన్ సైట్ ఏఐ, క్రెడో ఏఐ, ఏక కేర్, గ్లీన్, ఇన్నోగుల్, ఇన్విడియో, మికో, ఒరిజిన్, ప్రొఫేజ్, రసేన్, రుబ్రిక్, సాట్ షూర్, సూపర్‌నోవా, సైఫా ఏఐ కంపెనీల సీఈవోలు, వ్యవస్థాపకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి శ్రీ పి.కె. మిశ్రా, ప్రధాన కార్యదర్శి-2 శ్రీ శక్తికాంతదాస్, సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద కూడా సమావేశానికి హాజరయ్యారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Nagaland gets its first natural gas supply via National Gas Grid

Media Coverage

Nagaland gets its first natural gas supply via National Gas Grid
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఆగష్టు 2026
August 19, 2026

Defence to Diamonds: How PM Modi’s Vision Turned India into a Global Capability Hub