దేశంలో మత్స్య రంగ పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. లోకకల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. స్వీయ ఆర్థిక మండళ్లు (ఈఈజెడ్), సముద్ర మధ్యంలో చేపల వేటపై ఇందులో ప్రధానంగా దృష్టి సారించారు.
మత్స్యకారులకు భద్రతా సూచనలు ఇవ్వడానికి, మత్స్య వనరులను వారు బాగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి ఉపగ్రహ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు.
అధునాతన ఓడరేవులు, మార్కెట్లు, చేపల తరలింపు, వాటి మార్కెటింగ్‌లో డ్రోన్ల వినియోగం ద్వారా ఈ రంగాన్ని ఆధునికీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరింత మెరుగైన పద్ధతుల ద్వారా సరఫరా వ్యవస్థలో ఉత్పత్తికి అదనపు విలువను సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు.
అంతేకాకుండా, పౌర విమానయాన విభాగాన్ని సంప్రదించి.. సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా డ్రోన్లను వినియోగించి తాజా చేపలను ఉత్పత్తి కేంద్రాల నుంచి సమీపంలోని నగరాలు, పట్టణాల్లో ఉన్న పెద్ద మార్కెట్లకు తరలించే విషయమై అవకాశాలను పరిశీలించాలని ప్రధానమంత్రి సూచించారు.
ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ను మెరుగుపరచడం ఆవశ్యకమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులను సులభతరం చేయడంపై కూడా చర్చించారు.
వ్యవసాయ రంగంలో అగ్రో టెక్ తరహాలో.. మత్స్య రంగంలో ఫిష్ టెక్‌ను అందిపుచ్చుకోవడం ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పద్ధతులను మెరుగుపరచుకోవాలని ప్రధానమంత్రి సూచించారు.
అమృత్ సరోవర్లలో చేపల పెంపకాన్ని చేపట్టడం వల్ల ఈ జల వనరుల నిర్వహణతోపాటు మత్స్యకారుల జీవనోపాధి కూడా మెరుగుపడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. ఆదాయ మార్గంగా అలంకారిక మత్స్య సంపదను కూడా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు.
చేపలకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ తగినంత సరఫరా లేని భూపరివేష్టిత ప్రాంతాల అవసరాలను తీర్చడం కోసం ఓ వ్యూహాన్ని రూపొందించాలని ప్రధానమంత్రి అన్నారు.
ఇంధన అవసరాల కోసమూ, పోషకాలను అందించేవిగానూ, ఔషధాలు, ఇతర రంగాల్లోనూ సముద్ర శైవలాల వినియోగానికి అవకాశాలను పరిశీలించాలని ప్రధానమంత్రి సూచించారు. సంబంధిత అన్ని విభాగాలు కలిసి పనిచేస్తూ సాంకేతికతను వినియోగించుకుని సముద్ర శైవలాల రంగంలో అవసరమైన ఫలితాలను సాధించాలని, వాటిపై పూర్తి యాజమాన్యాన్ని సాధించాలని పేర్కొన్నారు.
ఆధునిక చేపల వేట పద్ధతుల్లో మత్స్యకారుల సామర్థ్యాభివృద్ధి చర్యలు చేపట్టాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. ఈ రంగం వృద్ధికి ఆటంకం కలిగించే ప్రతికూల అంశాల జాబితాను కూడా రూపొందించాలన్నారు. తద్వారా వాటిని అధిగమించడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించవచ్చని, సులభతర వాణిజ్యాన్నీ మత్స్యకారుల జీవనాన్నీ మెరుగుపరచవచ్చని ఆయన పేర్కొన్నారు.
గత సమీక్షలో చేసిన సూచనలకు అనుగుణంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో సాధించిన పురోగతి, అలాగే భారత స్వీయ ఆర్థిక మండళ్లు (ఈఈజెడ్), సముద్ర మధ్యం నుంచి సుస్థిరమైన పద్ధతుల్లో మత్స్య సంపదను వినియోగించుకోవడం కోసం ప్రతిపాదిత విధానంపై ఈ సమావేశం సందర్భంగా ఓ ప్రదర్శన నిర్వహించారు.
2015 నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఈ రంగంలో పెట్టుబడిని భారత ప్రభుత్వం రూ. 38,572 కోట్లకు పెంచింది. నీలి విప్లవ పథకం, మత్స్య-జలచరాల పెంపకం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్), ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై), ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సహయోజన (పీఎంఎంకేఎస్ఎస్‌వై), కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)లను కేంద్రం ప్రారంభించింది. 2024-25లో భారత వార్షిక చేపల ఉత్పత్తి 195 లక్షల టన్నులుగా ఉంది. రంగాలవారీ వృద్ధి రేటును బట్టి చూస్తే ఇది 9 శాతం కన్నా ఎక్కువగా ఉంది.
ఈ సమావేశానికి కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ-2 శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ అమిత్ ఖరే, మత్స్య శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Chaired a meeting on ways to further strengthen the fisheries sector. We attach great importance to this area and have worked extensively to improve infrastructure relating to the sector and also ensure greater access to credit as well as markets for our fishermen. Today’s… pic.twitter.com/wcTycWhPzO
— Narendra Modi (@narendramodi) May 15, 2025